Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: అనుచరుల ఆరాటం, అధినేతల ఇరకాటం

ఎమ్బీయస్‍: అనుచరుల ఆరాటం, అధినేతల ఇరకాటం

జంధ్యాల సినిమా ఒకదానిలో తండ్రీ కొడుకు పోట్లాడుకుంటూ, తండ్రి కోపంతో ఫ్లవర్ వేజ్ విరక్కొడితే, ‘ఓహో నువ్వు అది బ్రేక్ చేశావా, చూడు నేను ఏం బ్రేక్ చేస్తానో’ అంటూ కొడుకు టీవీ విరక్కొడతాడు. పవన్ బాబుల మధ్య వ్యవహారం అలాగే అనిపిస్తోంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు తేలకుండానే బాబు ఫలానా రెండు సీట్లు టిడిపికే అని ప్రకటించేశారు. వెంటనే పవన్ ‘మీరు పొత్తు ధర్మం బ్రేక్ చేశారు కదా నేనూ బ్రేక్ చేస్తున్నా’ అంటూ ఆయనో రెండు సీట్లు ప్రకటించాడు. వెంటనే నాగబాబు న్యూటన్ సూత్రాలు వల్లించి ‘టిట్ ఫర్ టాట్’ అన్నట్లు ధ్వనించారు. కానీ చిత్రంగా టిడిపి వాళ్లకు కోపం రాలేదు. ఇట్సోకే అన్నట్లు ఊరుకున్నారు. రెండు పార్టీలూ కలిసి కూర్చుని కామన్  మినిమమ్ ప్రోగ్రాం, స్థానాల జాబితా విడుదల చేస్తాయేమో ననుకుంటూంటే ఇదెక్కడి సరసంరా బాబూ అనిపించింది.

కూటమిలో బిజెపికి యిచ్చే సీట్లు ఎక్స్ అనుకుంటే దాని విలువ జీరోనో, ఐదో, పదో ఏదీ తేలకుండా ఉంది కాబట్టి యీ గందరగోళం, ఆ పజిల్ సాల్వ్ అయిందంటే వీళ్ల మధ్య చర్చల ఘట్టం ప్రారంభమై పోతుంది అనుకున్నాం. పవన్ రిపబ్లిక్ డే నాడు ప్రకటన చేసినప్పుడు నెలాఖరులో దిల్లీ వెళుతున్నారటగా, ఎక్స్ విలువ తెలుసుకుని వచ్చి, గందరగోళానికి మంగళం పాడతారని అనుకున్నాం. జనవరి నెల వెళ్లిపోయింది కానీ హస్తిన యాత్రా లేదు, ఎక్స్ విలువా తెలియలేదు. బిజెపికేం పోయింది, దానికి పెద్దగా కలిసి వచ్చేదేమీ లేదు. పార్లమెంటు ఎన్నికలపైనే దాని దృష్టి. ఆంధ్రలో తమంతట తాము ఒక్క సీటూ గెలవాల్సిన  పని లేదు. ఏ పార్టీ గెలిచినా మొత్తం 25 మంది ఎంపీలు వారి పక్షానే నిలుస్తారు. ఇక అసెంబ్లీ అంటారా, గుడ్డి కన్ను మూసినా, తెరిచినా ఒకటే. అందువలన నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు.

కానీ టిడిపి, జనసేనలకు చాలా స్టేక్ ఉంది. పవన్ ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెడదామనుకుంటున్నారు. ఇక బాబైతే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ సైతం చేశారు. టిడిపి, జనసేనల తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు పొత్తు యింకా కుదరకపోవడం ఆరాటాన్ని కలిగిస్తోంది. వైసిపి లిస్టులు వరుసగా బయటకు వచ్చేస్తున్నాయి. వాటితో పాటు కొందరు నిరాశావాహులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. అక్కడ రిజక్టయిన సరుకు మా పార్టీలోకి వచ్చి పడి నా సీటు కాజేస్తారేమో, వాళ్లు చేరతామంటూ వచ్చేలోపునే నా సీటు కన్‌ఫమ్ అయిపోతే బాగుణ్ను అని టిడిపి-జనసేన నాయకుల ఆదుర్దా. ఎందుకింత ఆలస్యం అని వ్యథ. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు దాటినా యిప్పటిదాకా టిడిపితో సీట్ల పంపిణీ ప్రక్రియ అనుభవం లేదు. 2014లో పోటీ చేయలేదు, 2019లో విడిగా పోటీ చేసింది. 2024కే యీ కసరత్తు జరుగుతోంది. ఇదే క్లిష్టమైన ప్రక్రియ.

‘మా పొత్తు కుదరకూడదని వైసిపి ఆశిస్తోంది, జనసేన కార్యకర్తలను ఉసి గొల్పుతోంది.’ అని టిడిపి చెప్పుకుంటోంది కానీ అసలు సమస్య యీ యిద్దరి పార్టీల మధ్యనే ఉంది. ఉట్టి కట్టిన తాళ్లు గట్టిగా ఉంటే పిల్లి శాపాలకు అవి తెగుతాయా? బిజెపికై వెయిటింగు కారణంగా యీ ప్రక్రియ ఆగింది అని స్థూలంగా చెప్పుకుంటున్నాం కానీ నిజానికి దానికి పరిష్కారం లేకపోయిందా? 175లో 10 స్థానాలు రాబోయే భాగస్వామికై (బిజెపి అయితే బిజెపి, లెఫ్టయితే లెఫ్ట్) అట్టే పెట్టి తక్కిన 165 స్థానాల విషయంలో టిడిపి-జనసేనలు ఒక అంగీకారానికి వచ్చేయవచ్చు. భాగస్వామి వచ్చాక ఈ 165 స్థానాల్లో ఫలానావి మాకు కావాలి అని అడిగితే రెండు, మూడు మార్పులు చేసుకోవచ్చు.

ఇది ఎందుకు అత్యవసరమంటే అవతల వైసిపి ఎంపిక చేసిన అభ్యర్థులు ఎన్నికలకై ప్రిపేరవుతున్నారు. టిక్కెట్లు రాని వాళ్లు బయటకు వచ్చేస్తున్నారు. వారి స్థానాల్లో కొత్తవాళ్లు దిగి ఓటర్లను పలకరిస్తున్నారు. సభలు, సమావేశాలూ ప్రారంభించేశారు. కూటమి అభ్యర్థుల కంటె వారికి టైము ఎక్కువ చిక్కుతోంది. కూటమి టిక్కెట్ల పంపిణీ తర్వాత అసంతృప్తులు బయటకు వస్తారేమో, వాళ్ల కోసం ఆగాలి అని వైసిపి అనుకోవటం లేదు. తన దారిన తను వెళ్లిపోతోంది. ఇటు ప్రతిపక్షాలు జబ్బలు చరుస్తున్నాయి తప్ప గోదాలోకి దిగటం లేదు. ఇది తప్పుడు సంకేతం యిస్తోందని భయపడి ఆంధ్రజ్యోతి వారు టిడిపి-జనసేన జాబితా అంటూ తమంతట తామే ఓ చిన్న లిస్టు ప్రకటించేశారు. ఎంత టిడిపి అనుకూల పత్రిక వేసినా, కూటమి వారు దాన్ని అంగీకరిస్తూనో, నిరాకరిస్తూనో ప్రకటన చేసేవరకూ దానికి శాంక్టిటీ ఏముంది?

చూడబోతే సందిగ్ధ పరిస్థితి పట్ల నిస్పృహ చెందిన టిడిపి-జనసేన క్యాడర్‌ను హుషారు చేయడానికి చేసిన ట్రిక్కులా ఉంది యీ జాబితా. నిస్పృహ పోగొట్టగలిగేవి కూటమి పార్టీలు మాత్రమే. అవెందుకు తేల్చటం లేదు? జనసేనకు ఎన్ని సీట్లు యిస్తారనేది తేలకపోవడం చేత అనేది రెడీమేడ్ ఆన్సర్. ‘‘జనసేన కోలాహలం’’ అనే వ్యాసంలో జనసేన హితైషుల సలహాలు, అనుచరుల ఉబలాటం, ఆరాటం గురించి రాశాను. అనుచరుల యీ ఆరాటఉబలాటాలు పవన్‌ను యిరకాటంలోకి నెడుతున్నాయి. అసలే అతను చికాగ్గా ఉన్నాడు. 2019లో మీటింగుల్లో శ్రోతల సందడి చూసి కనీసం ఓ పాతిక ముప్ఫయి సీట్లు వస్తాయనుకున్నాడు లాగుంది, ఫలితాలు చూసి నివ్వెరపోయాడు. ‘నన్నే ఓడించేశారు, అసెంబ్లీలోకి మన పార్టీ వెళ్లనీయకుండా చేశారు (వెళ్లిన ఒకతనూ జారిపోయాడు). కనీసం ఓ 30 సీట్లు అప్పుడిచ్చి ఉంటే యీరోజు టిడిపితో ధాటీగా బేరాలాడడానికి ఆస్కారం ఉండేది. ఓట్లేయరు కానీ సిఎం సిఎం అని అరుస్తారు’ అని బహిరంగంగానే విసుక్కుంటున్నాడు. వాస్తవాలు నిక్కచ్చిగా గుర్తించడం, గుర్తించినా యింత ఓపెన్‌గా మాట్లాడడం రాజకీయాల్లో అరుదు. :

ప్రస్తుతం వస్తున్న సర్వేలు వైసిపి:టిడిపి కూటమికి వచ్చే సీట్లు 2:1 అంటున్నాయి. ఎన్నికలకు చాలా ముందే, అభ్యర్థులు ఎవరో కూడా తెలియని స్థితిలో వచ్చాయి కాబట్టి, శాంపుల్ తక్కువగా ఉంది కాబట్టి వీటిని మరీ అంతగా నమ్మనక్కరలేదు. కానీ ఒక సంకేతంగా మాత్రం తీసుకోవచ్చు. వీళ్ల ప్రకారం కూటమికి 55-60 సీట్లు వస్తాయనుకుంటే మరో 30-35 తెచ్చుకోవాలి. వారు పైకి ఎంత డాబు కబుర్లు చెప్పినా, మన పాఠకుల్లో కొందరు అది నమ్మినా, వైసిపి స్థితి తుమ్మితే ఊడే ముక్కులా లేదని బాబు, పవన్‌లకు తెలుసు. అందుకే పొత్తు కోసం యీ వెంపర్లాట. బాబు పొత్తు అవసరమే అని ఊరుకుంటున్నారు కానీ పవన్ విశదీకరిస్తున్నారు. ఒక్కరమూ వెళితే శలభంలా మాడిపోతాం, ఆత్మహత్య చేసుకున్నట్లే అని.

‘ఊరూరా అభ్యర్థులున్న 40 ఏళ్ల పార్టీతో పొత్తు అంటే ఆషామాషీగా, అడావుడిగా తేలే వ్యవహారం కాదు. మన బలం ఏమిటో చూసుకోకుండా చిత్తమొచ్చినట్లు సీట్లు అడిగితే ప్రయోజనం లేదు. అది తెలిసే బాబు పొత్తు ధర్మం పాటించక పోయినా, లోకేశ్ ఏకపక్షంగా ప్రకటనలు చేస్తున్నా ఓర్చుకుంటున్నాను. ఎందుకంటే యీ కారణం చెప్పి పొత్తు తెంపుకుంటే అవతల జగన్ గెలిచేస్తాడు. అతన్ని గద్దె దింపాలంటే నేను ఓర్చుకోక తప్పదు, నాతో పాటు మీరు సహనం పాటించాల్సిందే, పొత్తుకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు’ అని స్పష్టంగా పవన్ చెప్పాడు.

తనకివ్వబడిన పాత్రపై పవన్‌కు పూర్తి క్లారిటీ ఉంది. దాని ప్రకారం ఆయన చేసుకుంటూ పోతున్నాడు, దర్శకుణ్ని మెప్పిస్తున్నాడు. మధ్యలో హితైషులంటూ కొందరు పోగడి, సెట్స్ మీదకు వచ్చి అలాక్కాదు యిలా చేయి, అలా చేయి అంటే మండదూ. కానీ ఆ మంట ప్రత్యక్షంగా చూపించలేడు. ఎందుకంటే తనను అభిమానించే ప్రేక్షక ఓటర్లలో కూడా అలాటి భావాలే ఉన్నాయి. వాటిని హర్ట్ చేస్తే మొదటికే మోసం రావచ్చు. ఇదీ పవన్ డైలమా. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో బాబు జనసేనతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు కాబట్టి, యిదే అదనుగా ఉప ముఖ్యమంత్రి పదవి, వీలైతే సగం టర్ము ముఖ్యమంత్రి పదవి డిమాండు చేసి, కాపులకు తృప్తి కలిగించాలని, తద్వారా భవిష్యత్తులో పవన్ పెద్ద లీడరుగా, జనసేన పెద్ద పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుందనీ, జనసేనలో చేరడానికి అంగబలం, అర్థబలం ఉన్నవారు ముందుకు వస్తారనీ జనసేన అభిమానుల, పవన్ అభిమానుల, కులస్తుల ఆకాంక్ష. అందువలన హీనపక్షం 50 సీట్లయినా అడగాలని వారి డిమాండ్.

జనసేనకు టిడిపి 50 సీట్లు యివ్వగలదా అనే దానిపై ఆలోచిద్దాం. బలాలు కాంప్లిమెంటరీగా ఉంటేనే విన్-విన్ సిచ్యువేషన్ వుంటుంది. రాయలసీమలో జనసేన, కోస్తాలో టిడిపి బలంగా ఉంటే యిద్దరూ కలిస్తే లాభముండేది. టిడిపి ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీయే కానీ ప్రస్తుతం రాయలసీమలో బలం తగ్గింది. 2019లో దాని ఓటు శాతం కోస్తాలో కంటె 1.3% తక్కువగా 38.3 ఉంది. జనసేన చూడబోతే కోస్తాలో 7.2% ఉంటే రాయలసీమలో 2% ఉంది. అంటే రాయలసీమలో జనసేనకు సీట్లు యిస్తే దానికేమీ ప్రయోజనం లేదు. పోనీ బలిజల ఓట్లు చూసుకుని ఒక 5 సీట్లు యిచ్చినా 45 కోస్తాలో యివ్వాలంటే కష్టమే కదా! ఎందుకంటే యిద్దరి బలమూ ఒకే చోట మోహరించి ఉంది. అదీ సమస్య. 2019 ఎన్నికలలో ఓటింగు శాతం బట్టి చూస్తే టిడిపి, జనసేనల ఓట్లశాతాలను కలిపితే వైసిపి కంటె ఎక్కువున్న జిల్లాలు (ఉమ్మడివే రాస్తున్నాను) విశాఖ, తూగోజి, పగోజి – మూడే!

ఇతర వివరాల్లోకి వెళ్తే - 19 సీట్లున్న తూగోజిలో జనసేనకు 14.8% టిడిపికి 36.8%, 15 సీట్లున్న పగోజిలో జనసేనకు 11.7 టిడిపికి 36.3. 15 సీట్లున్న విశాఖలో జనసేనకు 8.6, టిడిపికి 36.7. 16 సీట్లున్న కృష్ణాలో జనసేనకు 5.3 టిడిపికి 41.5, 17 సీట్లున్న గుంటూరులో జనసేనకు 6 టిడిపికి 41.9. ఇక తక్కిన 8 జిల్లాలలో జనసేనకు 3% కంటె తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి వాటిని వదిలేస్తున్నాను. అక్కడ తక్కువ వచ్చినా, పై 5టిలో ఎక్కువ వచ్చాయి కాబట్టి రాష్ట్రం మొత్తం మీద 5.5 వచ్చాయి. (ఈ అంకెలన్నీ లోకనీతి డాట్ ఆర్గ్ నుంచి తీసుకున్నవి) ఇప్పుడు బలం ఉన్న చోటే పొత్తు భాగస్వామిగా పోటీ చేస్తుంది కాబట్టి పాత సగటు కంటె కొత్త సగటు కచ్చితంగా ఎక్కువ ఉంటుంది. కోస్తాలోనే తమకు ఎక్కువగా కావాలని యిద్దరూ పట్టుబడితే యిబ్బంది వస్తుంది.

2019లో విడివిడిగా పోటీ చేసినపుడు పడిన ఓట్ల శాతం ప్రకారం సైంటిఫిక్‌గా లెక్కలు వేసి చూస్తే తూగోజి, పగోజిలలో టిడిపికి పడిన ఓట్ల శాతం సరాసరి 36.6 కాగా, జనసేనది 12.8 అంటే టిడిపి ఓట్లలో 35% జనసేనకు వచ్చాయి. ఆ జిల్లాలలో 34 సీట్లు ఉన్నాయి కాబట్టి, టిడిపి-జనసేన 65:35 నిష్పత్తిలో సీట్లు పంచుకోవచ్చు. అంటే జనసేనకు వచ్చేవి 12. విశాఖలో నిష్పత్తి 77:23, అంటే జనసేనకు 4. కృష్ణా గుంటూరులలో నిష్పత్తి 86:14, అంటే జనసేనకు 5 సీట్లు. ఈ ఐదు జిల్లాలలో కలిపి 21 స్థానాలయ్యాయి. ఇది బేస్‌గా పెట్టుకుని జనసేన బేరాలు ప్రారంభించవచ్చు. ఎంత లాగినా, గుంజినా జనసేనకు 30 సీట్ల కంటె ఎక్కువ యివ్వడానికి టిడిపికి కారణాలు కనబడవు.

ఇంకో విషయం ఉంది. కూటమి గెలుపు సమర్థవంతమైన ఓట్ల బదిలీపై ఆధారపడి ఉంది. జనసేనకు కాపుల బలం కలిసి వస్తుందని లెక్క వేసుకునే జిల్లాలలోనే వారికి వ్యతిరేకమైన బిసిలు, కమ్మలు కూడా ఉన్నారు. వాళ్లే టిడిపికి ఓటు బ్యాంకు. జనసేనకు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 దాటనివ్వద్దని ఆ వర్గాలు బాబుకి సలహా యిస్తూంటారు. ‘ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచాం, తెలంగాణలో జనసేన ఏమీ చేయలేకపోవడం చూశాం, అసలు దానితో పొత్తే అక్కరలేదు’ అనే అతివాదులూ టిడిపిలో ఉన్నారు. టిడిపి కాకపోతే జనసేన ఓటర్లకు ఆప్షన్ ఏముందని వారి వాదన. జగన్, పవన్‌ల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. పవన్ అభిమాని అన్నవాడు చచ్చినా జగన్‌కి వేయడు. బాబు సగం టర్మ్  ముఖ్యమంత్రి పదవి యివ్వకుండా ఉప.. అన్నా, ఒట్టి మంత్రి అన్నా, పాతిక కాదు, పది సీట్లే అన్నా టిడిపికే ఓటేయాలి - జగన్ ను ఓడించే సామర్థ్యం బాబుకి మాత్రమే ఉంది కాబట్టి! బాబు అంటే కూడా పడకపోతే బిజెపికి వేయాలి, పోనీ పవన్‌కు ప్రాధాన్యత యిస్తున్నారు కదాని.

వీరి వాదన యిలా ఉంటే 50కి తక్కువైతే టిడిపితో పొత్తే వద్దు అనే అతివాదులు జనసేనలో ఉన్నారు. పొత్తు కావాలా వద్దా అని పార్టీల అభ్యర్థుల నడిగితే వారి అవసరాల బట్టి జవాబిస్తారు. మన యింటి ముందు రోడ్డు వెడల్పు కావాలి, మన యింటికి మార్కెట్ వేల్యూ పెరగాలి అని కోరుకుంటాం, కానీ వెడల్పు చేయడానికి మన స్థలం కొంత తీసుకుంటామంటే వద్దులే అంటాం. రోడ్డుకి అవతలివైపు తీసుకోవచ్చుగా అంటాం. అలాగే, పొత్తు ఉంటే మన పార్టీకి లాభం అంటే సై అంటారు, కానీ దానికి గాను నీ స్థానాన్ని భాగస్వామి పార్టీకి యివ్వాలి మరి అంటే, నై అంటారు.  

నా ఊహ ప్రకారం పవన్ కళ్యాణ్‌కి ప్రాక్టికల్‌గా ఏది సాధ్యమో తెలుసు కాబట్టి, 30కి అటూయిటూగా సీట్లు యిస్తే సర్దుకుందామని అనుకుంటున్నాడు. వాటిలో 18-20 గెలిస్తే అసెంబ్లీలో మన కంటూ స్థానం ఏర్పడుతుంది కదాన్న ఆలోచన అతనిది. కానీ అనుచరుల ఉబలాటం 50 కంటె తగ్గేదే లే.. అనే రేంజ్‌లో ఉంది. 50 టిక్కెట్లిస్తేనే 30 ఎమ్మెల్యేలు పోగడతారు కదా అంటారు వారు. టిడిపి అనుచరుల ఉబలాటమూ అదే స్థాయిలో ఉంది. జనసేన మనకు హెల్పవ్వాలి తప్ప, మనం వాళ్లకు ప్రాధాన్యత యిచ్చి నెత్తికెక్కించుకోవాల్సిన పని లేదు, జనసేన ఓటర్లకే కాదు, పవన్‌కూ ఆప్షన్ లేదు. 20 టిక్కెట్లిస్తే చాలు, అంతకంటె హెచ్చేదే లే.. అనే రేంజ్‌లో వారున్నారు. వారివలన బాబుకి యిరకాటంగా ఉంది. అందువలననే మనం అవతలి వాళ్లకు లొంగటం లేదు అని చూపడానికి ఏకపక్షంగా రెండు స్థానాలు ప్రకటించారు. పవన్‌కూ అదే సమస్య కాబట్టి ఆయనా నా తరఫున ఓ రెండు అన్నాడు.

అలా పోటీపోటీగా చేసినట్లు కనబడినా, మొదటి పేరాలో చెప్పినట్లు ‘ఆల్ యిన్ ద ఫ్యామిలీ’. ఈ దాగుడుమూతలు కొన్ని రోజులే. జాబితా బయటపెట్టక తప్పదు. అప్పుడు వచ్చే రుసరుసలను అధినేతలు భరించకా తప్పదు. అధినేతల నిర్ణయాలను అనుచరులు అమలు చేయకా తప్పదు. ఇప్పటిదాకా ఉప ఎన్నికలలో కానీ, స్థానిక ఎన్నికలలో కానీ అధికార పార్టీని ఢీకొనలేక పోయిన ప్రతిపక్షాలు యీ ఎన్నికలలోనైనా ఐకమత్యంతో పోరాడే బలమైన ప్రత్యామ్నాయంగా చూపుకోకపోతే ఓటర్లకు నమ్మకం కుదరడం కష్టం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2024)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?