గాజువాక విషయం మరోసారి అధినాయకత్వం పరిశీలిస్తుందని ప్రచారం గత కొన్ని రోజులుగా సాగింది. అరకు ఇంచార్జిగా ఎంపీ గొడ్డేటి మాధవిని మార్చిన తీరుగానే గాజువాకలో ఇంచార్జిగా నియమించిన ఉరుకూటి రామచంద్రరావుని మార్చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం చోటు చేసుకుంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఉరుకూటి అభ్యర్ధిత్వం మీద సుముఖంగా లేరని ఆయన తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా నేను సహకరిస్తాను అని అధినాయకత్వానికి చెప్పినట్లుగా ప్రచారం సాగింది. అయితే గాజువాకలో శుక్రవారం జరిగిన వైసీపీ సమావేశంలో ఈ విషయాన్ని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తేల్చేశారు.
వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసిది నూరు శాతం ఉరుకూటి మాత్రమే అని బాబాబు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్యల ఆశీస్సులతోనే ఉరుకూటి గెలుస్తారు అని ఫిట్టింగ్ పెట్టెశారు. అంతా కలసి భారీ మెజారిటీతో ఉరుకూటిని గెలిపించాలని మరోసారి జగన్ సీఎం కావాలంటే గాజువాక నుంచి ఉరుకూటి విజయం చాలా ముఖ్యమని వైవీ నొక్కి చెప్పారు.
ఉరుకూటి గాజువాక వైసీపీ అభ్యర్ధి అన్నది ఇపుడు స్పష్టం అయిపోయింది. వైసీపీలో వర్గ పోరుని సుబ్బారెడ్డి తీర్చిన మీదటనే ఈ ప్రకటన చేసి ఉంటారని అనుకుంటున్నారు. అధినాయకత్వం ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలకు సరైన హామీలు ఇచ్చిన తరువాతనే ఉరుకూటి ఎమ్మెల్యే అభ్యర్ధి అని వారి సమక్షంలోనే అనౌన్స్ చేయించారు అని అంటున్నారు.
వైసీపీ తేల్చేసింది కాబట్టి బాల్ ఇపుడు ముగ్గురు మాజీల కోర్టులోనే ఉంది. వారు హై కమాండ్ నచ్చచెప్పిన తీరుకు సంతృప్తి చెంది ఉరుకూటిని ఎమ్మెల్యేగా గెలిపించాల్సి ఉంది. ఈ ముగ్గురు మాజీలు కలిస్తే వైసీపీకి గాజువాకలో తిరుగు ఉండదు. వైసీపీ పెద్దలు అంతా ఆ దిశగా ఐక్యతా రాగాలని ఆలపించేలా చూశారు అని అంటున్నారు. ఇది ఎంతవరకూ ఫలిస్తుంది అన్నది రానున్న రోజులు తెలియచేస్తాయి.