షాద్ నగర్ లో కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీని పోలీసులు గుర్తించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడు. దీన్ని పరువు హత్యగా నిర్థారించిన పోలీసులు.. ఈ కేసును రోజుల వ్యవథిలో ఛేదించి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పరువు కోసం హత్య చేశాడు.. షాద్ నగర్ లో ఈమధ్య కాలంలో ఇది వరుసగా రెండో పరువు హత్య. బిహార్ కు చెందిన కరణ్ కుమార్, షాద్ నగర్ లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడి ఫ్యాక్టరీకి దగ్గర్లో రంజిత్ ఉంటున్నాడు. రంజిత్ కూతురు, కరణ్ ప్రేమించుకున్నారు. ఈ విషయం రంజిత్ కు తెలిసి ఓసారి కరణ్ ను మందలించాడు.
అయినప్పటికీ ఈ జంట ప్రేమించుకోవడం ఆపలేదు. ఒక దశలో ఇద్దరూ వెళ్లిపోయారు కూడా. ఆ తర్వాత కొంతమంది సహకారంతో తిరిగి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు రంజిత్. ఈ విషయం తెలిసి బంధువులు, గ్రామస్తులు అడగడంతో పరువు పోయినట్టు భావించాడు. ఎలాగైనా కరణ్ ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఆగస్ట్ 15న కరణ్ ను ఫోన్ చేసి పిలిపించాడు. మరో ఐదుగురితో కలిసి కొట్టి చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా, మృతదేహాన్ని తన పొలంలోనే పాతిపెట్టాడు. కరణ్ కనిపించడం లేదంటూ, అతడి అన్న ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.
దీంతో కరణ్ పరారయ్యాడు. అతడ్ని ఈరోజు అరెస్ట్ చేశారు. అతడితో పాటు, మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం పరువు పోతుందనే భయంతోనే హత్య చేసినట్టు నిందితులు అంగీకరించారు.