cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: డ్రగ్ స్మగ్లర్ల కథ – ‘నార్కోస్’

ఎమ్బీయస్‍: డ్రగ్ స్మగ్లర్ల కథ – ‘నార్కోస్’

‘‘పుష్ప’’ సినిమాకు ‘‘నార్కోస్’’ వెబ్ సీరీస్ స్ఫూర్తి అనిపిస్తోందని యీ వెబ్‌సైట్‌లోనే రాసినది చదివి, కొందరు నార్కోస్ గురించి రాయమని కోరారు. పాఠకులలో చాలామంది దాన్ని చూసే వుండవచ్చు, పుష్పతో దానికి గల పోలికలు ఏ మేరకు అని తెలుసుకుని వుండవచ్చు. నేను ‘‘పుష్ప’’ చూడలేదు కాబట్టి తెలుసుకోలేను. నార్కోస్ కథ మాత్రం చదివి చెప్పి వూరుకుంటాను. కొలంబియాలో డ్రగ్ వ్యాపారి పాబ్లో ఎస్కోబార్ గురించి నెట్‌ఫ్లిక్స్ వారు 2015-17లలో తీసిన ఆ సీరీస్‌ను సుకుమార్ తప్పకుండా చూసి స్ఫూర్తి పొంది వుంటారు. ఆంధ్రలో ఎర్రచందనం స్మగ్లింగుపై దాన్ని ఆపాదించి వెబ్ సీరీస్ తీద్దామనుకుని వుండడంలో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా రెండు భాగాలుగా తీసినా వెబ్ సీరీస్ కూడా తీస్తానని అంటున్నారాయన.

ఎందుకంటే సినిమా అనగానే కమ్మర్షియల్ ఎలిమెంట్స్ పరంగా, నిడివిపరంగా కొన్ని పరిమితులుంటాయి. రియలిస్టిక్‌గా తీయడం కుదరదు. అన్ని పాత్రలనూ వివిధ కోణాలలో విపులంగా చూపడం సాధ్యపడదు. వెబ్ సీరీస్‌లో అయితే అనేక కోణాలను చూపవచ్చు. స్మగ్లరు కథ అంటే ‘‘దీవార్’’ సినిమాలో లాగ కేవలం దొంగా-పోలీసు ఆట మాత్రమే కాదు. పోలీసులు అవినీతితో పాటు, రాజకీయ నాయకుల ప్రమేయం వుంటుంది. లోపాయికారీగా వాళ్లిచ్చే మద్దతు, మరీ ఘోరాలు జరిగి ప్రజల్లో విమర్శ వచ్చినప్పుడు మొహమాటానికి చర్యలు తీసుకోవడం, మళ్లీ వాళ్లలో కొందరు నాయకులు నిజాయితీగా వ్యవహరిస్తే స్మగ్లర్లు వాళ్లని చంపేయడం, స్మగ్లర్ల మధ్య విభేదాలు, వ్యక్తిగతమైన కక్షలు, వాళ్ల కుటుంబసభ్యులు మధ్యమధ్యలో వారిని వారించడం, స్మగ్లింగుకి సహకరించేలా చేయడానికి స్థానిక ప్రజలకు మేలు చేసి మంచివాడని పేరు తెచ్చుకోవడం, నికార్సయిన పోలీసు ఆఫీసరు వచ్చినపుడు వీళ్లంతా కలిసి అడ్డుకోవడం... యిలా అనేక అంశాలు వీటితో ముడిపడి వుంటాయి.

ఎర్ర చందనం స్మగ్లింగ్ విషయంలో అయితే ఆంధ్ర, తమిళనాడు పోలీసుల, రాజకీయనాయకుల ప్రమేయం తప్పకుండా వుంటుంది. స్మగ్లర్లలో తెలుగు, తమిళ విభేదాలు కూడా ఉన్నాయేమో తెలియదు. చైనా, జపాన్‌లలో దీనికి గిరాకీ వుంది కాబట్టి, అక్కడి వ్యాపారస్తులు కూడా దీనిలో చొరబడి ఫైనాన్స్ చేయడం, తమ పలుకుబడి ఉపయోగించడం ఉంటూండవచ్చు. 19వ శతాబ్దంలో ఇండియా సుగంధ ద్రవ్యాలకై ఇంగ్లీషు, ఫ్రెంచ్ వాళ్లు యిక్కడ కంపెనీలు పెట్టి పోటీ పడి, రాజులను అడ్డు పెట్టుకుని, యుద్ధాలు చేసినట్లు చైనా, జపాన్ వాళ్లు తమ దళారీల ద్వారా గేమ్స్ ఆడుతున్నారేమో! ఇలాటివన్నీ చూపించాలంటే వెబ్ సీరీస్ లాటి కాన్వాస్ కావాలి. నార్కోస్‌లో అయితే అనేక అంశాలు చూపగలిగారు. ఎర్రచందనం రెండు రాష్ట్రాల మధ్య గొడవైతే, డ్రగ్స్ రెండు దేశాల మధ్య గొడవ. అనేకానేక కోణాలున్నాయి.

కొలంబియా దక్షిణ అమెరికాలో పశ్చిమ తీరంలో ఉన్న దేశం. అక్కడ తయారైన కొకేన్‌కు అమెరికాలో చాలా గిరాకీ వుంది. అమెరికా పశ్చిమ తీరంలో వున్న లాస్ ఏంజిలిస్‌కి, మయామీకి కూడా ధారాళంగా డ్రగ్స్ సప్లయి చేస్తూండడంతో అది అమెరికాలోని డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎడ్మినిస్ట్రేషన్ (డిఇఏ) వారి దృష్టికి వచ్చింది. ఇక్కడ సప్లయి చేసేవారి మీద, వాడే వారి మీద కేసులు పెట్టి ఊరుకుంటే లాభం లేదు, ఎక్కణ్నుంచైతే వస్తోందో అక్కడికే వెళ్లి యిక్కడికి పంపే పెద్ద తలకాయలనే కొట్టాలి అనుకుంది డిఇఏ. తన యిద్దరు ఇన్‌స్పెక్టర్లను కొలంబియాకు పంపింది. అయితే వాళ్లను పోలీసులుగా పంపితే కొలంబియా ప్రభుత్వం ఊరుకోదు. మీకు యిక్కడేం పని అంటుంది. అందువలన కొలంబియాలోని అమెరికా రాయబార కార్యాలయ ఉద్యోగులుగా పంపాలి. స్మగ్లర్లు దొరికినా వీళ్లు దాడి చేయలేరు, అరెస్టు చేయలేరు. కొలంబియా పోలీసుల ద్వారానే చేయించాలి. వాళ్లలో కొందరికి స్మగ్లర్ల దగ్గర్నుంచి డబ్బు ముడుతుంది కాబట్టి, సహకరించరు. పైగా దాడి చేయబోతున్న సమాచారాన్ని లీక్ చేసేస్తారు కూడా!

కొలంబియా ప్రభుత్వం బహిరంగంగా యీ ఆపరేషన్‌తో చేతులు కలపలేదు. కలిపితే ‘మన గడ్డపై విదేశీ ప్రమేయాన్ని అనుమతిస్తున్నావు, మన దేశం పరువు తీస్తున్నావు. మన స్మగ్లింగును మనమే ఆపాలి కానీ బోడి అమెరికా వాళ్లను సాయపడమని అర్థించడమేమిటి? అని ప్రజలు, ప్రతిపక్షాలు అధ్యక్షుణ్ని దుమ్మెత్తిపోస్తాయి. కొన్నాళ్లకు ప్రతిపక్ష నాయకుడే అధికారంలోకి వచ్చినపుడు అతనికి కష్టాలు తెలుస్తాయి. స్మగ్లింగ్ వలన జనజీవితం నాశనమౌతోంది. స్మగ్లర్లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి జరిపే పోరాటాల్లో సామాన్యులు చచ్చిపోతున్నారు. స్మగ్లర్లు రాబిన్‌హుడ్ అవతారమెత్తి పేదలకు డబ్బులు పంచడంతో వాళ్లు సాధారణ రాజకీయ నాయకుల కంటె వీళ్లనే మెచ్చుకుంటున్నారు. ఆ మోజుని ఉపయోగించుకుని దేశాధ్యక్షుడు కావాలని స్మగ్లరు అనుకుంటూంటే యిక మన గతి ఏమిటని పదవిలో వున్నవారి బెదురు.

అమెరికా రాయబారం కార్యాలయంలో డిఇఏ ఏజంట్లే కాదు, సిఐఏ ఏజంట్లు కూడా వున్నారు. కొలంబియాలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని అరికట్టడం వాళ్ల ముఖ్యోద్దేశం. స్మగ్లర్లలో కొందరు కమ్యూనిస్టు వ్యతిరేకులున్నారు. తమ మధ్య కక్షలను తీర్చుకోవడానికి స్మగ్లర్లు కమ్యూనిస్టులకు డబ్బిచ్చి అవతలివాళ్లను మట్టు పెట్టించడమో, తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులను తగలబెట్టించడమో చేయిస్తూంటారు. మరి కొందరు కమ్యూనిజాన్ని నిర్మూలించడానికి ఆయుధాలతో తిరుగుతున్నారు. కమ్యూనిస్టులను తుదముట్టించడానికి వాళ్లకు వ్యతిరేకంగా వున్న స్మగ్లర్లతో చేతులు కలపడానికి కూడా సిఐఏ వాళ్లు సిద్ధం. అందువలన వాళ్లు ఒక్కోప్పుడు డిఇఏకు సహకరిస్తారు, ఒక్కోప్పుడు తప్పుదారి పట్టిస్తారు, వాళ్ల గురించి స్మగ్లర్లకు సమాచారం లీక్ చేస్తారు. కొలంబియా అధ్యక్షులుగా వచ్చినవారిలో కూడా అమెరికా యిష్టులున్నారు, వ్యతిరేకులున్నారు. ధైర్యవంతులున్నారు, పిరికివారున్నారు, పిరికిగా ప్రారంభమైనా, స్మగర్ల ఘోరాలు చూసి, చలించి, ధైర్యం తెచ్చుకున్నవారున్నారు.

బాహాటంగా చేతులు కలపడానికి భయపడుతూంటారు కాబట్టి ఏదైనా ఆపరేషన్‌లో డిఇఏ వాళ్లు యిరుక్కుంటే, అది బయటకు వస్తే వాళ్లని వెనక్కి పంపించేస్తూ వుంటారు. స్మగ్లర్లకు అనుకూలమైన కొలంబియా జర్నలిస్టులు దీనిపై దృష్టి పెట్టి డిఇఏ వాళ్లపై నిఘా వేసి, వాళ్లని ఎక్స్‌పోజ్ చేస్తూంటారు. ఇలా అనేక యిబ్బందుల మధ్య డిఇఏ పని చేస్తూ వుంటుంది. వాళ్ల కుటుంబసమస్యలు ఎలాగూ వుంటాయి. స్మగ్లర్లు చాలా క్రూరులు. అమానుషంగా ప్రవర్తిస్తూంటారు. పోలీసులతోనే కాదు, సాటి స్మగ్లర్లతో కూడా! ఒకరిపై మరొకరు దాడి చేసుకుంటూ వుంటారు. అవతలివాళ్ల ముఠాలో తమ మనుష్యులను పంపుతూంటారు. తమ అకృత్యాలను బయటపెట్టిన స్థానిక అధికారులను వేధిస్తారు, బెదిరిస్తారు. వచ్చి పడుతున్న డబ్బుతో అత్యాధునికమైన సామగ్రి సమకూర్చుకుని, పోలీసుల ఫోన్లు ట్యాప్ చేస్తూ, వాళ్ల కంటె ఒక అడుగు ముందే వుంటారు.

ఇలాటి అనేక లేయర్స్‌తో పరిస్థితి కాంప్లికేటెడ్‌గా వుంటుంది. స్మగ్లర్ల యింటిసభ్యుల మానసిక స్థితి, వాళ్ల స్వభావాలూ కూడా కథాగమనంలో పాత్ర పోషిస్తాయి. అందుకే యీ సీరీస్ మొత్తం ఉత్కంఠభరితం. చూసినవాళ్లు వాహ్ అనకతప్పదు. కథలో సంఘటనలతో సహా చెప్పాలంటే ‘‘హోమ్‌లాండ్’’ (‘‘గూఢచారిణి ప్రేమకథ’’) అంత పెద్దగా చెప్పాల్సివుంటుంది. అది రెండు సీజన్లయితే యిది మూడు సీజన్లు. అందుకని కొన్ని పాత్రల గురించి మాత్రం చెప్పి వదిలేస్తాను. ‘‘పుష్ప’’ సినిమా ఒకటి, రెండు భాగాల్లో, వెబ్ సీరీస్‌లో వీరి ఛాయలు కనబడితే మీరు పోల్చుకోగలుగుతారు.

ఈ కథకు మూలం పాబ్లో ఎస్కోబార్ అనే డ్రగ్ వ్యాపారి. అతను ఎలా ఎదిగాడో చూపిస్తారు. అతను సప్లయి చేసిన డ్రగ్స్ అమెరికాలోని మయామీ దాకా చేరడంతో అక్కడున్న అమెరికన్ డిఇఏ ఎలర్ట్ అయి, స్టీవెన్ మర్ఫీ అనే ఏజంటును భార్యతో సహా కొలంబియా రాజధాని బొగోటాకు పంపిస్తుంది. అతనికి ఇంగ్లీషే వచ్చు కానీ అతనికి తోడుగా పంపిన జేవియర్ పేనా అనే ఏజంటుకి కొలంబియాలో అందరూ మాట్లాడే స్పానిష్ కూడా వచ్చు. నిజానికి వీళ్లిద్దరూ టెక్సాస్‌లోని మెక్సికన్-అమెరికన్ సంతతికి చెందినవాళ్లు. వీళ్లు ఎస్కోబార్ వెంటపడి అతన్ని, అతనితో పాటు మెడెల్లిన్ కార్టెల్‌ను (వాయువ్య కొలంబియాలోని మెడెల్లిన్ అనే ఊరు కేంద్రంగా నడిచిన డ్రగ్ మాఫియా) మట్టుపెట్టడంతో మొదటి రెండు సీజన్లు పూర్తవుతాయి. 2017లో వచ్చిన మూడో సీజనులో పేనా యితర డ్రగ్ లార్డ్‌స్‌ను, కాలి కార్టెల్‌ను (నైరృతి కొలంబియాలోని కాలి అనే ఊరు కేంద్రంగా నడిచిన డ్రగ్ మాఫియా) తుదముట్టించిన తీరు చెప్తుంది. వాస్తవ సంఘటనలకు కాస్త కల్పన జోడించి యీ సీరీస్ తీశారు. మర్ఫీ, పేనా సజీవంగా వున్నారు కాబట్టి వారిని కన్సల్టెంట్లగా పెట్టుకున్నారు.

ఈ మెడెల్లిన్ కార్టెల్ విస్తృతి గురించి చెప్పాలంటే 1972లో స్మగ్లింగ్‌కు మాత్రమే చేసే కొలంబియా నెట్‌వర్క్ 1976 నుంచి కొకేన్ విక్రయం కూడా మొదలుపెట్టింది. దానికి కారణం ఎస్కోబార్. అతను బ్లాంచో అనే మరో ట్రాఫికర్‌తో కలిసి దీన్ని విస్తరించాడు. ప్రతివారం బొలీవియా, పనామా, పెరు, బహామాస్, సెంట్రల్ అమెరికా, కెనడాలకు టన్నుల కొద్దీ సరుకు వెళ్లేది.  పోనుపోను యిది ఎంత పెద్దదైందంటే ఒక టెర్రరిస్టు సంస్థగా మారిపోయి, దేశ రాజకీయాల్లో కూడా వేలుపెట్ట సాగింది. బాంబులు వేయడం, కిడ్నాపులు చేయడం, చిత్తమొచ్చినట్లు హత్యలు చేయడం.. యిలా దేశంపై అప్రకటిత యుద్ధం సాగించింది. 1993 వరకు దీని ఆటలు సాగాయి. దీని ఉచ్చదశలో రోజుకి 60 మిలియన్ డాలర్ల లాభం వచ్చేదని అంచనా. ప్రపంచంలో అతి పెద్ద డ్రగ్ ఆర్గనైజేషన్‌గా పేరు కెక్కింది.

దీనిలో మూడోవంతు ఉండే కాలి కార్టెల్‌ను నడిపిన వారిలో గిల్బెర్టో రోడ్రిగ్యూజ్ అతని తమ్ముడు మిగువేల్ రోడ్రిగ్యూజ్ ఉన్నారు. వారితో పాటు జోస్ లండనో కూడా చేరాడు. వాళ్లు ఎస్కోబార్‌తో 1988 నుంచి విడిపోయాక హెల్మెర్ పాచో కూడా వచ్చి చేరాడు.

ఎస్కోబార్‌ది మొరటు పద్ధతులు. అసాంఘిక శక్తిగా పేరుబడినా బాధపడని రకం. ప్రభుత్వాధికారులను ఎడాపెడా చంపేసేవాడు. పేదరికం నుంచి వచ్చినవాడు. కమ్యూనిస్టులంటే పరమ అసహ్యం కానీ పేదలకు మంచి చేయడంలో ముందుంటాడు. వాళ్లకు యిళ్లు, ఆస్పత్రులు కట్టించి వాళ్ల పాలిటి దేవుడయ్యాడు. దేశానికి అధ్యక్షుడు కావాలని కలలు కన్నాడు. అన్నీ తన సొంత నిర్ణయాలే. ఎవరినీ సంప్రదించడు. కాలి కార్టెల్ వాళ్లు ఉన్నత వర్గాల నుంచి వచ్చినవారు. పైకి పెద్ద కంపెనీ నడుపుతున్నట్లు బిల్డప్ యిస్తూ లోపాయికారీగా డ్రగ్ వ్యాపారం చేసేవారు. వారి నెట్‌వర్క్ విస్తృతమైనది. దేశదేశాలకు కొకేన్ ఎగుమతి చేసేవారు. కార్పోరేట్ స్టయిల్లో పనులు యితరులకు అప్పగించి, అందరూ కూర్చుని చర్చించి చేసేవాళ్లు.

వాళ్లకు పేదలన్నా, తక్కువ జాతులన్నా పరమ అసహ్యం. సమాజంలో ఉండనక్కరలేని రకాలని వాళ్లు అనుకున్నవాళ్లని చంపిపారేసేవారు. ప్రభుత్వాధికారులను బెదిరించో, బ్లాక్‌మెయిల్ చేసో భయపెట్టేవారు తప్ప చంపేవారు కారు. 1993లో ఎస్కోబార్ మరణం తర్వాత 1995 వరకు ప్రపంచంలోని కొకేన్ వ్యాపారంలో 80శాతం వారి చేతిలోనే వుండేది. ఏడాదికి 7 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసేవారు. వాళ్లకు రాజకీయాల్లో ఆసక్తి లేదు. వాళ్లు బలపడడంతో పేనాను అక్కడకు పంపారు. అతను వెళ్లి తన ఇన్‌ఫార్మర్ల ద్వారా వాళ్ల గొడవలు తెలుసుకున్నాడు. ఎస్కోబార్ అంతాన్ని చూసి భయపడిన అన్నగారు యీ వ్యాపారంలోంచి బయటకు వచ్చేసి, మర్యాదకరమైన జీవితం గడపడానికి ప్రభుత్వంతో బేరసారాలు సాగిస్తున్నాడు. కానీ వ్యాపారం వదలడానికి తమ్ముడికి యిష్టం లేదు. అతనికి కుడిభుజంగా వున్న సాంకేతిక నిపుణుడు జార్జి అంటే అతని కొడుకు డేవిడ్‌కు పడదు. రకరకాల సంఘటనల కారణంగా కొందరు జైలుకి వెళ్లి, కొందరు చచ్చిపోయి, 1995లో ఆ కార్టెల్ మూతపడింది.

ఎస్కోబార్ (1949-93) పేద కుటుంబంలో పుట్టాడు. మెడిల్లిన్‌లోనే పెరిగాడు. చదువు పూర్తి చేయకుండానే నేరప్రపంచంలోకి దిగాడు. మొదట్లో చిన్నచిన్నవి చేసినా 1970 వచ్చేసరికి స్మగ్లర్ల కోసం కిడ్నాపులు చేసేవాడు. అతని తల్లి వీటిని ప్రోత్సహించేది. తండ్రి నిరసించి యింట్లోంచి బయటకు వెళ్లిపోయి, ఓ మారుమూల అజ్ఞాతంగా వ్యవసాయం చేసుకుంటూ వుండిపోయాడు. అతనికి తన భార్య తాతా అన్నా, కొడుకు, కూతురు అన్నా చాలా యిష్టం. 1976 వచ్చేసరికి కొకేన్ పౌడరును అమెరికాకు సరఫరా చేయడంలో ప్రవీణుడయ్యాడు. పోలీసులను బెదిరించి, తన పనులు చక్కబెట్టుకుంటూ ఎంతో సంపాదించాడు. తన కంటె మూడేళ్లు పెద్దవాడైన కజిన్ గుస్తావో అతనికి అండగా నిలిచాడు. అతనే యితని ఆర్థికవ్యవహారాలు, ఏ మార్గం ద్వారా సరుకు వెళ్లాలి అన్నీ నిర్ణయించేవాడు. అతని దగ్గరా చాలా డబ్బుంది, వ్యక్తిగతంగా ఎంతోమంది అనుచరులున్నారు. కానీ ఎస్కోబార్‌లా అతనికి పబ్లిసిటీ పిచ్చి లేదు కాబట్టి తగ్గి వుండేవాడు.

1980లు వచ్చేసరికి ఎస్కోబార్ విపరీతంగా సంపాదించడంతో అప్పటిదాకా డ్రగ్ వ్యాపారంలో వున్నవాళ్లకు కన్నెర్రగా మారాడు. వాళ్లలో వాళ్లకు పోరాటాలు జరిగి, విపరీతమైన హింస, హత్యాకాండ జరిగింది. ఎస్కోబార్‌కు ఒక లేడీ జర్నలిస్టుతో సంబంధం వుంది. ఆమె యితనికి మంచి పబ్లిసిటీ వచ్చేట్లు చేసేది. భారీ విరాళాలతో పేదల్లో పేరు వచ్చింది కాబట్టి రాజకీయాల్లోకి వెళదామని ఎస్కోబార్‌కు ఆశ. కానీ గుస్తావో వద్దన్నాడు. ఎస్కోబార్‌కు అతని మాటంటే గురి. కానీ యీ విషయంలో అతను వారించినా వినకుండా ముందుకు వెళ్లాడు. 1982లో పార్లమెంటుకి ఎంపీగా ఎన్నికయ్యాడు. మంత్రిగా అనేక యిళ్లు, ఫుట్‌బాల్ మైదానాలు, కమ్యూనిటీ సెంటర్లు కట్టించి పేరు తెచ్చుకున్నాడు. ఇక కొలంబియా రాజకీయ నాయకులకు భయం పట్టుకుంది. డబ్బు, నేరసామ్రాజ్యానికి తోడు రాజకీయాధికారం కూడా జత పడిందంటే తమ పని ఆఖరే అనుకున్నారు. అమెరికన్ ప్రభుత్వం అండదండలతో డిఇఏ ద్వారా ఆధారాలు సంపాదించి, అతనిపై కేసులు మోపి, ఎంపీ పదవి నుంచి తీసేశారు.

ఎస్కోబార్‌కు పగ రగిలింది. సెక్యూరిటీ ఆఫీసు బిల్డింగుపై దాడి చేయించాడు. ఒక విమానాన్ని పేల్పించేశాడు. ఆ కారణంగా ప్రజలకు అతనిపై సానుభూతి తగ్గింది. ఎస్కోబార్‌ను అణచాలంటే గుస్తావోను చంపాల్సిందే అనుకున్న డిఇఓ విశ్వప్రయత్నాలు చేసి 1990లో కొత్త దేశాధ్యక్షుడు గేవియేరా అధికారంలోకి వచ్చిన నాలుగు రోజులకు ఆ పని సాధించింది. ఎస్కోబార్ చలించిపోయాడు. ప్రతీకారంగా బాంబులు అవీ వేసి కొత్త ప్రభుత్వాన్ని హడలగొట్టాడు. కానీ అతనికీ బెదురు పుట్టింది. 1991లో ప్రభుత్వంతో రాజీకి వచ్చాడు. తనను అమెరికా అప్పగించకూడదని, కార్యకలాపాలు కట్టిపెట్టి, గృహనిర్బంధంలో వుంటానని మాట యిచ్చాడు. ప్రభుత్వం సరేనంది. కానీ ఆ గృహం జైలులాటిది కాదు. పెద్ద కోటలా కట్టుకున్నాడు. సొంత సెక్యూరిటీ పెట్టుకున్నాడు. రహస్యంగా తన పనులు సాగిస్తూనే వున్నాడు. తన ప్రత్యర్థులను అక్కడకి రప్పించి చంపేస్తున్నాడు. అది గ్రహించిన ప్రభుత్వం 1992లో అతన్ని మరిన్ని కట్టుదిట్టాలున్న చోటుకి తరలిద్దామని చూస్తే దొరక్కుండా పారిపోయాడు. కొంతకాలం పాటు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియలేదు.

సీరీస్‌లో అతను ఆ సమయంలో తండ్రి దగ్గరకు వెళ్లి తలదాచుకున్నాడని చూపించారు. తోడుగా విశ్వాసపాత్రుడైన డ్రైవరు ఒక్కడే మిగిలాడు. 16 నెలల పాటు కనిపించకుండా పోవడంతో కొలంబియా ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి, అతని సెల్‌ఫోన్ సిగ్నల్ ఎక్కణ్నుంచి వస్తోందో కనిపెట్టింది. అతను యీ లోపున బయటకు వచ్చి, ఓ కాలనీలో వుండగా సెర్చ్ పార్టీ వచ్చి వెతికింది. 8మంది వున్న బృందం అతన్ని కనిపెట్టి కాల్పులు జరిపింది. 1993 డిసెంబరు 2న అతను చనిపోయాడు.

ఇక కాలి కార్టెల్‌కు వస్తే అన్నగారు గిల్బెర్టో 1970ల్లో మారిజువానా వ్యాపారం చేసేవాడు.. ఎస్కోబార్‌ను చూసి, 1980ల నుంచి కొకేన్ వ్యాపారంలోకి దిగాడు. పైకి పెద్దమనిషిలా, వ్యాపారస్తుడిలా కనిపించేవాడు. ఎస్కోబార్‌తో వైరం ముదిరాక 1992 డిసెంబరులో యితని కూతురు పెళ్లిలో వెడ్డింగ్ కేక్‌లో ఎస్కోబార్ బాంబు పెట్టించి పలువురు అతిథులను చంపేశాడు. ఇక అప్పణ్నుంచి అతను ఎస్కోబార్‌పై కసిపెట్టుకున్నాడు. అతను కనబడకుండా పోయిన తర్వాత కాలి కార్టెల్ ప్రాభవం పెరిగింది. ఎప్పుడైతే పేనా వీళ్లపై పడ్డాడో, యితను వ్యాపారం వదిలిపెట్టేస్తాను, క్షమాభిక్ష పెట్టండి అని ప్రభుత్వంతో బేరసారాలు సాగించాడు. కానీ నేరాలు ఆగలేదు. ఇతను పారిపోయి అజ్ఞాతంగా బతకసాగాడు. చివరకు ఒక యింట్లో నేలమాళిగలో దొరికాడు. జైల్లో వుండాల్సి వచ్చింది. వ్యాపారం మానేయండి అని తమ్ముడికి కబుర్లు పంపాడు. కానీ తమ్ముడు మిగువేల్ వినలేదు. ఇన్నాళ్లూ అన్నగారు చెప్పినట్లు వినాల్సి వచ్చింది, యికపై రాజీ లేదు, ఏమీ లేదు, విజృంభించి వ్యాపారం చేయడమే అన్నాడు. కార్టెల్‌లో యితర సభ్యులు అతన్ని ఎగదోశారు.

అయితే అతనికి కొడుకు డేవిడ్ ద్వారా చిక్కులు వచ్చాయి. అతను మహా పొగరుబోతు. అసూయాపరుడు. తండ్రికి చేదోడుగా వున్న జార్జి అనే సాంకేతిక నిపుణుడిపై అకారణ కోపం. అతను యీ సంస్థలోంచి తప్పుకుని నా దారి నేను చూసుకుంటానంటే ఒప్పుకోలేదు. పైగా అతని కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడు. దాంతో అతను పేనా వైపుకి తిరిగాడు. తనకు తెలిసిన రహస్యాలన్నీ చెప్పేశాడు. మిగువెల్ కూడా జైలుపాలయ్యాడు. ఇది జరగడానికి ముందు అతను సాలాజార్ తన ప్రత్యర్థి ఒకతన్ని చంపించి, అతని భార్య మేరియాను లోబరుచుకున్నాడు. ఆమెను ఉంపుడుగత్తెగా పెట్టుకోవడం కొడుక్కి నచ్చలేదు. తండ్రి జైల్లో పడగానే ఆమెను బయటకు తరిమివేశాడు. ఆమె యితనిపై కక్షతో వెళ్లి వాళ్ల శత్రువుకి యితని ఆనుపానులు చెప్పేసింది. ఇతను సాంకేతిక నిపుణుణ్ని చంపడానికి బయలు దేరుతూండగా వాళ్లు వచ్చి కాల్చేశారు. గిల్బెర్టో సోదరులిద్దరినీ అమెరికాకు ఒప్పగించారు. అక్కడ వాళ్లకు జైలుశిక్షలు పడ్డాయి.

ఇలా అనేక మలుపులతో నార్కోస్ సీరీస్ నడుస్తుంది. వీలైతే చూడండి. ఏ నటుడూ అభినయించినట్లు అనిపించదు. పాత్రల్లో జీవించారనిపిస్తుంది. ఆ సీరీస్ ఆధారంగా మనవాళ్లు మంచి సీరీస్ తీసినా అభినందించాల్సిందే.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు