Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పాతాళం అంటే..?

ఎమ్బీయస్‍: పాతాళం అంటే..?

మన పురాణాల్లో చెప్పబడే పాతాళం ఏది? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? భూమి అడుగున ఉంటుందా? ఖగోళ శాస్త్రంలో నిష్ణాతులైన మన పూర్వీకులకు భూమి గోళాకారంలో ఉందని తెలిసే ఉంటుంది. భూతలం, భూగర్భం స్వరూపస్వభావాలు తెలిసే ఉంటాయి. భూమిని తవ్వుతూ పోతే పాతాళం తగులుతుందనే భావన వారికి ఉంటుందని నమ్మడం కష్టం. పాతాళం అంటే అధోలోకం. ఇంగ్లీషులో నెదర్‍ వరల్డ్ అంటున్నాం. మిల్టన్‍ ‘’పారడైజ్‍ లాస్ట్’’లో నెదర్‍ వరల్డ్‌ను ఎలా వర్ణించాడా అని చూడబోయాను. వివిధ జాతుల పురాణాల్లో నెదర్‍ వరల్డ్‌ని వర్ణించిన తీరులు అక్కడ కనబడతాయి. అయితే అవన్నీ మరణం తర్వాత వెళ్లే లోకాలే. పాతాళం అనే మాటకు సరి తూగవు. నరకలోకానికి వెళ్లినవాడు తిరిగి రాడు. పాతాళానికి వెళ్లినవాడు మళ్లీ పైకి రాగలుగుతున్నాడు. మళ్లీ వెళ్లగలుగుతున్నాడు. పాతాళానికి పంపబడిన బలి ప్రతీ ఏడూ ఓణమ్‍ టైముకి భూమికి వస్తున్నాడు. పాతాళంలో ఉండే మయుడు భూతలానికి వచ్చి మయసభ కట్టాడు.

నరకంలో వున్న వాళ్లు, అక్కడి సిబ్బంది తప్ప, అందరూ పాపులే. కానీ పాతాళంలో ఉన్నవాళ్లు పాపులు కారు. వారు వేరే ప్రాంతం వాళ్లంతే! అయితే వాళ్లు మానవులు కారు. దేవుళ్లూ కారు. దేవుళ్లు ఊర్ధ్వలోకాల్లో వుంటారు. గంధర్వాదులు అంతరాళంలో (ఆకాశానికి, స్వర్గానికి మధ్య) విహరిస్తూ వుంటారు. లేదా గంధమాదన పర్వత శ్రేణుల్లో వుంటారు. ఇక పాతాళంలో వుండేది రాక్షసులు, పోనీ అనాగరికులు, మోటువాళ్లు. పాతాళానికి నాగులకు లింకు వుంది. ఈ నాగులు పాములు కావచ్చు, లేదా నాగారాధకులైన నాగజాతి వారు కావచ్చు. వారూ అక్కడే నివసిస్తూ వుండవచ్చు. సముద్రగర్భంలో కూడా నాగులుంటాయి. అంతమాత్రం చేత పాతాళం కూడా సముద్రగర్భంలోనే వుందనుకోవడం సరి కాదు.

నా ఉద్దేశంలో  పాతాళాన్ని పాతాళలోకం అని వ్యవహరించడంతో గందరగోళం ఏర్పడుతోంది. లోకాలు అనగానే గోళాకార గ్రహాలను ఊహించి, 14 లోకాలు అనగానే భూమికి పైన ఆరు, కింద ఏడు గోళాలు కల్పిస్తున్నాము. నాకు తోచేదేమిటంటే భూమి, పైన స్వర్గలోకం, కింద నరకలోకం అనుకోవడం సరిగ్గా వుంటుంది. తక్కినవి లోకాలు కావు. ఇక అతల, వితల, సుతల, తలాతల... వంటి వాటి మాటేమిటి అనే ప్రశ్న వస్తుంది. ఇవన్నీ గోళాకార గ్రహాలు కావని నా అభిప్రాయం. తలము అంటే సర్ఫేస్‍, ఎ లెవెల్‍ సర్ఫేస్‍, రీజియన్‍.. అనే అర్థాలున్నాయి. అ-తల, వి-తల ... అంటూంటే అవి ఆయా ప్రాంతాలని, అవి సమతలంగానే (ప్లెయిన్‍గానే) ఉంటాయని అనుకోవాలి. అయితే యివి ఎక్కడున్నాయన్న ప్రశ్న వస్తుంది.

