Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ప్రచారచిత్రాలు

ఎమ్బీయస్‍: ప్రచారచిత్రాలు

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘‘అబా’’ అనే ఒక సింహళ సినిమాతో ఈ వ్యాసం ప్రాంభిస్తున్నాను. అదెందుకు గుర్తుకు వచ్చింది అంటే కర్ణాటక ఎన్నికల సందర్భంగా వొక్కళిగలను మెప్పించడానికి తీయబోయిన ‘‘ఉరి గౌడ, నంజె గౌడ’’ వార్తల్లోకి ఎక్కింది కనుక! దానితో పాటు యితర సినిమాలూ ప్రస్తావిస్తాను. ముందుగా సింహళ సినిమా గురించి చెప్పాలంటే, క్రీ.పూ. 474 - క్రీ.పూ. 367 మధ్య జీవించి క్రీ.పూ. 437 నుంచి 70 ఏళ్ల పాటు పాలించిన పాండుకభయ అనే సింహళ రాజు గురించిన సినిమా అది. సింహళులు ఘనంగా చెప్పుకునే కాలానికి చెందిన ఆ సినిమా ఎల్‌టిటిఇపై చేస్తున్న యుద్ధం చరమాంకంలో విడుదలై సింహళ సైనికులలో ఉత్తేజాన్ని నింపింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన టెర్రరిస్టుగా పేరు బడిన ప్రభాకరన్‌ను ఓడించగల సత్తా సింహళీయులకు ఉందనే ఆత్మస్థయిర్యాన్ని కలిగించింది. 2008 ఆగస్టులో యీ సినిమా విడుదల కాగా, 2009 మే కల్లా తమిళ పులులను సింహళ సైన్యం మట్టుపెట్ట గలిగింది.

సింహళ చరిత్ర గురించి చెప్పే ‘‘మహావంశ’’ క్రీ.పూ. 543- క్రీ.పూ.505 మధ్య పాలించిన విజయుడనే రాజు కథతో ప్రారంభమౌతుంది. అతడు భారతదేశం నుంచి (మహారాష్ట్ర అని కొందరు, బెంగాల్ లేదా ఒడిశా అని కొందరు అంటారు) బహిష్కృతుడై కొందరు సైనికులతో మధ్య లేదా పశ్చిమ శ్రీలంకకు చేరాడు. అక్కడ తాంబపణ్ని (తామ్రపర్ణి అనే పేరుకి అపభ్రంశం కాబోలు) అనే ప్రాంతంలో ఒక యక్షరాజుని ఓడించి స్థానికులను తరిమివేశాడు. ఒక యక్ష నాయకుడి కూతురు కువేణి అతనితో ప్రేమలో పడి తన వాళ్లను విడిచి అతన్ని పెళ్లాడి, అతను తాంబపణ్ని రాజు కావడానికి దోహదపడింది. అయితే కొన్నాళ్లకు భారతదేశం నుంచి వచ్చిన ఒక యువరాణితో ప్రేమలో పడి విజయుడు ఆమెను వదిలిపెట్టేశాడు. ఈ విజయుడే శ్రీలంకలో చెప్పుకోదగ్గ మొదటి రాజు. అతని వారసులు కొంతకాలం పాలించారు.

తర్వాతి కాలంలో అనూరాధపురం రాజధానిగా ఏలిన రాజవంశాలు శ్రీలంకను ఏలాయి. ఆ వంశంలోనే పుట్టిన పాండుకభయ వనవాసుల మధ్య పెరిగి రాజై, సింహళ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచాడు. విజయుడి మూలాలు భారతదేశంలో ఉండగా పాండుకభయ మూలాలు సింహళంలో ఉన్నాయి. పాండుకభయ కథ వింటే కృష్ణుడి కథలా తోస్తుంది. పాండువాసుదేవ మహారాజు కుమార్తె చిత్ర. ఆమెకు పదిమంది సోదరులు. ఆమె ఒక సామంత రాజు కొడుకైన దిఘాగమిని అనే అతన్ని పెళ్లాడతానంది. వారికి పుట్టిన ప్రథమపుత్రుడు మేనమామల మరణానికి కారణమౌతాడని జ్యోతిష్కుడు చెప్పడంతో మహారాజు తటపటాయించాడు. కానీ తమకు కొడుకు పుట్టగానే చంపివేస్తానని చిత్ర తండ్రికి బాస చేయడంతో పెళ్లికి సరేనన్నాడు.

కొన్నాళ్లకు ఆమెకు పాండుకభయ పుట్టాడు. కానీ పసికందుని చంపడానికి తల్లికి చేతులు రాలేదు. అందువలన అప్పుడే కూతుర్ని ప్రసవించిన దాసితో ఒప్పందం చేసుకుని పిల్లల్ని మార్చుకుంది. తన కొడుకుని నగరానికి దూరంగా తీసుకుపోయి పెంచమంది. తండ్రికి, భర్తకు తనకు కూతురు పుట్టింది అని చెప్పింది. కుమార్తె అంటే మేనమామలు చంపరు కదాని దాసి ఒప్పుకుంది. పసివాణ్ని తీసుకుని ఒక బుట్టలో పెట్టుకుని దగ్గరున్న గ్రామానికి బయలుదేరింది. దారిలో ఆమె చిత్ర సోదరుల కంటపడింది. అనుమానం వచ్చి బుట్టలో ఏముందని అడిగితే ఆహారం ఉందంది దాసి. చూపించమని అడుగుతూండగానే రెండు భల్లూకాలు అటువైపు వెళ్లాయి. వాటిని చూస్తూనే పిల్లవాడి మేనమామలు వాటి వెంట పడ్డారు. బతుకుజీవుడా అనుకుని తప్పించుకున్న దాసి యువరాజును జాగ్రత్తగా తీసుకెళ్లి ద్వారమండలక అనే గ్రామంలో వనవాసుల నాయకుడికి అప్పగించింది. అతను పిల్లవాణ్ని పెంచసాగాడు. ఇక్కడ అంతఃపురంలో దాసి కూతురు రాచరికంలో పెరగసాగింది.  

ఆ ఏడాదే పాండువాసుదేవ మహారాజు మరణించాడు. పెద్ద కొడుకు అభయ గద్దె కెక్కాడు. అతను తండ్రి అంత సమర్థుడు కాదు కానీ, క్రూరుడు కాడు. ఏడేళ్లు గడిచాయి. ద్వారమండలక అనే గ్రామంలో వనవాసుల మధ్య రాచఠీవితో ఒక పిల్లవాడు పెరుగుతున్నాడన్న వార్త అభయ యొక్క తొమ్మిదిమంది తమ్ముళ్ల చెవిన పడింది. రాజసౌధంలో ఉన్న చిత్ర కుమార్తెలో రాచరికపు లక్షణాలు లేకపోవడంతో చెల్లి మోసం చేసిందేమోనన్న అనుమానం వచ్చింది వాళ్లకు. సైనికులను ఆ ఊరికి పంపి ఏడేళ్ల వయసులో ఉన్న మగపిల్లలందర్నీ చంపివేయ మన్నారు. వాళ్లు అలాగే చేశారు కానీ సరిగ్గా ఆ సమయానికి పాండుకభయ వారిలో లేడు. శత్రుశేషం లేదని మేనమామలు సంతోషించారు కానీ పాండుకభయకు 16 ఏళ్ల వచ్చేసరికి, యువరాజ లక్షణాలు కొట్టవచ్చినట్లు కనబడసాగాయి. ఈ విషయం తెలుసుకున్న తల్లి అతన్ని ఆ గ్రామం నుంచి తరలించి పాండుల అనే బ్రాహ్మణుడి వద్దకు పంపింది.

మేనమామలతో యుద్ధం చేయగలనన్న నమ్మకం వచ్చిన తర్వాత పాండుకభయ, పాండుల విడిచి పెట్టి రాజధాని చేరాడు. అక్కడ గిరికండశివ అనే మేనమామ కూతురు పాళీ అనే ఆమెను వలచి, పెళ్లాడాడు. ఆమె తండ్రిని, దయాళువైన పెద్ద మేనమామ అభయను తప్ప దుష్టులైన తక్కిన 8 మంది మేనమామ లందరితో పోరు సల్పి ఒక్కొక్కరిని చంపడానికి 17 సంవత్సరాలు పట్టింది. మొత్తానికి అతనే రాజయ్యాడు. ప్రజారంజకంగా 70 ఏళ్ల పాటు పాలించాడు. ఇదీ చరిత్ర. దీనిలో శత్రువులు అతని మేనమామలే. వేరే జాతి వారు, వేరే మతస్తులు కారు. అయినా యీ సబ్జక్టుతో సినిమా వచ్చేసరికి సింహళీయులకు తమ జాతిలో పుట్టిన వీరుడు గుర్తుకు వచ్చాడు.  ప్రాణాలకు తెగించి తమిళ పులులతో పోట్లాడేందుకు సింహళ సైనికులకు ఊపు నిచ్చింది.

కన్నడ నాట ఎన్నికల సందర్భంగా ఉరి గౌడ, నంజె గౌడ సినిమా ప్లాను చేసిన బిజెపి నాయకులకు ఈ ఆబా సినిమా గురించి తెలిసి ఉండకపోవచ్చు కానీ తమ కులంలో పుట్టిన యిద్దరు వీరులు మైసూరు పులిగా పేరు కెక్కిన టిప్పు సుల్తాన్‌ను చంపారని వొక్కళిగలను నమ్మిస్తే వాళ్లు మురిసిపోయి, ఆ సినిమా తీసిన తమకు ఓట్లేస్తారని అనుకున్నారు. టిప్పు సుల్తాన్ చచ్చిపోయి 200 ఏళ్లయినా అతన్ని కర్ణాటకలో ఎన్నికలకు వాడుకుంటున్నారు. అతని జయంతిని ఘనంగా నిర్వహిస్తే ముస్లిములు తమకు సన్మానం జరిగినట్లు భావించి ఓట్లేస్తారని కాంగ్రెసు వాళ్లు, టిప్పును ఘోరమైన హిందూపీడకుడిగా చిత్రీకరిస్తే శభాషంటూ హిందువులు ఓట్లేస్తారని బిజెపి భ్రమపడుతూ వచ్చాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా టిప్పూ భూతం ఎన్నికలలో ఒక అంశంగా మారింది. టిప్పు రాక్షసుణ్ని వొక్కళిగ యువకులే చంపినట్లుగా చూపిస్తే డబుల్ ధమాకా అనుకుంది బిజెపి. లింగాయతులు ఎలాగూ మనతో ఉన్నారు, యిక యీ సినిమాతో వొక్కళిగలు మన ఒళ్లో పడ్డట్లే అనుకుంది.

సినిమా ఐడియా బాగానే ఉంది కానీ కథ ఎలా? టిప్పును బ్రిటిషు సైనికులు తప్ప వొక్కళిగ యువకులు చంపినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. హిస్టరీ ఫ్యాక్టరీని సంప్రదించారు. హిందూత్వ శక్తులు కర్ణాటకలో ఎప్పణ్నుంచో చురుగ్గా ఉన్నాయి కాబట్టి ఆ పని ఎప్పుడో చేసి పెట్టారు. దాని గురించి నేను ‘‘ఎమ్బీయస్‍: కర్ణాటకలో వొక్కళిగ ఓట్లు’’ అనే వ్యాసంలో రాశాను కాబట్టి మళ్లీ రాయటం లేదు. ఈ సినిమా షూటింగు ఎన్నికల తర్వాత మే 18న ప్రారంభవుతుందంటూ మార్చి 19న పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్ మీద బిజెపి మంత్రులు మునియప్ప, ఆర్ అశోక, సిటి రవి ఫోటోలు వేశారు. ముగ్గురూ వొక్కళిగ కులస్తులే. డా. సిఎన్ అశ్వత్థ నారాయణ అనే వొక్కళిగ నాయకుణ్ని రచయితగా పేర్కొన్నారు. సినిమా తర్వాత తీయవచ్చు, ముందు పబ్లిసిటీతో వొక్కళిగల ఓట్లు పొందుదా మనుకున్నారేమో!

కానీ సినిమా ప్రకటన రాగానే వొక్కళిగలు ఆరాధించే ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ స్వామి నిర్మాత మునిరత్నను మఠానికి పిలిపించి సినిమాను తీయవద్దని చెప్పారు. వొక్కళిగలందరికీ ఆయన మాట శిరోధార్యం కాబట్టి సినిమా తయారవలేదు. ఆ తర్వాత స్వామీజీ ‘‘తగినన్ని చారిత్రక ఆధారాలు లేకుండా సినిమా తీయడం సరి కాదు. చరిత్ర వేరు, కల్పన వేరు.’’ అని ప్రకటించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బొమ్మయ్ ‘‘ఔనౌను, యీ సినిమా తీయకూడదు’’ అన్నారు.  అలా యీ సినిమా ఆగింది, లేకపోతే మరో చరిత్ర వక్రీకరణతో యింకో సినిమా తయారయేది.

అర్ధసత్యాలతో, అతిశయోక్తులతో సినిమాలు తీసి రాజకీయ ప్రయోజనాలు సాధించుకోడం ద్రవిడోద్యమంతోనే ప్రారంభమైంది. అప్పుడప్పుడు ఒకటీ అరా వస్తూండేవి. ఇప్పుడు ఒక్కసారిగా అవి పెరిగాయి. వాస్తవంగా జరిగిన సంఘటనపై సినిమా తీస్తున్నాం అంటూ మొదలుపెట్టి దాన్ని ఒక ప్రాంతానికో, కులానికో మొత్తంగా ఆపాదించడంతో చిక్కు వస్తోంది. ఉదాహరణకి ‘‘కశ్మీర్ ఫైల్స్’’ సినిమా ఉందనుకోండి. 1990 నాటి కశ్మీరీ పండిట్ల ఊచకోత గురించి సినిమా తీద్దామనుకుంటే ఒక బాధితుడి కథను తీసి ‘‘అనుపమ్ పండిట్’’ అనో, మరోటనో పేరు పెట్టవచ్చు. ‘‘కశ్మీర్ ఫైల్స్’’ అని రాష్ట్రం మొత్తాన్ని ఉద్దేశించి పేరు పెట్టనక్కరలేదు.

దేశవిభజన సమయంలో ముస్లిములు ఎదుర్కొన్న సమస్య గురించి ‘‘గరమ్ హవా’’ అనే సినిమా వచ్చింది. కథ ఆగ్రాలో జరుగుతుంది. దానికి ‘‘ఆగ్రా ఫైల్స్’’ అనో, ‘‘యుపి ఫైల్స్’’ అనో పేరు పెట్టలేదు. ఒక వ్యక్తి యొక్క విషాదాన్ని చూపించినప్పుడు ‘పాపం యిలా ఎందరు బాధపడ్డారో’ అనే ఫీలింగు ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. కేరళలో హిందూ యువతి ఇస్లాంలోకి మారి ఐఎస్‌ఐఎస్ ఏజంటుగా మారిన కథ తీయాలంటే ‘‘లక్ష్మి ఉరఫ్ ఫాతిమా’’ వంటి పేరు పెట్టవచ్చు. ఎండ్ టైటిల్స్‌లో యిలాటి యిలాటి అభాగినులు ఎందరో ఉన్నారు అని ఒక వాక్యం పెడితే ప్రేక్షకుల్లో ఒక అవగాహన దానంతట అదే కలుగుతుంది. ‘‘కేరళ స్టోరీ’’ అని రాష్ట్రం మొత్తానికి అన్వయించేట్లా పెట్టడం దేనికి? ఆ రాష్ట్రంలో యిది తప్ప వేరేదీ జరగటం లేదన్న భావం కలిగించడం దేనికి?  

ఒక ఎన్నారై ఒక పల్లెటూరి అమ్మాయిని మోసం చేసిన పెళ్లి చేసుకుని హింస పెట్టిన కథతో ‘‘47 డేస్’’ అనే సినిమా తీశారు బాలచందర్. దానికి ‘‘ఎన్నారై స్టోరీ’’, అనో ‘‘తూగోజి కథ’’ (దానిలో హీరోయిన్ ఊరు దోసకాయలపల్లి ఉన్న జిల్లా) అనో పెట్టలేదు. కంచికచర్లలో హరిజనుణ్ని దగ్ధం చేసిన సంఘటనపై రేపెవరో సినిమా తీసి ‘‘ఆంధ్రా స్టోరీ’’ అనో, ఆ ఘాతుకం చేసిన కులస్తుల కులం పేరుతోనో ప్రచారం చేస్తే...? రజాకార్ల అకృత్యాలు చూపించి, ‘‘తెలంగాణ స్టోరీ’’ అంటే..? మేలో జరిగి యిప్పుడు వెలుగులోకి వచ్చిన మణిపూర్‌ ఘటనను సినిమాగా తీసి ‘‘మణిపూర్ స్టోరీ’’ అని పేరు పెడితే? మనదేశంలో బాలికలను గల్ఫ్‌కు అక్రమ రవాణా చేసే అంశంపై విదేశీయుడెవరో సినిమా తీసి ‘‘ఇండియా స్టోరీ’’ అని పేరు పెడితే మనం ఊరుకుంటామా? ఇండియా అంటే యిదే అనుకుంటున్నారా, రోదసిలో పంపిస్తున్ను ఉపగ్రహాలు కంటికి ఆనటం లేదా అని మండిపడమా? అంతర్జాతీయ వేదికలపై అభ్యంతరం తెలుపమా? ఇలాటి సంఘటనలపై సినిమాలు తీయకూడదని నేననను. వాటి బ్రాండింగ్ గురించే నాకు అభ్యంతరం ఉంది.

కేరళలో లవ్ జిహాద్ పేరుతో కొందరు హిందూ వనితలను ఇస్లాంలోకి, ఆపై ఐఎస్‌ఐఎస్‌లోకి మార్చారని వార్తలు వచ్చినపుడు నేను ఆర్టికల్ కూడా రాశాను. ఇప్పుడీ ‘‘కేరళ స్టోరీ’’ నిర్మాతదర్శకులు 2016లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అలాటి 21 మంది యువతుల కుటుంబసభ్యులతో మాట్లాడి యీ సినిమా తీశామనీ చెప్తూ, ఐఎస్‌ఐఎస్ కారణంగా మిస్సయినవాళ్లు 32 వేల మంది ఉన్నారని క్లెయిమ్ చేయడంతో వచ్చింది గొడవ. సినిమాకు, ఆ నంబర్లకు సంబంధం ఏముంది? ఇదేమీ డాక్యుమెంటరీ కాదు. 32 వేల మంది అనడంతో కేరళ ముఖ్యమంత్రి విజయన్ మండిపడ్డారు. 32 వేలు కాదు, 32 మంది ఉన్నారని నిరూపిస్తే రూ. 11 లక్షలిస్తామని ఒక న్యాయవాది ఛాలెంజ్ చేశారు. 32 వేల మంది సమాచారం మా వద్ద ఉందంటున్న దర్శకనిర్మాతలు తాము కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నామని గ్రహించలేక పోయారు.

2022 నవంబరులో వచ్చిన సినిమా టీజరులో 32 వేల మంది అనడంతో సినిమా బ్యాన్ చేయాలని కొందరు కోరారు. సుప్రీం కోర్టుకి వెళ్లినా లాభం లేకపోయింది. ‘పాపం చాలా డబ్బు ఖర్చు పెట్టారు కదా’ అని నిర్మాతలపై జాలి పడ్డారు కూడా. కేరళ హైకోర్టు నడిగితే వాళ్లూ సినిమాని ఆపము అన్నారు. టీజరులోంచి 32 వేల అంకె తీసేస్తామని, ఇది నలుగురు అమ్మాయిల వాస్తవ గాథ అని చెప్తామని నిర్మాతలు హామీ యిచ్చారు. మే 5న విడుదలైంది. యుపి, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయించాయి. సినిమా హిందీ ప్రాంతాల్లో బాగా ఆడింది కానీ కేరళలో పెద్దగా ఆడలేదు. ఎందుకంటే రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్న కేరళలో మతసామరస్యం ఏ స్థాయిలో వుందో, ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు విఘాతాలు జరిగాయో మలయాళీలకు వాస్తవాలు తెలుసు. మూడేళ్ల క్రితం కాయమ్‌కులమ్‌లో ఓ మసీదులో జరిగిన హిందూ వివాహం గురించి ఎఆర్ రెహమాన్ ఓ వీడియో రిలీజు చేశాడు. తన హిందూ పనిమనిషి ముగ్గురు పిల్లల్ని సొంత పిల్లల్లా పెంచిన ముస్లిము మహిళ వాస్తవగాథతో ‘‘ఎన్ను స్వంతం, శ్రీధరన్’’ పేరుతో తీసిన సినిమాను కొందరు ప్రస్తావించారు.

ఇలాగే తక్కినవాళ్లూ యిది కాదు కేరళ స్టోరీ అంటూ అభ్యంతరాలు తెలిపారు. ఈ సినిమా ద్వారా తమ రాష్ట్రం పరువు తీశారని కేరళీయులు బాధ పడ్డారు. ‘ద రియల్ కేరళ స్టోరీ’ అంటూ విజయన్ తమ ప్రభుత్వహయాంలో కేరళ ఎంత అభివృద్ధి సాధించిందో యాడ్స్ యిచ్చారు. నీతి ఆయోగ్ ప్రకారం సస్టయినబుల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో తమ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిన సంగతిని హైలైట్ చేశారు. సినిమా విడుదలై రెండు నెలలు దాటింది. ఆ 32 వేల మంది గురించి కేంద్ర సంస్థలు కానీ, కేంద్ర హోం మంత్రి కానీ నోరు విప్పారా? ఆ యువతుల గురించి దర్శకనిర్మాతలకు అంత అక్కర ఉంటే వారి ఆచూకీ కనిపెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఉండేవారు. చేశారా? సినిమా తీసి డబ్బు చేసుకున్నారు గానీ!

మామూలు శాంతిభద్రతలు రాష్ట్ర పరిధిలోకి వచ్చినా, అంతర్జాతీయ నేరం ముడిపడిన చోట కేంద్రానిదే బాధ్యత. మోదీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లయినా ఉగ్రవాదం యీ స్థాయిలో పెరుగుతోందని యీ సినీ నిర్మాతలు చాటి చెప్పినట్లేగా! పైగా కేంద్ర సంస్థలు ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా యివ్వకుండా వీళ్లతో పంచుకోవడమేమిటి? అనే ప్రశ్న వస్తుంది కదా! కేంద్రం వెంటనే వీళ్లకు నోటీసులివ్వాలి. ఇచ్చారా? సినిమా తీసిన లక్ష్యం ఏమిటి? ప్రేమ పేరుతో ఉగ్రవాదుల వలలో పడకండి అని హిందూ, క్రైస్తవ యువతులను హెచ్చరించడమా? అలా అయితే ఓ నలుగురు అమ్మాయిల కథను గుండెలు కదిలించేట్లా తీస్తే సరిపోతుంది. అందరి మనసుల్లో నాటుకుంటుంది. 32 వేల మంది యిలా మారారు అని క్లెయిమ్ చేయడంలో రాజకీయం ఉంది తప్ప సృజనాత్మకత లేదు. ఆ అంకెయే సృజనాత్మకత అంటే, ఆ విషయం స్పష్టంగా చెప్పాలి.

ఇలాటి క్లెయిమ్స్ చేసి మా పరువు తీశావని మోదీ, అమిత్ షాలు కోపం తెచ్చుకోకపోగా కర్ణాటక ఎన్నికలలో దీన్ని ప్రస్తావించి, తమ ప్రచారానికి వాడుకున్నారు. బిజెపి మద్దతిచ్చిన సూపర్ హిట్ సినిమా ‘‘కశ్మీర్ ఫైల్స్’’లో చనిపోయిన పండిట్ల సంఖ్య విషయంలో కూడా వివాదం ఉంది. 240322 నాటి ఆంధ్రజ్యోతిలో డా. సయ్యడ్ మొహినుద్దీన్ యిలా రాశారు – ‘దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ప్రకారం నాలుగు వేల మంది పండిట్లు చనిపోయారు. కశ్మీరీ పండిట్ల సంఘర్షణ సమితి మాత్రం 650 మంది చనిపోయినట్లుచెపుతోంది. 1991లో ఆరెస్సెస్ ప్రచురణ ‘జెనిసైడ్ ఆఫ్ హిందూస్ ఇన్ కశ్మీర్’ పుస్తకం యీ సంఖ్యను 600గా చెపుతోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల్లో 219 మంది అని ఉంది. ఇవన్నీ కేంద్రంలో బిజెపి మద్దతుతో నడుస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వం ఉండగా జరిగినవే. రాష్ట్రంలో గవర్నరుగా, నాలుగేళ్ల తర్వాత బిజెపిలో చేరిన జగ్‌మోహన్ ఉన్నారు. కానీ సినిమాలో ఫారూఖ్ అబ్దుల్లా ప్రభుత్వం ఉందనే ప్రచారం యీ సినిమా చేసింది.’ .

2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి అభిమానులు తమ సిద్ధాంతాల ప్రచారానికై తమ నాయకులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు. రాబోతున్న ‘‘మై అటల్ హూఁ’’ ‘‘స్వతంత్ర వీర్ సావర్కార్’’ అలాటివే. దానితో పాటు కాంగ్రెసు పార్టీని నెగటివ్‌గా చూపించడానికి ‘‘ఎమర్జన్సీ’’ అనే సినిమాను కంగనా రనౌత్ తన దర్శకత్వంలో తీస్తూ ఇందిరా గాంధీ వేషం కట్టింది. ఎమర్జన్సీ దారుణాలను, దానికి వ్యతిరేకంగా పోరాడిన జనసంఘ్‌ను ఎలాగూ చూపిస్తారు వారితో పాటు పోరాడిన సోషలిస్టులు, పాత కాంగ్రెసు వారు, లోకదళ్ వాళ్లు, కమ్యూనిస్టులను చూపించారా లేదా అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. 2019 ఎన్నికల సమయంలో విడుదలైన యీ తరహా సినిమా ‘‘పిఎం నరేంద్ర మోదీ’’ బాగా ఆడలేదు. అంతకు కొద్ది నెలల ముందు మన్‌మోహన్ సింగ్‌ను అసమర్థ ప్రధానిగా చూపించిన ‘‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’’ కూడా ఆడలేదు.

జాతీయవాదం ప్రేరేపించడానికి తీసిన సినిమాలు ‘‘రామసేతు’’ (2022), ‘‘సామ్రాట్ పృథ్వీరాజ్’’ (2022) కూడా ఆడలేదు. పృథ్వీరాజ్ సినిమాలో చరిత్ర మార్చేసి మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చేతిలో చచ్చిపోయినట్లు, ఘోరీ సైనికుల చేతిలో పృథ్వీరాజ్ పోయినట్లు చూపించారు. పృథ్వీరాజ్ పోయినది 1192లో, ఘోరీ పోయినది 1206లో! రాబోయే రోజుల్లో చరిత్ర వక్రీకరణలు, అర్ధసత్యాలు, అతిశయోక్తులతో యింకా సినిమాలు రావచ్చు. చరిత్రను చరిత్రలా చూపిస్తే అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. కానీ రాజకీయ ప్రయోజనంతో తీస్తే మాత్రం అయ్యో అనిపిస్తుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా