పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం సంచలనం కలిగించింది. ఆరుగురు మాజీ ఎంపీలతో కలిసి మాజీ ముఖ్యమంత్రి పార్టీ పెడితే కొన్ని పేపర్లు కవర్ చేయలేదు. మరి కొన్ని లోపలిపేజీల్లో వేశాయి. పార్టీ పెట్టాలన్న నిర్ణయం నాన్చడం వలన, పాఠకులకు ఉత్సుకత తగ్గిందని గ్రహించడం చేత మీడియా అలా చేసిందని సర్దిచెప్పుకోవచ్చు. కానీ పవన్‌కి మాత్రం విపరీతమైన కవరేజి వచ్చింది. పవన్‌కున్న సినిమా గ్లామర్ అలాటిది అని వూరుకోలేం. తెలుగు మీడియా జనరల్‌గా కాంగ్రెసుకు వ్యతిరేకం, టిడిపికి అనుకూలం కాబట్టి ఆ బాటలోనే పవన్ నడవబోతున్నాడన్న సంకేతాలున్నాయి కాబట్టి.. అనే కారణం కూడా చేర్చుకోవచ్చు. బహుశా యిదే కారణం చేత కాబోలు – తెరాస పవన్ పార్టీని పుట్టకముందే వ్యతిరేకించింది. వారితో బాటే టి-కాంగ్రెసు నేతలు కూడా! పవన్‌కూడా తెరాస వారిపై సెటైర్లు వేశాడు. ప్రశ్నించే పార్టీ అని చెప్పుకున్నాడు కాబట్టి కాబోలు కవితకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. జవాబులు తనకు కాదు, విరాళాలు యిచ్చినవాళ్లకు చెప్పుకుంటే చాలన్నాడు. సమాధానం యివ్వడానికి కవిత తొందరపడుతున్నట్టు లేదు. దీనికి సమాధానం చెపితే ఇంకో ప్రశ్న ఎదురు కావచ్చు. రఘునందన్, హరీశ్ ఒకరిపై మరొకరు చేసుకున్న ఆరోపణలు నిజమేనా? అంటూ ! దానికి చెపితే ఇంకోటి, మరోటి.
పవన్ కళ్యాణ్‌ను సంక్రాంతికి వచ్చే గంగిరెద్దు మేళంతో పోల్చారు కెసియార్. అన్న ముచ్చటైంది, యిప్పుడు తమ్ముడు తయారయ్యాడు అని తీసిపారేశారు. అలాటి పోలికలు అనవసరం. ఎవరి సత్తా వాళ్లదే. అన్నగారి జాతకంలాగే తమ్ముడి జాతకం వుండాలన్న రూలు లేదు కదా. వల్లభాయ్ పటేల్‌కి గతంలో వున్న పేరు కంటె యిటీవల మరీ పేరు వచ్చేసింది. ఆయనకు విఠల్‌భాయ్ పటేల్ అనే ఓ అన్నగారున్నారని, ఆయనా బారిస్టరనీ, స్వాతంత్య్రయోధుడనీ ఎంతమందికి తెలుసు? వల్లభాయ్‌కు అన్నగారి కంటె ఎక్కువ పేరు వచ్చింది. సుభాష్ చంద్రబోసుకి వూరూరా విగ్రహాలున్నాయి, పేటలున్నాయి. సినిమాలకు ఆ పేరు పెట్టి హీరోలు టైటిల్ రోల్ వేశారు. మరి ఆయన అన్నగారు శరత్ చంద్ర బోసు కూడా స్వాతంత్య్రయోధుడే. ఆయన పేర కలకత్తాలో ఒక వీధి (కొత్త రోడ్డు కాదు, లాన్స్‌డౌన్ రోడ్ పేరు మార్చి ఆయన పేరు పెట్టారు) తప్ప దేశంలో వేరే ఎక్కడా కాలనీలు కనబడవు. తెలుగు సినిమాలకు వస్తే అన్నయ్య రమేష్ బాబు కంటె మహేష్ బాబు ఎన్నో శిఖరాలు అధిరోహించారు. అన్నయ్య హరికృష్ణ కంటె తమ్ముడు బాలకృష్ణ ఎంతో పైకి వెళ్లారు. తమిళంలో ఎంజీఆర్ అన్న చక్రపాణి కూడా నటుడే. కానీ ఎమ్జీయార్ పేరు తెలిసున్నవాళ్లల్లో ఒక శాతం మందికి కూడా ఆయన పేరు తెలియదు. ఈ కేసుల్లో తమ్ముళ్లకు ఎక్కువ పేరు వచ్చింది. చిరంజీవి సోదరుల్లో చిరంజీవి మెగాస్టార్, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. మధ్యలో నాగబాబు స్టార్ కాదు, యాక్టర్ మాత్రమే.
జయప్రద అక్క సౌందర్యకు ''లవ్ ఇన్ ఆంధ్ర'' వంటి సినిమాల్లో చిన్నచిన్న వేషాలే దొరికాయి. మరి చెల్లెలు తెలుగు, తమిళ, హిందీ రంగాల్లో దున్నేసింది. జయసుధ విషయంలో ఆమె చెల్లెలు సుభాషిణి పట్టుమని పది సినిమాల్లో వేసి మాయమై పోయింది. చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు కాబట్టి తమ్ముడు పవన్ కూడా రాణించరని తీర్మానించడం ఎవరికీ తగదు. ముఖ్యంగా కెసియార్‌కు. ఎందుకంటే ఆయన యిద్దరు పిల్లల్లో కవితకు వాళ్ల అన్నగారి కంటె ఎక్కువ గుర్తింపు వచ్చింది. వాళ్లిద్దరికీ కలిపి వున్న ఫాలోయింగ్ కంటె మేనల్లుడు హరీశ్‌కు ఎక్కువ ఫాలోయింగ్ వుంది. ఇవన్నీ తెలిసిన కెసియార్ పవన్ పెట్టే పార్టీ గురించి మాట్లాడడం దేనికి? ఊరుకుంటే పోయేది కదా. టిడిపి గురించి అడిగితే 'అది సీమాంధ్ర పార్టీ. పొరుగు రాష్ట్రాల పార్టీల వూసు మనకేల?' అంటున్న కెసియార్ పవన్ పార్టీని తెలంగాణ పార్టీగా అనుకుంటున్నారా? తెలంగాణలో పవన్ ప్రభావం వుంటుంది, అది కొమ్ము విసరడానికి ముందే దానికి ముకుతాడు వేయాలన్న అంచనాకు వచ్చారా? నిజానికి చిరంజీవికి సీమాంధ్రలో వచ్చినన్ని సీట్లు, ఓట్లు తెలంగాణలో రానే లేదు, పవన్ ప్రభావం కోస్తా జిల్లాల్లోనే ఎక్కువగా వుంటుంది అనుకుంటున్న తరుణంలో, కాదు తెలంగాణలో కూడా వుంటుందన్న లెక్క కెసియార్ వద్ద వుందా? తెలియదు.
ఎన్నికల సీజనులో పార్టీ పెట్టడం గురించి అయితే మాత్రం పండగల్లో మాత్రమే వచ్చే మేళాలతో పోలిక నప్పుతుంది. ఏ నిర్భయ కేసు జరిగినప్పుడో, 2 జి స్కామ్ బయటపడినప్పుడో, ఆమ్ ఆద్మీ విజయం సాధించినప్పుడో, విభజన బిల్లు పాసయినప్పుడో పవన్ యిలాటి స్పీచి ఒకటి యిచ్చేసి, ఎన్నికలు ప్రకటించాక పార్టీ పెట్టినా బాగుండేది. అప్పుడంతా వూరుకుని, యిప్పుడు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి మాట్లాడడం 'ఇదంతా ఎన్నికలలో నిలబడ్డానికి మాత్రమే' అన్న ఫీలింగు కలిగిస్తోంది. 'ఇది ఎన్నికల కోసం పెడుతున్న పార్టీ కాదు, ఎన్నికలలో నిలబడతానో లేదో కూడా యింకా తేల్చుకోలేదు. ఈ పార్టీ చాలా ఏళ్లపాటు అస్తిత్వంలో వుంటుంది, ఎన్నో సమస్యలపై ఎన్నో ఏళ్ల పాటు పోరాడతాను' అని పవన్ చెప్పారనుకోండి. ఏం చెప్పినా ఎన్నికల సీజనంటేనే అబద్ధాల సీజను, అతిశయోక్తుల సీజను. అందువలన విన్న ప్రతి మాటకు శ్రోతలు భారీ డిస్కౌంటు యిస్తారు. పైగా ప్రత్యర్థులు పెడర్థాలు తీస్తారు.
కొత్త పార్టీ పెట్టిన ప్రతివాళ్లకు యీ తలనొప్పి తప్పదు. పవన్‌కైతే చిరంజీవి అనే గుదిబండ ఒకటి అదనంగా చేరింది. అన్నగారిని దేవుడనాలి, మళ్లీ ఆయనకు వ్యతిరేకంగా నడవాలి. ఆయన పార్టీని నాశనం చేయాలి అని నినాదం యిస్తూనే ఆయన నా గుండెల్లో ఎల్లప్పుడూ వున్నారనాలి. 'ఎవరో ఢిల్లీ వాళ్లు చేసిన తప్పుకు అన్నయ్యను ఎందుకు తప్పుపట్టాలి?' అని చెపితే ఎలా పొసుగుతుంది? అన్న మహాశయులు అది తప్పు అనటం లేదు కదా. తప్పు అంటున్న కిరణ్‌ను తూర్పారబట్టారు. కన్నతల్లి లాటి పార్టీని విడిచి వెళ్లడం నేరం, ద్రోహం అని డైలాగులు చెప్పారు. రేపు ఎన్నికలలో సీమాంధ్రలో వూరూరా తిరుగుతూ ఢిల్లీ వాళ్లు చేసినది అద్భుతమైన పని అని, తెలుగువారి శ్రేయస్సు కోరే యీ క్రతువు జరిపించారని ప్రచారం చేయవలసిన బాధ్యత అన్నగారిదే కదా! ఆయన్ని ఏమీ అనకూడదు, ఢిల్లీ వాళ్లను మాత్రమే అంటాను ఎలా? (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2014)