దీనికి ప్రపంచం గురించి మన ప్రాచీనుల అవగాహన ఎలా వుండేదో ఆలోచించాలి. ఈనాటి లోకంలో సంఖ్యాపరంగా అత్యధికులైన క్రైస్తవులు, ముస్లిములు, యూదులు ముగ్గురికీ ప్రామాణిక గ్రంథం, ఓల్డ్ టెస్ట్‌మెంట్‍. దానిలో చర్చించిన ప్రపంచమంతా మధ్య ఏసియా, దాని చుట్టూ వున్న ఆసియా, యూరోప్‍ దేశాలకే పరిమితం. దానిలో అమెరికా కనబడదు, ఆస్ట్రేలియా కనబడదు, పర్షియా అవతల తూర్పు వైపున ఏముందో కూడా ప్రస్తావన లేదు. వారి దృష్టిలో లోకం అదే. మన భారతీయుల భౌగోళిక పరిజ్ఞానం గురించి చూద్దాం. మన మంత్రాల్లో ‘చతుస్సాగర పర్యంతం...’ అంటాం. అదే మన లోకం. మూడు వైపుల సముద్రం తెలుస్తోంది. ఉత్తర భాగాన కూడా ఒక సముద్రం (కాస్పియన్‍ సీ?) వుందని అదే భూలోకానికి హద్దని అనుకుని వుండవచ్చు. మేరు పర్వతాన్ని గుర్తుగా పెట్టుకున్నారు. జంబూ ద్వీపం, భరతవర్షం, భరతఖండం, మేరు పర్వత దక్షిణ దిగ్భాగం... యిదీ ఆర్డర్‍. అందువలన ఇప్పటి ఇండియా, ఉత్తరాన వున్న కొన్ని దేశాలు కలిపి భూలోకంగా (కరక్టుగా చెప్పాలంటే భూలోకంలో భూతలంగా) వ్యవహరించారని అనుకోవాలి.

మనది భూతలం అనుకుని మనకు కుడివైపు కొన్ని తలాలు, ఎడమవైపు కొన్ని తలాలు వున్నాయని గుర్తించారు. వాటికి అతలం, రసాతలం.. అంటూ పేర్లు పెట్టారు.  వాటిని అప్పుడప్పుడు లోకాలు, భువనాలు అని కూడా అనేశారు. ఇలా పెట్టడం విడ్డూరమేమీ కాదు. దేశం అనే మాటను కూడా మనం నిశ్చితార్థంలో వాడం. భారతదేశం అంటూనే ఆంధ్రదేశం, తమిళదేశం, వంగదేశం అని కూడా వాడతాం. మనం మాత్రం కన్‍ఫ్యూజన్‍ లేకుండా ...తలం అనే మాటనే వాడదాం. ఇలా అనుకుంటే అతల, వితలాది తలాలన్నీ యిప్పటి భూగోళం మీదే వున్నాయని ఒప్పుకోవాలి. ఆ వరసలోనే వున్న పాతాళం కూడా భూగోళం మీదే వుంది. ఎక్కడుంది? ఆర్యసమాజ్ వ్యవస్థాపకులు దయానంద సరస్వతి రాసిన ‘‘సత్యార్థ ప్రకాశము’’ అనే పుస్తకం తెలుగు అనువాదం చదివాను. ఆయన ఆర్యావర్తమునకు సరిగా పాదముల క్రింద నుండు దేశమునకు పాతాళమని పేరు. ఆ దేశస్థులు నాగులనబడెదరు. అచ్చట నాగవంశపు రాజులు రాజ్యమేలు చుండిరి. ఆ దేశపు రాజకన్య యగు ఉలూపిని అర్జునుడు వివాహమాడెను అని రాశారు.

గ్లోబ్‍ తీసుకుని మన ఇండియా ద్వారా ఓ దబ్బనాన్ని గుచ్చితే అది మెక్సికో ప్రాంతంలో తేలుతుంది. వాళ్లకీ మనకీ యించుమించుసరిగ్గా 12 గంటల తేడా. గ్రెవిచ్‍ (గ్రీన్‍విచ్‍) నుంచి ఇండియా యిటువైపు ఎంత దూరం వుందో, అటువైపు మెక్సికో ప్రాంతం (కరక్టుగా చెప్పాలంటే మెసో అమెరికా ప్రాంతం) అంత దూరం వుంది. అందువలన అది మన దృష్టిలో పాతాళం కావడానికి ఛాన్సుంది. మెసో అమెరికా అంటే రెండు ఉత్తర, దక్షిణ అమెరికాలను కలిపే ప్రాంతం. ప్రాచీనకాలం వారు భూగర్భంలోంచి ప్రయాణించి, యీ విషయాన్ని కనుక్కున్నారా అంటే నమ్మలేం. కానీ ఖగోళశాస్త్ర జ్ఞానంతో కనుక్కుని వుండవచ్చు. అక్కడకు వాళ్లు ఎలా చేరి వుంటారు? విమానాలు వుండేవనుకుంటే విమానాల్లో వెళ్లేవారనుకోవాలి. అంతకంటె సులభమైన సాధనం - ఓడలు, ఇండియా నుంచి నౌకల్లో బయలుదేరి తూర్పుగా ప్రయాణించి మెసో అమెరికన్‍ ప్రాంతం చేరి వుండవచ్చు. అందుకే పాతాళం అనగానే మనకు చటుక్కున సముద్రం గుర్తుకు వస్తుంది. అంటే దాని అర్థం - సముద్రం దాటి గాని అక్కడకు చేరలేమని, అంతేకానీ సముద్రం అడుగున వుందని కాదు.

దీని గురించి ఇంటర్నెట్ శోధిస్తే మరింత సమాచారం దొరికింది. అనేది బలిచక్రవర్తి గురించిన వ్యాసం. వామనుడు మూడడుగులు అడిగాడని, త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని, రెండో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడోది ఎక్కడ పెట్టాలని అడిగాడని చదువుతాం. బలి భూమి మీదే వున్నపుడు అప్పటికే అతన్ని ఆక్రమించేశాడు కదా, యిక మూడోది పెట్టడానికి అతని తల అంటూ విడిగా ఏముంటుంది? అనే సందేహం వచ్చేది. దానికి యితను సమాధానం యిచ్చాడు. మూడు పాదాలంటే మూడు అడుగులు కాదని, మూడు నక్షత్రపాదాలు (చరణాలనీ అన్నాడు) ఇప్పుడు మనం ఆకాశాన్ని నక్షత్రాలుగా విభజించి లెక్కలు వేస్తున్నాం. అప్పట్లో భూమిని కూడా అలా వేసేవారన్నమాట. బలి అప్పట్లో ఆసియా, యూరోప్‍, ఆఫ్రికాలు పాలించేవాడు. ఆ మూడు పాదాలు త్రివిక్రముడికి వదిలేసి, నాలుగో పాదంలో వున్న పాతాళానికి (దక్షిణ అమెరికా) పయనమయ్యాడు.

దారిలో సుతల (ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా), తలాతల (అంటార్కిటికా) తగిలాయి. అతని మనుష్యులు మహాతల (ఉత్తర అమెరికా)లో కూడా స్థిరపడ్డారు. వాళ్లను తలాతలక్‍లు అన్నారు. ఈ పేరు భ్రష్టమై తోల్తెక్‍ (Toltec) అయింది. మెక్సికోలో ఒకప్పుడు వాళ్ల సామ్రాజ్యం వర్ధిల్లింది. ఇప్పటికీ తోల్తెక్‍లు కనబడతారు. వికీపీడియాలో అతల వగైరాల వర్ణనలు చదివితే అతలకు మయుడి కొడుకు రాజుగా వుంటాడని, అక్కడ చిత్తం వచ్చినట్లు సంచరించే స్వైరిణులు వుంటారని రాసి వుంది. అందువలన యివన్నీ దారిలో తగిలే దేశాలనుకోవచ్చు. ఇతని వాదన వినడానికి బాగుంది. బలి ప్రయాణం గురించి విభేదించవచ్చు కానీ మెసో అమెరికన్‍ వాసులకు, భారతీయులకు ఎన్నో పోలికలున్నాయన్నది వాస్తవం.

