Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 68

ఆగస్టు 18 - అప్పటికి సాయంత్రం 4 అయింది. పోలీసులు పుట్టనహళ్లికి వెళ్లేసరికి ఉదయం 8.30. రంగనాథ్‌ను దింపి వస్తున్న మెటడార్‌ డ్రైవర్ని పట్టుకునే సరికి 10.30. అతని సహాయంతో మధ్యాహ్నానికి బెంగుళూరు చేరుకుని విజయనగర్‌లోని చర్చిలోంచి బయటకు వస్తూండగా మృదులను పట్టుకునేటప్పటికి ఆ టైమైంది. పోలీసుల్ని చూస్తూనే మృదుల వణికిపోయింది. గత 16 రోజులుగా ఆమె అనుభవిస్తున్న టెన్షనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చి ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. పోలీసులు ఆమెను అనునయించారు. తెలిసినదంతా చెప్పేస్తే ఏమీ చేయమని బుజ్జగించారు. ఆమె సమాధానపడింది. శివరాజన్‌ బృందంతో తను పడిన భయాందోళనలను విపులంగా చెప్పింది. వాళ్ల గురించి సమస్తం చెప్పివేసింది. ఆ యిల్లు ఎక్కడుందో చూపమన్నారు. పోలీసు వ్యానులో వెళితే తెలిసిపోతుందని అసిస్టెంటు పోలీసు కమిషనరు కారులో పంపించారు. ఆయనతో బాటు వెళ్లి ఆ యింటిని ఆమె చూపించింది. ఇదంతా జరిగేటప్పటికి సాయంత్రం 5.45 అయింది.  లోపల ఎవరెవరు వున్నారంటే శివరాజన్‌, శుభ, నెహ్రూ, వీరితో బాటు మరో నలుగురు టైగర్లున్నారంది. వాళ్ల పేర్లు అమ్మన్న, డ్రైవర్‌ అణ్నా, సురేశ్‌ మాస్టర్‌, రంగన్‌ అని చెప్పింది.

రంగన్‌ అంటే తిరుచ్చి వాడే కదా అని అడిగారు పోలీసులు. అవును అతనే. బెంగుళూరులో వుంటాడు. మారుతి జిప్సీలో యీ ముఠా అందర్నీ బెంగుళూరు చుట్టుపక్కల శిబిరాల్లో తిప్పుతున్నాడు అని చెప్పింది. ఇంటి ఆనుపానులు పరిశీలించారు పోలీసులు. రోడ్డు మీద వున్న ఓ యింటికి వెనక భాగంలో ఈ ఇంటి ముఖద్వారం వుంది. రెండిళ్లకీ మధ్య కొన్ని గజాల దూరం వుంది. ముందింటి కప్పు ఎక్కి చూస్తే శివరాజన్‌ ముఠా దాగున్న యింటి ఆవరణ కనబడుతుందన్నమాట. డిప్యూటీ పోలీసు కమిషనర్‌ మఫ్టీలో వుండే పోలీసును ఆ యింటి మీదకు ఎక్కించి, శివరాజన్‌ బృందంపై నిఘా వేయమన్నాడు. అతనికి సహాయంగా మీరందరూ వుండండి అని మరికొంతమంది ఏడుగురు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను, రిజర్వ్‌ పోలీసు దళాన్ని మోహరించాడు. వాళ్లు ఆ యింటికి కొంత దూరంలో తమ వాహనం పార్కు చేసి, దాన్లోంచి యీ యింటికి ఎవరైనా వస్తున్నారా అని చూడసాగారు. శివరాజన్‌ వున్న యింట్లోకి యీ వాహనాలేవీ కనబడవు. అయితే ఆ యింటికి వచ్చేవారికి మాత్రం కనబడతాయి. ఈ ఆలోచన ఆ పోలీసులకు పోలేదు. 

మారుతీ జిప్సీ బయటకు తీసుకెళ్లి తిరిగి వస్తున్న రంగన్‌ యీ వాహనాన్ని చూసి విషయం గ్రహించాడు. పోలీసులై వుంటారని సులభంగా వూహించాడు. కారు అట్నుంచి అటే తిప్పి వెళ్లిపోయాడు. ఎక్కడికి? ఎకాయెకి తమిళనాడుకి. చెన్నయ్‌కి చేరుకుని ఒక ద్రవిడ కళగం కార్యకర్తను ఆశ్రయించాడు. అతను మరో కళగం నాయకుడి వద్దకు తీసుకెళ్లాడు. ''నా స్నేహితుడి తమ్ముడు డిఫెన్సు ఉద్యోగి. ఆవడిలో క్వార్టర్సులో వుంటాడు. పూనా వెళుతూ వెళుతూ యింటి తాళాలు తన అన్నగారికి యిచ్చాడు. నేను అతన్ని అడిగి ఆ యింటి తాళం చెవులు మీకిప్పిస్తాను. అక్కడే వుండండి.'' అన్నాడతను. ఈ విధంగా రంగన్‌ తప్పించుకున్నాడు. శివరాజన్‌ ముఠా దొరికిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి యింకొన్ని రోజులు పట్టింది. అంతేకాదు, రంగన్‌ వెనక్కి తిరిగి రాకపోవడంతో శివరాజన్‌ ముఠాకు అనుమానం కలిగింది. పైగా రంగనాథ్‌, మృదుల వెనక్కి తిరిగి రాకపోవడం ఆందోళన కలిగించింది. బయట పోలీసులు కాపు కాసి వుంటారని వాళ్లు వూహించగలిగారు.

