Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పెట్రోలు ధరలు తగ్గవేం?

ఎమ్బీయస్‍: పెట్రోలు ధరలు తగ్గవేం?

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక రష్యా పెట్రోలు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఇయు) ఆంక్షలు విధించాయని, దానితో రష్యా వాళ్లకు అమ్ముకోవడానికి వీల్లేక ఆంక్షలు విధించని దేశాలకు ఎగుమతులు పెంచిందని విన్నాం. తక్కువ ధరకే అమ్ముతోందని, ఆ విధంగా మేలు కలిగిన దేశాల్లో ఇండియా ఒకటని చదివాం. బోల్డంత పెట్రోలు మనకు వచ్చి పడుతూ ఉంటే పెట్రోలు, డీజెలు, గ్యాస్ ధరలు తగ్గాలి కదా! కానీ తగ్గటం లేదెందుకని? పైగా గ్యాస్ సిలండరు ధర పెరుగుతూ పోతోంది. ఎందుకిలా అనేది మిస్టరీ అయిపోయింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న పెట్రోలు, డీజిలులో చాలా భాగం రిలయన్సు గ్రూపుకి యిస్తున్నారని, వాళ్లు ఎగుమతులు చేసి లాభాలు సంపాదిస్తున్నారనీ గణాంకాలతో సహా చెప్పిన వీడియోలు చూశాను కూడా!

‘‘హిందూ బిజినెస్‌లైన్’’ 2023 ఏప్రిల్‌లో వచ్చిన వార్త ప్రకారం రష్యా నుంచి ఇండియా చౌకగా దిగుమతి చేసుకుంటున్న చమురులో 46% వాటా రిలయన్స్, నయారా ఎనర్జీలదేనని ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వోర్టెక్సా తెలిపింది. బిజెపి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలు బారెల్ ధర తగ్గుతూ వచ్చినా ఆ బెనిఫిట్‌ను ప్రజలకు పాస్ ఆన్ చేయలేదు. పెట్రోలియం కార్పోరేషన్లకు గతంలో వాటిల్లిన నష్టాలు భర్తీ చేసుకోవడానికి ఆ నిధులు వినియోగిస్తున్నారు అన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా గతిలేని పరిస్థితుల్లో ముడి పెట్రోలును భారీ పరిమాణంలో చౌకగా లభింపచేస్తే, కనీసం అదైనా ప్రజలతో పంచుకోకుండా రిలయన్స్‌ లాభపడేట్లు చేయడం దేనికి? అనే ప్రశ్న నన్ను వేధిస్తూ వచ్చింది. అసలు మధ్యలో రిలయన్సుకి యివ్వవలసిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా నాకు అర్థం కాలేదు.  

పాఠకుల్లో ఎంతమంది చదివి ఉంటారో నాకు తెలియదు కానీ మే నెలలో పేపర్లలో ‘లాండ్రోమాట్ దేశాలు’ అంటూ ఒక రిపోర్టు వచ్చింది. ఫిన్లాండ్‌లో ఉన్న క్రియా (సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్), బ్లూమ్‌బెర్గ్, కెప్లర్ అనే ఎనలిటిక్స్ సంస్థ యివన్నీ స్వతంత్రంగా తయారు చేసిన నివేదికలన్నీ 5 దేశాలు రష్యా నుంచి పెట్రోలు దిగుమతి చేసుకుని, ఇయు దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయాన్ని ఎత్తి చూపాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించాక రష్యాకు బుద్ధి చెప్పడానికి ఇయు దేశాలు 2022 డిసెంబరులో ఒక తీర్మానం చేశాయి. సముద్రమార్గం ద్వారా వచ్చే రష్యా పెట్రోలుకి బ్యారెల్‌కు 60 డాలర్ల కంటె ఎక్కువ ధర చెల్లించకూడదని నిర్ణయించారు. వాటిని ‘ప్రైస్ క్యాప్ కొయాలిషన్’ దేశాలన్నారు. వీటిలో ఇయు దేశాలు, జి7 దేశాలు, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. ఈ ఆంక్షల కారణంగా 2022 మొదటి నెలల్లో నెలకు 6.1 బిలియన్ టన్నులు కొన్న ఇయు దేశాలు, 2023 వచ్చేసరికి 0.7 బిలియన్ టన్నులు మాత్రమే కొన్నాయని ఒక సమాచారం. దిగుమతి అంతగా పడిపోయింది. మరి యీ లోటును ఎలా భర్తీ చేసుకుంటున్నాయి? ఇంధన ప్రత్యామ్నాయాలు వాడినా యింత భారీ లోటు అంత తక్కువ సమయంలో పూడ్చుకోవడం సాధ్యమా?

