Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ - తెరాస చోటెక్కడో చెప్పిన తెలంగాణ

ఎమ్బీయస్‌ - తెరాస చోటెక్కడో చెప్పిన తెలంగాణ

చాలాకాలం క్రితం తమిళనాడులో జరిగిందిది. పార్లమెంటు ఎన్నికలలో నిలబడిన డిఎంకె అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ హాస్యనటుడు ఎన్‌ ఎస్‌ కృష్ణన్‌ వచ్చారు. ప్రత్యర్థి ఒక పెద్ద డాక్టరు. పేదల పక్షపాతి అని, ఉచితంగా వైద్యం చేస్తారని పెద్ద పేరు. కృష్ణన్‌ తన ఉపన్యాసంలో డిఎంకె అభ్యర్థి గురించి చెప్పలేదు. అవతలి డాక్టరు గురించే చెప్పుకుపోయాడు. ఎంత మంచివాడు, ఆయన మన కాలంలో ఉండడం మనకు అదృష్టం... అంటూ. డిఎంకె కార్యకర్తలకు ఏమీ అంతుపట్ట లేదు. ఉపన్యాసం చివర్లో కృష్ణన్‌ ''అంత మంచాయన మనకు అందుబాటులో ఉండడం అత్యవసరం. ఆయన్ని ఢిల్లీ పంపించి వేస్తే మనం ఎంతో నష్టపోతాం. ఈ డిఎంకె అతనంటారా, ఎక్కడున్నా ఒకటే. అందువలన అతన్ని ఢిల్లీకి తోలేసి, డాక్టరు గారిని మన మధ్యే ఉంచేసుకుందాం.'' అన్నాడు. జనం చప్పట్లు కొట్టారు. ఎన్నికలలో డాక్టర్ని ఓడించి తమ మధ్యే ఉంచుకున్నారు!

తెలంగాణ ప్రజలు తెరాసను పార్లమెంటు ఎన్నికలలో ఓడించి, స్థానిక ఎన్నికలలో గెలిపించడానికి యిలాటి లాజిక్కే కారణమై ఉంటుందని తోస్తోంది. మోదీ ఆకర్షణ యింకా తగ్గలేదని, పార్లమెంటు ఎన్నికలు మోదీ కేంద్రంగా జరుగుతున్నాయని గ్రహించక కెసియార్‌ భంగపడ్డారు. ప్రజలు ముఖ్యమంత్రిగా ఎవరుండాలో, ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయించే విచక్షణ తమకు ఉందని ఒడిశా ఓటర్లు నిరూపించుకున్నారు. అలాగే మమతా బెనర్జీ బెంగాల్‌ విడిచి ప్రధాని అయిపోదామని కలలు కంటే అక్కరలేదు, యిక్కడే ఉండు అన్నారు. మాయావతికీ అదే సందేశం. రాబోయే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలలో యిప్పుడు గెలుచుకున్న ఎంపీల నిష్పత్తిలో ఎమ్మెల్యేలు ఉంటారని బిజెపి అనుకుంటే లాభం లేదు - మమతకు దీటైన స్థానిక నాయకుణ్ని చూపిస్తే తప్ప! ఇది గ్రహించని కెసియార్‌ కాంగ్రెసు, బిజెపి రెండూ చతికిల పడతాయని, ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రముఖ స్థానంలో ఉంటుందని, దానికి తను సారథ్యం వహించవచ్చని కలలు కన్నారు.

తీరాచూస్తే పార్లమెంటు ఎన్నికలలో కెసియార్‌కు చావు దెబ్బ తగిలింది. సారు-కారు-పదహారు-సర్కారు నినాదం బేకారైంది, తెరాస నాయకత్వం బేజారైంది. కెసియార్‌ కూతురు ఓడిపోయింది. పార్టీకి కొత్తగా వర్కింగ్‌ ప్రెసిడెంటుగా నియమితుడైన కుమారుడు విఫలమయ్యాడు. కొడుకుని ముఖ్యమంత్రిగా పట్టాభిషుక్తుణ్ని చేసి తన స్వయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పేద్దామనుకుంటే మీకా శ్రమ అక్కరలేదన్నారు. అందువలన మనకు ప్రస్తుతానికి కెసియారే ముఖ్యమంత్రి. 17 సీట్లలో ఒకటి మజ్లిస్‌కు ఎలాగూ పోతుంది, తక్కిన పదహారూ మావే అని అహంకరించిన తెరాస కాంగ్రెసు మళ్లీ జీవం పోసుకోవడంతో, బిజెపి తనకు ప్రత్యర్థిగా అవతరించడంతో బిత్తర పోతోంది. గోడ దూకిన కాంగ్రెసు నాయకులు మళ్లీ గోడెక్కి పిల్లుల్లా చూశారు, దూకాలా వద్దా అని. స్థానిక ఎన్నికల ఫలితాలు చూశాక ధైర్యం వచ్చి దూకేశారు.

