Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: ఉషాపతికీ పతి ఉన్నాడు

వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి అవుతున్నారు. గతంలోనూ తెలుగువాళ్లు ఆ పదవిలో ఉన్నారు. వారు సంతోషంగానే ఆ పదవి చేపట్టారు. కానీ వెంకయ్య తన అభీష్టానికి వ్యతిరేకంగా అక్కడికి వెళుతున్నారు. మామూలు ఎన్నిక అయితే సరిగ్గా ప్రచారం చేసుకోక ఓడిపోవచ్చు. ఇక్కడ అదేం కుదరదు. పార్టీల వారీగా ఓట్లు పడి తీరతాయి, నెగ్గి తీరతారు. అఫ్‌కోర్స్‌, వెళ్లిన తర్వాత ఆయన తన ప్రాస ప్రసంగాలతో ఎలాగూ అదరగొడతాడనుకోండి.

కోవింద్‌ లాయరే అయినా ఆయన వాక్పటిమ సంగతి మనకు పెద్దగా తెలియదు. వెంకయ్య ఆయనకంటె ఎక్కువగా వెలగవచ్చు. ఉపరాష్ట్రపతులకు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. అలా అయితేగియితే వెంకయ్య దేశ ప్రథమపౌరుడు కావచ్చు. ఇన్ని అవకాశాలున్నా వెంకయ్య కాదు పొమ్మన్నారెందుకు? 'ఉషాపతినే తప్ప ఉపరాష్ట్రపతిని కాను' అని పొయెటిక్‌గా తిరస్కరించేరెందుకు? 

దానికి సమాధానం ఆయనే చెప్పాడు. క్రియాశీలక రాజకీయాల్లోంచి తప్పుకోవాలని లేదు, 2019లో మోదీని మరోసారి గెలిపించి అప్పుడు రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుని సామాజిక సేవలోకి వెళదామనుకున్నాను అని. సమాజసేవ దేముంది? ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడూ చేస్తున్నాననీ చెప్పుకోవచ్చు. నానాజీ దేశ్‌ముఖ్‌ 60 ఏళ్లు వచ్చినవాళ్లందరూ రాజకీయాల్లోంచి రిటైరై ప్రజాసేవకి అంకితం కావాలన్నారు. బిజెపివాళ్లే ఆ మాటలు పట్టించుకోలేదు. వెంకయ్య 70వ పడిలో పడ్డారు. 2019లో మాత్రం రిటైరవుతారన్న నమ్మకం ఏముంది? ఏదో సాధ్యమైనన్ని రోజులు రాజకీయాల్లోనే వుందామని వెంకయ్య ప్లాను.

రాజకీయాల్లో వుంటేనే ప్రయోజనాలు. వ్యాపారపరంగా కానీ, పలుకుబడి పరంగా కానీ ఎదగవచ్చు. ఉపరాష్ట్రపతి అంటే పక్కకు వెళ్లిపోయినట్లే. మర్యాదలకు లోటుండదు కానీ వ్యక్తిగతమైన పనులు జరగవు. అందుకే ఆయన ఉషాపతిగానే వుంటానన్నాడు. అయితే ఆయనకీ ఓ పతి వున్నాడు. ఆ మాటకొస్తే దేశంలో అందరికీ మోదీయే పతిగా, భాగ్యవిధాతగా మారాడు. అతననుకుంటే ఓడ బండి అవుతుంది, బండి ఓడ అవుతుంది. అతని మాట కాదంటే కొంప కొల్లేరవుతుంది. అందువలన గత్యంతరం లేక, బహిరంగంగా వ్యతిరేకత చాటుకున్నా ప్రయోజనం లేక, వెంకయ్య నామినేషన్‌ పడేశారు. 

వెంకయ్య అంత మొరాయించినా మోదీకి ఆయనకీ బలవంతపు పెళ్లి ఎందుకు చేస్తున్నట్లు? ఆన్సర్‌ సింపుల్‌. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగాలని వెంకయ్య ఎంత అనుకున్నారో, కొనసాగనీయకూడదని మోదీ అంత దృఢంగానూ అనుకున్నారు. దీనితో బిజెపికి జాతీయ అధ్యక్షుడిగా చేసిన వారందరినీ కట్టడి చేసినట్లయింది. భీష్మాచార్యుడు ఆడ్వాణీని  అష్టదిగ్బంధం చేసి మూల కూర్చోబెట్టారు. మురళీ మనోహర్‌ జోషి ఊసే మరిచారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ మంత్రులుగా గుట్టుగా కాలక్షేపం చేస్తున్నారు.

వారి సొంత రాష్ట్రాలలో వాళ్లకు ప్రత్యామ్నాయాలను తయారుచేయడం అయిపోయింది. వెంకయ్య అధ్యక్షుడిగా వుండగా  కొన్ని రాష్ట్రాలలో అనుచరులనో, సన్నిహితులనో తయారు చేసుకుని వుంటారు. ఇకపై వారితో సంబంధాలు తగ్గిపోతాయి. నిజానికి వెంకయ్య ఒకప్పుడు ఆడ్వాణీకి అనుచరుడు. మోదీ రంగంపైకి వచ్చాక అటు మొగ్గారు. సందర్భం వున్నా లేకపోయినా మోదీని ఆకాశానికి ఎత్తేస్తూ వచ్చారు. అయినా మోదీ వెంకయ్యను పెద్దగా విశ్వసించలేదని, కాస్త దూరంగానే పెడుతూ వచ్చారని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు చేతల్లో చూపించారు. ఇలాటి సందర్భాలను కికింగ్‌ అప్‌స్టయిర్స్‌ అంటారు. ఎమ్మెల్యేగా వుండి చికాకు పెడుతున్న సొంత పార్టీ సహచరుడికి రాజ్యసభ సీటిచ్చి దిల్లీ పంపేసినపుడు వాడుతూంటారు. ఇదీ అలాటిదే. నమస్కారాలకు, గౌరవాలకు లోటుండదు. కానీ రాజకీయంగా మంచో, చెడో ఏదైనా ప్లాను చేయాలంటే కుదరదు. ఆటలోంచి నుంచి తప్పుకుని రిఫరీగా మారిపోయినవాడు మళ్లీ ఆటలోకి వస్తానంటే రానిస్తారా? 

తనకు ఏ విధంగానూ అడ్డు తగలకుండా, తన కిచ్చిన మంత్రిత్వశాఖను ఏ లోటూ లేకుండా నిర్వహిస్తూన్న వెంకయ్యను మోదీ అర్జంటుగా తప్పించడం దేనికి? అటువంటి ప్రతిభావంతుడైన వక్తను 2019 పార్లమెంటు ఎన్నికలలో పూర్తిగా వాడుకోవచ్చు కదా! కనీసం దక్షిణాది రాష్ట్రాల బిజెపి నాయకులందరికీ వెంకయ్య పరిచితుడు. వారందరి గురించీ ఆయనకు తెలుసు. బిజెపి దక్షిణాదిన విస్తరించవలసిన అవసరం ఎంతో వుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వెంకయ్య స్థాయి వున్న దక్షిణాది బిజెపి నాయకుడు లేడు.

2019 ఎన్నికలలోపున తయారయ్యే అవకాశమూ లేదు. మరి వెంకయ్యను ఎందుకు వదులుకున్నట్లు? నా అనుమానం, అనుమానం మాత్రమే సుమా, చంద్రబాబు నాయుడుతో వెంకయ్య నాయుడు సాన్నిహిత్యమే కొంప ముంచిందని! నిజానికి వెంకయ్య ఆంధ్ర రాష్ట్రానికి చాలా తరచుగా వస్తున్నారు. వచ్చినప్పుడల్లా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడమే పని. టిడిపి, బిజెపికి మిత్రపక్షమే కానీ తక్కిన మిత్రపక్ష నాయకులెవరినీ బిజెపి నాయకులు యిలా ఆకాశానికి ఎత్తివేయడం లేదు.

వెంకయ్య కూడా ఉద్ధవ్‌ ఠాక్రేనో, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌నో, మెహబూబా ముఫ్తీనో యీ లెవెల్లో మురిపిస్తున్నారా? లేదే! చంద్రబాబుతో ఆయనకున్న వ్యక్తిగత స్నేహమే ఆయన చేత యిలా మాట్లాడించింది. అది స్నేహం మాత్రమే కాదు, వ్యాపారబంధం కూడా అంటారు కొందరు. కావచ్చు, కాకపోవచ్చు కానీ ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు ఆంధ్ర ప్రజల్ని ఊహల ఉయ్యాలలో ఊగించాలనుకున్నపుడు ఆ ఉయ్యాలకు రంగురంగు బెలూన్లు కడుతున్నది యీయనే. ఇదిగో విజయవాడ మెట్రో వెళ్లే దారి, ఇదిగో అమరావతిలో కట్టే ఐఫిల్‌ టవర్‌ నీడ పడే చోటు అంటూ మ్యాప్‌లు పట్టుకుని చూపించి అందర్నీ మురిపించింది యీయనే. దాని వలన అక్కడ రియల్‌ ఎస్టేటు రేట్లు పెరిగి వాళ్లందరూ సంతోషించారేమో కానీ వాటిని నమ్మి ఆశాభంగం పొందినవారికి ఏమీ దక్కలేదు. 

ఇదంతా ఆంధ్ర మీద వెంకయ్య ప్రేమే అంటే నమ్మటం కష్టం. గత ఎన్‌డిఏ ప్రభుత్వంలో కూడా బాబు భాగస్వామి. వెంకయ్య కేంద్రమంత్రి. అప్పుడింత హంగామా చేయలేదే! ఇంత దోస్తీ లేదే! ఇప్పుడు మాత్రమే ఆంధ్రరక్షకుడి అవతారం ఎత్తారు. ఆయన ఉపరాష్ట్రపతి అయితే ఆంధ్రకు పెద్ద దెబ్బ, కేంద్రంతో లయజన్‌ చేసే మన మనిషంటూ లేకుండా పోతారు అంటూ బాబు అనుకూల మీడియా వార్తలు వడ్డించింది. ఇప్పుడు వెంకయ్య అటు వెళ్లిపోయారు కాబట్టి, ఆంధ్ర సర్వనాశనం అయిపోతుందా? అనే ఆ ప్రశ్నకు ఆ మీడియానే సమాధానం చెప్పాలి.

వెంకయ్య అనగానే ప్రత్యేక హోదా గుర్తుకు వచ్చి తీరుతుంది. విభజన బిల్లుపై లోకసభ చర్చ తలుపుచాటు వ్యవహారంగా జరిగింది కాబట్టి ఎవరేం మాట్లాడారో తెలియలేదు. రాజ్యసభ చర్చ మాత్రం అందరూ చూశాం. వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా గురించి ఎంత ధాటీగా ఊదరగొట్టారో చూసి అదిరిపోయాం. ఎన్నికల ప్రచారసభల్లో ఐదేమిటి, పదేళ్లు హోదా యిస్తాం అన్నపుడు ఔనుస్మీ అనుకున్నాం. ఆ తర్వాత అంతా తూచ్‌ అన్నపుడు విస్తుపోయాం. అన్నిటికంటె పెద్ద అన్యాయం, ప్రత్యేకహోదా ఒట్టి ఆజాగళస్తనం అనడం! ఒక్క మనిషికి యిన్ని నాలుకలా! హోదాకి మించి ప్యాకేజీ యిచ్చామన్న బుకాయింపు వేరే.

తక్కిన రాష్ట్రాలకు యిచ్చినదాని కంటె ఎక్కువగా ఏమిచ్చారో చెప్పమంటే, సూటి జవాబు రాదు. విభజన బిల్లులో చెప్పినవి కూడా యివ్వలేదు కదా అని గుర్తు చేస్తే ఏదో మాటల గారడీ చేస్తారు. అంత్యప్రాసల కవిత్వం చెప్తారు. బాబు హయాంలో ఆంధ్ర వెలిగిపోతోంది అని బాకా వూదడమే ఆయనకు ముఖ్య కార్యకలాపం అయిపోయింది. 

ఆంధ్ర బిజెపి నాయకులకు అదే బెంగ - యిలా అయితే పార్టీ స్వతంత్రంగా ఎప్పటికి ఎదిగేను అని. వెంకయ్య పంథాలో నడిస్తే బిజెపి టిడిపికి తోకగా వుండడమే తప్ప ఎప్పటికీ పైకి రాదని వాళ్లకు తెలుసు. పైగా బాబు ఆ తోకను హఠాత్తుగా విదిల్చేసుకుంటే తమ గతి ఏమవుతుందోనన్న చింత కూడా వుంది. బాబు నమ్మకమైన భాగస్వామి కాదు. థర్డ్‌ ఫ్రంట్‌, బిజెపిల మధ్య వూగిసలాడుతూ వుంటారు. ఒకసారి కమ్యూనిస్టులు సహజమిత్రులంటారు, మరోసారి బిజెపి ఆత్మీయమిత్రులంటారు. ఆంధ్ర బిజెపిలో రెండు చీలికలున్నాయి. వెంకయ్య తరహాలో టిడిపి అనుకూల వర్గమొకటి, టిడిపి వ్యతిరేక వర్గం యింకొకటి.

టిడిపి వ్యతిరేక వర్గం మొత్తుకోళ్లను అమిత్‌ సీరియస్‌గా పట్టించుకున్నారేమో తెలియదు. బాబుతో వెంకయ్య సాన్నిహిత్యం కారణంగా తెలంగాణ బిజెపి నాయకులు కూడా ఆయనను నమ్మడం మానేసి చాలాకాలమైంది. 2014 ఎన్నికలలో తెలంగాణలో బిజెపి విడిగా పోటీ చేయాలని వారందరూ అధిష్టానంతో పోట్లాడారు. కానీ బాబు, వెంకయ్యలకు కేంద్రనాయకులతో వున్న పలుకుబడి కారణంగా వారి మాట చెల్లలేదు. తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం టిడిపిని ఉద్యమకారులు 'తెలంగాణ ద్రోహుల పార్టీ'గా, 'ఆంధ్రుల పార్టీ'గా ముద్ర కొట్టారు.

దానితో అంటకాగిన బిజెపిని తెలంగాణ ఓటర్లు ఎక్కువగా వున్న నియోజకవర్గాలలో  ఓడించారు. నగరంలో ఆంధ్రమూలాలు వున్న నియోజకవర్గాలలోనే బిజెపి నెగ్గింది - వారికి టిడిపిపై వున్న నమ్మకం కారణంగా! తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసియార్‌ టిడిపిని తుడిచిపెట్టేయడం మొదలుపెట్టాక, రేవంత్‌ రెడ్డి కేసు తర్వాత టిడిపి అస్తిత్వానికే భంగం కలిగింది. తెలంగాణలో టిడిపి పట్ల విముఖత పెరుగుతున్న వాతావరణంలో పొద్దస్తమానం టిడిపి భజన చేసే వెంకయ్యను తెలంగాణ ప్రజలు ఎందరు గౌరవిస్తారు? తెలంగాణ బిజెపి నాయకులు ఎందుకు మన్నిస్తారు? వెంకయ్య పక్కకు తప్పుకోవడంతో వాళ్లంతా అమ్మయ్య అనుకుని వుంటారు.  

కర్ణాటకలో బిజెపికి ఎడ్యూరప్ప ఉన్నాడు. వెంకయ్యతో పని లేదు. ఇక తమిళనాడుకి వస్తే - ఆంధ్రకు ఏదో చేసేశానని వెంకయ్య చెప్పుకునే మాటలు ఆంధ్ర ప్రజలు నమ్మరు కానీ తమిళులు నమ్మవచ్చు. అందువలన ఆంధ్ర పక్షపాతి వెంకయ్య తమకెందుకు అని తమిళ బిజెపి నాయకులు అనుకోవచ్చు. పైగా తమిళనాడులో విస్తరణకు రజనీకాంత్‌నో, ఎడిఎంకె చీలిక వర్గాన్నో  బిజెపి నమ్ముకుంటోంది.  క కేరళ విషయానికి వస్తే అక్కడ పోరాడడానికి బిజెపి హిందూ సేనలను ఉపయోగించుకుంటోంది. అక్కడ వెంకయ్య అవసరం లేదు.

ఈ విధంగా లెక్కలు వేసి చూస్తే 2019లో వెంకయ్య ప్రభావం ఆంధ్రలో తప్ప వేరే ఎక్కడా పనికి వచ్చేట్లు కనబడదు. ఆంధ్రలో కూడా టిడిపితో జత్తు కొనసాగించే పక్షంలోనే పనికి వస్తుంది. ఇద్దరూ ప్రతిక్షకులుగా తలపడితే బాబును నిందిస్తూ మాట్లాడడం వెంకయ్యకు నప్పదు. వెంకయ్యను తప్పించి ఆంధ్రలో బిజెపిని సొంతంగా ఎదగనిచ్చే ఆలోచనలో మోదీ, అమిత్‌లు వున్నారా అనేది కొద్ది నెలల్లో తెలిసిపోతుంది. వెంకయ్య యాక్టివ్‌ పాలిటిక్స్‌ నుంచి తప్పుకోవడం వలన ఆంధ్రకు జరిగే నష్టం ఉంటుందనుకోను. ఆయన ఆంధ్రకు బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా వున్నారని అనుకూల మీడియా రాసినా, వాస్తవానికి ఆయన బాబుకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మాత్రమే పనిచేశారు. ఒకప్పుడు ఆయన ఉపన్యాసాలు ఉత్తేజకరంగా వుండేవి. పోనుపోను క్షేత్రస్థాయిలో ఫలితాలు కనబడక పోవడంతో అవి ఉత్త గ్యాస్‌గానే, కాలక్షేపం కబుర్లుగానే మిగిలాయి. 

ఉపరాష్ట్రపతి అంటే హుందాతనం మేన్‌టేన్‌ చేయాలి. అందువలన యీ చెక్కభజనల నస తగ్గుతుంది. ఆయన ఉపన్యాసాల్లో పాతకాలపు అందం తిరిగి వస్తుంది.  మోదీ మెదడులో ఏ లెక్కలున్నాయో మనకు తెలియవు. బాబు అంశం లెక్కలోకి తీసుకోకపోయినా, దక్షిణాది నాయకుడికి ఛాన్సు యిచ్చానని చెప్పుకోవచ్చు. 'రాష్ట్రపతి ఉత్తరాది దళితుడు, ఉపరాష్ట్రపతి దక్షిణాది అగ్రవర్ణుడు. దక్షిణాదిపై మాకు చిన్నచూపు లేదు. ఉపప్రధాని వంటి పోస్టులు అడక్కుండా వుంటే ఉపరాష్ట్రపతి పోస్టు ఏం భాగ్యం? ధారాళంగా యిస్తాం' అనవచ్చు.  ఎనీవే, వెంకయ్యగారు ఉపరాష్ట్రపతి పదవికి తప్పకుండా వన్నె తెస్తారు. విషయపరిజ్ఞానం, వాక్చాతుర్యం వున్న వ్యక్తి. సమయానుకూలంగా, చమత్కారంగా మాట్లాడగలరు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తప్పకుండా రాణిస్తారు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌
-mbsprasad@gmail.com