Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌:YM: మంత్రిగా మొదటి రోజు- 1/1

సరిగ్గా నాలుగేళ్ల క్రితం యీ ''ఎస్‌ మినిస్టర్‌'' సీరీస్‌ మొదలుపెట్టి రెండు భాగాలు రాసి ఆపేశాను. ఆ విషయం చాలామందికి గుర్తుండకపోవచ్చు కాబట్టి ఆ రెండు భాగాలు మళ్లీ యిస్తూ, తక్కిన భాగాలు కూడా రాస్తున్నాను. ప్రతీ బుధవారం ఒక్కో కొత్త కథ మొదలుపెడతాను. అది రెండు, మూడు భాగాలు నడుస్తుంది. అందువలన 1/1, 1/2... 2/1, 2/2.. అలా వుంటుంది నంబరింగ్‌. గమనించగోర్తాను. 

2011 డిసెంబరులో బయటకు వచ్చిన శ్రీలక్ష్మి-సబితా ఇంద్రారెడ్డి వ్యవహారం ధర్మమాని ఐయేయస్‌ ఆఫీసర్లకు, మంత్రులకు మధ్య వుండే సమీకరణాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. ఎవరు ఎవర్ని ఆడిస్తారు? అనేది బయటవాళ్లకు అంతుపట్టని విషయం. ఈ అంశంపై వచ్చిన అతి గొప్ప రచన 'ఎస్‌ మినిస్టర్‌'. బిబిసి సీరియల్‌గా టీవీలో చాలాసార్లు చూసినవారు, పుస్తకరూపంలో చదివినవారు చాలామంది వున్నారు. కానీ దాని గురించి పూర్తిగా తెలియనివారు, తెలిసినా భాషాసమస్య వలన పూర్తిగా ఆస్వాదించలేనివారు వుండి వుంటారనే అభిప్రాయంతో ''ఎస్‌ మినిస్టర్‌'' కథల్ని పరిచయం చేస్తాను. ఇవి అనువాదాలు కావు. కథాంశాన్ని చెప్పి దానిలోని వ్యంగ్యాన్ని, సాంకేతిక అంశాలను వివరిస్తాను. ఓ నాలుగు కథలు చెప్పి రెస్పాన్సు బావుందంటే తక్కినవీ చెప్తాను.

ఈ కథలను బ్రిటన్‌లో జరిగినట్టుగా రచించారు. జిమ్‌ అనే ఓ రాజకీయవేత్త మొట్టమొదటిసారి మంత్రి కావడంతో కథలు ప్రారంభమవుతాయి. అతనికీ, అతని శాఖకు సంబంధించిన సీనియర్‌ అధికారి హంఫ్రీకి మధ్య జరిగే పిల్లీ-ఎలుకా ఆటలను వ్యంగ్యవైభవంతో మన ముందుకు తెచ్చారు. మంత్రి ఒక డైరీని మేన్‌టేన్‌ చేశాడనీ, దాన్ని, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆర్కయివ్స్‌తో సరిచూచుకుని ఇద్దరు సంపాదకులు 2019లో పుస్తకరూపంలో తెచ్చారని బిల్డప్‌ యిస్తారు. నిజానికి 40 ఏళ్ల క్రితమే తెచ్చారు. పుస్తకమంతా జిమ్‌ ఆత్మకథలా సాగుతుంది. మధ్యలో సంపాదకులు తమ వ్యాఖ్యలు జోడిస్తూంటారు. ఏది ఏమైనా ఈ పుస్తకం, ఈ సీరియల్‌ ఎందరో రాజకీయనాయకుల (ఇందిరా గాంధీ వారిలో ఒకరు), అధికారుల ప్రశంసలు కూడా అందుకున్నాయి. ఈ వ్యాసాలు చదివి వూరుకోకండి. ఇంగ్లీషు భాషను ప్రేమించేవారయితే పుస్తకం తప్పకుండా చదవండి. 

మొదట జిమ్‌ గురించి - అతను పాలిటెక్నిక్‌ కాలేజీలో లెక్చరరుగా పనిచేసి, తర్వాత 'రిఫార్మ్‌' అనే పత్రికకు ఎడిటరుగా వుండేవాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి బర్మింగ్‌హామ్‌ ఈస్ట్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ప్రతిపక్షంలో వుండగా వ్యవసాయశాఖకు షాడో మినిస్టర్‌గా వుండేవాడు. (ప్రతిపక్షంలో ఒక్కొక్క సభ్యుడు అధికారపక్షంలో ఒక్కొక్క శాఖపై దృష్టి కేంద్రీకరించి దానిలోని తప్పొప్పులని ఎండగడుతూ వుంటారు. ఆ శాఖ చూసే మంత్రిని వీళ్లు నీడలా, పీడలా వెంటాడతారు. మంత్రి కంటె వీళ్లకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మంత్రి తరచుగా మారిపోవచ్చు. కానీ వీళ్ల ఫోకస్‌ ఎప్పుడూ స్థిరంగానే వుంటుంది కదా). కొత్తగా జరిగిన ఎన్నికలలో జిమ్‌, అతని పార్టీ నెగ్గాయి. అక్టోబరు 23న జిమ్‌ పార్టీ నాయకుడు ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. జిమ్‌కు మంత్రిపదవి దక్కవచ్చని మీడియాలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆ వూహలు నిజం కావాలని జిమ్‌ కోరుకుంటున్నాడు. 

23 వ తారీకు రోజంతా జిమ్‌ ఫోన్‌ పక్కనే చతికిలపడ్డాడు. మంత్రి కాగోరే ఏ వ్యక్తియైనా ఆ దశలో టెలిఫోన్‌కి 20 అడుగుల దూరం దాటి వెళ్లకపోవడం సహజం కదా! కానీ జిమ్‌ భార్య ఏనీ అర్థం చేసుకోదు. అంతగా నిన్ను కాబినెట్‌లో చేర్చుకోవాలనుకుంటే మళ్లీ ఫోన్‌ చేయడా ఏం? వెళ్లి నాకు సిగరెట్లు పట్టుకు రా అంది. జిమ్‌ ఆదుర్దా జిమ్‌ది. ఎందుకంటే పార్టీ నాయకుడిగా గతంలో ఎన్నిక జరిగినప్పుడు జిమ్‌ యింకో అతన్ని సమర్థించాడు. అతని కోసం విస్తృతంగా ప్రచారం చేశాడు. తీరా చూస్తే యీయన నెగ్గాడు, ఇప్పుడు ప్రధాని కూడా అయ్యాడు.

చివరకు 24 న ఉదయం 9 గంటలకు రెండురోజులుగా 'కల'వరించి, పలవరించిన ఫోన్‌ కాల్‌ వచ్చింది. జిమ్‌ తన రాజకీయ సలహాదారు ఫ్రాంక్‌తో బాటు లండన్‌ రైలెక్కాడు. ప్రధాని నివాసానికి వెళితే ఆయన ''ఎడ్మినిస్ట్రేటివ్‌ ఎఫయిర్స్‌ శాఖను తీసుకో'' అన్నాడు. ఇది కాబినెట్‌ ర్యాంకు. ప్రాధాన్యతా క్రమంలో ఎనిమిదోదో, తొమ్మిదోదో. జిమ్‌ హితైషులు అతన్ని హెచ్చరించారు. ''నిన్ను రాజకీయంగా సమాధి చేయడానికే ప్రధాని ఆ శాఖ యిచ్చాడు. అన్ని మంత్రిత్వ శాఖలనూ సమన్వయం చేసే ఆ శాఖ నిర్వహణ చాలా కష్టం. ఆయన నిన్ను ఓవర్‌ప్రమోట్‌ చేశాడు - ప్రేమతో కాదు, పగతో!'' అని.  

వ్యవసాయశాఖకు ఏడేళ్లపాటు షాడో మినిస్టర్‌గా వున్నాను కాబట్టి, దానిలో సర్వం తెలుసుకాబట్టి ఆ శాఖే యిస్తారని జిమ్‌ అనుకున్నాడు. కానీ నిజానికి జరిగిందేమిటంటే ''జిమ్‌ యీ శాఖ గురించి చాలా సమాచారం సేకరించాడు కాబట్టి అతను మంత్రి కాకుండా చూస్తే మంచిది'' అని వ్యవసాయశాఖ పెర్మనెంట్‌ సెక్రటరీ తన సీనియర్‌ అయిన కాబినెట్‌ సెక్రటరీకి రాయడం, కాబినెట్‌ సెక్రటరీ కొత్త ప్రధానికి 'జిమ్‌ ఆ శాఖతో చాలా యిన్వాల్వ్‌ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు మంత్రి అయితే పాత మూసలో, అదే నలిగినబాటలో వెళ్లి కొత్తతరహాగా ఆలోచించలేకపోయే ప్రమాదం వుంద'ని హెచ్చరించడం జరిగాయి. దాని ఫలితమే ఈ శాఖ!

జిమ్‌ను ఆ మంత్రిత్వశాఖ వున్న బిల్డింగుకి తీసుకెళ్లగానే అక్కడ బెర్నార్డ్‌ అనే అతను కలిశాడు. అతను ఎవరు మంత్రిగా వుంటే వాళ్లకి ప్రైవేట్‌ సెక్రటరీ. అంటే యిప్పుడు జిమ్‌కు ప్రైవేట్‌ సెక్రటరీ అన్నమాట. అతనికో అసిస్టెంటు. జిమ్‌ వెంట వచ్చిన అతని రాజకీయసలహాదారు ఫ్రాంక్‌ను యిక్కణ్నుంచే అధికారులు తప్పించసాగారు. బెర్నార్డ్‌ ఎదురై జిమ్‌ను కారిడార్లోంచి అతని ఆఫీసుకి తీసుకుని వెళుతూండగా అతని అసిస్టెంటు ఫ్రాంక్‌ను ఏదో పని వున్నట్టు పక్కగదిలోకి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టేశారు. అధికారులు ఎందుకైనా మంచిదని అందరు రాజకీయనాయకుల గురించి రకరకాల సమాచారాలు సేకరించి వుంచుతారు. జిమ్‌ను తమ చేతిలోకి తెచ్చుకోవాలంటే ఫ్రాంక్‌ను తప్పించాలని తెలుసు కాబట్టే యిలా ప్లాను చేశారు. 

తన శాఖలోని అధికారులతో స్నేహం నెరపి, వారినుండి పని రాబట్టాలని జిమ్‌ ప్లాను. అందుకని బెర్నార్డ్‌ తనను మినిస్టర్‌ అని పిలుస్తూంటే, ఆ ఫార్మాలిటీ వద్దు, నన్ను పేరు పెట్టి పిలు అన్నాడు. కానీ అధికారగణం యిటువంటి ఉచ్చుల్లో పడరు. ఎవరు ఎంతకాలం అధికారంలో వుంటారో తెలియనప్పుడు మంత్రితో ఆత్మీయంగా మెలగడం రిస్కు. రేపు యీయన దిగిపోయి యీయనంటే పడనివాడు యీ పదవిలోకి వస్తే..? వచ్చి నువ్వు పాతవాడి స్నేహితుడివి అంటూ తొక్కేస్తే..? అందుకని వీళ్లకు దూరం మేన్‌టేన్‌ చేస్తేనే మంచిదని బ్యూరాక్రసీ అభిప్రాయం. అందుకని జిమ్‌ ఎంత చెప్పినా బెర్నార్డ్‌ మినిస్టర్‌ అనే పిలిచాడు. తనను మాత్రం బెర్నార్డ్‌ అని పిలవమన్నాడు. 

ఇప్పుడు హంఫ్రీ దిగాడు. అతను ఆ శాఖకు పెర్మనెంట్‌ సెక్రటరీ. మొత్తం ఆ శాఖకు అధిపతి. ఉపద్రవమైన తెలివితేటలు కలవాడు. టక్కరి. మాటలతో ఆడుకుంటాడు. ఈ ఆఫీసుకి స్వాగతం అన్నాడు జిమ్‌తో. 

''మీ ఇద్దరూ యింతకుముందు కలిశారనుకుంటా'' అన్నాడు బెర్నార్డ్‌.

''అవును కితం ఏడాది యీయన పబ్లిక్‌ ఎక్కవుంట్స్‌ కమిటీ ఎస్టిమేట్స్‌ మీద ప్రశ్నలడిగి నన్ను వేపుకుని తినేశారు. ఏ ప్రశ్నలైతే అడగకూడదని ఆశించానో సరిగ్గా అవే అడిగాడాయన.'' అన్నాడు హంఫ్రీ.

జిమ్‌ ముగ్ధుడైపోయాడు-తన విషయం యింత బాగా గుర్తుపెట్టుకున్నందుకు. ఓ రకమైన సంజాయిషీ చెపుతున్నట్టు ''ఇబ్బందికరమైన ప్రశ్నలడగడమేగా ప్రతిపక్షం అంటే ..!'' అన్నాడు. 

హంఫ్రీ అతనితో ఏకీభవిస్తూ, ''....ఆ ప్రశ్నలకు జవాబు చెప్పకపోవడమేగా ప్రభుత్వం పని..'' అని చేర్చాడు. 

''అదేమిటి, మీరు నా ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పారుగా..'' అని ఆశ్చర్యపడ్డాడు జిమ్‌.

''వాటిని మీరు జవాబులని అనుకున్నందుకు చాలా సంతోషం'' అన్నాడు హంఫ్రీ గుంభనగా. ఇక్కడే వుంటుంది ప్రభుత్వం యిచ్చే సమాధానాల్లో కిటుకు. ఫలానా స్కీము లోపభూయిష్టముగా వున్నది కావున దానిని సంస్కరించే వుద్దేశము ప్రభుత్వమునకు వున్నదా? అని అడిగితే  - ' పరిశీలనలో ఉన్నది' అని సమాధానం  యిస్తారు మంత్రి. పరీశీలనలో వున్నది స్కీమా? సంస్కరణ పథకమా? అన్నది తేలదు. అనుబంధప్రశ్న అడిగినా దాని జవాబు యింకా అస్పష్టంగా వుంటుంది. (సశేషం)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2016) 

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?