ఇదంతా దేనివలన? బెంగుళూరు పోలీసులు మామూలు పద్ధతుల్లో దాడి చేయడానికి చూడడం వలన! వాళ్లు సిట్‌కి చెప్పి వారి మార్గదర్శకత్వంలో నడవవచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఎందుకు అంటే పోలీసుల మధ్య స్పర్ధ వలన! కష్టం మనదీ, పేరు సిట్‌ది కాకూడదని రాష్ట్రపోలీసులు అనుకోవడం చేత. కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం. హీరో రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ వుంటాడు. అష్టకష్టాలు పడి విలన్‌ను పట్టుకుంటే చివరి నిమిషంలో సిబిఐవారు వచ్చి క్రెడిట్‌ కొట్టేస్తారు. మెడల్స్‌ వాళ్లకు వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యిగో సమస్యలు ఎలా వుంటాయో, పోలీసుల్లో కూడా అలాటి గొడవే వుంటుంది. అందుకే కేసు సిబిఐకు అప్పగించిన సందర్భాల్లో విచారణ సరిగ్గా సాగదు. రాష్ట్ర పోలీసులు తాము అప్పటిదాకా సేకరించిన సమాచారాన్ని సిబిఐతో పంచుకోవడానికి సిద్ధపడరు. నిజానికి సిట్‌ దళం అక్కడే బెంగుళూరు సిబిఐ ఆఫీసులో ఎన్‌ఎస్‌జి కమాండోలతో చర్చల్లో వుంది. ఆగస్టు 18 ఆదివారం కావడంతో, రంగనాథ్‌ ఫ్యాక్టరీ మూసి వుండడంతో అతని ఆచూకీకై ఎటు పోవాలో తెలియక చర్చల్లో మునిగివున్నారు. ఇలా మృదుల పట్టుబడిందని, శివరాజన్‌ ముఠా దాగున్న యింటి ఆనుపానులు తెలిసిపోయాయని ఆగస్టు 18 రాత్రి 8.30కు బెంగుళూరు పోలీసు కమిషనర్‌ రామలింగం ఫోన్‌ చేసి చెప్పేదాకా వారికి తెలియనే తెలియదు. ఆయన అప్పుడు మాత్రం ఎందుకు చెప్పాడు? ఆయనకు సాయంత్రం శివరాజన్‌ శిబిరం గురించి తెలిసింది. 8.30 దాకా ఆ దాడి ఏదో తామే చేద్దామన్న ఉబలాటంతో ఊగిసలాడాడు. అయితే మృదుల చెప్పింది - శివరాజన్‌, నెహ్రూల వద్ద ఎకె 47, పిస్టల్‌, సైనైడ్‌ గొట్టాలు రెడీగా వుంటాయని. వాటిని ప్రయోగించి తమ పోలీసులను కాల్చి పారేసి, సైనైడ్‌ మింగేస్తే అప్రదిష్ట వస్తుందని దడిశాడు. పేరు మాట ఎలా వున్నా చెడ్డపేరు వస్తుందని దడిసి అప్పుడు సిట్‌ వాళ్లకు చెప్పాడు.

అంతకు ముందు రోజు మాండ్యాలో దాడులు జరిపి ఐదుగురు ఎల్‌టిటిఇ వాళ్లను సజీవంగా పట్టుకున్న ఎన్‌ఎస్‌జి దళం బెంగుళూరులోనే వుంది. ''ఆదివారం రాత్రి 8 గం||లకు బెంగుళూరు పోలీసు కమిషనర్‌ మమ్మల్ని అనుమతించి వుంటే నా వద్ద వున్న అయిదుగురు కమెండోలతో సోమవారం తెల్లవారు ఝామున ఐదు గంటలకు దాడి చేసి శివరాజన్‌ను సజీవంగా పట్టుకునేవారం'' అని ఆ దళం అధినేత రవీంద్రన్‌ తర్వాత చెప్పారు. కానీ అలా జరగలేదు. శివరాజన్‌ లోపల, పోలీసులు వెలుపల.. యిలా 36 గంటలు గడిచాక పోలీసులు ఆ యింట్లోకి ప్రవేశించారు. పోరాడినంత సేపు పోరాడి శివరాజన్‌ ముఠా చివరకు సజీవంగా దొరక్కుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడిదాకా బాగానే నడుస్తూ వచ్చిన కథ హఠాత్తుగా యిలా భశుం కావడానికి చాలా కారణాలే వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం - వంటవాళ్లు ఎక్కువై వంటకాన్ని తగలేశారు! ఆదివారం సాయంత్రం పోలీసులు నిఘా వేసిన సంగతి శివరాజన్‌ ముఠాకు సోమవారం ఉదయం దాకా తెలియలేదు. ఆ ఎడ్వాంటేజిని సిట్‌ వినియోగించు కోలేక పోయింది. నిజానికి ఆదివారం రాత్రంతా శివరాజన్‌ ముఠా ఆందోళనతో గడిపింది. రంగనాథ్‌, మృదుల, రంగన్‌ ఎవరూ రావటం లేదు. తాము పారిపోదామంటే చేతిలో వాహనం లేదు, నడిపేందుకు రంగన్‌ లేడు, ఆటోలో పారిపోదామంటే సిటీ గురించి ఏమీ తెలియదు. స్థానిక భాష రాదు. ఇలా దిగాలు పడి వున్నారు. ఎప్పుడైతే సోమవారం తెల్లారాక పోలీసుల సందడి వాళ్లకు అర్థమైందో, యిక అప్పణ్నుంచి తెగింపు వచ్చింది. చావో రేవో అని పోరాడారు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives