Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: గృహనిర్బంధంలో సౌదీ మాజీ యువరాజు

జూన్‌ 21 వరకు మహమ్మద్‌ బిన నయీఫ్‌ సౌదీ అరేబియా యువరాజు. సౌదీ అరేబియాకు ఇంటీరియర్‌ (హోం) మంత్రి. అంతర్జాతీయంగా అందరికీ తెలిసిన వ్యక్తి. రాజు గారి తర్వాత రాజు కావలసినవాడు. అంతలో అదృష్టం తిరగబడింది. రాజు గారికి మూడో భార్య ద్వారా కలిగిన ప్రియతమ పుత్రుడైన 31 ఏళ్ల సల్మాన్‌ అతని స్థానంలోకి వద్దామనుకున్నాడు.

అంతే జూన్‌ 21న రాజాజ్ఞలు వెలువడ్డాయి. నయీఫ్‌ను దింపేసి సల్మాన్‌ను ఎక్కించేశారు. నయీఫ్‌కు యువరాజు హోదాతో బాటు మంత్రి పదవి కూడా పోయింది. అతని స్థానంలో అతని సోదరుడి కొడుకును కూర్చోబెట్టారు. సరేలే అనుకుంటూండగానే అతన్ని గృహనిర్బంధంలో పెట్టారనే వార్తలు వస్తున్నాయి. 

నయీఫ్‌ సౌదీ అరేబియా వ్యవస్థాపకుడి పౌత్రుడు. ప్రస్తుతం వున్న రాజుగారి సోదరుని కుమారుడు. అమెరికాలో చదువుకున్నాడు. టెర్రరిజానికి బద్ధ వ్యతిరేకి. సౌదీలోని కౌంటర్‌ టెర్రరిజం విభాగానికి నాయకత్వం వహిస్తూ, అల్‌ కాయిదా పట్ల అతి కఠినంగా వ్యవహరిస్తూ పాశ్చాత్య దేశాల మెప్పు పొందాడు. టెర్రరిస్టులను ఎలా ఎదుర్కోవాలో 1985-88 మధ్య అమెరికాలో ఎఫ్‌బిఐ వద్ద సెక్యూరిటీ కోర్సెస్‌లో తర్ఫీదయ్యాడు. తర్వాత 1992-94 మధ్య ఇంగ్లండులో స్కాట్లండ్‌ యార్డ్‌ వద్ధ తర్ఫీదు అయ్యాడు.

పదేళ్ల క్రితం తమ దేశం మీద దాడి చేసిన అల్‌ కాయిదాపై విరుచుకుపడి దాని నడుం విరక్కొట్టాడు. దానికి అమెరికా నుంచి, ఇంగ్లండ్‌ తదితర యూరోప్‌ దేశాల నుంచి మద్దతు లభించింది. అతనిపై ఇస్లామిక్‌ టెర్రరిస్టు గ్రూపులు పగబట్టాయి. ఇప్పటివరకు నాలుగు హత్యాప్రయత్నాలు జరిపాయి. మూడోసారి ఓ రంజాన్‌ నాడు అతనికి అభినందనలు తెలపడానికి వచ్చినట్లే వచ్చి ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. నయీఫ్‌ గాయపడినా అతని ఆత్మస్థయిర్యం  చెక్కు చెదరలేదు. 

ఇలాటి యువరాజు యీ రోజు పంజరంలో చిలుక అవుతాడని ఎవరూ వూహించలేదు. కానీ రాజరికాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. రాకుమారుడు సల్మాన్‌కు పదవీలాలస ఎక్కువ, దూకుడు ఎక్కువ అంటున్నారు. నయీఫ్‌ను తప్పిస్తే తప్ప తను వెలుగులోకి రానని లెక్క వేసి వుంటాడు. తండ్రి తల వూపాడు. సల్మాన్‌ను యువరాజుగానే కాదు, రక్షణ మంత్రిగా కూడా నియమించాడు. అంటే అమెరికా నుంచి ఖరీదైన రక్షణ సామగ్రి దిగుమతి చేసుకోవడంలో, పొరుగున వున్న యెమెన్‌తో యుద్ధం చేయడంలో యిక సల్మాన్‌దే ప్రముఖపాత్ర.

యువరాజుగా రావడానికి సల్మాన్‌ ఉబలాట పడ్డాడు కానీ ఆ పదవి  ఉత్తినే అప్పగించేయడానికి నయీఫ్‌ సుముఖంగా లేడు. అందువలన బలవంతంగా దించారని ప్రజలు చెప్పుకుంటున్నారు. అబ్బే, అదేం లేదు, వారిద్దరి మధ్య ఏ గొడవలూ లేవు అని చెప్పడానికి నయీఫ్‌ చేతిని సల్మాన్‌ ముద్దాడుతున్న వీడియోను సౌదీ ప్రభుత్వ మీడియా పదేపదే ప్రసారం చేస్తోంది. మరి అలాటి పరిస్థితుల్లో అతనిపై ఆంక్షలు విధించి గృహనిర్బంధంలో పెట్టడం దేనికి?

సౌదీలో అమెరికాకు అత్యంత ఆప్తుడు నయీఫ్‌. అతనితో యీ విధంగా వ్యవహరించడాన్ని అమెరికా ప్రభుత్వంలోని కౌంటర్‌ టెర్రరిజం, యింటెలిజెన్సు శాఖలు నిరసిద్దామనుకుంటున్నాయి. కానీ ట్రంప్‌ చూడబోతే సౌదీ రాజుతో పూసుకుపూసుకు తిరుగుతున్నాడు. మార్చి నెలలో సల్మాన్‌ అమెరికాకు వచ్చి వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో విందు కుడిచాడు. అప్పుడే వాళ్లిద్దరి మధ్య బేరసారాలు కుదిరి వుంటాయి. ట్రంప్‌ యిటీవలే సౌదీ వచ్చి వాళ్లను వాటేసుకుని వెళ్లాడు. ట్రంప్‌ అల్లుడు జారేద్‌ కుష్నర్‌ కూడా సౌదీ పక్షమే.

సౌదీ రాజకుటుంబాన్ని ఏమీ అనలేకపోయినా కనీసం తమ చిరకాల మిత్రుణ్ని ఎలాగైనా తప్పించి, అవమానభారం నుంచి తప్పించాలని అమెరికా యింటెలిజెన్సు పక్షాలు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. నయీఫ్‌కు ఒక భార్య, యిద్దరు కూతుళ్లు వున్నారు. దేశం విడిచి అమెరికాకు వెళ్లి స్థిరపడదామనే ఆలోచన వచ్చి వుంటుంది. రాకపోయినా, వస్తుందేమో, అమెరికా వెళ్లి రక్షణ పొంది తమపై ఆగ్రహంతో సౌదీ రహస్యాలన్నీ వాళ్లకు చెప్పి వేస్తాడేమోనన్న భయం పట్టుకుంది రాజుకి, కొడుక్కి. 

అందువలన ఎక్కడికీ వెళ్లకుండా కట్టుదిట్టం చేయడానికి యింట్లోనే నిర్బంధించారు. ఈ విషయం బయటకు పొక్కగానే 'అబ్బే, అదేం లేదు, యిది ఛేంజ్‌ ఓవరు పీరియడ్‌. నయీఫ్‌ కొద్దిగా అలకలో వుండి వుండవచ్చు. ఈ పరిస్థితుల్లో విదేశాలు వెళ్లడం దేనికి అంటున్నామంతే' అంటున్నారు అధికార వర్గాలు. రాచకుటుంబంలోని యితర బంధువులు యువరాజు సల్మాన్‌ ఉధృతి కారణంగానే యింత తీవ్ర చర్యలు జరుగుతున్నా యంటున్నారు. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో చూడాలి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com