Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: జనసేన కోలాహలం

ఎమ్బీయస్‍: జనసేన కోలాహలం

కొంతమంది నాయకులు వైసిపి వీడి జనసేనలో చేరడంతో ఆ పార్టీ హితైషుల్లో కోలాహలం కనబడుతోంది. ఇన్నాళ్లూ జనసేనలో అభ్యర్థుల కొరత ఉండేది. యువత హడావుడి తప్ప, సీనియర్ నాయకులెవ్వరూ జనసేన వైపు చూసేవారు కాదు. 30, 40 సీట్లు వాళ్ల కిచ్చినా నిలబడడానికి అభ్యర్థులేరీ? అనేవారు. ‘నా దగ్గర ప్రస్తుతానికి ఆస్తేమీ లేదనుకోండి, కానీ మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే, తన ఆస్తంతా నాదే అవుతుందిగా’ అన్నట్లు, ‘మీరు సీటు కేటాయిస్తే అభ్యర్థి తనే దొరుకుతాడు’ అనే జవాబు యివ్వాల్సి వచ్చేది. జనసేన సిద్ధాంతాలపై ప్రేమ, విజయావకాశాలపై విశ్వాసం వుండి ఉంటే యీ పాటికే పెద్ద నాయకులనేకులు చేరి ఉండేవారు. ఇన్నాళ్లూ చేరకుండా గట్టు మీద ఉండి, యిప్పుడు రావడంలో మర్మమేమిటి?

మర్మం పెద్దగా ఏమీ లేదు. ఆ పార్టీ, యీ పార్టీ, యిండిపెండెంటు అని కాదు, ఎన్నికలలో అభ్యర్థిగా నిలబడితే కొన్ని ప్రయోజనాలుంటాయి. మొదటగా పేరు నలుగురిలో నలుగుతుంది. మంచో, చెడో ఏదో ఒక రకమైన పబ్లిసిటీ వస్తుంది. గెలిచినా, ఓడినా ఒక రాజకీయ చరిత్ర అంటూ ప్రారంభమౌతుంది. గత ఎన్నికల్లో యిన్ని ఓట్లు వచ్చాయి, యీసారి యిన్ని రావచ్చు అనే లెక్క వేయడానికి ఒక బేస్ ఏర్పడుతుంది. ఆర్థికపరంగా చూస్తే పార్టీ కొన్ని నిధులిస్తుంది. సానుభూతిపరులు మరి కొంత యిస్తారు. ఇంకొంత నియోజకవర్గం లోని వ్యాపారస్తులను, పారిశ్రామికవేత్తలను దబాయించి పుచ్చుకుంటారు. అసెంబ్లీ ఎన్నికకు 30 కోట్లు ఖర్చు పెట్టా అంటే అంతా తన యింట్లోది పెడతారని కాదు, యిలా రకరకాలుగా పోగేసినది ఖర్చు పెడతారు. నిధులివ్వలేని చిన్న పార్టీ తరఫునో, స్వతంత్రంగానో నిలబడితే ‘నీ ఓట్లు చీలుస్తా’ అని బెదిరించి, పెద్ద పార్టీ కాండిడేటు దగ్గర డబ్బు గుంజవచ్చు.

ఇన్ని రోజులూ వైసిపి నుంచి బయటకు వచ్చినవాళ్లు టిడిపి వైపే వెళ్లారు. ఇప్పుడు కొంతమంది జనసేన బాట పట్టారు. ఎన్నికల వేళ టిడిపివైపు వెళితే హౌస్‌ఫుల్ అంటారని యిటు వస్తున్నారు. ఏ కారణం చేత వస్తేనేం, సింగిల్ మ్యాన్ షో పార్టీ అని కాకుండా ఎస్టాబ్లిష్‌డ్ పార్టీ అనే యిమేజి అంటూ వస్తుంది. పొత్తులో భాగంగా టిడిపి ఏదైనా స్థానాన్ని కేటాయిస్తే ఎవరో ఒకర్ని నిలబెట్టేస్తే పని అయిపోదు కదా! వీళ్లయితే ఆర్థిక స్తోమత కలవారు. ఇప్పటికే పదవుల్లో ఉన్నారు కాబట్టి సభలకు జనాల్ని సమీకరించ గలరు. వైసిపి నుంచి వచ్చారు కాబట్టి జగన్ లోపాలను బయటపెట్టి శ్రోతల్లో ఆసక్తి రగిలించగలరు. పార్టీకి స్వతహాగా నిర్మాణం లేదు కాబట్టి, వారి అంగబలం అంది వస్తుంది. ఉన్నదున్నట్లు చెప్పాలంటే అలాటి వాళ్లు జనసేనలో యిప్పటివరకు ఎంతమంది ఉన్నారు?

పెట్టి పదేళ్లయిన పార్టీలో యీ రోజు కనబడేది మూడే మూడు పెద్ద తలకాయలు. పవన్, మనోహర్, నాగబాబు. అటు కూడినా, యిటు కూడినా ముగ్గురంటే ముగ్గురే. ఇక టీవీల్లో కనబడి మాట్లాడే ముగ్గురు నలుగురూ తెలివైనవారేమో కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నవారు కాదు. కింద పేరు రాకపోతే ఎవరో తెలియని పరిస్థితి. పై ముగ్గురిలో మనోహర్ తప్ప తక్కిన యిద్దరూ అసెంబ్లీలో కానీ, పార్లమెంటులో కానీ అడుగు పెట్టినవారు కాదు. మనోహర్ కూడా వేరే పార్టీ ద్వారా అడుగు పెట్టారు తప్ప యీ పార్టీ పెట్టాక కాదు. ఈ ముగ్గురిలో నాగబాబు పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుందని జనసేన నుంచి బయటకు వచ్చినవారు చెప్తున్నమాట. జనసేన ఆఫీసులో కూడా ఆయన మాట చెల్లకుండా మనోహర్ చేశాడని వాళ్లంటున్నారు.

ఇక మిగిలినది పవన్, మనోహర్. పవన్ ఎవరికీ అందుబాటులో ఉండరు. హరిరామ జోగయ్య గారు ఒక యింటర్వ్యూలో చెప్తున్నారు, ‘ఫోన్ చేసి చెప్తే పోయేదానికి యీ లేఖలెందుకు అని అడుగుతున్నారు, పవన్‌తో నేనెన్నడూ ఫోన్‌లో మాట్లాడలేదు. ఆయన ఎవరికీ నెంబరు యివ్వడు. ఎవర్నీ కలవడు.’ అని. అక్కడ చక్రధారి మనోహర్ మాత్రమే. ఆయన బాబు మనిషి అని జనసేన బాధితుల ఆరోపణ. వేరే ఎవరితోనైనా పవన్ సమావేశమైతే వెంట మనోహర్ ఉంటాడు, బాబుతో సమావేశాల్లో మాత్రం ఉండడు చూడండి అని ఒకాయన ఎత్తి చూపాడు. కారణం ఏమిటంటేట యితరులతో పవన్ ఏం మాట్లాడాడో తనకు రిపోర్టు చేసేందుకు మనోహర్‌ని బాబు పంపిస్తారట. తనతో మాట్లాడేటప్పుడు ఆ అవసరం లేదు కాబట్టి రానివ్వరుట.

ఏమైతేనేం జనసేనలో ఉండి వచ్చినవారు మనోహర్‌ను పాపాలభైరవుడిగా చిత్రీకరిస్తారు. ఇది సులభమైన పని. జగన్ ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా మారుస్తూ, కొన్ని రోజుల్లో ఆ మార్పులను మారుస్తూ, వారిని అయోమయానికి గురి చేస్తూ, తాను గందరగోళ పడుతూ కంపుకంపు చేస్తూంటే ఆ దోషం సలహాదార్లదే అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఆ సలహాదార్లను పెట్టుకున్నదెవరు? చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి వివేకం ఉండాలంటారు. జగన్ సలహాదార్లు కానీ, మనోహర్ కానీ వీళ్లంతా విపింగ్ బాయ్స్. అసలు తప్పు అధినేతలదే. పైగా మనోహర్‌ను ఏమైనా అంటే వాళ్లు పార్టీలోంచి బయటకు పోవచ్చు అని పవన్ హెచ్చరిస్తున్నారంటేనే తెలుస్తోంది, మనోహర్ చేసే ప్రతీ పనికీ పవన్ ఆమోదం ఉందని, రేదర్ పవన్ ఆదేశాల మేరకే మనోహర్ అలా చేస్తున్నారని.

