Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: కొండల్లె వచ్చినవి మంచల్లే కరుగుతాయి...

కష్టాలెప్పుడూ ఒక్కుమ్మడిగా వచ్చి మనల్ని బెంబేలెత్తిస్తాయి. 'మిస్‌ఫార్చ్యూన్స్‌ నెవర్‌ కమ్‌ సింగ్లీ' అని ఇంగ్లీషువాళ్లూ అంటారు. 'పెద్ద కూతురు ప్రసవం, చిన్న కూతురు సమర్త, కోడలికి వేవిళ్లు, భార్యకు చట్టనొప్పి, తనకు గోరుచుట్టు...' ఇలా ఒక గృహస్తు ఏకసమయంలో పడిన అవస్థలు గొలుసుగా చెపుతూంటారు. ఇలా ఒకసారి కాదు, అనేకసార్లు జరుగుతూ వుంటుంది. జరిగిన ప్రతీసారీ మనం వర్రీ అవుతాం, నిరాశ పడతాం. నిదానంగా ఆలోచిస్తే కితంసారి యిలా వచ్చిపడిన యిబ్బందుల్లో కొన్ని అనుకున్నంత యిబ్బంది కలిగించలేదని, ముందులో కంగారుపడినంత ప్రమాదం ఏదీ సంభవించలేదనీ గ్రహిస్తాం.

ఎటొచ్చీ ఆ దిశగా ఆలోచించే నిదానమే కావాలి. ఎప్పటికప్పుడు మనంత దురదృష్టవంతుడు భూమండలం మీద లేదని అనుకుంటూ వుంటాం కాబట్టి అలా ఆలోచించే కసరత్తు చేయం. అలా చేసిన ఒకాయన కథ యిది. అమెరికాలోని ఓక్లహామా సిటీలోని బ్లాక్‌వుడ్‌-డేవిస్‌ బిజినెస్‌ కాలేజీ యజమాని సి.ఐ.బ్లాక్‌వుడ్‌ అనే ఆయన 1943లో తనకు ఎదురైన కష్టాలను గ్రంథస్తం చేశాడు. ఆయనకప్పుడు 40 ఏళ్లు. ఒకేసారి ఆరు సమస్యలు తనపై దాడి చేశాయని ఫీలయ్యాడు. 

1. అప్పట్లో రెండవ ప్రపంచయుద్ధం జరుగుతోంది. యువకులందరినీ సైన్యంలో చేరమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. అందువలన అతని కాలేజీలో చేరేవాళ్లు లేరు. యువతుల సంగతి చూస్తే యీ కాలేజీలో పట్టా తీసుకుని ఆఫీసుల్లో పనిచేసి సంపాదించేదాని కంటె, ఏ డిగ్రీ అక్కర్లేకుండా సైన్యానికి సరంజామా సరఫరా చేసే సంస్థల్లో పని చేస్తే ఎక్కువ జీతం వస్తోందని వాళ్లూ చేరడం మానేశారు.

2. నగరానికి ఎయిర్‌పోర్టు కట్టాలని నిశ్చయించుకుని సిటీ ఎడ్మినిస్ట్రేషన్‌ భూమి సేకరించడం మొదలుపెట్టింది. అతనికి వారసత్వంగా వచ్చిన యిల్లు దాని కోసం గుర్తించిన ఏరియా లోనే వుంది. మార్కెట్‌ రేటు కంటె పదో వంతు రేటుకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటున్నారు. అలా అయితే ఉండడానికి యిల్లు లేకుండా పోతుంది. ఎక్కడైనా అద్దెకు వుందామన్నా, యిళ్ల కొరత విపరీతంగా వుంది. ఏ గుడారంలోనో కాపురం పెట్టాలేమో.

3. అతని యింటి పక్కనే ఓ డ్రయినేజి కాలువ తవ్వడం వలన అతని యింటి బావి ఎండిపోయింది. పశువులకోసం వేరే చోటి నుంచి బకెట్లలో నీళ్లు మోసుకురావలసి వస్తోంది. కొత్త బావి తవ్వాలంటే 500 డాలర్ల ఖర్చు. తవ్వించిందాకా వుండి, ప్రభుత్వం భూమి లాగేసుకుంటుందేమో తెలియదు. అందుకని తవ్వించలేదు. రోజూ పొద్దున్న నీళ్ల మోత తప్పటం లేదు.

4. అతని యింటి నుంచి అతను నడిపే బిజినెస్‌ స్కూలుకి పది మైళ్ల దూరం వుంది. అరిగిపోయిన టైర్లున్న పాత ఫోర్డు కారులో వెళుతున్నాడు. టైర్లు మార్చాలంటే కుదరదు, ఎందుకంటే యుద్ధనిబంధనల కారణంగా అతనికి క్లాస్‌ బి పెట్రోలు కార్డు మాత్రమే యిచ్చారు. దానితో కొత్త టైర్లు కొనే అవకాశం లేదు. ఈ పాత టైర్లు ఫట్‌మంటే స్కూలుకి వెళ్లే సాధనం లేదు. 5. అతని పెద్దకూతురు అనుకున్న దాని కంటె ఏడాది ముందుగా హైస్కూలు చదివి పూర్తి చేసేసింది. కాలేజీకి వెళతానని కూర్చుంది. చూడబోతే సరిపడా ఆదాయం లేదు. కాలేజీకి పంపనంటే తను బాధపడుతుంది. 6. అతని పెద్దబ్బాయి సైన్యంలో ఉన్నాడు. కొడుకు యుద్ధరంగంలో వుంటే అతని క్షేమం గురించి ఏ తండ్రి కైనా వర్రీ ఉండకమానదు.

ఇవన్నీ ఓ కాగితం మీద రాసి చూసుకున్నాడు. సమస్యలు స్పష్టంగా తెలిశాయి కానీ వాటికి పరిష్కారాలు మాత్రం ఏమీ తట్టలేదు. ఏం చేయాలో తోచక ఓ ఫైల్‌లో దాన్ని గుదిగుచ్చి పెట్టేశాడు. కాలం దాని పాటికి అది గడుస్తున్న కొద్దీ, యితను ఆ కాగితం మాటే మర్చిపోయాడు. ఏడాదిన్నర పోయాక, వేరే కాగితం గురించి వెతుకుతూ వుంటే యిది కనబడింది. ఈ మధ్యలో ఏం జరిగిందా అని సమీక్షించి చూసుకున్నాడు. 

1. విద్యార్థులు లేక బిజినెస్‌ కాలేజీ మూసేయాల్సి వస్తుందేమో అనుకున్నాడు కదా. అయితే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. యువకులందరూ యుద్ధంలోకి వెళ్లడం వలన భవిష్యత్తులో బిజినెస్‌ మేనేజర్ల కొరత ఏర్పడే ప్రమాదం వుంది కాబట్టి యీ లోపున యుద్ధం నుంచి తిరిగివచ్చిన వారికి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రభుత్వం ఖర్చుతో తర్ఫీదు యిప్పించాలని అనుకుంది. అందువలన యితని కాలేజీ ఫుల్‌ కెపాసిటీతో నడిచింది.

ఫీజు చెల్లింపుల విషయంలో కూడా చింతేమీ లేదు, ప్రభుత్వమే చెల్లించింది కాబట్టి! 2. ఇతని యింటికి మైలు దూరంలోనే ఆయిల్‌ బావి బయటపడింది. దాంతో చుట్టుపట్లంతా మార్కెట్‌ ధర విపరీతంగా పెరిగిపోయింది. ఆ ధరకు భూమిసేకరణ చేస్తే కిట్టుబాటు కాదనుకుని ప్రభుత్వం విమానాశ్రయాన్ని వేరే చోటకి మార్చేసింది. అందువలన యింటి సమస్య తీరిపోయింది. 3. ఆ విషయం తెలియగానే 500 డాలర్లు పెట్టి యితను యింట్లో మరో బావి తవ్వించేశాడు. నీటి ఎద్దడి సమస్యా తీరిపోయింది.

4. టైర్ల గురించిన భయం నిర్హేతుకమని తేలింది. చూసుకుని జాగ్రత్తగా డ్రైవ్‌ చేయడం వలన టైర్లు మార్చవలసిన అవసరం పడలేదు. 5. అమ్మాయి కాలేజీ చదువు ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు అనుకోకుండా అతనికి ఒక ఆడిటింగ్‌ పని తగిలింది. కాలేజీ పని అయిపోయాక అక్కడకు వెళ్లి పని చేయడంతో అదనంగా డబ్బు సమకూరింది. దానితో అమ్మాయిని కాలేజీకి పంపగలిగాడు. 6. కొడుక్కి యుద్ధంలో ప్రమాదాలేమీ జరగలేదు. అంతా సవ్యంగానే నడుస్తోంది. 

ఇలా కాలం అనేక సమస్యలు పరిష్కరించేసింది. 18 నెలల క్రితం భవిష్యత్తులోకి తొంగి చూడగలిగితే అతనవేళ వర్రీ అయ్యేవాడు కాదేమో! కొండల్లే వచ్చిన కష్టాలు కాలక్రమంలో మంచు వలె కరిగిపోతాయన్న ఆశాభావం పెట్టుకుంటే మనం ప్రతీదానికి యింత టెన్షన్‌ పడం!

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com