నాన్ లోకల్ గంటా వద్దు… లోకల్స్ కే చాన్స్!

తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వలస పక్షి అని స్థానిక నేతలు విమర్శిస్తూంటారు. సొంత పార్టీ వారే ఆయనను అలా చూస్తారు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం…

తెలుగుదేశం సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వలస పక్షి అని స్థానిక నేతలు విమర్శిస్తూంటారు. సొంత పార్టీ వారే ఆయనను అలా చూస్తారు. ఎక్కడో ప్రకాశం జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చిన గంటా విశాఖ వాసుల చల్లని చూపులతో ఒకసారి ఎంపీగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2024లో మరోసారి గెలవాలని చూస్తున్నారు.

గంటా కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న కాలంలో రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత విభజన నేపధ్యంలో టీడీపీలో చేరి 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ల పాటు మంత్రిగా కంటిన్యూస్ గా పనిచేశారు ఇలా రెండు ప్రభుత్వాలలో ఏడేళ్ల పాటు మంత్రిగా పని చేసిన గంటా విశాఖకు ఒరగబెట్టింది ఏంటి అని ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు.

చట్టసభలలో ఏనాడైనా విశాఖ అభివృద్ధి గురించి కానీ సమస్యల మీద కానీ గంటా పెదవి విప్పారా అని ప్రశ్నిస్తున్నారు. గంటా కీలక పదవులు అనుభవిస్తూ తన స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారు కానీ విశాఖ ప్రగతి కోసం పాటు పడిన దాఖలాలు ఏ మాత్రం లేవని విశాఖ నవ నిర్మాణ సమితి అధ్యక్షుడు తోట రాజీవ్ గట్టిగానే తగులుకున్నారు.

గంటావి కుట్ర రాజకీయాలు అని ఆయన ఆక్షేపించారు. గంటా ఎపుడూ అధికార పార్టీలోనే ఉండాలని ఆరాటపడతారు అని ఈ సంగతి ఏపీ ప్రజలకు మొత్తం తెలుసు అని రాజీవ్ అంటున్నారు. గంటా వైసీపీలోకి వెళ్లడానికి మూడు రాజధానులకు అప్పట్లో జై కొట్టిన సంగతి ఎవరికి తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ స్టాండ్ కి భిన్నంగా గంటా నాడు మాట్లాడడం వెనక ఆయన సొంత రాజకీయమే ఉందని విమర్శించారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటాను ప్రజలు గెలిపిస్తే నాలుగేళ్ళ తొమ్మిది నెలల కాలంలో గంటా ఎన్నిసార్లు అసెంబ్లీకి వెళ్లారో చెప్పాలని రాజీవ్ నిలదీశారు. గంటా ఆయన అనుచరులు విశాఖలో పాల్పడిన భూ కబ్జాల మీద అధికార వైసీపీ తక్షణం చర్యలు చేపట్టాలని రాజీవ్ డిమాండ్ చేయడం విశేషం. గంటా మీద సిట్ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని ఆయన కోరారు.

విశాఖ గురించి ఏనాడూ నోరు మెదపని గంటా లాంటి నాన్ లోకల్స్ ని టికెట్లు ఇవ్వరాదని, ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు స్థానికులకే టికెట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గంటా ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వం భూ దందాలు అంటున్నారు. ఇపుడు ఆయన మీద చర్యలకు దిగాలని విశాఖ నవ నిర్మాణ సమితి కోరడంతో వైసీపీ ఆ దిశగా యాక్షన్ కి దిగుతుందా లేదా అన్నది చూడాలి.