సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. మరీ ముఖ్యంగా సౌత్ లో ఈ కల్చర్ చాలా ఎక్కువ. ఇప్పుడీ లిస్ట్ లోకి హీరో విజయ్ కూడా చేరాడు. కొత్త పార్టీ ప్రకటించాడు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెరదీశాడు. ఈ క్రమంలో విజయ్ తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఎంతగానో నచ్చింది.
ఒకప్పుడు హీరోలు రాజకీయాల్లోకి వస్తే సినిమాలు పక్కనపెట్టేసేవారు. ఎన్టీఆర్ అదే పని చేశారు. ఆ తర్వాత చిరంజీవి కూడా అలానే చేశారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలా చేయలేదు.
దాదాపు దశాబ్దం కిందటే జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్, ఓవైపు సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు రాజకీయాలు చేస్తున్నారు. అలా రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్, అటు సినిమాల్లో బ్లాక్ బస్టర్స్ కొట్టలేక, ఇటు రాజకీయాల్లో రాణించలేక రెంటికి చెడ్డ రేవడిగా మారారు.
ఈ తప్పు విజయ్ చేయడం లేదు. ఇలా రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించిన వెంటనే అలా తన సినిమా కెరీర్ పై కూడా విస్పష్ట ప్రకటన చేశాడు.
“నాకు సంబంధించినంత వరకు, రాజకీయాలు మరొక వృత్తి మాత్రమే కాదు. ఇది ఒక పవిత్రమైన ప్రజాకార్యం. కాబట్టి రాజకీయాలు నాకు అభిరుచి కాదు: ఇది నా ప్రగాఢ వాంఛ. అందులో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను. పార్టీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఇప్పటికే అంగీకరించిన సినిమాలు పూర్తి చేయబోతున్నాను. ఆ తర్వాత ప్రజల సేవ కోసం పూర్తిగా రాజకీయాల్లో నిమగ్నమై ఉంటాను.”
ఇలా తన సినీ కెరీర్ పై విస్పష్ట ప్రకటన చేశాడు విజయ్. ఇదే పని గతంలో పవన్ కల్యాణ్ చేసుంటే, రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేవాడు. కనీసం ఎమ్మెల్యేగానైనా గెలిచేవాడు. ఆ తప్పు విజయ్ చేయలేదు.
విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటూనే, పవన్ కల్యాణ్ వ్యవహారశైలిని దెప్పిపొడుస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా జనం.