దీనికి గాను అవి ఎంచుకున్న మార్గం రష్యా నుంచి నేరుగా కొనకుండా మధ్యలో మధ్యవర్తుల ద్వారా కొనడం! అంటే ఇండియా, చైనా, టర్కీ, యుఎఇ, సింగపూర్‌లకు రష్యా పెట్రోలు అమ్ముతుంది. దాన్ని ప్రాసెస్ చేసి వాళ్లు యీ దేశాలకు అమ్ముతారు. 2022 డిసెంబరు 5 నుంచి 2023 ఫిబ్రవరి 24 (ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదినాటికి) యీ ప్రైస్ కాప్ దేశాలు యీ దేశాల నుంచి 12.9 మిలియన్ టన్నుల పెట్రోలు ఉత్పాదనలు 9.5 బిలియన్ యూరోలు (1052 కోట్ల డాలర్లు) పెట్టి కొన్నాయి. సాంకేతికంగా యూరోప్ దేశాలు రష్యా నుంచి కొనలేదు కాబట్టి, మేం యీ దేశాల నుంచి కొన్నామని వాళ్లు అమెరికాకు చెప్పుకోవచ్చు. మాకు అమ్మే 5 దేశాలకు ఎక్కణ్నుంచి పెట్రోలు వచ్చిందో మాకు అనవసరం అని వాదించవచ్చు. ఈ విధంగా వాళ్లు అవసరాలు తీర్చుకుంటున్నారు.

ఇది ఒక విధమైన మనీ లాండరింగ్‌ లాటిది. నల్లధనాన్ని పన్ను మినహాయింపులున్న ‘టాక్స్ హేవన్’లకు తరలించి, మళ్లీ అక్కణ్నుంచి పెట్టుబడుల రూపంలో దేశంలోకి తెచ్చే పద్ధతిని మనీ లాండరింగ్ అంటారు. ఈ ఐదు దేశాలు పెట్రోలుపై రష్యా పేరు చెరిపేసి తమ దేశపు స్టాంప్ కొట్టి యూరోప్‌కు అమ్ముతున్నాయి కాబట్టి, వీటికి ‘లాండ్రోమాట్’ దేశాలని పేరు పెట్టింది ఆ ఫిన్లండ్ నివేదిక. దీనికి సంబంధించిన గణాంకాలు కూడా బయటకు వచ్చాయి. యుద్ధానికి ముందు చైనా రష్యా నుంచి 39.8 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకుంటే, యుద్ధం ప్రారంభమైన ఏడాది తర్వాత దాని దిగుమతులు 57.73 మిలియన్ టన్నులు అయ్యాయి. అంటే 1.45 రెట్లన్నమాట. ఇండియా దిగుమతులు ముందులో 3.85 మి.ట. లైతే, తర్వాత 55.9 మి.ట. అంటే ఏకంగా 14.52 రెట్లు! టర్కీ విషయంలో యీ అంకెలు 11.12-17.39 అంటే 1.56 రెట్లు. యుఎఇ 0-1, సింగపూరు 0.45-0.53.

దీని ప్రకారం యీ స్కీములో అత్యంత లబ్ధి పొందుతున్నది ఇండియాయే! (‘‘హిందూ’’ 04052023). ఇంత భారీగా దిగుమతి చేసుకున్న పెట్రోలును ఇండియా దేశంలో పంపిణీ చేయటం లేదు. ప్రాసెస్ చేసి ప్రైస్ క్యాప్ దేశాలకు అమ్మేస్తోంది. 2023 ఏప్రిల్‌లోనే 3.8 మిలియన్ టన్నుల ఆయిలు ఉత్పాదనలను అమ్మింది. 2022 మార్చిలో రోజుకి 50 వేల బారెల్స్ డీజిల్ అమ్మిన మన దేశం 2023 మార్చి వచ్చేసరికి రోజుకి 160 వేల బారెల్స్ డీజిల్ అమ్మింది. రష్యా దాడి తర్వాత ఒక సంవత్సరంలో ఈ 5 దేశాల నుండి ఇయు దేశాలు 20.1 మిలియన్ టన్నుల ఆయిలు ఉత్పాదనలు కొనగా, ఆస్ట్రేలియా 9.1 మిలియన్ టన్నులు కొంది. అమెరికా 8.5 మిలియన్ టన్నులు కొంది. ఈ నివేదిక బయటకు రాగానే మే 16న ఇయు విదేశాంగ మంత్రి జోసెఫ్ బోరెల్ ఇయు దేశాలు ఆంక్షలు అతిక్రమిస్తున్న ఇండియా ద్వారా వచ్చే రష్యా రిఫైన్డ్ పెట్రోలు కొనకూడదని ప్రకటన చేశాడు.

దానికి జవాబుగా మన ప్రభుత్వం ‘మేమేమీ ఆంక్షలను అతిక్రమించటం లేదు. ఇండియా నుంచి యూరోప్‌కు అమ్మే పెట్రోలు ఉత్పాదనల మూలం కనిపెట్టడం కష్టం. పైగా మేమేమీ ప్రభుత్వం తరఫున అమ్మకాలు చేయటం లేదు. ఆ పని చేసేది ప్రయివేటు కంపెనీలు, ఆయిల్ రిఫైనరీలు మాత్రమే. వాళ్లు యూరోప్‌కే అమ్ముతున్నారో, ఎవరికి అమ్ముతున్నారో మాకు తెలియదు.’ అంది. ఫిన్లండ్ నివేదికను తోసిపుచ్చింది. (‘‘హిందూ’’ 17052023) నిజమే, యీ అమ్మకాలు సాగుతున్నది ప్రయివేటు కంపెనీల ద్వారానే. గుజరాత్‌లోని సిక్కా పోర్టు జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి సేవలు అందిస్తూ ఉంటుంది (అది వాళ్లదే). ఇప్పుడు దాని ద్వారానే యీ ఎగుమతులు జరుగుతున్నాయి. రష్యన్ ఆయిల్ కంపెనీ రోస్‌నెఫ్ట్‌కు 49% వాటా ఉన్న నయారా ఎనర్జీస్‌‌కు, రిలయన్స్‌కు, ఎస్సార్ గ్రూపుకు సేవలందిస్తూ ఉన్న వాడినార్ పోర్టు (గతంలో కాండ్లా పోర్ట్ ట్రస్ట్, పేరు మార్చిన తర్వాత దీన్‌దయాళ్ పోర్ట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తుంది) నుంచి కూడా ఎగుమతులు జరుగుతున్నాయి. వీటికి రష్యా నుంచి ముడిసరుకు అందుతోంది. (‘‘హిందూ’’ 02052023)  

2022 అక్టోబరు నాటి ‘‘ఔట్‌లుక్’’ వ్యాసం మార్చి-సెప్టెంబరు 2022 నాటి కాలాన్ని సమీక్షించింది. దాని ప్రకారం ప్రభుత్వ ఆయిలు కంపెనీలు ఎగుమతులు, దిగుమతుల వ్యాపారం చేపట్టవు కాబట్టి రిలయన్స్, నయారా కంపెనీలు తమ వ్యాపారాన్ని ఉధృతం చేశాయి. యుద్ధం ప్రారంభమయ్యాక రిలయన్స్, నయారా తమ దిగుమతులను 10 రెట్లు పెంచుకున్నాయి. మార్చి-సెప్టెంబరు మధ్య సగటున నెలకు 2.82 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిలు దిగుమతి చేసుకున్నాయి. దీన్ని ప్రాసెస్ చేసి నెలకు 2.64 మిలియన్ టన్నులు ఎగుమతి చేశారు. దీనిలో 21% యూరోప్‌కు వెళ్లింది.

ఇక 2023 మే వచ్చేసరికి ఇండియా రష్యా నుంచి రోజుకి 1.96 మిలియన్ బారెల్స్ ఖరీదు చేస్తోంది. ఇది ఏప్రిల్ కొనుగోళ్ల కంటె 15% ఎక్కువ. మన చమురు అవసరాల్లో 42% రష్యాయే తీరుస్తోంది. (ఈ సమాచారం వోర్టెక్సా అనే ఎనర్జీ కార్గో ట్రాకర్ సంస్థ యిచ్చినది). దీనిలో రిలయన్స్ వాటా గురించి చెప్పాలంటే అది ఏప్రిల్‌లో రోజుకి 1.20 మిలియన్ బారెల్స్ దిగుమతి చేసుకుంది. మే వచ్చేసరికి 12% పెరిగి 1.35 మిలియన్ బారెల్స్ దిగుమతి చేసుకుంది. దీనితో పాటు కొలంబియా, మెక్సికోల నుండి కూడా దిగుమతి చేసుకుంది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయిలు విషయంలో ఇండియాకు భారీ డిస్కౌంట్లు యిచ్చిన రష్యా ఏప్రిల్ నుంచి తగ్గించడం మొదలుపెట్టింది. గతంలో బారెల్‌కు 15-20 డాలర్ల డిస్కౌంటు యిస్తే ఇప్పుడు 10 కంటె తగ్గి, ఒక్కోప్పుడు 5 కూడా అయిపోతోంది. తగ్గించినా, తగ్గించకపోయినా మన ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. 2022 జూన్ నుంచి ధర పెంచటం లేదంతే! 2022-23లో గత సంవత్సరంలో కంటె పెట్రోలు వినియోగం 10% పెరిగినా అలాగే మేన్‌టేన్ చేస్తున్నారు.

ఇక ప్రభుత్వం చేయిస్తున్న పెట్రో లాండరింగ్ గురించి చెప్పాలంటే, ఉక్రెయిన్ యుద్ధంలో తటస్థత పాటించడం వలన రష్యా మెచ్చి మనకీ ఛాన్స్ యిచ్చిందనుకోవాలి. యూరోప్ దేశాలకు కూడా మేలు చేసిన వాళ్లమవుతున్నాం. ఇదంతా అమెరికాకు నచ్చే విధానం కాదు. అయినా మన ప్రభుత్వం సాహసం చేస్తోంది. ఈ పనిలో చైనాకు వాటాదారుగా ఉంది. అంతర్జాతీయ విధానాలు యిలాగే ఉంటాయి. చైనాతో శత్రుత్వం, పాకిస్తాన్‌తో శత్రుత్వం అనుకుంటాం. మామూలు జనం చైనీయులను, పాక్ వాళ్లను చూడగానే పళ్లు నూరతాం. కానీ పాలకులు, ఏ పార్టీ పాలిస్తున్నా సరే, వ్యాపారబంధాలు కొనసాగిస్తూనే ఉంటారు. రష్యాతోనూ, అమెరికాతోనూ సత్సంబంధాలు ఏకకాలంలో సాగిస్తూ ఉంటారు. అవసరాలు అలాటివి.

మనకు మన దేశప్రయోజనాలు ముఖ్యం. ఏ దేశంతోనూ వైరం కొని తెచ్చుకుని యుద్ధంలోకి దిగకుండా ఉంటే అంతే చాలు. దానితో పాటు ఆర్థికంగా కూడా దేశం బలపడాలని కోరుకుంటాం. ఈ పెట్రో లాండరింగ్‌ ప్రభుత్వసంస్థల ద్వారా జరిగి ఆ లాభాలు మన ప్రభుత్వానికి వస్తే ఎంతో సంతోషిస్తాం. మధ్యలో రిలయన్స్, మరో రష్యన్ కంపెనీ లాభపడుతున్నాయి. రష్యా మనకు చౌకగా చమురు అమ్ముతోందంటే ప్రజలకేం లాభం? రిలయన్సు మరింత సొమ్ము చేసుకోవడం తప్ప! ఉక్రెయిన్ యుద్ధం, ముకేశ్ అంబానీ బాగుపడడానికే వచ్చినట్లయింది. రిలయన్సు ఏ మేరకు లాభపడింది, ఆ లాభాన్ని మన ప్రజలతో, ప్రభుత్వంతో ఎలా పంచుకుంటోంది, యిలాటి వివరాలు నేను చదవలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ వ్యాసంలో అవగాహనా లోపం వలన పొరపాట్లు దొర్లితే ఎత్తి చూపండి. సబ్జక్ట్ గురించి వ్యాఖ్యానించండి, నా గురించి కాదు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా