Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: రివ్యూ బాంబింగ్

ఎమ్బీయస్‍: రివ్యూ బాంబింగ్

ఏదైనా ఉత్పాదనపై పని గట్టుకుని నెగటివ్ కామెంట్స్ రాసి, వినియోగదారులను ప్రభావితం చేసి, తద్వారా ఆ ఉత్పత్తిదారులకు నష్టం కలిగించడాన్నో, లేక వాళ్లను బెదిరించి డబ్బు లాగడాన్నో ‘‘రివ్యూ బాంబింగ్’’ అంటున్నారు. మలయాళ సినిమాల విషయంలో కొందరు యీ బాంబింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు దర్శకులు చర్యలకు ఉపక్రమించారు. అక్టోబరులో ‘‘రాహేల్ మకన్ కోరా’’ (పైన ఫోటో) సినిమా డైరక్టరు ఉబైనీ ఇ. కొందరిపై కోచి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు 120, 385 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. దానికి ముందే ‘‘ఆరోమలింటే ఆద్యాతే ప్రణయం’’ అనే సినిమా డైరక్టరు ముబీన్ రవూఫ్ కేరళ హైకోర్టులో కేసు వేశాడు. హైకోర్టు జజ్ జస్టిస్ దేవన్ రామచంద్రన్ దాన్ని విచారణకు స్వీకరించి యథార్థాలు నిర్ధారించడానికి ‘ఎమికస్ క్యూరీ’ (కోర్టుకు మిత్రుడు)గా శ్యామ్ పద్మన్‌ను నియమించడం జరిగాయి.

గతంలో మనం ఏదైనా కంపెనీ సేవల గురించి, వైద్యుడి హస్తవాసి గురించి, వస్తువు నాణ్యత గురించి, పుస్తకం, సినిమా, హోటల్ యిత్యాదుల తీరుతెన్నుల గురించి తెలిసున్నవాళ్లని అడిగేవాళ్లం. ఇప్పుడు మనుషులతో సంపర్కం తగ్గిపోయింది కాబట్టి ఆన్‌లైన్‌లోకి వెళ్లి రేటింగు, రివ్యూస్ చూస్తున్నాం. ఆ రేటింగు యిచ్చేవాడెవడో, వాడి స్థాయేమిటో మనకు తెలియదు. ఒక్కోప్పుడు ఏదైన హోటల్‌లో బస చేద్దామని రివ్యూలు చూడబోతే ‘సిబ్బంది రూడ్‌గా ప్రవర్తించారు, అందుకే దీనికి ఒకటి రేటింగు యిస్తున్నాను.’ వంటి వ్యాఖ్యలు కనబడతాయి. సిబ్బందిలో ఒకడే అలా ఉన్నాడేమో, పైగా యీ కస్టమరు ఏం మాట్లాడాడో! శుభ్రత, రుచి వంటి వాటిల్లో ఎవరి స్టాండర్డ్ వారిదే!

కొంతమంది ప్రతీదానికీ ఆహా, ఓహో అనేస్తారు. వెళ్లి చూస్తే రోతగా ఉంటుంది. కేవలం రివ్యూల సంఖ్యాబలం బట్టి నాలుగు స్టార్లు, నాలుగున్నర స్టార్లు కనబడతాయి. మనం గుడ్డిగా వాటిని నమ్ముతున్నాం. దీన్ని కనిపెట్టి సరుకు అమ్మేవాళ్లు రేటింగులను మానిప్యులేట్ చేస్తున్నారు. ఆ మధ్య మా కజిన్‌కు గుండె ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఓ కార్పోరేట్ హాస్పటల్లో డాక్టరు నేను చేస్తానన్నాడు. అతని గురించి రేటింగ్స్ చూస్తే చాలా బాగున్నాయి. మా కజిన్ కొడుక్కి అనుమానం వచ్చి రేటింగు యిచ్చినవాళ్ల గురించి శోధించాడు. వాళ్లు రాచ్చిప్పల నుంచి రాకెట్ల దాకా (చమత్కారం లెండి) ఒకే రకమైన పదాలు ఉపయోగిస్తూ, ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూలు రాస్తున్నారట. అంటే ఆ డాక్టరు ఒక కంపెనీని నియోగించుకుని, తన గురించి పాజిటివ్ రివ్యూలను మాన్యుఫేక్చర్ చేయించు కుంటున్నాడన్నమాట.

దీనికి విపర్యంగా రివ్యూల ద్వారా అవతలివాళ్ల బిజినెస్ పడగొట్టే నిపుణులు నిర్వహించే సంస్థలూ ఉంటాయనుకోవాలి. రాజకీయ పార్టీల సోషల్ మీడియా వింగ్స్ చూస్తున్నాం కదా. పోటాపోటీలుగా మీమ్స్, షార్ట్ వీడియోల దగ్గర్నుంచి పచ్చి బూతులు కూడా కురిపించి సోషల్ మీడియా అంటే భయపడేలా చేస్తున్నారు. వీరిలో కొందరు జీతాలకు పని చేస్తే, మరి కొందరు పార్టీపై అభిమానంతో వాలంటీర్లుగా చేస్తున్నారట. కేసులు ఎదుర్కోవలసి వస్తే దన్నుగా మేమున్నామని పార్టీ నేతలు హామీ యిస్తున్నారు. ఇక సినిమాలకు వస్తే, రెగ్యులర్ మీడియాలో వచ్చే సమీక్షలపై చిత్రనిర్మాతలు, దర్శకులు, హీరోలు విరుచుకు పడడాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ అంశంపై గతంలో కూడా నేను వ్యాసాలు రాశాను.

సమీక్షకులను తిట్టే నిర్మాతలు తక్కిన విషయాలపై యితరుల రివ్యూస్ చూస్తున్నారు కదా. ఫలానా ఊళ్లో షూటింగు అంటే అక్కడి హోటళ్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రేటింగ్స్ చూస్తున్నారుగా! సమీక్షకుడికి ఒక ఐడెంటిటీ ఉండి ప్రేక్షకుల ప్రతినిథిగా రాస్తూన్నంత కాలం అతనికి క్రెడిబిలిటీ ఉంటుంది. దాన్ని పాఠకప్రేక్షకులు పట్టించుకుంటారు. బాగాలేని సినిమాలను ఆకాశానికి ఎత్తేస్తూన్నా, బాగున్న సినిమాను పాతాళానికి దింపేస్తూన్నా, పాఠకులు అతన్ని పట్టించుకోవడం మానేస్తారు. ఇకపై అతని సమీక్షలకు విలువే లేకుండా పోతుంది. పాఠకప్రేక్షకుల గౌరవాన్ని నిలుపుకున్న సమీక్షకులను కూడా ‘మా పెట్టుబడి మేం రాబట్టుకునే దాకా మీరు సమీక్ష చేయకూడదు’ అని నిర్మాతలు డిమాండు చేయడం అర్థరహితం.

‘మేం ప్రేక్షకులకు మాయమాటలు చెప్పి, మభ్య పెట్టి, సొమ్ము చేసుకుందా మనుకుంటూ ఉంటే, మధ్యలో మీరొచ్చి బాగా లేదని చెప్తే ఎలా? నీకు సినిమా తీయడం వచ్చా? ఏ కెమెరా వాడారో తెలుసా?’ వంటి ప్రశ్నలు హాస్యాస్పదంగా ఉంటాయి. వంటకం బాగా లేదని చెప్పడానికి వంట వండడం రానక్కరలేదు. సమీక్షకుడు ప్రేక్షకుడిగా తన సొంత అభిప్రాయమే చెప్తున్నాడని నిర్మాతలకూ తెలుసు, పాఠకులకూ తెలుసు. అతని అభిప్రాయమే కోట్లాది ప్రేక్షకుల అభిప్రాయమని ఎవరూ అనుకోరు. పుస్తక సమీక్షలు చదివేవాళ్లకూ యీ విషయం తెలుసు. అందుకే సమీక్షకుల రేటింగ్స్‌తో సంబంధం లేకుండా సినిమాల జయాపజయాలు ఉంటున్నాయి. పత్రికాధిపతులు తీసిన సినిమాలు కూడా ఫెయిలవుతున్నాయని యిక్కడ గమనించాలి. కొందరు రాసే సమీక్షలు వారు రాసే చమత్కార విధానం, ఎద్దేవా చేయడంలో చతురత గురించి చదువుతారు తప్ప సీరియస్‌గా తీసుకోరు. బాడ్ రివ్యూ కారణంగా సినిమా పోయిందని వాదిస్తే వింతగా కనబడుతుంది.

అయితే యిదంతా మామూలు సమీక్షకులకు వర్తిస్తుంది. పని గట్టుకుని దుష్ప్రచారం చేసేవారికి వర్తించదు. సినీ సమీక్షలు బయటకు రావడానికి వారం, పది రోజులు పట్టి, కేవలం మౌత్‌టాక్ పైననే సినిమాలు నడిచే రోజుల్లో పోటీ నిర్మాత కుట్రల కారణంగా కొన్ని సినిమాల మార్కెట్ దెబ్బ తిందని గతంలో కథనాలు వచ్చేవి. మొదటి వారం టిక్కెట్లన్నీ బుక్ చేసేసి, సినిమా మొదటి షో కాగానే, ‘సినిమా బాగా లేదు కాబట్టి, డిమాండు లేదు. గతి లేక మా దగ్గరున్న టిక్కెట్లు తక్కువ రేట్లకు అమ్మేస్తున్నాం’ అని థియేటరు దగ్గర బ్లాక్ మార్కెటీర్ల చేత అమ్మించేవారట. దాంతో థియేటరుకు వచ్చిన ప్రేక్షకుడికి సినిమాపై విరక్తి కలిగి మరో సినిమాకు వెళ్లిపోతాడు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి, సినిమా మొదటి షో కూడా పూర్తి కాకుండానే, సినిమా ఘోరంగా ఉందని సమీక్షలు రాసేసి, సోషల్ మీడియాలో పెట్టి, బాడ్ ప్రాపగాండా చేస్తున్నారట. దీన్నే సినీ రివ్యూ బాంబింగు అంటున్నారు.

ఈ సమీక్షలు ఏదో పత్రిక ద్వారానో, టీవీ ఛానెల్ ద్వారానో, వెబ్‌సైట్ ద్వారానో చేస్తే వాళ్లని పట్టుకోవచ్చు. కానీ యూట్యూబు మార్గాన్ని వీళ్లు ఎంచుకుంటున్నారు. వాట్సాప్ మెసేజిల్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియనట్లు, యూట్యూబు వీడియోలు కూడా అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రతీ వాడూ యూట్యూబరే. చాలా వాటికి ఆథెంటిసిటీ ఉండదు. ఊరూపేరూ లేనివారు అనేకమంది అందరికీ తెలిసిన విషయాల్లో కూడా తప్పులు చెప్పేస్తూ ఉంటారు. చెప్పేవాళ్లే అన్యాయంగా చెప్తున్నారనుకుంటే, యిక థంబ్‌నెయిల్ పెట్టేవాళ్లు మరీ అన్యాయంగా అంటారు. ఔట్ ఆఫ్ కాన్‌టెక్స్‌ట్ కామెంటో, ఒక్కోసారి వాళ్లు చెప్పని కామెంటో ఏదో ఒకటి పెట్టి వీక్షకులను ఆకర్షిద్దామని చూస్తారు.

వీటిని ఏదో కాలక్షేపానికి చూడడమే తప్ప సీరియస్‌గా పట్టించుకునే వారు ఎందరా అని నా అనుమానం. స్టాండర్డ్ పత్రికల సమీక్షలకే ప్రాధాన్యత యివ్వకుండా సినిమా చూడడమో, మానడమో నిశ్చయించు కుంటున్న ప్రేక్షకుడు వీటిని చూసి మానేస్తాడా? అనేది యింకా పెద్ద సందేహం.  కానీ వీటి కారణంగా బంగారం లాటి మా సినిమాలు ఆడటం లేదని మలయాళ పరిశ్రమ గగ్గోలు పెడుతోంది. క్రితం ఏడాది 177 సినిమాలు విడుదలైతే పదో, పరకో సినిమాలకు లాభాలు వచ్చాయట. ఈ ఏడాది అక్టోబరు వరకు 190 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో నాలుగిటికే లాభాలు వచ్చాయట. పెద్ద బజెట్ సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడ్డాయి. అంటే సినిమాల క్వాలిటీలోనే లోపం ఉందన్నమాట. పైగా ఒటిటి ప్లాట్‌ఫాం నుంచి పోటీ ఒకటి. అన్ని భాషాచిత్రాలకూ యీ సమస్య ఉంది. విద్యావంతులు విపరీతంగా ఉన్న కేరళలో ఒటిటికి మరింత ఆదరణ ఉండివుండవచ్చు. వాటిని అధిగమించి, ప్రేక్షకుణ్ని థియేటరుకు రప్పించే స్థాయిలో సినిమాలు తీయాలి దర్శక, నిర్మాతలు.

రివ్యూ బాంబింగ్‌పై కోర్టులో కేసు వేసిన ‘... ప్రణయం’ దర్శకుడు రవూఫ్ సినిమా విడుదలైన వారం రోజుల దాకా ఎక్కడా సమీక్షలు వెలువడకూడదనే ఆదేశాలిమ్మనమని కోర్టుని కోరాడు. అక్టోబరు చివరి వారంలో ‘‘రహేల్ మగన్ కోరా’’ దర్శకుడు ఉబైనీ ఫిర్యాదు మేరకు కోచి పోలీసు వాళ్లు హైన్స్ అనే ఫిల్మ్ ప్రమోషన్ కంపెనీపై, అరుణ్ తరంగా, అశ్వత్థ్ కోక్ అనే ఆన్‌లైన్ చిత్రసమీక్షకులపై, అనూప్‌అను6165  అనే ఫేస్‌బుక్ ఖాతా ఉన్న వ్యక్తిపై, సోల్‌మేట్స్55 అనే సోషల్ మీడియా వ్యక్తిపై, యూట్యూబు, ఫేస్‌బుక్ సంస్థలపై కేసులు పెట్టారు. ఇదే సమయంలో మలయాళ చిత్రనిర్మాతలు ఆన్‌లైన్ సమీక్షలపై పూర్తి నిషేధం విధించాలని కోరుతున్నారు. ఇది విమర్శలకు గురవుతోంది, చెడుగా రాసిన సమీక్షల వలన సినిమాలు ఫెయిలవుతున్నాయని నమ్మితే, మరి అద్భుతంగా ఉందని సమీక్షలు వచ్చిన సినిమాలు ఎందుకు ఆడటం లేదు అని అడుగుతున్నారు.

చెడు సమీక్షలు రాసేవారు పోటీ నిర్మాతల డబ్బుకు అమ్ముడు పోయారని, వ్యక్తిగతంగా యీ నిర్మాతపై పగబట్టి ఉన్నారని, లేదా నిర్మాతను బ్లాక్‌మెయిల్ చేయడానికి యీ పని చేశారని అందామంటే, మరి అతిశయోక్తుల సమీక్షలు రాసేవారు ఎందుకు రాస్తున్నారో కూడా వివరించాల్సి వస్తుంది. పైన నేను చెప్పిన కార్పోరేటు ఆస్పత్రి డాక్టరు స్కోరింగు లాగానే నిర్మాత సమీక్షకులకు డబ్బిచ్చి రాయించుకున్న సమీక్షలనుకోవాలా? సినిమా పబ్లిసిటీ, ప్రమోషన్‌లలో భాగమనుకోవాలా? మామూలు మీడియా సమీక్షల కంటె సోషల్ మీడియా సమీక్షలకు ఎక్కువ రీచ్ ఉంటుందని నిర్మాతల భయం అంటున్నారు. రీచ్ ఉండవచ్చు కానీ క్రెడిబిలిటీ కూడా ఉండాలిగా! మంచి సినిమాలకు తక్కువ స్కోరింగు యిచ్చిన సమీక్షకుడు తనే నష్టపోతాడు. ఇకపై ఎవరూ అతని సమీక్షలు చూడరు.

సినిమా పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని, సినిమా బాగా లేదని రాసి వారి పొట్ట కొట్టడం భావ్యం కాదని కూడా నిర్మాతలు సెంటిమెంటు రంగరిస్తున్నారు. సినిమా కార్మికుడి స్వేదానికే కాదు, ప్రేక్షకుడి కష్టార్జితానికి కూడా విలువ ఉంటుంది. తను ఖర్చు పెట్టే వంద రూపాయలకు తగినంత విలువ వస్తోందా లేదా అని అతనూ వర్రీ అవుతాడు. ఇలాటి సినిమా న భూతో న భవిష్యతి అని కల్లబొల్లి కబుర్లు చెప్పి మోసగించడానికి నిర్మాత చేసే ప్రయత్నాలను అడ్డుకునే సమీక్షకుడు సమాజద్రోహి అయిపోతాడా? సినిమాలో పని చేసే రోజుల్లోనే కార్మికుడికి కూలీ దక్కుతుంది. సినిమా ఆడకపోతే నష్టపోయేది నిర్మాత మాత్రమే. సినిమా కథాకథనాలపై దృష్టి పెట్టకుండా, హీరోకి, దర్శకుడికి అలవి కాని పారితోషికాలు యిచ్చినందుకు అతనికి ఆ పాటి గుణపాఠం అవసరమే.

ప్రజలు మెచ్చే సినిమాను ఏ సమీక్షకుడూ ఏమీ చేయలేదు. అతనేమీ సెన్సారు ఆఫీసరు కాదు, సర్టిఫికెట్టు యివ్వనని బెదిరించడానికి. అతను తొలి నాటి ప్రేక్షకుడంతే! అతను రెగ్యులర్‌గా రాసే సమీక్షలు తన భావాలకు, అనుభవాలకు అనుగుణంగా ఉంటేనే పాఠకప్రేక్షకుడు చదువుతాడు. తక్కిన సమీక్షలు పట్టించుకోడు. ఇది అర్థం చేసుకోకుండా బ్యాడ్ రివ్యూస్ (లేదా రివ్యూ బాంబింగ్) కారణంగా దెబ్బ తిన్న సినిమాల లిస్టు అంటూ కొందరు మలయాళ నిర్మాతలు మీడియాకు ఒక జాబితా విడుదల చేశారు. ఆ సినిమాలను చూడబోతే అవి ఫెయిలవడానికి ఏ బాంబింగూ అక్కరలేదని, వాటి క్వాలిటీయే అలా ఏడ్చిందని వ్యాఖ్యలు వచ్చాయి.

ఏ సమీక్ష పక్షపాతంగా ఉంది, ఏది నిష్పక్షపాతంగా ఉంది అని తేల్చడం ఎలా? అని కోర్టు పోలీసు చీఫ్‌ను అడిగింది. ‘దాని గురించి ప్రోటోకాల్స్ వర్కవుట్ చేస్తున్నాం’ అన్నాడాయన. ‘బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్‌స్’ యీ దిశగా ఏదైనా కొలబద్ద తయారు చేయగలదా?’ అని అడిగారు న్యాయమూర్తి. ఆ కొలబద్దేదో కేరళ హైకోర్టు ఏర్పరచ గలిగితే తక్కిన భాషా చిత్రాల నిర్మాతలు కూడా దాని ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తారు.

ఇది యిలా జరుగుతూండగా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ వారు సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించే పద్ధతిని యికపై అనుమతించ కూడదని నిశ్చయించారు. అది జర్నలిజమే కాదు అంటున్నారు వాళ్లు. వాళ్లూ, ఫిల్మ్ ఎంప్లాయీ ఫెడరేషన్ ఆఫ్ కేరళ వాళ్లూ కలిసి కూర్చుని రివ్యూ బాంబింగుతో పాటు పెయిడ్ ప్రమోషనల్ రివ్యూస్ గురించి కూడా చర్చిస్తున్నారు. కేరళ ఫిల్మ్ చాంబర్స్ సెక్రటరీ సాజీ ‘భావప్రకటనా స్వేచ్ఛను కాదనలేము. కానీ కొందరు రివ్యూ బాంబింగును అక్రమ జీవనోపాధిగా మార్చుకోవడాన్ని సహించ కూడదు.’’ అన్నాడు. వినడానికి బాగానే ఉంది కానీ ఒక సమీక్షకుడిక డబ్బు ముట్టినట్లు కానీ, దురుద్దేశం ఉన్నట్లు కానీ, బ్లాక్‌మెయిల్‌కు దిగినట్లు కానీ సాక్ష్యం సంపాదించడమే అత్యంత కష్టమైన పని.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?