''ఆరాధన'' తర్వాత తీసిన ''ఆత్మబలం'' సినిమాకు కూడా బెంగాలీ సినిమా ''అగ్నిసంస్కార్'' మూలం. ఆ విషయం రాజేంద్రప్రసాద్ మర్చిపోయి, ''దసరా బుల్లోడు'' పేరుతో రాసుకున్న తన అత్మకథ (యీ వ్యాసంలో వివరాలు ఆ పుస్తకంలోనివే) లో దానికి మూలం ''అతుల్ జలేర్ ఆహ్వాన్'' అని రాశారు. అది చదివి ''ఇదీ అసలు కథ'' కార్యక్రమం చేసేటప్పుడు నేను ఆ సినిమా గురించి చాలా వెతికి సంపాదించాను. తీరా చూస్తే దాని కథ వేరు. రాజేంద్రప్రసాద్‌గారితో చెప్పాను. ''అబ్బే, అదేనండి, 'ఇన్విటేషన్ ఫ్రమ్ డీప్ వాటర్స్' అని ఆ టైటిల్ అర్థం.'' అన్నారాయన. అర్థం కరక్టే. అదో సెంటిమెంటల్ సినిమా. ఓ బీద యువతి ఒక ధనికుడి యింట్లో ఆశ్రయం పొంది, చివరకు అతని ఆదరణ పొందడం కథాంశం. ''ఆత్మబలం''తో పోలికే లేదు. తెలుగు నిర్మాతలు కలకత్తా వెళ్లి వరసపెట్టి సినిమాలు చూసి, అదా, యిదా అనుకుని ఏదో ఒకటి ఫైనలైజ్ చేసేవారు. ఒకసారి రైట్స్ కొన్నాక, దాన్ని రచయిత, దర్శకుడి చేతిలో పెట్టేవారు. వాళ్లు మార్పులు, చేర్పులు చేసి చూపించేవారు. ఇక నిర్మాతలకు ఆ ఒరిజినల్ లీలగా గుర్తుంటుంది తప్ప వివరంగా గుర్తుండదు. చాలా ఏళ్లకు మనలా ఎవరైనా పరిశోధించి చెపితే ఓహో, అలాగా అంటారు. అప్పట్లో ''అతుల్..' కూడా చూసి కన్సిడర్ చేసి వుంటారు. ఆ పేరు మైండ్‌లో అతుక్కుపోయి వుంటుంది.
రాజేంద్రప్రసాద్‌గారు తీసిన 'మంచి మనుషులు' (అది ''ఆ గలే లగ్‌జా'' అనే హిందీ సినిమా రీమేక్) సినిమాలో మరో రకమైన యాక్సిడెంటు గురించి చెప్పాలి. ఆ సినిమాలో నటించే ఓ నటీమణి పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. నాల్గవనెల కడుపుతోనే షూటింగుకని కశ్మీర్ వచ్చింది. కెరియర్ దృష్ట్యా అబార్షన్ చేయించుకోమని అందరూ సలహా చెబితే సరేనంది. అప్పటికే నాల్గవనెల. అప్పుడు అబార్షన్ చేయించుకోవడం నేరం. చేసిన డాక్టరుకు కూడా శిక్ష విధిస్తారు. రహస్యంగా చేయించాలి.
మద్రాసు అయితే ఎవరో ఒకరు దొరుకుతారు. కశ్మీరులో ఎలా? వీళ్లకు తెలిసిన ట్రావెల్ ఏజంటు ద్వారా ఓ గవర్నమెంటు డాక్టర్ని పట్టుకున్నారు. ఆవిడ ముస్లిం. హిందూ యువతికి అబార్షన్ చేస్తూ ఏదైనా వికటిస్తే పెద్ద కమ్యూనల్ ప్రాబ్లెమ్ వస్తుంది. డబ్బు చాలా డిమాండ్ చేసింది. వీళ్లు సరేనన్నారు. ఓ ఆదివారం నాడు తన ఇంట్లోనే, మత్తుమందుకూడా ఇవ్వకుండా ఆవిడ అబార్షన్ చేసేసింది. ఈ నటీమణి బాధను ఓర్చుకుంది. ఆపరేషన్ సక్సెసయింది కాబట్టి గుట్టు రట్టవలేదు. లేకపోతే వీళ్లందరూ జైలు కెళ్లాల్సినవాళ్లే!
ఇవన్నీ సినిమానిర్మాణంతో సంబంధం లేనివే అయినా నిర్మాతకు తలకాయనొప్పి తెచ్చిపెట్టేవే! ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటే ఇవే కాబోసు!
''ఆత్మబలం''లోని 'చిటపట చినుకులు' పాట గురించి చెప్పాలంటే చాలానే వుంది కథ. అందరికీ తెలుసు ఆ పాట రాసింది ఆత్రేయ గారని. ఆ పాట ఆత్రేయగారు రాయడానికి ముందు చినుకుల మాట ఎలా వున్నా నిర్మాతల కంట బొటబొటా కన్నీళ్లు కార్పించాడు. సినిమా అనుకోగానే పాటలు రాయించుకుందామని రాజేంద్రప్రసాద్, దర్శకుడు వి.మధుసూదనరావు, సంగీతదర్శకుడు మహదేవన్ – వీళ్లందరూ బెంగుళూరు చేరారు.
ఆత్రేయ పాటలు రాయాలి. అప్పుడే రథం కదులుతుంది. కానీ ఆయన రాయడే! జగపతివారి ఫస్ట్ సినిమా ''అన్నపూర్ణ''కు సదాశివబ్రహ్మం రచయిత. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. రెండో సినిమా 'ఆరాధన'కు ఆత్రేయ, నార్ల చిరంజీవి రచయితలు. పాటలు శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, నార్ల చిరంజీవి. ''ఆత్మబలం'' కు వచ్చేసరికి మాటలు, పాటలు ఆత్రేయ. సంగీతం మహదేవన్. ఇక అప్పణ్నుంచి జగపతి సినిమాల్లో ఆత్రేయ, మహదేవన్ కాంబినేషన్ స్థిరపడిపోయింది. నిజానికి రాజేంద్రప్రసాద్ కాలేజీ రోజుల్లో ఆత్రేయ రాసిన 'కప్పలు' నాటకంలో ఓ గయ్యాళి స్త్రీ పాత్ర ధరించారు.
బెంగుళూరు తీసుకొచ్చి మూడురోజులు కూచోబెట్టినా ఆత్రేయ పాట కాదు కదా, పల్లవి కూడా రాయలేదు. పేపరు మీద పెన్ను పెడితో ఒట్టు. హాయిగా తినడం, తాగడం, తిరగడం. నిర్మాతగా రాజేంద్రప్రసాద్‌కి రచయితలతో ఇలాటి ఇబ్బందులు కొత్తకాదు. ఆయన సినిమారంగ ప్రవేశం తమాషాగానే జరిగింది. డిగ్రీ అయ్యేటప్పటికి ఆయనకు పెళ్లయింది. చదువయ్యాక మరో ముగ్గురితో కలిసి సిమెంటు వ్యాపారం చేశారు. పెద్దగా ఆదాయం రాలేదు. కొన్నాళ్లు వ్యవసాయం చూసేరు. కానీ ఆస్త్మా కారణంగా పొలాల్లో అవస్థ పడుతూంటే, రైసుమిల్లు చూడమన్నారు. కానీ అక్కడా చిట్టూ, తవుడూ వల్ల ఆస్త్మా పెరిగేది. ఇక ఇది పనికాదని సినిమా నటుడిగా మారదామనుకున్నారు. తండ్రి ఓ 50 వేల రూపాయలు చేతికిచ్చి 'దీనితో నీ అదృష్టం పరీక్షించుకో. డబ్బయిపోతే ఇంటికి తిరిగివచ్చి వ్యవసాయం చేసుకోవలసినదే!' అన్నారు. ఆ డబ్బు పట్టుకుని మద్రాసులో దిగారు రాజేంద్రప్రసాద్.
నాగేశ్వరరావుగారి సిఫార్సు వున్నా ఎక్కడా అంబ పలకలేదు. ఆర్నెల్లు తిరిగేసరికి డబ్బు సగం అయిపోయింది. హీరో వేషాల మాట వదిలేసి నిర్మాతగా మారదామనుకున్నారు. డబ్బింగ్ సినిమా తీద్దామా అని ఆలోచించి, చివరికి స్ట్రెయిట్ సినిమా తీస్తేనే బావుంటుందనుకున్నారు. 60 వేలు బజెట్ అనుకున్నారు. రంగారావుగారనే ఆయన 20 వేలు తెచ్చారు. రాజేంద్రప్రసాద్ బంధువులను 15 వేలు అప్పడిగి మొత్తం 40 వేలు సమకూర్చుకున్నారు. కథ గురించి సదాశివబ్రహ్మంని అడిగారు. నాలుగైదు సిట్టింగుల తర్వాత కథ ఫైనలైజ్ అయింది. అదే 'అన్నపూర్ణ'! డైలాగుల కోసం బెంగుళూరు వెళదామన్నారు ఆయన. కొత్త నిర్మాతలు సరేనన్నారు.
నిర్మాతలిద్దరూ, సదాశివబ్రహ్మం, ఆయన మనవడూ కలిసి కారులో బెంగుళూరు వెళ్లారు. ఓ యూరోపియన్ స్టయిల్ హోటల్లో దిగారు. మూడు పగళ్లూ, మూడు రాత్రుళ్లూ గడిచిపోయాయి. బ్రహ్మంగారు తినడం, తాగడం, రేసులకెళ్లడం.. డైలాగ్స్ మాత్రం ఊడిపడటం లేదు.
ఆఖరికి వీళ్లు ఆయన్ని అడిగేశారు – ఏమండీ డైలాగ్స్ రాసేది వుందా లేదా? అని. 'ఓస్ డైలాగ్సే కదా, ఓ రోజులో అయిపోతాయి ' అన్నారు. అవాళ రాత్రి మనుమణ్ణి కూచోబెట్టుకుని డిక్టేట్ చేసేశారు. పొద్దున్న కల్లా డైలాగ్స్ సిద్ధం! అమ్మయ్య అనుకున్నారు వీళ్లు. డైరక్టరు మధుసూదనరావుగారు కాస్త ఆలస్యంగా బెంగుళూరు వచ్చారు. డైలాగ్స్చూసి పెదవి విరిచారు. చేసేదేం లేక మద్రాసు తిరిగివచ్చి నానా అవస్థలు పడి మళ్లీ రాయించుకున్నారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2015)