ఇప్పటికీ ఆహారపుటలవాట్లలో మెక్సికన్లకు, భారతీయులకు పోలికలున్నాయి. ఇక అక్కడ వర్ధిల్లిన మాయా నాగరికత గురించి తెలుసుకున్న కొద్దీ మనకు వాళ్లకూ వున్న సామ్యం మనను ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని వేల (8 వేలంటారు) సంవత్సరాల క్రితం అద్భుతంగా వర్ధిల్లి, హఠాత్తుగా మాయమైన మాయా నాగరికత గురించి ఎంతో సమాచారం దొరుకుతుంది. అక్కడి కట్టడాలు, మనుషుల ఆహార్యాలు పాతాళలోకానికి చెందినవే అంటే నమ్మేట్లుగా వుంటుంది. అక్కడి పిరమిడ్లు ఈజిప్టు పిరమిడ్ల కంటె పెద్దవి. మన దేవాలయాలు పగోడా టైపులో వుంటాయి. వాటితో పోలిక కనబడుతుంది. పురాణాల్లో ప్రస్తావించిన మయుణ్ని తీసుకుందాం. స్వర్గంలో వున్న యింజనియర్‍ విశ్వకర్మ అయితే పాతాళంలో యింజనియర్‍ మయుడు.  అతని పేరుమీదుగానే మాయన్‍ నాగరికత ఏర్పడి వుండవచ్చు. పేరులో పోలిక స్పష్టంగా కనబడుతోంది.

మయుడి గురించి ఒక మంచి ఆర్టికల్‍ చదివాను.  మన పురాణాల్లోని మయుడు, మాయన్‍ నాగరికత నిర్మాత మయుడు ఒకడేనా అని మార్కస్‍ ష్మీక్‍ అనే అతను వ్యాసం రాశాడు. మయుడు దక్షిణ ప్రాంతం నుంచి అక్కడకు వెళ్లి కట్టి వుండవచ్చు. లేదా అక్కణ్నుంచి యిక్కడకు వచ్చి కట్టి వుండవచ్చు అని ప్రతిపాదించాడు. తంజావూరు శిల్పుల వారసుడు, మన బుద్ధ విగ్రహం మొదలైన అనేక శిల్పాలు చెక్కిన గణపతి స్థపతి 1995లో పెరు వెళ్లి అక్కడి నిర్మాణాలను పరిశీలించి అక్కడి వాస్తుకి, మన వాస్తుకి వున్న పోలికలు గమనించి ఆశ్చర్యపడ్డారట. భాషాపరంగా కూడా మాయా నాగరికతకు, మన సంస్కృతానికి పోలికలున్నాయట. మన యోగం, వాళ్ల యోకా (దాని అర్థం సత్యమట), మన కుండలిని వాళ్ల కుల్తన్లిని. చిచెన్‍ ఇట్జా అనే పిరమిడ్‍లో గర్భాలయం పేరు చిలంబలం. మన చిదంబరానికి పోలిక తడుతోంది.

మాయా సంస్కృతికి, హిందూ సంస్కృతికి కల పోలికల గురించి మరింత చెప్పింది. మనకు త్రిమూర్తులున్నట్లే వారికీ వున్నారు. చాలామంది దేవతలున్నట్లే వాళ్లకీ వున్నారు. విగ్రహారాధన చేసేవారు. దేవతలవే కాదు, జంతువులవీ, కీటకాలవీ కూడా విగ్రహాలు చేసేవారు. చెట్లను, నదులను, వృక్షాలనూ పూజించేవారు. ఆత్మ వుందనీ, పునర్జన్మ వుందనీ నమ్మేవారు. స్పెయిన్‍ వారు దాడి చేసి అనేక మాయా దేవాలయాలను నాశనం చేసారు. వారి విగ్రహాలలో మనలాగానే రాజులు, పూజారులు గోచరిస్తారు. శిల్పాలు ముద్రలు పట్టివున్నట్లు కనబడుతుంది. మన మంత్రాల్లాగే మన్‍లా అని చదువుతారు. మనలాగే పద్మాసనం వేసుకుని ధ్యానముద్రలో కూర్చున్నట్లు శిల్పాలు కనబడతాయి.

http://www.veda.harekrsna.cz/connections/Americas.php లో ప్రాచీన అమెరికాకు, ఇండియాకు గల లింకులు అంటూ అరుణ్‍ అనే ఆయన పెద్ద వ్యాసం రాశాడు. ఇది మరీ అంత సైంటిఫిక్‍గా తోచలేదు. సూక్ష్మంగా దాని భావం రాసేస్తాను - మెక్సికోకు, ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపారబంధాలుండేవని శిలాశాసనాలు తెల్పుతున్నాయి.  అక్కడ తవ్వకాల్లో శివ, శివలింగ, గణేశ, కాళి, సూర్యుడు, బుద్ధులను పోలిన దేవతల విగ్రహాలు దొరికాయి. గ్యాటెమాలాలో ‘విల్కా హ్యూమానా’ పేరుతో 50 అడుగుల హనుమంతుడి విగ్రహం దొరికింది. మెక్సికోలోని అజ్‍టెక్‍ గుడిలో వాయుదేవుడి, కోతి దేవుడి బొమ్మలు దొరికాయి. మెక్సికోలో నవరాత్రి సమయంలో సితువా, రైమీ పేరుతో సీతారాముల పండగ జరుగుతుంది. అజ్‍టెక్‍ కాలండర్‍ హిందూ పంచాగాన్ని పోలి వుంటుంది. మెక్సికోలోని యుకాటన్‍ ప్రాంతపు యువతిని చూపిస్తే హరియాణాలోని జాట్‍ యువతిలా వుంటుంది.

అయార్‍ ఇనోవా రాజు తలపై తలపాగా, చెవికి పోగులు వుండి త్రిశూలం వంటిది చేతిలో పట్టుకుని వుంటాడు. ఆర్య సంప్రదాయానికి చెందిన శిల్పరీతి అంటే మెలిపడిన తామరతూళ్లు వంటివి అమెరికాల్లో కనబడుతుంది. మెక్సికోలో అమెరికన్ అంబాసిడర్‌గా పని చేసిన మైల్స్ పాయిండెక్స్టర్ అనే ఆయన ‘‘ద ఆర్యా-ఇన్‌కాస్’’ అనే పుస్తకాన్ని 1930లో రాశాడట. దానిలో ఆయన మాయా నాగరికత కచ్చితంగా హిందూ నాగరికతే అని రాస్తూ, పురాతన ఆర్యులు పొలినీషియా ద్వీపసముదాయం ద్వారా అమెరికాకు వచ్చారని ప్రతిపాదించాడట. ఇవన్నీ ఆ వ్యాసంలో రాశారు.

మయుడు మూడు నగరాలు కట్టాడని వాటిని త్రిభువనకాలన్నారని, దాన్ని మెక్సికన్‍ భాషలో Tiahuanaco  అంటారని, శివుడు త్రిపురాంతకుడి పేరుతో వాటిని నాశనం చేశాడని, తర్వాత మయుణ్ని కరుణించాడని పురాణగాథలున్నాయి. మాయా నాగరికత నాశనాన్ని యీ కథ తెలుపుతుందేమో తెలియదు. బలి వెళ్లిన తర్వాత అక్కడ కొత్త వలసలు ఏర్పడ్డాయని దాన్ని ‘నవ (కొత్త) తల’ అన్నారనీ, మెక్సికన్‍ భాషలో అది Nahuatl అయిందని, అది దక్షిణ అమెరికాలో వుందని, మెక్సికన్‍ పరిసర ప్రాంతాల్లోని వారి భాషను కూడా అదే పేరుతో పిలుస్తారని పై వ్యాసంలో రాశారు.

ఇక పాతాళంలో వున్న పాముల గురించి చూడబోతే ఆ వ్యాసంలో రాసిన ప్రకారం బలిని పాతాళానికి పంపిన వామనుడు, అతనిపై నిఘా పెట్టమని అక్కడున్న సర్పజాతి వారిని ఆదేశించాడు. వాళ్లు అక్కడకు చేరడానికి కారణం వుంది. జనమేజయ యాగంలో సర్పజాతి చాలాభాగం నాశనమైంది. తక్కినవారిని అస్తీకుడనే కాపాడి, పాతాళానికి పంపాడు. అందువలన వారు తాము అస్తీకపుత్రులుగా చెప్పుకున్నారు. ఆ పేరు క్రమేపీ భ్రష్టమై ఎజ్‍టెక్‍  అయింది. పాముల ఆరాధన మాయా నాగరికతలో చూడవచ్చు. మన పురాణాల ప్రకారం కూడా మయుడు, తక్షకుడు స్నేహితులు. ఖాండవవన దహనంలో ప్రాణాలు దక్కించుకున్నారు. కృతజ్ఞతగా మయసభ కట్టి యిచ్చాడు. మాయా నాగరికతలో పాములకు రెక్కలుంటాయి. నెట్‍లో మాయన్‍ సివిలిజేషన్‍ అని కొడితే చాలా ఫోటోలు వస్తాయి. మన భారతీయ శిల్పాలకు దగ్గర పోలికలున్న శిల్పాలు కనబడతాయి. జతపరచిన ఫోటో చూడండి. దీనికి సంబంధించిన వ్యాసాలేవైనా మీ దృష్టికి వస్తే పంచుకోగోర్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా