59.. రాజస్తాన్ లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్య ఇది. 200 అసెంబ్లీ సీట్లకు గానూ రాజస్తాన్ లో ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ సీట్లుగా 59 ఉన్నాయి. ఈ సంఖ్యను బట్టి.. ఈ నియోజకవర్గాల్లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందో ఆ పార్టీనే అసెంబ్లీలో పాగా వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరి ఎస్సీ, ఎస్టీలే ప్రధానంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పటికీ.. ఈ ఓట్లు ఒక పార్టీ కి గంపగుత్తగా ఉండటం లేదు. దీంతో 1998 నుంచి రాజస్తాన్ లో ప్రతి ఐదేళ్లకూ ఒక పార్టీ అధికారం నుంచి వైదొలుగుతూనే ఉంది. మరో పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యన ఈ అధికార మార్పిడి ప్రతి ఐదేళ్లకూ ఒక సారి జరుగుతూనే ఉంది.
అన్ని సీట్లు ఎస్సీ, ఎస్టీలకే రిజర్వ్ అయినా.. ఓటర్లు మాత్రం ఐదేళ్లకు ఒక సారి పార్టీని మార్చేయడం రాజస్తాన్ ప్రత్యేకత అనుకోవాలి. రిజర్వ్ సీట్లలో 34 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ కాగా, 25 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. మొత్తం ఓటర్లలో 18 శాతం షెడ్యూల్ కులాలకు చెందిన వారే. అయితే షెడ్యూల్ కులాల్లో ఏకంగా 50 కులాలు, ఉపకులాలు, తెగలున్నాయి!
త్వరలోనే రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఐదేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి బీజేపీ నుంచి షరామామూలుగా గట్టి పోటీనే ఎదుర్కొనాల్సి ఉంది. ఐదేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ సీట్లలో స్వీప్ చేసింది.
అయితే ఆ తర్వాత ఏడాదిలోపు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. రిజర్వ్డ్ సీట్లలో కేవలం ఒక్క ఎంపీ సీటును మాత్రమే కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఎంపీ సీట్లలో బీజేపీ స్వీప్ చేసింది. మరి ఎస్సీ, ఎస్టీలే నిర్ణేతలైన రాజస్తాన్ లో ఈ సారి ఏం జరగనుందనేది ఆసక్తిదాయకమైన అంశం. వీరి మదిని దోచుకోవడానికి పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. వీరి తర్వాత రాజ్ పుత్ ల అండ కోసం పార్టీల మధ్యన పోటీ ఉంది.