Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: రాజీవ్‌ హత్య - 73

తిరుచ్చి శంతన్‌ ఎల్‌టిటిఇ రాజకీయ విభాగానికి యిన్‌చార్జిగా మాత్రమే వుంటే అతనిపై కేసు వుండేది కాదు. కానీ యింటెలిజెన్సు విభాగంతో చేతులు కలిపి శివరాజన్‌ ముఠాకు ఆశ్రయం కల్పించడం, బెంగుళూరు పారిపోవడానికి సహకరించడం వలన దోషిగా అయ్యాడు. కుట్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి పోలీసులు తనకోసం వెతుకుతున్నారని అతనికి తెలుసు మెట్టూరు పరిసరాల్లోనే ద్రవిడ కళగం కార్యకర్త సోదరుడు, మరి కొందరు రాజకీయనాయకుల యిళ్లల్లో తలదాచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. ఇది ఎక్కువకాలం కొనసాగడం కష్టం కాబట్టి జాఫ్నా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమిళనాడు తీరమంతా పోలీసులు పహరా కాస్తున్నారు కాబట్టి ఆంధ్ర తీరం వైపు దృష్టి సారించాడు. విశాఖపట్నంలో ఒక కళాసీ దొరికాడు. ఎవరికీ దొరక్కుండా జాఫ్నా తీసుకెళ్లగలనని హామీ యిచ్చాడు. అది సాధ్యపడేట్లా వుందా లేదా గమనించి చెప్పమని ధనశేఖరన్‌ను వైజాగ్‌ పంపాడు. అతనితో బాటు తన అసిస్టెంటు వసంతన్‌ని కూడా పంపాడు. వాళ్లిద్దరూ లేనప్పుడే ధనశేఖరన్‌ యిల్లు సోదా జరిగింది. సిట్‌ నోటీసు జారీ చేసినపుడు లాయరు వద్దకు వెళ్లడానికి మళ్లీ వసంతన్‌ను ధనశేఖరన్‌ వద్దకు పంపాడు. ఇద్దరూ చెన్నయి వెళ్లి, మారుపేర్లతో ఒక లాడ్జిలో దిగి, లాయరును కలుసుకున్నారు.  ఇవన్నీ ధనశేఖరన్‌ విచారణలో సిట్‌కు చెప్పేశాడు. శంతన్‌కు ఆశ్రయమిస్తున్న రాజకీయనాయకుల వివరాలు తమిళనాడు పోలీసులకు అందచేసి రాష్ట్రమంతా జల్లెడ పట్టయినా శంతన్‌ను పట్టుకోవాలని చెప్పింది సిట్‌. 

రోజులు గడుస్తున్నాయి.

అక్టోబరు 20 - సిట్‌కు అందిన సమాచారం ప్రకారం శంతన్‌ మెట్టూరు వదిలి భవానీ, ఈరోడ్‌ల మీదుగా తిరుచ్చికి తిరిగి వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఒక ద్రవిడ కళగం కార్యకర్తను తిరుచ్చిలో ఒక రెస్టారెంటులో కలవబోతున్నాడు. ఆ కార్యకర్తను సిట్‌ యిప్పటికే గుర్తించింది. సిట్‌ దళ సభ్యులు మఫ్టీలో ఆ రెస్టారెంటులో తలో మూలా కూర్చుని కాఫీ సేవిస్తున్నారు. కాస్సేపటికి కళగం కార్యకర్త వచ్చి కూర్చున్నాడు. ఎంతసేపు చూసినా శంతన్‌ రాలేదు. వేరే ఎవరో వచ్చి ఆ కళగం కార్యకర్తతో మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ఒక్క క్షణంలోనే నిర్ణయం తీసుకున్నారు. అతన్ని పట్టుకోవడానికి లేచారు. అతనది గ్రహించి పారిపోబోయాడు. మీదకు దూకి, పెడరెక్కలు విరిచిపట్టుకుని, జేబులు సోదా చేశారు. జేబులో ఒక ఉత్తరం దొరికింది. 

అతను వేరెవరో కాదు, శంతన్‌ అసిస్టెంటు వసంతన్‌. శంతన్‌ న్యాయవాది అతన్ని ఉద్దేశించి 'నువ్వు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం మంచిది' అని రాసిన ఉత్తరమే వసంతన్‌ జేబులో దొరికింది. వసంతన్‌ను ఎంత అడిగినా శంతన్‌ ఆచూకీ చెప్పటం లేదు. తనకు తెలియదంటున్నాడు. 'సరే, శంతన్‌ వద్ద ఎవరెవరున్నారు చెప్పు' అని అడిగితే 'ఇద్దరే యిద్దరు సహాయకులు మిగిలారు. గుణరాజ్‌, శివథాను' అన్నాడు. ఈ యిద్దరూ పద్మనాభ హత్యకేసులో ముద్దాయిలు, పరారీలో వున్నారు. వసంతన్‌ వద్ద రాబట్ట గలిగినంత రాబట్టి, చివరకు తమిళనాడు పోలీసులోని క్యూ విభాగానికి అప్పగించారు. 

శంతన్‌ వేట కొనసాగుతూనే వుంది.

నవంబరు 12 - సిట్‌ ఈరోడ్‌ విభాగానికి కబురు అందింది. గుణరాజ్‌ ద్రవిడ కళగం కార్యకర్తను కలిసి, మోటారు సైకిల్‌పై తిరుచ్చి వెళుతున్నాడని. వెంటనే తిరుచ్చి సిట్‌ ఆఫీసుకి ఉప్పందించి వీళ్లు ఈరోడ్‌ నుంచి అతన్ని వెంటాడుతూ వెళ్లారు. తిరుచ్చి దళం అక్కడ కాపలా కాస్తోంది. 

రాత్రి 8.30కు సుందర్‌ నగర్‌ వద్ద గుణరాజ్‌ మోటారు సైకిల్‌ దిగి తన స్నేహితుడికి గుడ్‌బై చెపుతూండగానే సిట్‌ దళాలు చుట్టుముట్టాయి. గుణరాజ్‌ విదిలించుకోబోయాడు. సిట్‌ వాళ్లు అతన్ని గట్టిగా పట్టుకుని జేబులోంచి రెండు సైనైడ్‌ గొట్టాలు లాగేశారు. దాంతో అతను లొంగిపోయాడు.  విచారించడానికి ఎక్కడకి తీసుకెళ్లాలాని ఆలోచించి, రైల్వే భద్రతాదళం (ఆర్‌పిఎఫ్‌) ఆఫీసుకి వెళ్లి అక్కడ విచారించసాగారు.

గుణరాజ్‌ ఓ పట్టాన లొంగలేదు. సిట్‌ కూడా వదిలిపెట్టలేదు. విచారణ వాయిదా వేస్తే శంతన్‌కు అనుమానం వచ్చి మకాం మార్చేయవచ్చు. అతన్ని తికమకపెట్టి చివరకు సమాచారం లాగారు. చివరకు అతను నోరు విప్పాడు - ''శంతన్‌ను కలవడానికే సుందరనగర్‌ వచ్చాను. ఇక్కడే ఒక శ్రీలంక స్మగ్లరు యింట్లో వున్నాడు. అక్కడికి వెళుతూండగానే మీరు పట్టుకున్నారు'' అని చెప్పాడు. 

అప్పటికే అర్ధరాత్రి దాటుతోంది. శంతన్‌ వద్ద కూడా సైనైడ్‌, గ్రెనేడ్‌, పిస్టలు వుంటాయి. శివరాజన్‌ కథ యిక్కడ రిపీట్‌ కాకూడదు. సిట్‌ వద్ద చాలినంతమంది మనుష్యులు లేరు. స్థానిక పోలీసుల మద్దతు కావాలి. అప్పటికప్పుడు స్థానిక డిఐజిని నిద్ర లేపారు. ఆయన ఎస్‌పిని లేపాడు. అరగంటలో అందరూ సమావేశమై ఒక ప్లాటూన్‌తో స్మగ్లరు యింటిపై దాడి చేయడానికి నిశ్చయించుకున్నారు.

రాత్రి ఒంటిగంటకు గుణరాజ్‌ సహాయంతో ఆ యింటిని చుట్టుముట్టారు. స్మగ్లరు తన కుటుంబసభ్యులతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాడు. ''తిరుచ్చి శంతన్‌ ఎక్కడ?'' పోలీసులు డైరక్టుగా అడిగారు.

''... శంతన్‌ ఎవరు సార్‌?'' అన్నాడతను అమాయకంగా.

మర్యాదగా అడిగితే చెప్పేట్టు లేడని, ఆర్‌పిఎఫ్‌ ఆఫీసుకు తీసుకెళ్ల నాలుగు తగిలించారు. ''నిజమే సార్‌, శంతన్‌ మా యింటికి యివాళ సాయంత్రం వచ్చాడు. కానీ వెంటనే వెళ్లిపోయాడు..'' అని చెప్పి వూరుకున్నాడు. అంతకంటె యింకేమీ రాబట్టలేకపోయారు. రాత్రి 2 గంటలైంది. చేసేదేమీ లేదని డిఐజి, ఎస్‌పిలు గుడ్‌ నైట్‌ చెప్పి వెళ్లిపోయారు. 

సిట్‌ దళాలు నిరాశలో మునిగిపోయాయి. శివరాజన్‌ లాగానే శంతన్‌ కూడా చేతి వేళ్లలోంచి జారిపోతున్నాడా అని. చిట్టచివరి అస్త్రాన్ని స్మగ్లర్‌పై ప్రయోగించారు ''చూడు, నువ్వు యిప్పటిదాకా నేరస్థుడివి కావు. శంతన్‌ యివాళ కాకపోయినా రేపైనా చిక్కుతాడు. చిక్కితే ఆ ఘనత గుణరాజ్‌కు పోతుంది. అతనికి అవార్డు యిస్తారు. నిజం దాచిపెట్టావని నీమీద కేసు పెడతాం. నీకు దక్కేది శిక్ష మాత్రమే'' అని. 

దాంతో అతను నోరు విప్పాడు ''సాయంత్రం వరకు శంతన్‌ నాతోనే వున్నాడు. నాకో చిన్న కాగితం మీద ఏదో రాసి, యీ కాలనీలోనే వున్న సెబాస్టియన్‌కు యిచ్చి రమ్మన్నాడు. వెళ్లాను. సెబాస్టియన్‌ కాగితం చదివి, ఎవరికో టెలిఫోన్‌ చేసి, 'పని పూర్తయిందని శంతన్‌కు చెప్పు' అని నాతో అన్నాడు. నేను వచ్చి శంతన్‌కు అదే మాట చెప్పాను. కాస్సేపటికి ఒక పెద్దాయన నల్లమోపెడ్‌ మీద వచ్చి, శంతన్‌ను ఎక్కించుకుని వెళ్లాడు.'' అని చెప్పాడు.

అంతే సిట్‌ దళాలు సెబాస్టియన్‌ యింటికి పరుగులు తీశాయి.

నవంబరు 13 - తెల్లవారుఝామున 3 గం||లు. సెబాస్టియన్‌ యింటి తలుపు తట్టాయి సిట్‌ దళాలు. అతను ఒక కరడుగట్టిన ద్రవిడ కళగం కార్యకర్త. గతంలో ఎల్‌టిటిఇ చీఫ్‌ ప్రభాకరన్‌ తల్లిదండ్రుల్ని తన యింట్లో పెట్టుకుని చూసుకున్నాడు. సిట్‌ దళాలలో కొందరు అతన్ని ప్రశ్నిస్తూండగా కొందరు అతని యిల్లు సోదా చేశారు. ఆ సోదాలో ప్రభాకరన్‌ బర్త్‌ సర్టిఫికెట్టు, అతని భార్య మార్కుల షీటు, ఎల్‌టిటిఇ చిహ్నమైన పులి గుర్తున్న ఖాళీ కోడిగుడ్లు దొరికాయి. ఇక ప్రశ్నల ఆధారంగా సెబాస్టియన్‌ ఆ సాయంత్రం ముగ్గురికి ఫోన్‌ చేశాడని, వారిలో ఒకరు ఆనంద రాజా అనే కళగం కార్యకర్త అని తెలిసింది. ఆనందరాజా గురించి సెబాస్టియన్‌ చేసిన వర్ణన, శంతన్‌ను మోపెడ్‌ మీద తీసుకెళ్లిన పెద్దాయన వర్ణన సరిపోయాయి. ఈ ఆనంద రాజా తిరుచ్చికి 16 కి.మీ.ల దూరంలో అణ్నానగర్‌లో వుంటాడని చెప్పాడు. 'మాతో వచ్చి అతని యిల్లు చూపించు' అన్నారు సిట్‌ వాళ్లు.

తెల్లవారుఝామున 4.15 కు ఆనంద రాజా యింటి ముందు సిట్‌ దళాలు నిలబడ్డాయి. చాలా విశాలమైన స్థలంలో రెండు యిళ్లు వున్నాయి. ఒకటి ఖాళీగా వుంది. మరోదాని చుట్టూ ప్రహారీగోడ. ఒక వైపు గోడమీద పెద్దక్షరాలతో 'దేవుడంటూ ఎవరూ లేరు..' అనే నినాదం పెయింట్‌ చేసి వుంది. ఇంటి ముందు యింకా పెద్ద అక్షరాలతో 'ఇది తమ్ముడు ప్రభాకరన్‌ గృహం' అని రాసి వుంది. ఇంటి గోడలకు ఎల్‌టిటిఇ నేత ప్రభాకరన్‌ ఫోటో, ఇవి రామస్వామి నాయకర్‌ ఫోటో వేళ్లాడుతున్నాయి. 

ఇక్కడ శంతన్‌ తలదాచుకున్నాడని నిర్ధారణ అయిపోయింది. బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను ప్రయోగించి పట్టుకోవాల్సిన సందర్భం. కానీ కోననకుంటె ఆపరేషన్‌ తర్వాత అవసరం లేదంటూ ఎన్‌ఎస్‌జి కమెండోలను సిట్‌ నుంచి తప్పించారు. తిరుచ్చి పోలీసుదళం సాయంతోనే ముందుకు చొచ్చుకుపోవడానికి, తెల్లవారే లోపున, జనాలు మూగేలోపున ఆపరేషన్‌ ముగించడానికి సిట్‌ నిశ్చయించింది.

'మీరంతా అటూ యిటూ గోడవారగా నక్కి వుండండి. సంకేతం రాగానే యింట్లోకి దూసుకుపొండి. లోపల్నుంచి ఎవరైనా ఫయర్‌ చేస్తే వెంటనే ఎదురుకాల్పులు జరపండి' అని వారికి ఆదేశాలిచ్చి సెబాస్టియన్‌ను కేక వేయమన్నారు. 

సెబాస్టియన్‌ కేక విని ఆనంద్‌రాజ్‌ తలుపు తీసుకుని వరండాలోకి వచ్చి, యినుప గ్రిల్‌లోంచి సెబాస్టియన్‌ను చూసి, వస్తున్నా నుండు అన్నట్టు సైగ చేసి, లోపలకి వెళ్లి తాళాలు తెచ్చి వరండా తలుపు తాళం తీశాడు. బైట గేటు తాళం కూడా తీయబోతున్నాడు.

వరండాలో వేసిన లైటు వెలుగులో ఆ వెనకాల హాలు గుమ్మంలోంచి బయటకు ఆత్రుతగా తొంగిచూస్తున్న శంతన్‌ సిట్‌ వారికి కనబడ్డాడు. పోలీసుల జాడను ఆనంద్‌రాజ్‌ కూడా పసిగట్టాడు. వెనక్కి తిరిగి ''శంతన్‌ పారిపో'' అని అరిచాడు. 

ధన్‌ మంటూ హాలు తలుపు మూసేశాడు శంతన్‌.

'కమాన్‌, ఎటాక్‌' అంటూ క్షణాల్లో పోలీసులు వరండాలోకి దూకి, యిల్లంతా చుట్టుముట్టేశారు. డజను మంది పోలీసు అధికారులు మూకుమ్మడిగా తలుపులు బద్దలుకొట్టే పనిలో పడ్డారు. అవన్నీ కొత్త తలుపులు, పగలటం లేదు.

ఇంతలో ఒక కిటికీలోంచి ఒక ఆఫీసరు లోపలకు తొంగి చూశాడు. శంతన్‌ నేలమీద పడుకుని సైనైడ్‌ గొట్టాలు తీస్తున్నాడు. ఆ ఆఫీసరు శంతన్‌ చేతి మీద ఫయర్‌ చేశాడు. అది గురి తప్పి, గోడకి తగిలి, తిరిగి వచ్చి శంతన్ని కొట్టింది. 

ఈ లోగా కొందరు పోలీసులు సింహద్వారాన్ని, మరికొందరు వెనక తలుపును ఫయర్‌ చేసి, గడియను వూడగొట్టారు. గడియ వూడిపోగానే లోపల్నుంచి ఒక మహిళ బయటకు పరిగెత్తింది. అన్ని వైపుల నుంచి పోలీసులు శంతన్‌ను చుట్టుముట్టారు. ఈ లోగానే అతను సైనైడ్‌ మింగేసి గిలగిలా తన్నుకుంటున్నాడు.

సైనైడ్‌ విరుగుడు యింజక్షన్‌ ఎక్కించసాగారు పోలీసులు. బలిష్టమైన మనిషి కావడంతో స్పృహ కోల్పోతూ కూడా ఇంజక్షన్‌ను నిరోధిస్తున్నాడు. అయినా బలవంతంగా యిచ్చేశారు. అది అతని శరీరంలోకి ఎక్కేసింది.

అమ్మయ్య అనుకుని వాహనంలో వేసుకుని శరవేగంగా డ్రైవ్‌ చేసి 25 కి.మీ.ల దూరంలో వున్న ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు ఉరుకులు పరుగుల మీద స్ట్రెచర్‌ పైన తీసుకెళ్లి నాడి పట్టుకున్నారు. అంతే! చేయి వదిలేశారు.

శంతన్‌ చనిపోయాడు! (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌  (ఏప్రిల్‌ 2015)

mbsprasad@gmail.com

Click Here For Archives