పవన్‌కు తన లక్ష్యమేమిటో తెలుసు, తన శక్తియుక్తుల పరిమితి ఏమిటో తెలుసు. అందుకని జనసేనను అతను ఒక పార్టీగా నడపటం లేదు. వైసిపిని ఓడించడానికి టిడిపికి ఒక కెటలిస్టుగా మాత్రమే తను పనికి వస్తాడు అనే అవగాహన పూర్తిగా ఉంది. కెటలిస్టు అంటే ప్రేరకం. రసాయనిక చర్య వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది తప్ప, ఆ చర్యలో భాగం పంచుకోదు. తన పని బాబుకి దోహదపడడం మాత్రమే తప్ప విడిగా పార్టీ నడిపేసి, టిడిపి ఓట్లను, వైసిపి ఓట్లను చీల్చి, దీర్ఘకాలిక పోరాటం చేద్దామని కాదు. ఈ విషయం గ్రహించని కొందరు కాపు తదితర కులస్తులైన మేధావులు జనసేనలో చేరి, పార్టీని బలోపేతం చేయడానికి నానా రకాల ఐడియాలు యివ్వసాగారు.

ఇవన్నీ పవన్‌కు చిర్రెత్తించాయి. తను అనుకున్నదేమిటి, వీళ్లు చేస్తున్నదేమిటి? పార్టీ నిర్మాణం, సొంత అజెండా, మానిఫెస్టో.. యిలాటి మాటలు చెప్తారేమిటి అని విసుక్కుని వాళ్లను కలవడం మానేశాడు. నాదెండ్ల మనోహర్‌కు సమస్తం అప్పగించేసి, అతన్ని ఏమైనా విమర్శిస్తే, అతను చెప్పినది వినకపోతే ఖబడ్దార్ అన్నాడు. ఇక యీ మేధావులందరికీ మండింది. ఒక్కొక్కరూ బయటకు వచ్చేశారు. వచ్చేసినవాళ్లంతా యూట్యూబులో వీడియోలే వీడియోలు. ‘పవన్‌కు రాజకీయాల్లో ఆసక్తి లేదు. మనం మంచి చెప్పినా వినడు. కాపు యువకుల్లారా, అతని భ్రమలో పడి సమయం వృథా చేసుకోకండి. మేము సమయం, శ్రమ కోల్పోయి తెలుసుకున్న సత్యాన్ని మీకు చెప్తున్నాం, అతన్ని ఆడించేవాళ్లు వేరే ఉన్నారు.’ అంటూ ఉపదేశాలు యిస్తున్నారు. చిత్రమేమిటంటే జనసేన తరఫున వారిని ఖండించేవారు కూడా ఎవరూ లేరు.

ఇలాటి పరిస్థితుల్లో ‘మన పొత్తు కోసం బాబు వెంపర్లాడుతున్నాడు. మా పవన్ పవన్ అని ప్రతి సభలో పలవరిస్తున్నాడు. ఆట గెలిపించే తురఫు ముక్క మన దగ్గర ఉంది. బెల్లించి ఎక్కువ సీట్లు లాగడానికి యిదే అదను. ఎక్కడా తగ్గొద్దు’ అని పవన్‌కు సలహాలిచ్చే కాపు నాయకులు ఎక్కువై పోయారు. పవన్‌కు, వాళ్లకూ యిక్కడే తేడా వస్తోంది. 2019 తర్వాత పవన్‌కు తత్త్వం బాగా బోధపడింది. ఎన్నికల సభలో సిఎం, సిఎం అని అరిచేవారు, లేఖల మీద లేఖలు గుప్పించేవారి వలన ఓట్లు పడవని అర్థమై పోయింది. ఇలా సలహా చెప్పేవాళ్లు ‘మా నియోజకవర్గంలో 50 వేల ఓట్లు జనసేన అభ్యర్థికి వేయిస్తాం’ అనగలరా? పోనీ నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ఖర్చు మేం భరిస్తాం అని ముందుకు వస్తారా? ఎంతసేపు చూసినా ‘మన కాపులం యింతమంది ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రివి కావాలి, లేదా ఉపముఖ్యమంత్రి కావాలి, అది మా కళ్లతో మేం చూసి తరించాలి.’ అని ఊదరగొట్టడమే వీరి పని. కాపు కాపు అంటూ పిచ్ పెంచిన కొద్దీ యితర కులాల వారు దూరమౌతారనే యింగితం కూడా వీళ్లకు లేదు.

‘నువ్వు చిత్తశుద్ధి కలవాడివి, రాజకీయంగా ఏ మచ్చా లేనివాడివి, ప్రజల గురించి కొత్త రకంగా ఆలోచించి వినూత్న పథకాలు రూపొందించి గలవాడివి, మేధావులను ఆకర్షించగలిగిన వాడివి..’ వంటి వర్ణనలు చేస్తే యితర కులస్తులు, తటస్థులు కూడా మొగ్గు చూపుతారు. అది మానేసి ఎంతసేపూ ‘మీది తెనాలి, మాది తెనాలి’లా ‘నువ్వు కాపు, నేను కాపు’ జపం చేస్తే ఎలా? దీనితో పాటు ‘బాబుతో జాగ్రత్తగా ఉండు, భాగస్వాములను దగా చేసే రకం, గీచిగీచి బేరమాడు. కోస్తా జిల్లాల్లో సీట్లు వాళ్లు నీకు యివ్వడం కాదు, నువ్వే కావలసినవి తీసుకుని తక్కినవి వాళ్ల కియ్యి. మనదే పైచేయిగా ఉండాలి’ అంటూ ఎక్కవేస్తున్నారు. ఏ సీట్లలో ఏయే జనసేన అభ్యర్థులు నిలపాలో జోగయ్యగారు లిస్టు కూడా ప్రకటించేశారు. ఏ హోదాలోనో ఆయనకే తెలియాలి. ఇక తెలుగు రాజ్యం టీవీ కూడా సెలక్టు కాబోయే అభ్యర్థులు వీరంటూ 40 పై చిలుకు పేర్లతో లిస్టు విడుదల చేయడంతో బాటు 18-20 సీట్లలో జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారంటూ వాటి జాబితా కూడా యిచ్చేసింది.

సీట్ల పంపిణీ జరిగేటప్పుడు గత ఎన్నికలలో పెర్‌ఫామెన్స్ చూడడం కద్దు. ‘అలా చూడవద్దు, ఈ ఐదేళ్లలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఓటింగు పది శాతంకు పైగా పెరిగింది. పవన్ దూకుడు వలన జగన్‌ను ఎదుర్కొనే పోరాట పటిమ జనసేనకే ఉంది అని వైసిపి వ్యతిరేక శక్తులు నమ్ముతున్నాయి.’ అని జనసైనికుల, పార్టీ హితైషుల వాదన. వీరందరికీ ఉన్న ఊహేమిటంటే సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్న కాపులకు యిన్నాళ్లూ నామ్‌కే వాస్తే పదవులతో సరిపెడుతూ వస్తున్నారు. ఇన్నాళ్లకు మనపై ఆధారపడే ప్రభుత్వం రాబోతోంది కాబట్టి దాని చేత మన వర్గానికి ప్రయోజనం చేకూరే పనులు చేయించుకోవాలి అని.

కూటమి ప్రభుత్వ మనుగడకు కీలకంగా ఉండాలంటే జనసేనకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలుండాలి. లేకపోతే కూటమి నాయకత్వం లక్ష్యపెట్టదు. 2014 నాటి టిడిపి ప్రభుత్వంలో బిజెపి మంత్రులకు ఏ పాటి గౌరవం యిచ్చారో చూసిన అనుభవం ఉంది. ‘గత అసెంబ్లీలో జనసేనకు ఓ 30 మంది ఎమ్మెల్యేలుంటే ఓ స్టేచర్ ఉండేది, కర్ణాటకలో జెడిఎస్‌లా లెవరేజి ఉండేది’ అని పవన్ అనేకసార్లు చెప్పారు. 30 మంది ఎమ్మెల్యేలు నెగ్గాలంటే ఎంతమంది పోటీ చేయాలి? 2014లో జనసేన, బిజెపిల మద్దతుతో టిడిపికి 58% సీట్లు వచ్చాయి. అదే నిష్పత్తిలో జనసేన యిప్పుడు గెలుస్తుంది అనుకుంటే 52 సీట్లు పోటీ చేయాలి. మొత్తం 175 సీట్లలో కూటమి రాబోయే భాగస్వామి (బిజెపి లేదా లెఫ్ట్)కి 10 వదిలేయాలి అనుకుంటే 165లో జనసేనకు 52 అనగా 31% ఉండాలి. సింపుల్‌గా గుర్తుంచుకోవాలంటే టిడిపి జనసేన 70:30 నిష్పత్తిలో సీట్లు పంచుకుంటేనే జనసేనకు పరువు దక్కినట్లు అర్థం.

కానీ లోకేశ్ ఏమన్నారు? 175లో 150 టిడిపికే, తక్కిన 25లోనే యితర కూటమి సభ్యులంతా సర్దుకోవాలి అన్నారు. బిజెపి లేదా లెఫ్ట్, కాంగ్రెసుతో సర్దుబాటు, యిలాటి వాటికి 10 తీసి పక్కన పెడితే జనసేనకు మిగిలేవి 15 మాత్రమే. అంటే టిడిపి జనసేన 10:1 నిష్పత్తిలో పంచుకున్నట్టవుతుంది. బిజెపి 10 అడిగితే కాదనలేని పరిస్థితి కానీ, లెఫ్ట్‌, కాంగ్రెసుతో ఏముంది 5 యిస్తే ఊరుకుంటారు అనుకుంటే జనసేనకు 20 వస్తాయనుకోవచ్చు. టిడిపి జనసేనకు 18-20 యివ్వడానికి సిద్ధపడుతోందట అనే టాక్ కూడా చాలాకాలంగా వినబడుతోంది. 20 అనుకుంటే అప్పుడు టిడిపి-జనసేన నిష్పత్తి 10:1.3 అయిందన్నమాట. ఇది జనసేన అభిమానులకు దుస్సహంగా ఉంది. పవన్ పవన్ అంటూ మర్యాద కురిపిస్తున్న చంద్రబాబు వ్యవహారానికి వచ్చేసరికి పిడికిలి బిగిస్తున్నారన్నమాట అనే భావం కలిగింది.

20 సీట్లిస్తే వాటిలో 60% గెలిచినా 12 సీట్లు వస్తాయి. అదే నిష్పత్తిలో టిడిపి కూడా గెలిస్తే వాళ్లకు 78 వస్తాయి. ప్రభుత్వ ఏర్పాటుకై టిడిపి జనసేన మీద ఆధారపడవలసి వస్తుంది. వైసిపి వ్యతిరేక పవనాలు బలంగా వీచి, కూటమికి 70% సీట్లు వస్తే జనసేనకు 14, టిడిపికి 105 వస్తాయి. అప్పుడు జనసేనతో టిడిపికి పనే లేదు. మధ్యస్తంగా 65% వస్తే టిడిపికి 98, జనసేనకు 13 వస్తాయి. అప్పుడూ టిడిపికి జనసేనతో పని లేదు. మొదటి సినారియోలో 78 దగ్గర ఆగితే టిడిపి వైసిపి నుంచి ఫిరాయింపుదారులను తీసుకుని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అలా తీసుకునే విషయంలో తమకు శషభిషలు లేవని 2014లోనే చూపుకున్నారు. పైగా పొరుగున ఉన్న తెలంగాణలో చాన్నాళ్లుగా జోరుగా సాగుతున్న వ్యాపారం అదే! ఫిరాయింపులు జరిగినప్పుడు వాళ్లకు కంచాల్లోనూ, మొదటినుంచి ఉన్నవాళ్లకు ఆకుల్లోనూ వడ్డిస్తారు. 12-14 సీట్లతో మిగిలే జనసేన పళ్లు నూరుకోవడం తప్ప మరేమీ చేయలేదు.

జనసేన అభిమానులకు యిది రుచించటం లేదు. సర్వావస్థల్లోనూ టిడిపి తమపై ఆధారపడాలంటే కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, అనగా 50 టిక్కెట్లు యివ్వాలని వారి పట్టుదల. ఆ మేరకు గట్టిగా డిమాండు చేయాలని పవన్‌పై వారి ఒత్తిడి. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు జాన్తానై అని లోకేశ్ యిప్పటికే చెప్పేశాడు. ఉప ముఖ్యమంత్రి అనేది నిజంగా గొప్పదేమీ కాదు. ఆ పదవి కాపులకు యితర పార్టీల ద్వారా యిప్పటికే వచ్చేసింది. ముఖ్యమంత్రిగా కాపు అనేదే ఎక్సయిటింగ్ ఫ్యాక్టర్. కానీ ఆ పదవి బాబుదే అని లోకేశ్ అన్నాడు. కనీసం కీలకసంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఉంటే ప్రభుత్వాన్ని తాము అనుకున్న దిశగా నడిపించవచ్చు కదా అని జనసేన అభిమానుల ఉద్దేశం.

లోకేశ్ చెప్తే బాబు చెప్పినట్లా? తాము చెప్పలేనిది తమ వాళ్లతో చెప్పించడం ఎప్పణ్నుంచో ఉన్న అలవాటు. ‘‘పెద్దమనుషులు’’ సినిమాలో దుష్టుడైన మోతుబరి తన మిత్రుడికి డబ్బు అప్పిస్తాడు. ప్రోనోటు యిమ్మనమని అడగాలంటే మొహమాటం. అందుకని తను లేనప్పుడు గుమాస్తా చేత ఫార్మాలిటీ కోసం అంటూ ప్రోనోటుపై మిత్రుడి చేత సంతకం పెట్టిస్తాడు. సంతకమయ్యాక తను గది లోకి వచ్చి గుమాస్తాని ‘బుద్ధుందా? అతని చేత ప్రోనోటు రాయిస్తావా?’ అని తిడతాడు. మిత్రుడు వెళ్లిపోయాక ‘సంతకం పెట్టడానికి గునిశాడా?’ అని అడుగుతాడు. ఇందిరా గాంధీ సిపిఐని వదుల్చుకోవడానికి సంజయ్ గాంధీ చేత తిట్టించేదని గతంలోనే రాశాను. బాబు తన భావాన్నే లోకేశ్ నోట వినిపించారని అనుకోవాలి. వచ్చిన రియాక్షన్ బట్టి సర్దుబాట్లు చేసుకునేందుకు అప్పుడే అవకాశం ఉంటుంది.

లౌక్యం తెలియని పవన్, బాబు చేతిలో మోసపోతాడేమోనన్న ఆతృతతో అతనికి సలహాలిచ్చే హితైషులు పెరిగిపోతున్నారు. తగ్గొద్దు, తగ్గొద్దు అంటూ జనసైనికులు ఒత్తిడి తెస్తున్నారు. బాబుపై మరొక రకమైన ఒత్తిడి వస్తోంది. ఇవి తట్టుకోవడానికి పవన్, బాబు యిద్దరూ ప్రకటనలు చేయాల్సి వస్తోంది. వీటి గురించి  ‘‘అనుచరుల ఆరాటం, అధినేతల ఇరకాటం’’ అనే వ్యాసంలో చర్చిస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2024)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?