అసెంబ్లీ ఎన్నికలలో 119కి 88 సీట్లు సాధించి అఖండ విజయం సాధించడంతో కెసియార్‌ తనకు ఎదురు లేదనుకున్నారు. తన విజయంలో చంద్రబాబు పాత్రను విస్మరించారు. బెంగాల్‌ కానీయండి, యుపి కానీయండి, మహారాష్ట్ర కానీయండి - బాబు ఎక్కడికి వెళ్లి ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపారో అక్కడ వాళ్లంతా మటాష్‌ అయ్యారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసుతో చేతులు కలిపారు. దెబ్బకి కాంగ్రెసు కుదేలైంది. (పార్లమెంటు నాటికి బాబును వదుల్చుకుని ఒంటరిగా 3 సీట్లు గెలిచి మీసాలు మెలేస్తోంది). బాబును బూచిగా చూపించి కెసియార్‌ ఎన్నికలలో లబ్ధి పొందారు తప్ప లేకపోతే తెరాసకు 70కి మించి సీట్లు వచ్చేవి కావని నా అంచనా. కానీ యీ 88 తన ప్రజ్ఞే అనుకున్నారు కెసియార్‌. అంతటితో తృప్తి పడకుండా యితర పార్టీ ఎమ్మేల్యేలను ఆరగించడం మొదలెట్టారు.

11 మంది కాంగ్రెసు ఎమ్మేల్యేలు, ఒక టిడిపి ఎమ్మెల్యే తన వెనక్కాల క్యూ కట్టడంతో తనేం చేసినా ఫర్వాలేదనే ధీమా వచ్చింది కెసియార్‌కు. ప్రజలకు జవాబు చెప్పుకోవలసిన పని లేదనుకున్నారు. ఫలితాలు వచ్చిన రెండు నెలల దాకా కాబినెట్‌ కూర్పే లేదు. తనుండగా వేరే ప్రజాప్రతినిథి అక్కర లేదనుకుంటూ అధికారగణంతో పరిపాలన సాగించారు. ఇదేమిటని ప్రతిపక్షం అడగకుండా అసెంబ్లీ కూడా సమావేశ పరచలేదు. ఏ సంప్రదింపులూ లేకుండా కెటియార్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంటు చేశారు. పార్టీ కార్యకర్తలకు సన్నిహితుడైన హరీశ్‌ రావుని పక్కన పడేశారు. తను కేంద్రమంత్రి అయిపోయి, కొడుకుని ముఖ్యమంత్రి చేస్తారనే మాట బయటకు వచ్చినా ఖండించలేదు. తప్పేముంది? అన్నట్లు వ్యవహరించారు. దానాదీనా 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో 16 ఖాయం అని లెక్కలు వేసేసుకున్నారు. తీరా 9 దగ్గర ఆగవలసి వచ్చింది. బిజెపికి 4, కాంగ్రెసుకు 3 వచ్చాయి. తెరాసకు 2014 కంటె 2 తగ్గాయి.

తెరాస అనేక రకాలుగా నష్టపోయింది. ఉత్తర తెలంగాణలో కంచుకోటలైన కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లలో కూడా ఎదురు దెబ్బలు తగిలాయి. దక్షిణ తెలంగాణలోని నల్లగొండలోనూ తగిలాయి. నగరంలో మల్కాజ్‌గిరిలో కాంగ్రెసు పక్షాన రేవంత రెడ్డి నెగ్గగా, సికింద్రాబాద్‌ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన బిజెపి కిషన్‌ రెడ్డి పార్లమెంటుకి ఎన్నికై కేంద్రమంత్రి కూడా అయిపోయారు. బిజెపికి సొంతంగా పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి తెరాస అవసరం లేదు. ప్రతిపక్షాలకు మనుగడే ప్రశ్నార్థకమై పోయింది కాబట్టి కెసియార్‌ సలహా సంప్రదింపులు అక్కరలేదు. తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో కూడా సగం సీట్లే సంపాదించుకోగలిగిన కెసియార్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఏమీ లేదని వాళ్లనుకుంటారు. ఇవన్నీ చాలనట్లు బిజెపి తెలంగాణపై గురి పెడుతుంది. ఈ ఫలితాలు యిచ్చిన ఉత్సాహంతో బిజెపి తన తెలంగాణ యూనిట్‌ను ఉత్తేజ పరిచి, కాంగ్రెసు స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి వనరులు సమకూరుస్తుంది.

తెరాసకు దక్కినవి - చేవెళ్ల, మెదక్‌, నాగర్‌ కర్నూల్‌, మెహబూబాబాద్‌, మహబూబ్‌ నగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, జహీరాబాద్‌, ఖమ్మం! 2014లో గెలిచిన వాటిలో 4 ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, భువనగిరి చేజారాయి. గతంలో వైసిపి గెలిచిన ఖమ్మం, కాంగ్రెసు గెలుచుకున్న నాగర్‌ కర్నూలు కొత్తగా వచ్చి చేరాయి. బిజెపి గతంలో గెలిచిన సికింద్రాబాదుతో పాటు తెరాస పోగొట్టుకున్న 4టిలో మూడు గెలుచుకుంది. కాంగ్రెసు విషయానికి వస్తే గతంలోని నల్గొండ నిలుపుకుంటూ 2014లో టిడిపి గెలిచిన మల్కాజ్‌గిరి, తెరాస గెలిచిన భువనగిరిలను గెలిచింది. నాగర్‌ కర్నూలు పోగొట్టుకుంది. జాతీయ సర్వేలు వీటిని అంచనా వేయలేక పోయాయి. చాలామటుకు తెరాసకు 12 నుంచి 16 వస్తాయన్నాయి. (ఇండియా టుడే మాత్రమే 10-12 అంది) దాంతో తెరాసలో అహంకారం, అలసత్వం వచ్చి చేరాయి.

కాబోయే కేంద్రమంత్రిగా కెసియార్‌ ఓటర్లకు పరిచయం చేసిన వినోద్‌ 90 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని కుమారుడు 62 వేల ఓట్ల  తేడాతో ఓడిపోయారు. కవిత ధర్మపురి అరవింద్‌ చేతిలో 71 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెరాస గెలిచిన స్థానాల్లో లక్షకు పైగా మెజారిటీ వచ్చిన స్థానాలు 5. వాటిలో 3 లక్షలకు పైబడి వచ్చిన స్థానాలు 2. పదివేల లోపు తేడాతో గెలిచినది 1. బిజెపి మెజారిటీలన్నీ 50 వేలకు పై బడినవే. కాంగ్రెసు గెలిచిన మెజారిటీలు మాత్రం 5 వేలు, 10 వేలు, 26 వేలు. కాంగ్రెసు వారికి ఓటేసినా గెలిపించినా వాళ్లు తెరాసలోకి దూకేస్తారనే భయం ఓటర్లకు ఉంది. బిజెపితో ఆ భయం లేదు. అందుకే సంస్థాగతంగా కాంగ్రెసు కంటె బలహీనంగా ఉన్నా బిజెపి పెర్‌ఫామెన్స్‌ బాగుంది.

బిజెపికి అసెంబ్లీ ఎన్నికలలో 7% వస్తే పార్లమెంటు ఎన్నికలకు పాటికి అది 19.5% అయింది. ఎందుకంటే కెసియార్‌ ముఖ్యమంత్రే కానీ ప్రధాని అభ్యర్థి కాదు. మోదీపై అభిమానంతో ఆ ఓట్లు పడ్డాయనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బిజెపికి ఆ శాతంలో ఓట్లు రావనుకోవాలి. స్థానిక ఎన్నికలు ఆ విషయాన్ని చాటి చెప్పాయి. మోదీ బలం, బిజెపి బలం కాదని అర్థమైతే ఎదగడానికి బిజెపి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల విజయంతో తెరాస ప్రమత్తమైనట్లే, పార్లమెంటు ఎన్నికల గెలుపుతో బిజెపి కూడా ఆద మరిస్తే ముప్పే.

తెరాస ఓటమికి కారణాల్లో నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడమొకటని చెపుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించారు. హరీశ్‌ను ప్రాధాన్యత తగ్గించడం చాలామందికి నచ్చలేదు. ఎందుకంటే మొదటి నుంచీ వాళ్లతో టచ్‌లో ఉన్నది అతనే. కెటియార్‌ అర్బన్‌ ఓటర్లను, మధ్యేమార్గ నాయకులను ఆకట్టుకోగలడు కానీ, గ్రాస్‌ రూట్‌ స్థాయి కార్యకర్తలు కంఫర్టబుల్‌గా ఫీలయ్యేది హరీశ్‌తోనే. ఎలాగైనా గెలిచేస్తామన్న ధీమాతో కాబోలు అభ్యర్థుల ఎంపిక సరిగ్గా జరగలేదు. కొత్తవారితో కూడా ప్రయోగాలు చేశారు. వారైనా మొదటి నుంచీ ఓటర్లతో సంపర్కం పెట్టుకున్నవారు కారు. ఇక అన్ని నియోజకవర్గాల్లోనూ సభలు కూడా జరపలేదు. కెసియార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 100 సభల్లో పాల్గొంటే యీసారి 17 వాటిల్లో మాత్రమే పాల్గొన్నారు. మాకు కాక యింకెవరికి వేస్తారు అనే అతివిశ్వాసమే దెబ్బ తీసింది.

పార్లమెంటు ఎన్నికలలో తెరాసకు శృంగభంగం కాగానే ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు జనాలు బుద్ధి చెప్పారు అని కొందరు వ్యాఖ్యానించారు. కెటియార్‌ ఫిరాయించిన వారి నియోజకవర్గాలలో తెరాసకు ఓట్లు బాగానే పడ్డాయన్నారు. సీట్లు తగ్గినా ఓట్ల శాతం 6% పెరిగిందని చెప్పుకున్నారు. ఉన్న విషయమేమిటంటే నగర పరిధిలోని సెగ్మెంట్లలో తెరాసకు ఓట్లు తగ్గాయి. ఫిరాయింపు రాజకీయాల పట్ల వారు కనబరచిన స్పందన గ్రామీణ ఓటర్లలో కానరాలేదన్నమాట. మొత్తంగా నగర యువత మోదీపై అభిమానంతో బిజెపి వైపు మొగ్గు చూపడంతోనే బిజెపికి మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. స్థానిక ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలు ముఖ్యం కాబట్టి తెరాస బ్రహ్మాండంగా గెలిచింది.

మొత్తంమీద చూస్తే తెలియవచ్చే నీతి ఏమిటంటే - ఎవర్ని ఎక్కడ ఉంచాలో ప్రజలకు తెలుసు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అది చేస్తాం, అది చేస్తాం అన్న కబుర్లే తప్ప యింకా ఏమీ చేయలేదు. అనేక బిల్లులు పెండింగులో ఉన్నాయి. అనేక ప్రాజెక్టులు అరకొరగా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి తను దిల్లీకి, తన స్థానంలో కొడుకుని కూర్చోబెట్టేద్దామని కెసియార్‌ తొందర పడితే, అదేం కుదరదని ప్రజలు చెప్పారు. ఇక్కడుండి చేయగలిగినంత చేయి, తర్వాత తక్కినవి చూద్దాం అన్నారు. 'దిల్లీ దూర్‌ ఆస్త్‌' అనుకుని ఉస్సురన్నారు కెసియార్‌. స్థానిక ఎన్నికల ఫలితాలు చూసి గర్విస్తే మళ్లీ యింకో హెచ్చరిక చేయగల సమర్థుడే ఓటరు. అది ఆయన గ్రహించాలి. చైనా కబుర్లు మాని పాలనపై శ్రద్ధ పెడితే అదే పదివేలు.

మొన్న ఇంటర్‌ ఫలితాలు చూస్తే పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా వుందో కళ్లకు కట్టినట్లు తెలిసింది. గతంలో మాన్యువల్‌గా చేసినపుడు యిలాటి యిబ్బందులు రాలేదు. ఈసారి విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడినందుకు సిగ్గుపడాలి. చైనాలో అయితే సంబంధిత అధికారులను, మంత్రులను ఉరి తీసేవారేమో! మాకు కావలసినది చైనా గణాంకాలు కాదు, ఓ మాదిరి పాలన. అది కూడా అందివ్వకపోతే ఎలా సామీ?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?