సుమారు 1990ల్లోని మాట. అప్పట్లో “బ్రెయిన్ డ్రైన్” అనే టాపిక్ మీద కొన్ని వందల వ్యాసాలు కనపడేవి. చదువరులు, మేథావులు దేశం వదిలి విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వెళ్లిపోవడం చూసి పాత్రికేయులు, కాలమిష్టులు వాపోయేవారు. ఆ వలసలు దేశానికి అరిష్టం అనేవారు.
కానీ ఏమయ్యింది? అలా వలసపోయిన ఎందరో ఎన్నారైలు డాలర్లు సంపాదించి ఇండియాలోని తమ తల్లిదండ్రుల స్థితిగతులను మార్చారు. ఏ ప్రభుత్వానికైనా ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఉన్నతశ్రేణికి మార్చడం వల్లకాని పని. కానీ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు అమెరికాబాట పడితే ఐదారేళ్లల్లో ఇండియాలో ఉన్న అతని కుటుంబం పైస్థాయికి వెళ్లేది. అలా ఎన్నొ కుటుంబాలు మధ్యతరగతి నుంచి ఉన్నతమధ్యతరగతికి మారాయి. డాలర్లను తీసుకొచ్చి ఇండియాలో పోసి స్థాలాలు, ఇళ్లు కొన్నారు ఆ ఎన్నారైలు. అలా రియలెస్టేట్ కి ఎంతగానో దోహదమయ్యింది బెయిన్ డ్రైన్.
అసలా పరిస్థితి ఎందుకొచ్చిందో ఒక్కసారి గతంలోకి వెళ్లి చూద్దాం. 1990 మొదట్లో వీపీ సింగ్ ప్రభుత్వం 1979-80 నాటి మండల్ కమీషన్ ని భారీస్థాయిలో అమలుపరిచింది. అప్పటివరకు 25% మాత్రమే ఉండే రిజర్వేషన్స్ ఒక్కసారిగా 50% పైకి చేరిపోయాయి. మెరిట్ కి ప్రాధాన్యం తగ్గి కులప్రాతిపదికన చదువుల్లోను, ఉద్యోగాల్లోను ఖళీలు భర్తీ చేయడం మొదలయ్యింది.
ప్రతిభ ఏ ఒక్కరి సొంతమూ కాదు. అది ఉన్నవాళ్ళు తాము కోరుకున్న చోట కాలేజీ సీట్లు సంపాదించగలిగారు, కోరుకున్న ఉద్యోగమూ పొందగలిగారు. కానీ ఓపెన్ కేటగరీలో కోరుకున్న స్థానాన్ని పొందడం కష్టమనుకున్న ఎంతో మంది ఇతర ప్రతిభావంతులు ఆ కష్టాన్నేదో విదేశాల్లో పెడితే ఫలితం కూడా బాగుంటుంది కదా అనుకుని ఆ దిశగా పరుగులు తీసారు. కాలక్రమంలో గ్లోబలైజేషన్ మూలంగా ఈ బ్రెయిన్ డ్రైన్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అయితే దీనివల్ల దేశంలో ఎవరికీ ఇప్పుడు ఇబ్బంది లేదు.
ఇప్పుడు తాజాగా కొత్త ఇబ్బంది కనిపిస్తోంది. అదేంటంటే “మనీ డ్రైన్”. అంటే ధనికులు భారతీయ పౌరసత్వాన్ని వదిలేసుకుని విదేశాలకు తరలిపోవడం. అమెరికాలో జీవిస్తూ గ్రీన్ కార్డ్ పొంది ఆ తర్వాత ఐదేళ్లకి అమెరికన్ పౌరసత్వం పొందుతున్న వాళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటితో పాటు కొన్ని దేశాలు పౌరసత్వాన్ని అమ్మడంతో ఆయా దేశాల్లో రెండు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేసి భారతదేశ పౌరసత్వాన్ని వదిలేసుకుంటున్నారు. అంతే కాదు, ఇండియాలో పెట్టుబడుల మీద నిరాసక్తత చూపిస్తున్న ఎన్నారైలు కూడా పెరుగుతున్నారు. ఉన్న ఆస్తులని అమ్మేసుకుని మళ్లీ వెనక్కి రాకూడదన్న నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇది “బ్రెయిన్ డ్రైన్” లాగా తేలిగ్గా తీసుకునే విషయమైతే కాదు.
ఎందుకంటే “బ్రెయిన్ డ్రైన్” వల్ల ఇన్నాళ్లు దేశానికి సంపద వచ్చింది. కానీ ఇప్పుడు “మనీ డ్రెయిన్” లో సంపదలు రాకపోగా ఉన్నవి కూడా పోతున్నాయి.
దీనికి ప్రధానమైన కారణమేంటి?
అతి ముఖ్యమైన కారణం భారతదేశంలోని పూర్ ఇంఫ్రాస్ట్రక్చర్. మౌలిక వసతులైన రోడ్లు అధ్వాన్నంగా ఉండడం ప్రధానకారణం. ఒక్కసారి అభివృద్ధి చెందిన దేశాలు చూసొస్తే ఇండియా రోడ్ల మీద అసహ్యం పుట్టడం ఖాయం. ఏది చెప్పినా అధికజనాభా వల్ల ఎన్ని రోడ్లేసినా ట్రాఫిక్ అలాగే ఉంటుంది అని చెప్తారు. కానీ అధిక జనాభాగల దేశమైన చైనాలో రోడ్లు అద్భుతంగా ఉంటాయి. ట్రాఫిక్ జాములు అక్కడ నిత్యకృత్యం కాదు. అక్కడి ప్రభుత్వాలకి ఉన్న ముందు చూపు మన దేశ నాయకులకి లేదంతే. దీనికి తోడు పారిశుధ్యం కూడా ఇండియాలో దయనీయమే.
సంపాదిస్తున్న సంపాదనకి, కడుతున్న ట్యాక్సులకి, పొందుతున్న సుఖాలకి పొంతన లేకుండా ఉంది ఇండియాలో. ఏ మాత్రం ట్యాక్స్ తీసుకోకుండా ఉన్నతశ్రేణి మౌలిక వసతులు కల్పిస్తున్న దేశాలున్నాయి. వర్క్ ఫ్రం హోం కల్చర్ ప్రపంచవ్యాపితమైన ఈ రోజుల్లో ఆ పనులేవో ఆయా దేశాల్లో కూర్చుని చేసుకుంటే మంచిది కదా అనే భావనలోకి వెళ్లిపోతోంది భారతీయ యువత.
వృద్ధాప్యానికి దగ్గర పడిన వాళ్లు మాత్రం భారతదేశం వదలడానికి పెద్దగా చొరవ చూపట్లేదు. ఎందుకంటే ఇండియాలో లభించే సత్వర వైద్యం మరే దేశంలోనూ అంత తేలికగా లభించదు. అందుకే ఈ వయసు వాళ్లకి తప్ప ఎట్టి పరిస్థుల్లోనూ భారతదేశానికే అంటిపెట్టుకుని ఉండాలన్న కోరిక ప్రపంచజ్ఞానం ఉన్న యువతకైతే కలగట్లేదు.
20-50 వయసులో ఉన్న చాలామంది ధనికులు తమ శాశ్వత నివాసంగా ఏదో ఒక అభివృద్ధి చెందిన దేశం వైపుకి చూస్తున్నారు. అలా వెళ్లినవాళ్లు, వెళ్తున్నవాళ్లు, వెళ్లకుండా ఇండియాలోనే ఉంటున్న చాలామంది ధనికులు తమ రియలెస్టేట్ పెట్టుబడుల్ని దుబాయి, షార్జా, అబుధాబీల్లో పెడుతున్నారు. అక్కడ కొన్నా, అమ్మినా ట్యాక్సుల బాధ ఇండియాలో ఉన్నట్టు లేదు. అమ్మినదాన్ని వెనక్కి తెచ్చుకోవడానికైనా ట్యాక్సులు కట్టాల్సిందే అని ముక్కు పిండి వసూలు చేస్తుంటే అసలు మాకు భారతదేశ పౌరసత్వమే అక్కర్లేదని విదేశాల్లోనే స్థిరపడిపోతున్నవారున్నారు. ట్యాక్స్ హేవెన్ దేశాలు ప్రస్తుతానికి భారతదేశ ధనికుల్ని ఆకర్షిస్తున్నాయి. యు.ఎస్.ఎ తో పాటు మాల్టా, సైప్రస్, పోర్చుగల్, జెర్మనీ వంటి దేశాల పౌరసత్వాన్ని తీసుకుని భారతదేశ పురసత్వాన్ని త్యజిస్తున్న ధనికులు ప్రతి ఏడు లక్షల్లో ఉంటున్నారు. ఈ 2023లో జూన్ వరకు లెక్కేసుకున్నా 87000 మంది తేలారు.
ఈ పరిస్థితి దేశానికి అస్సలు మంచిది కాదు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభని అమ్ముకోలేని వాళ్లు లేదా ఆస్తులు లేని వాళ్లు, ఉన్నా ప్రపంచజ్ఞానం లేని కూపస్థమండూకాలు …ఇలాంటి వాళ్ళతో మాత్రమే దేశం నిండిపోయే పరిస్థితి రానున్న కాలంలో ఉండొచ్చు. ధనికులు వెళ్లిపోతుంటే ఎప్పటికీ పేదదేశంగానో మహా అయితే మధ్యతరగతి దేశంగానో మిగలొచ్చు. ఆ దుస్థితి రాకూడదనుకుంటే వెంటనే మౌలిక వసతుల మీద ప్రభుత్వం దృష్టి సారించాలి.
వెల్ఫేర్ స్ఖీముల పేరుతో పంచుతూ కూర్చుంటే ఆ మౌలిక వసతులు ఎప్పటికీ పూర్తవ్వవు. అలాగని ఆ స్ఖీములు ఆపలేరు. కనుక పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోని పెద్ద చిన్న చితకా అనే తేడా లేకుండా అన్ని రోడ్లను నిర్మించాలి. జీ.ఎస్.టీ మీద గణనీయమైన ఆదాయం వస్తోంది కనుక కనీసం ఆదాయపుపన్నునైనా తగ్గించి కాస్తంత ఊరట కలిగించాలి ప్రజలకి. ఎంతసేపూ పేదలే ఓటర్స్ అని, ధనికుల్ని బెదరగొట్టి పంపేస్తే పరిస్థితి ఏమౌతుందో నాయకులు ఆలోచించాలి. ఎక్కడ ఆలోచిస్తారు? ఎప్పటికీ రానున్న ఎన్నికల్లో మళ్లీ కుర్చీ ఎక్కాలంటే ఏం చెయ్యాలో దాని మీద దృష్టి తప్ప రోడ్ల మీద, పారిశుద్ధ్యం మీద ఎందుకుంటుంది? మన దేశ జనాభాకి అవి పట్టేంతవరకు నాయకులకి పట్టదంతే!
పద్మజ అవిర్నేని