ఫుట్ బాల్ ప్లేయర్ల కు ఫుట్ బాల్ ప్రాంచైజ్ లు ఇచ్చే వార్షిక వేతనాలు కళ్లు చెదిరే స్థాయిలో ఉండటం కొత్తేం కాదు. దశాబ్దాలుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. స్టార్ ఆటగాళ్లు ఒక క్లబ్ నుంచి మరో క్లబ్ జట్టుకు మారడం పెద్ద ఈవెంట్ తరహాలో వార్తల్లో ఉంటుంది.
ఇప్పుడు అలాంటి అంశంపై ఫుట్ బాల్ వార్తలు వస్తున్నాయి. ఇటీవలి సాకర్ ప్రపంచకప్ ఫైనల్ లో మెరిసిన ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే కు సౌదీ అరేబియన్ ఫుట్ బాల్ క్లబ్ అల్ హిలాల్ భారీ బంపర్ ఆఫర్ ను ఇస్తున్నట్టుగా బీబీసీ ఒక కథనాన్ని ఇచ్చింది.
ఆ వార్త ప్రకారం.. తమ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంటే.. ఈ ఫ్రాన్స్ ఆటగాడికి సౌదీ ఫుట్ బాల్ క్లబ్ ఏకంగా ఏడాదికి 6,300 కోట్ల రూపాయల సొమ్ములను ఇవ్వనుందట! ప్రస్తుతం తనకున్న వార్షిక కాంట్రాక్టును రద్దు చేసుకుని తమతో ఒప్పందం కుదర్చుకోవాలంటూ సౌదీ క్లబ్ ఈ బంపర్ ఆఫర్ ఇస్తోందని సమాచారం.
ఇప్పుడు ఎంబాపేకు ఉన్న కాంట్రాక్ట్ మొత్తంతో పోలిస్తేనే కాదు.. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలోనే ఇదో కాస్ట్లీ డీల్ గా నిలవనుంది. ఈ ఒప్పందానికి ఆ ఫ్రాన్స్ ఆటగాడు ఓకే చెప్పవచ్చని, ప్రస్తుతం ఫ్రెంచ్ క్లబ్ ఒక దానికి ఆడుతున్న అతడు తన కాంట్రాక్టును పొడిగించుకోవడం లేదని కూడా బీబీసీ పేర్కొంది. దీంతో ఈ భారీ డీల్ జరగవచ్చనే అభిప్రాయాలను కలిగిస్తోంది ఆ కథనం.
ఇప్పటికే మరో సౌదీ క్లబ్ తో లెజండరీ ఫుట్ బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇప్పుడు ఎంబాపే కూడా ఆ పరంపరలో చేరే అవకాశాలున్నట్టున్నాయి. మరి ఒక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తేనే ఏడాదికి ఏకంగా 6,300 కోట్ల రూపాయలంటే, ఇంకా అనేక ఆదాయ మార్గాల ద్వారా ఈ స్టార్ ప్లేయర్ కు బోలెడంత సంపాదనకు ఆస్కారం ఉంది.
అలాగే క్రికెట్ వంటి ఆటతో పోలిస్తే ఫుట్ బాల్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇలాంటి డీల్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఏడాదికి 15 కోట్లు అంటే అది భారీ మొత్తం. ఫుట్ బాల్ స్టార్ కు ఈ తరహా లీగ్ ఇస్తున్న ఆఫర్ ఏడాదికి 6,300 కోట్లు!