ఎమ్బీయస్‌ : రేపు టి-బిల్లుపై చర్చ జరిగేనా? – 2

చిక్కేమిటంటే తెలంగాణ విషయంలో బిజెపి కూడా కాంగ్రెసు బాట పట్టింది. ఆడ్వాణీ, మోదీ, వెంకయ్యనాయుడు ఒక రీతిలో మాట్లాడతారు. సుష్మ, జైట్లీ మరో తీరులో మాట్లాడతారు. రాజనాథ్‌ సింగ్‌ ఏ తీరులో మాట్లాడుతున్నారో తెలియడం…

చిక్కేమిటంటే తెలంగాణ విషయంలో బిజెపి కూడా కాంగ్రెసు బాట పట్టింది. ఆడ్వాణీ, మోదీ, వెంకయ్యనాయుడు ఒక రీతిలో మాట్లాడతారు. సుష్మ, జైట్లీ మరో తీరులో మాట్లాడతారు. రాజనాథ్‌ సింగ్‌ ఏ తీరులో మాట్లాడుతున్నారో తెలియడం కష్టంగా వుంది. ఇంతకుముందు సీమాంధ్రపై ఆశలు లేని రోజుల్లో బిజెపి కున్న తెగింపు యిప్పుడు కనబడటం లేదు. కాస్త తెలివిగా వ్యవహరిస్తే టిడిపితో పొత్తు, సీమాంధ్రలో కాస్త పట్టు – దక్కుతాయి కదాని ఆలోచిస్తున్నారు. ఈ తటపటాయింపు వూహించని టి-బిజెపి నాయకులు బెంగ పెట్టుకున్నారు. తెరాస భాష వుపయోగిస్తూ వచ్చిన విద్యాసాగరరావు, కిషన్‌ రెడ్డి వంటి నాయకులు యీ రాజీ ధోరణి తట్టుకోలేకపోతున్నారు. టి-బిల్లు పెట్టినట్టే భావించి, ఆమోదించేసి, చప్పట్లు కొట్టేయాలని వాళ్ల ఆతృత. దానివలన సీమాంధ్రలో బిజెపికి కలిగే నష్టం వాళ్లకు అనవసరం. 

ఏ పార్టీలోనైనా సరే స్థానిక నాయకులతో యిదే చిక్కు. వాళ్లు ముక్కుదాటి చూడలేరు. స్థానికంగా చాలా బలంగా వున్నామనీ, ఎవరితో పొత్తు అక్కరలేకుండా సొంతంగా పోటీ చేస్తామనీ జాతీయనాయకత్వంతో వాదనకు దిగుతారు. పొత్తు అంటే కొన్ని సీట్లు భాగస్వామ్యపక్షాలకు యివ్వవలసి వస్తుంది. ఆ వాటాల్లో మన టిక్కెట్టుకు ఎసరు వస్తుందేమోనన్న భయం వారిది. 'మన కార్యక్రమాలు జనాల్లోకి తీసుకెళ్లమని మీకు చెప్పాం కదా. అవేమీ చేపట్టకుండా రాజధానిలోనే కూర్చున్నారు. ఇప్పుడు బలం పెరిగిందని మీ అంతట మీరు అనుకుంటే సరిపోయిందా?' అని జాతీయనాయకత్వం చివాట్లు వేసి వాళ్ల స్ట్రాటజీ వాళ్లు అమలు చేస్తారు.

సభ సజావుగా సాగితే టిబిల్లుకు మద్దతు యిస్తాం, సీమాంధ్రులకు న్యాయం చేయమంటాం, మేం చెప్పిన సవరణలు చేయమంటాం అని రాజనాథ్‌ సింగ్‌ అంటారు. టి-బిల్లు ప్రవేశపెట్టినట్టే అనుకోమని ఆయన సుష్మకు నచ్చచెప్పారనుకోండి. సభ సజావుగా సాగుతుందన్న నమ్మకం వుందా? సీమాంధ్ర మంత్రులు రాహుల్‌ గాంధీ మాటలకు లొంగి రేపు సభలో నోరు మూసుకుని తమ సీట్లలోనే కూర్చుంటే ఎల్లుండి ప్రజలకు నచ్చచెప్పుకోవడం కష్టమవుతుంది. సమైక్యంగా వుంచలేకపోతే పోయావు కానీ మన ప్రాంతానికి ఏం చేశావ్‌? అని అడుగుతారు. ఏం చేశామని చెప్పాలో వాళ్లకూ తెలియదు. ఎందుకంటే బిజెపి చెప్పిన ప్రకారం బిల్లులో సవరణలు జరిగాయి అని కాంగ్రెసు ఢిల్లీ నేతలు చెప్తున్నారు. వాళ్లు బయట చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. అన్నీ నాటకాలే. వారం కితం ఓ సారి యిలాగే చెప్పి వెంకయ్య నాయుణ్ని బ్లఫ్‌ చేయబోతే 'పరిశీలిస్తాం' అంటే నిధులు యిచ్చినట్లు అయిందా? అని ఆయన నిలదీశాడు. అది జరిగిన తర్వాత యిక వీళ్లు సవరణలు ఎవరికీ చూపించడం మానేశారు. పార్లమెంటు చర్చలో అవన్నీ బయటకు వస్తాయన్న నమ్మకమూ లేదు. రైల్వే బజెట్‌, జనరల్‌ బజెట్‌ కూడా వాళ్లపాటికి వాళ్లు కాస్సేపు చదివేసి అయిపోయిందనిపించారు. ఇదీ అలాగే చేస్తారనుకోవాలి. బిల్లు ప్రవేశపెట్టిన తీరులోనే పార్లమెంటులో కూడా మూజువాణీ ఓటుతో మూడు నిమిషాల్లో తతంగం ముగించేస్తే, బిల్లులో ఏముందో ఎవరికీ తెలియదు. 

ఈ సవరణల వలన సీమాంధ్రకు మాత్రమే నష్టం అని టి-వాదులు మురిసిపోకూడదు. హైదరాబాదుపై అజమాయిషీ అంతా కేంద్రం తన చేతిలో పెట్టుకుంటే ఆ ఉత్సాహమంతా నీరుకారి పోతుంది. తెలంగాణ వచ్చేశాక మళ్లీ కొట్లాడి ఆంక్షలు ఎత్తివేయించుకుంటాం అని యిప్పుడు అనుకోవచ్చు. అప్పుడు రాజెవరో? రంగడెవరో? మొన్నమొన్నటిదాకా తెలంగాణ అంటే ఆశ, దోశె, అప్పడం అంటూ కేంద్రనాయకులు ఉడికించలేదా? నెలంటే నెలా కాదు, వారమంటే వారమూ కాదు కాదు ఆటలాడలేదా? ఈ క్షణాన  తెలంగాణ యిచ్చేస్తాం అని అడావుడి సాగుతోంది. ఇంతదూరం వచ్చినా ఇది కచ్చితంగా అయితీరుతుంది అని ఎవరూ చెప్పలేని స్థితి. కాంగ్రెసు కుట్రలు అలా అఘోరించాయి. ఇప్పుడు బిజెపికూడా వారితో చేరింది. ఇప్పుడు తెలంగాణ యివ్వకపోయినా ఫర్వాలేదు తప్పు ఎదుటివాళ్లపై నెట్టేయగలిగితే చాలు, అన్న మూడ్‌లో  యిద్దరూ వున్నట్టు తోస్తూ వుంటుంది. నికరంగా యిది అని మనకు కూడా తెలిసేట్లా చేస్తే రాజకీయ నాయకుల ప్రగ్గె ఏముంది? 

ఇరుప్రాంతాల వారినీ కూర్చోబెట్టి ఒప్పిస్తే విభజన చేయవచ్చని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు సెకండ్‌ బెస్ట్‌ సూచనగా చెప్పింది. విభజన భారాన్ని తన నెత్తిన వేసుకున్న కాంగ్రెసు పార్టీ తన పార్టీలోని యిరుప్రాంతాల నాయకులనైనా ఒక్కచోట కూర్చోబెట్టే ప్రయత్నమే చేయలేదు. తక్కిన పార్టీలూ డిటోడిటో. కాంగ్రెసు ఆ కనీస కసరత్తు చేసి వుంటే తక్కిన పార్టీలూ చేసి వుండేవి. అప్పుడు రెండు ప్రాంతాల ప్రజలు ఆకాంక్షలు తెలిసేవి, ఏ మేరకు దిగివస్తారో కూడా తెలిసేవి. అది చేయకుండా మా కిష్టం వచ్చినట్లు చేస్తాం అని కాంగ్రెసు బలప్రయోగం చేయడంతోనే యింత వ్యతిరేకత, ఏహ్యత కలుగుతోంది. సవ్యంగా చేసే బుద్ధి కాంగ్రెసుకు వుంటే రాజీ ప్రయత్నం చేసేది. ఒకరిపై మరొకర్ని ఉసికొల్పేది కాదు. ఇన్నాళ్లూ మాటలతో కుస్తీ చేయించింది. మొన్న భౌతికంగా కూడా కుస్తీ పట్టించింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత విజేతలు తమకు అన్యాయం చేశారన్న కసితోనే జర్మనీ రెండవ ప్రపంచయుద్ధం తెచ్చిపెట్టి, యూరోప్‌లోని అన్ని దేశాల నాశనానికి కారణమైంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా తమ మధ్య ఇజ్రాయేలును సృష్టించి దానికి అన్నీ కట్టబెట్టారన్న ఉక్రోషంతోనే అరబ్‌ దేశాలు ఇజ్రాయేలుతో నిరంతరం పోరాడుతూనే వున్నాయి. ఏడు థాబ్దాలవుతున్నా మధ్యప్రాచ్యం అగ్నిగుండం  చల్లారలేదు. న్యాయంగా చేశామని అధినేతలు అనుకోగానే సరిపోదు, న్యాయం జరిగిందని ప్రజలకు కూడా తోచాలి. వారికి ఓపిగ్గా నచ్చచెప్పాలి. ఒక మైనారిటీ ప్రభుత్వం అడ్డువచ్చిన వారందరినీ సస్పెండ్‌ చేసేసి, తమకు తోచిన తీరులో నిర్ణయం తీసుకుని ప్రజల నెత్తిన రుద్దితే తప్పక వ్యతిరేకత వస్తుంది. అది ఎప్పుడు, ఏ రూపం తీసుకుంటుంది అన్నది యిప్పుడు చెప్పలేం. 

'కాంగ్రెసు సరిగ్గా హేండిల్‌ చేయలేదు, కాబట్టి మేం బిల్లుకు మద్దతు యివ్వలేదు. అందర్నీ కూర్చోబెట్టి ఔననిపించి మేమే యిస్తాం' అని బిజెపి, 'మేం చేయగలిగినంతా చేశాం, బిజెపి యిచ్చిన మాట తప్పింది,' అని కాంగ్రెసు చెప్పుకుంటూ ఓటర్ల వద్దకు వెళ్లవచ్చు. బిజెపి మొత్తుకుంటున్నా కాంగ్రెసు బిల్లు పాస్‌ చేసే ప్రమాదం కూడా వుంది. మేం ఒప్పుకోం అని సుష్మా అంటూండగానే మీరా కుమార్‌ స్పీకరు సీటు విడిచి పారిపోవచ్చు. పాస్‌ అయిన బిల్లు చూసుకుంటే తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి రాబోయే పార్టీ బిజెపి కానీ మరోటి కానీ అప్పుడు దీన్ని ఆమోదించాలో, సవరించాలో ఆలోచించవచ్చు. హైదరాబాదుపై అజమాయిషీ కేంద్రం చేతిలో పెడితే కేంద్రం దాన్ని వదులుకోదు. ఆర్‌ఎస్‌ఎస్‌-జనసంఘ్‌-బిజెపి వాళ్ల మౌలిక సిద్ధాంతం – 'యూనిటరీ ప్రభుత్వం'. కేంద్రం బలంగా వుండాలని వారి వాదన. రాష్ట్రంపై హక్కులు తమ చేతికి వస్తే వాళ్లు సవరించకపోవచ్చు. అదే విధంగా ఈ రోజు సీమాంధ్రులకు వ్యతిరేకంగా వున్న సవరణలను రాబోయే ప్రభుత్వం మారుస్తుందన్న గ్యారంటీ లేదు. అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది, అది కేంద్రంపై ఏ రకమైన ఒత్తిడి కలగచేస్తుంది అన్నదానిపై మొత్తం ఆధారపడి వుంటుంది. 

అధికారపక్షం యిరువైపుల ఆటా తనే ఆడుతూ తన ఎంపీలను ప్రతిపక్షనాయకుల యిళ్ల చుట్టూ తిప్పుతోంది. ప్రస్తుతానికి సీమాంధ్రుల పట్ల కక్ష వహించినట్లు కనబడుతోంది. బిల్లు పూర్తి స్వరూపం చూశాక తెలంగాణను కూడా మోసం చేసిందా లేదా అన్నది స్పష్టమవుతుంది. నలుగురు కాంగ్రెసు నాయకులు కలిసి తెలుగువాళ్లతో, వారి భావితరాలతో చెడుగుడు ఆడేశారు. ప్రపంచంలో కల్లా పెద్ద ప్రజాస్వామ్యదేశం అని చెప్పుకునే భారతదేశంలో పార్లమెంటు గుడ్లప్పగించి చూస్తోంది. సుప్రీం కోర్టుకి 'సరైన సమయం' యింకా రాలేదు. ఆ బిల్లులో ఏముందో, ఎవరికి ఏ రకమైన మేలు లేదా కీడు చేస్తుందో అంతా అగోచరం, అయోమయం. ఇలాటి గందరగోళ బిల్లు పాస్‌ అవుతుందో లేదో యిప్పటిదాకా తెలియదు. అవదు అని కచ్చితంగా చెప్పనూ లేము. ఈ బిల్లు విషయంలో యీ రోజు చేస్తున్న దురాగతం భావి పార్లమెంటులకు ఆదర్శమౌతే అంతకంటె దురదృష్టం లేదు. ఈ దౌష్ట్యం తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జరగడం తెలుగువారి పట్ల అపచారం. (సమాప్తం)

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2014)

[email protected]

Click here For Part-1