Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పికెతో పనేముంది?

ఎమ్బీయస్‍: పికెతో పనేముంది?

లోకేశ్ ప్రశాంత కిశోర్‌ను వెంటబెట్టుకుని బాబు దగ్గరకి తీసుకుని వచ్చి మాట్లాడించడంపై చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటిలో యిది కూడా ఒకటి. పికె పాత సహచరుడు రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక టీము యిప్పటికే పని చేస్తూండగా పికెని తీసుకుని రావలసిన అవసరం ఏముందనేదే ఎవరికీ అర్థం కావటం లేదు. రాబిన్‌ను తీసేసి పికెను పెడతారా!? ఎన్నికలు జస్ట్ ఐదు నెలల్లో ఉండగా!? అబ్బే, కాకపోవచ్చు. బాబుతో జరిగిన సమావేశంలో రాబిన్ కూడా ఉన్నాడని, ‘నేను రాబిన్‌కు కావాలంటే సలహాలు యిస్తానంతే’ అని పికె అన్నాడని వార్తలు వచ్చాయి. రాబిన్ ఆంధ్రనే నమ్ముకుని క్షేత్రస్థాయిలో కొన్నేళ్లగా పని చేస్తూ, నిరంతరం సర్వేలు చేయిస్తూ ఉన్నాడు. పికె యీ పని వదిలేసి, జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి సమన్వయకర్తగా ఉందామని చూస్తున్నాడు. అతనికి ఆంధ్రపై ఫోకస్ లేదు. అలాటివాడు రాబిన్‌కు ఏం సూచనలు యివ్వగలడు? ఇచ్చినా వాటిని రాబిన్ శిరోధార్యంగా భావిస్తాడా?  

ఎందుకంటే పాలిటిక్స్ చాలా డైనమిక్‌గా ఉంటాయి. ఇటీవల కాలంలో ఆంధ్రలో బాబు అరెస్టు వంటి అనేక ఘటనలు జరిగాయి, వైసిపిలో సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రక్రియ ప్రారంభమైంది, వారిలో ఎందరికి తలుపులు తెరవాలో టిడిపి నిర్ణయించుకోవాలి, ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి, ఎన్నికలను ముందుకు జరుపుదామని కేంద్ర బిజెపి అనుకుంటోందన్న సమాచారంతో వ్యవధి తక్కువై మరీ తొడతొక్కిడి అయిపోతోంది. ఇలాటి కీలక సమయంలో వ్యూహకర్తను సాంతం మార్చేసే సాహసం టిడిపి చేస్తుందని నాకు నమ్మకం కుదరటం లేదు. ‘‘ఆంధ్ర రేవంత్‌గా లోకేశ్’’ అనే నా ఆర్టికల్‌లో నేను సూచించినట్లు లోకేశ్ యిమేజి మేకోవర్‌ అనే పరిమితమైన టాస్క్‌ కోసమే పికెను రప్పించారని నా ఊహ. నా ఊహను ఆమోదించేవారు, విభేదించేవారు వ్యాఖ్యలు రాయవచ్చు. కానీ కంటెంట్ గురించే రాయండి, నా గురించి కాదు.  

పికెను వ్యూహకర్తగా తెస్తున్నారనే వార్తలు రాగానే రకరకాల ప్రతిస్పందనలు వస్తున్నాయి. పికె ‘బాబు సీనియర్ నాయకుడు కాబట్టి కలిశాను’ అని చెప్పడం ఫక్తు రాజకీయ నాయకుడి స్టయిల్లో ఉంది. కలవాలంటే యిప్పుడే కలవాలా? అదీ అంత అట్టహాసంగా! బిజెపి ఎంపీ ప్రయివేటు విమానంలో లోకేశ్ వెంటబెట్టుకుని తీసుకుని వచ్చాడంటే యిదేమన్నా ఆషామాషీ చుట్టపుచూపా? ఏదో ముఖ్యమైన పని మీదే వచ్చి ఉంటాడు. అదేమిటో యింకా స్పష్టంగా తెలియదు. 2019లో జగన్‌కు సలహాదారుగా ఉన్న పికె యిప్పుడు టిడిపికి సలహాదారు అయ్యాడు కాబట్టి యిక టిడిపిదే విజయం అని కొందరు హడావుడి చేస్తున్నారు. పికెయే అనేక సార్లు చెప్పాడు – గెలిచేవారికి సాయపడగలం తప్ప, మేమే గెలిపించలేము అని. జగన్ గెలుపులో పికె సలహాలకు కూడా కొంత వాటా ఉంది అని మాత్రమే అనగలం.

కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎవరివైపు ఉంటే వారికే గెలుపు అనే తరహాలో పికె ఎటుంటే అటే గెలుపు అనే ఫార్ములా ఏమీ లేదు. యుపిలో కాంగ్రెసును గెలిపించ లేకపోయాడు కదా! ఎందుకంటే యితను చెప్పినమాట అవతలివాడు వినాలి కదా! ఇతని ఎసెస్‌మెంట్ నమ్మాలి కదా! తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో బాబు ఎంతమంది సలహాదారులను పెట్టుకుని ఉంటారు? ఇప్పుడైతే పొలిటికల్ స్ట్రాటజిస్టు అనే మాట వాడుతున్నారు కానీ కన్సల్టెంట్లు, సర్వేలు అనే పదాలు తెలుగునాట పరిచయం చేసిందే బాబు! అంత హైటెక్ పద్ధతులు అవలంబించినా, అనేక సార్లు ఓటమి చవి చూడవలసి వచ్చింది. సర్వేల మాట కొస్తే, యితర దేశాల మాట ఏమో కానీ, మన ప్రజలు మాత్రం గడుసువారు. వీడికి నిజం చెపితే నాకేమిటి లాభం? చెపితే ఏదైనా ముప్పొస్తే వీడొచ్చి తీరుస్తాడా? అని ఆలోచిస్తారు. ఇక సర్వే చేసేవాళ్లు చిత్తశుద్ధిగా చేస్తున్నారా లేదా అనేది మరో ప్రధానమైన అంశం. ఈ రోజుల్లో అంతా ఔట్‌సోర్సింగే కదా! డబ్బులు మిగులుతాయని స్థాయి లేనివారికి కూడా అప్పగించేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో మన పేర్లు, పుట్టిన తారీకులు తప్పుగా పడుతూండడానికి యిలాటివే కారణాలు! ఈ సర్వేయర్లు ‘ఎవడు చూడవచ్చాడులే’ అని యింట్లోనే కూర్చుని అంకెలు వండేయవచ్చు.

ఇంకొకటి మనం గుర్తించాలి. ఈ వ్యూహకర్తలందరూ పాలకుడు తీసుకున్న నిర్ణయాల పట్ల, జరిగిపోయిన సంఘటనల పట్ల ప్రజల స్పందన ఎలా ఉందో సర్వేల ద్వారా తెలుసుకుని చెప్పగలరు. అంటే రియాక్షన్‌ను మాత్రమే ఎసెస్ చేయగలరు. యాక్షన్ ఎలా ఉండాలో వారికి తెలియదు. అది తెలిస్తే వీళ్లే పాలకులు అయిపోయేవారు. ఒకలా చెప్పాలంటే వీళ్లు సినిమా సమీక్షకుల వంటి వారు. సినిమా అంతా అయిపోయాక ఫైనల్ ఔట్‌పుట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ లోపం జరిగిందో చెప్పగలరు. అలా అని సినిమా నిర్మాణంలోనే కథాచర్చల్లో వీళ్లను కూర్చోబెట్టినా సినిమా బాగా వస్తుందని గ్యారంటీ లేదు. చాలామంది జ్యోతిష్కులు అయిపోయిన సంఘటనలకు గ్రహప్రభావాల పరంగా విశ్లేషించ గలరు. ముందు జరగబోయేది సరిగ్గా చెప్పలేరు. రోగాన్ని డయాగ్నయిజ్ చేసి, చికిత్స చేయడం కష్టం, పోస్ట్‌మార్టమ్ సులభం.

ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలుగా అవతరించిన వాళ్లందరూ మార్కెటింగ్ స్ట్రాటజిస్టులే. టూత్‌పేస్టు, కొబ్బరినూనె వంటి ఉత్పాదనల గురించి తమ అభిప్రాయాన్ని చెప్పడానికి ప్రజలు తటపటాయించరు. కానీ రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి అభిమానాలుంటాయి, పైకి చెపితే యిబ్బందు లొస్తాయనే భయాలుంటాయి. చాలాసేపు వారితో కూర్చుని, నచ్చచెప్పి మాట్లాడిస్తే తప్ప మనసులో మాట చెప్పరు. ఇన్నేళ్లుగా రాజకీయాలు నడుస్తున్నాయంటే, పార్టీలకు పైనుంచి కింది దాకా ఓ నిర్మాణం ఉండేది, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులను పాలకులు సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. గత యిరవై పాతికేళ్లగా యీ పార్టీ నిర్మాణానికి మంగళం పాడేసి, అధిపతి నేరుగా ప్రజలతో సంపర్కం పెట్టుకుందామని చూస్తున్నాడు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి యీ స్ట్రాటజిస్టులను వినియోగిస్తున్నాడు. వీళ్ల మాట విన్నంతగా విధేయులైన పార్టీ సీనియర్ల మాట కూడా వినటం లేదు.

ఇది యీ వ్యూహకర్తల్లో అహంకారాన్ని పెంచింది. పాలన ఎలా ఉండాలో, ఎలాటి పథకాలు రూపొందించాలో, ఎవరికి టిక్కెట్టు యివ్వాలో కూడా చెప్పేస్తున్నారు. వీళ్లెవరూ ప్రజాక్షేత్రం నుంచి వచ్చినవారు కారు. ఉన్నత విద్యలభ్యసించి, టెక్నాలజీ ఆధారంగా లెక్కలు వేయగలిగినవారు, గ్రాఫ్‌లు గీయగలిగినవారు. ఆ పరిజ్ఞానంతో సలహాలివ్వడానికి పూనుకుంటారు. మేం ‘‘హాసం’’ నడిపే రోజుల్లో పత్రిక ఎలా నడపాలో మాకు రోజు కొకరు సలహాలు చెప్పేవారు. ‘మీరు ఏదైనా పత్రిక నడిపి సక్సెసయినా, ఫెయిలయినా సలహా చెప్పండి, వింటాను. ఏ అనుభవమూ లేకుండా ‘నేనే పత్రిక నడిపి ఉంటే..’ అని ఊహించుకుని మాత్రం చెప్పకండి.’ అని చెప్పేవాణ్ని. ‘అట్ట మీద ఆ సినిమా తార బొమ్మెందుకు? త్యాగరాజస్వామి బొమ్మేయండి’ అని సలహా యిచ్చేవాడికి ఆ సినిమా కవరు పేజీ కారణంగా అమ్మకాలు పది శాతం పెరుగుతాయనే మార్కెట్ రియాలిటీ తెలియదు.

‘మీరు సంచికకు పది మంది చొప్పున శాస్త్రీయ సంగీత కారుల ఫోటోలు ఆర్టు పేపరు మీద రంగుల్లో ముద్రించి అందించండి.’ అని సలహా యిచ్చేవారికి, దానికై ఎంత ఖర్చవుతుందో అంచనా ఉండదు. సినిమా తీసేవాళ్లకు యిలాటి సలహాలు ఎన్ని వస్తాయో ఊహించుకోండి. ‘ఐటమ్ సాంగ్ పెట్టకండి, హీరో చేత అంత భారీ ఫైటింగ్స్ చేయించకండి, వాస్తవానికి దగ్గరగా సినిమా కథ రాసుకోండి..’ యిలా ఎన్నయినా చెప్పవచ్చు. కానీ ప్రేక్షకులు ఎలాటి సినిమాలు చూస్తారో ఒకటి రెండు సినిమాలు తీసినవాడికే తెలుస్తుంది. మార్కెటింగు స్ట్రాటజిస్టును పెట్టుకున్నంత మాత్రాన వ్యాపారం అమోఘంగా వెలిగిపోతుందన్న గ్యారంటీ లేదు. వాళ్లని తీసుకుని వచ్చి హైలీ వోలటైల్, ఎవర్ డైనమిక్ పాలిటిక్స్‌లో అప్లయి చేద్దామని చూస్తే దానిలో సగం గ్యారంటీ కూడా లేదు.

గతంలో ప్రణయ్ రాయ్ కారణంగా సెఫాలజీ పేరు మనకు పరిచితమైంది. ఇక అప్పణ్నుంచి ఎన్నికల ప్రీ సర్వేలు, పోస్ట్ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్.. యిదో పెద్ద బిజినెస్ అయిపోయింది. వాటిలో కరక్టుగా చెప్పగలిగేవి 10శాతం అయితే, తప్పేవి 90శాతం. జ్యోతిష్యం విషయంలోనూ అంతే. అయినా జ్యోతిష్కుడి దగ్గరకు వెళుతూనే ఉంటాం. అలాగే సర్వేలు చేయించడం కూడా అలవాటు అయిపోయింది. సెఫాలజీ అనగానే ప్రణయ్ రాయ్ గుర్తుకు వచ్చినట్లు, ఎన్నికల వ్యూహకర్త అనగానే ప్రశాంత కిశోర్ అని గుర్తుకు వచ్చేట్లు అతను తనను తాను మార్కెట్ చేసుకున్నాడు. ఇతని కారణంగానే 2014లో మోదీ నెగ్గాడని అనుకుంటూ అంతకంటె మూర్ఖత్వం మరొకటి ఉండబోదు. ఎందుకంటే ఆ తర్వాత కూడా మోదీ, బిజెపి నెగ్గుతూనే ఉన్నారు. మంచి స్లోగన్స్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, టెక్నాలజీ వినియోగం వంటి నగిషీలు మాత్రమే వ్యూహకర్తలు చేయగలరు.

కానీ కొందరు విశ్లేషకులు వీళ్లే సర్వం చేయగలరు అనే అభిప్రాయంతో చెప్తూ ఉంటారు. తెలంగాణ ఎన్నికలకు ముందు టిడిపి అనుకూల పరిశీలకులు కొందరి వ్యాఖ్యానాలు చూశాను. తెలంగాణ కాంగ్రెసు వ్యూహకర్త సునీల్ కనుగోలును ఆకాశానికి ఎత్తేస్తూ, ఆ క్రమంలో పికెను తూర్పార పట్టేశారు. అతనికి ఎన్నో ఫెయిల్యూర్లు ఉన్నాయని, కానీ వాటిని దాచేస్తాడని, అదే సునీల్‌కైతే విజయాలే విజయాలనీ చెప్పారు. వారిచ్చిన ఉదాహరణలు రాహుల్ పాదయాత్ర, కర్ణాటక కాంగ్రెసు గెలుపు. పాదయాత్ర ఫలితం ఉత్తరాది అసెంబ్లీ ఎన్నికలలో తేలిపోయింది. తెలంగాణలో కాంగ్రెసు గెలిచింది కానీ కర్ణాటక స్థాయిలో గెలవలేదు. పికె-బాబు భేటీ తర్వాత పికె సామర్థ్యం గురించి వాళ్లేమంటున్నారో చూడలేదు.

ఆ మాటకొస్తే బిహారు బందిపోటు, ఆంధ్రను కులాల కురుక్షేత్రంగా మార్చినవాడు అంటూ పికెను తిట్టిన బాబు యిప్పుడతన్ని అక్కున చేర్చుకోలేదా? అని కొందరంటున్నారు. బాబు, కెసియార్ యిలాటి వాళ్లు ఎవర్నయినా ఆకాశానికి ఎత్తేయగలరు, పాతాళానికి పడేయగలరు. వాటేసుకోగలరు, పాతిపెట్టేయనూ గలరు. వాళ్లేం చేసినా ‘భేషుగ్గా ఉంది, అదే కరక్టు’ అని భజన చేసే బృందం ఉంది. రాజకీయ నాయకులకు ఎవరూ మిత్రులు కారు, శత్రువులు కారు. అందువలన గతాన్ని తవ్వి బాబుని నిలదీయాలనుకోవడం వ్యర్థం. నిజానికి చెప్పాలంటే పికె ప్రొఫెషనల్‌గా ఉన్నంతకాలం బాగానే చేశాడు, కానీ తనే పాలిటిక్స్‌లో దిగాలనుకోవడంతో దెబ్బ తింటున్నాడు. బిహార్‌లో సొంత ఉద్యమం ముందుకు సాగటంలేదు. మంత్రి, మంత్రిగానే ఉండాలి, రాజు రాజే. రోశయ్య విషయంలో యిది స్పష్టంగా తెలిసింది. ఆర్థికమంత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ముఖ్యమంత్రిగా పనికి రాలేదు.

పికె కాంగ్రెసులో చేరదామని తాపత్రయ పడడంతోనే అతని స్థాయి పడిపోయింది. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహరచనపై ఉత్సాహం చచ్చిందని చెప్పుకున్నాడు. అతను ఓడేవాళ్లను ఓడకుండా చూడలేడు. నెగ్గితే నాయకులకే క్రెడిట్ పోతోంది. అందుకని ఆ పనితో అతను విసిగిపోయాడు. కానీ వేరే పనిలో రాణించలేక పోతున్నాడు. ఐప్యాక్ నుంచి విడివడ్డాడు. తనే నాయకుడిగా ఎదుగుదామను కుంటున్నాడు. సొంత రాష్ట్రం బిహార్‌లో అంబ పలకకపోవడంతో కాంగ్రెసులో చేరదామనుకున్నాడు. ఆ పార్టీని క్షుణ్ణంగా స్టడీ చేసిన పికె దానిలో చేరదామని అనుకోవడం వలన అతనికి వివేకం నశించిందని అర్థమైంది. ఐప్యాక్‌లోని అతని శిష్యులకు ఆ పనిపై విసుగు పోలేదు కాబట్టి చాలామంది వేరే వేరే కుంపట్లు పెట్టుకుని, వివిధ పార్టీలకు పని చేస్తున్నారు. పికె మళ్లీ దీనిలోకి వస్తే పోటీదారులుగా మారతారు.

పికె టిడిపికి పని చేయడం ప్రారంభించగానే వైసిపికి పని చేస్తున్న ఐప్యాక్ టీము అతనికి తాము సేకరించిన సమాచారాన్ని అందచేసేస్తుందని కొందరన్నారు. పికె జగన్ కోవర్టు అని కొందరంటున్నారు. పికెను 2019లోనే పిండేశామని, మిగిలినది పిప్పే అని కొడాలి నాని అన్నారు. ఇవన్నీ గ్యాస్ కబుర్లే. ప్రొఫెషనల్స్ ఎథిక్స్ లేకుండా ఉంటారనుకోను. అలా అయితే పికె బిజెపి రహస్యాలు కాంగ్రెసుకు, తృణమూల్‌కు చెప్పేసేవాడుగా! యాడ్ కంపెనీ వాళ్లు రైవల్ కంపెనీలకు కాప్షన్లు యిస్తారు. గేయ రచయితలు యిరు పార్టీలకు పాటలు రాసి యిస్తారు. ఒకరికి రాసినది మరొకరికి చెప్పరు. ఉద్యోగస్తులు కూడా తమ కంపెనీ రహస్యాలు కాపాడతారు. అయినా ఐ ప్యాక్ సమాచారం సేకరించడానికి టిడిపికి యిప్పటికే కోవర్టులు ఉండుంటారు. రాబిన్ టీము సమాచారం లాగడానికి వైసిపి కోవర్టులూ ఉండి వుండవచ్చు. సినిమాలే లీకయిపోతున్నపుడు యిటువంటివి ఓ లెక్కా? దీనికోసం పికెను తెచ్చుకున్నా రనుకోవడం అర్థరహితం.

పికెను తెచ్చుకోవడం వలన టిడిపి ఎలాటి సంకేతం పంపిస్తోంది? ఒక పక్క వైసిపి అంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయా, ఎప్పుడు నెట్టి పారేద్దామాని చూస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంకో పక్క పొత్తులు పెట్టుకోకపోతే జగన్ మళ్లీ గెలవడం ఖాయం అంటూ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపితో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు. అది ఫలించకపోతే లెఫ్ట్‌ని కలుపుకుందామని చూస్తున్నారు. రాబిన్ శర్మ టీము యిప్పటికే పని చేస్తూ వ్యూహరచనలు చేస్తోంది. ఐదు రకాల సర్వేలు చేయిస్తున్నారట. ఇవన్నీ చాలనట్లు పికెను కూడా తీసుకుని వచ్చారంటే దాని అర్థం, గెలుపుపై యింకా నమ్మకం చిక్కలేదు అని ప్రజలు అనుకోరా?

ఇది తెలిసి కూడా ‘పికెను మా వైపు పెట్టుకున్నాం, యిక మీ పని ఆఖరు’ అని వైసిపి క్యాడర్ నైతిక స్థయిర్యం దెబ్బ తీయవచ్చు అనుకుని బహిరంగ ప్రదర్శన చేసి ఉంటారు. కలిసి మాట్లాడుకోవడానికే ఐతే రహస్యంగా దిల్లీలోనే మాట్లాడుకునేవారు. గత కొన్నేళ్లగా వైసిపి చేసిన ప్రతి పనికి పికెను బాధ్యుణ్ని చేసి టిడిపి నిందిస్తోంది. కోడి కత్తి అతని ఐడియానే, సమాజాన్ని కులపరంగా విడగొట్టడం అతని ఐడియానే (అప్పటిదాకా ఆంధ్రలో కులరాజకీయాలే లేనట్లు) తెలంగాణ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలును ఆకాశానికి ఎత్తేస్తూ పికెను తిట్టినపుడు మమతా కాలు విరగడం అతని ఐడియానే, తెరాస ఎంపీ కత్తిపోట్లు తినడం అతని ఐడియానే అంటూ టిడిపి అభిమాన పరిశీలకులు తిట్టిపోశారు. సడన్‌గా లోకేశ్ అతన్ని వాటేసుకోవడంతో యిప్పుడు ఏమనాలో తెలియక గుటకలు మింగుతున్నారు. పికె రావడంతో విజయం తథ్యం అనేస్తున్నారు.

యుద్ధంలో యిరు పక్షాల రాజులకూ మంత్రులుంటారు, జ్యోతిష్కులుంటారు, వ్యూహకర్తలుంటారు. అయినా ఇద్దరిలో ఎవరో ఒకరే గెలుస్తారు. ఫలానా వార్ని పెట్టుకుంటే విజయం తథ్యం అనే గ్యారంటీ ఉండదు. ఎన్నో విషయాలు సహకరించాలి. పికె రావడం వలన టిడిపి శ్రేణులు ఉత్సాహ పడ్డారో లేదో తెలియదు కానీ పవన్‌కు అలక వచ్చిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. కూటమి గెలుపు గురించే అతన్ని పిలిస్తే భాగస్వామి తనతో ఓ ముక్క చెప్పి ఉండాలని, ఆ సమావేశానికి తననూ పిలవాలని అనుకున్నారని ఆ వార్త సారాంశం. అందుకే నా అనుమానం - పికెను పిలిచింది కూటమి గెలుపు వ్యూహం కోసం కాదని, లోకేశ్‌ను ఎలివేట్ చేయడానికని! ఇది ఎలివేషన్ల కాలం. సలార్ సినిమా సక్సెసుకు ఎలివేషన్లే కారణమని చదివాను. అక్కడ ఉన్నది ప్రభాస్ కాబట్టి ఆ ఎలివేషన్లు నప్పాయని కూడా రాశారు. రాజకీయంగా లోకేశ్‌ను సినిమా ప్రభాస్ స్థాయికి తీసుకెళ్లడమే పికె పని కావచ్చు. మేస్త్రీ దొరికాడు కాబట్టి మెటీరియల్ క్వాలిటీ పెంచడానికి చూడవచ్చు.

ఆంధ్ర రేవంత్‌గా లోకేశ్‌ను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తూండవచ్చు అని ముందు వ్యాసంలో రాశాను.  దానికి గాను లోకేశ్ చాలా కసరత్తు చేయాలి. దూకుడు లక్షణం ఒక్కటే పుణికి పుచ్చుకుంటే చాలదు. రేవంత్‌కు గాడ్ ఫాదర్లు లేరు. ఢక్కామొక్కీలు తింటూ కింది నుంచి పైకి వచ్చాడు. పార్టీలు మారుతూ, అవకాశాలను సృష్టించుకుంటూ శ్రమపడ్డాడు. పార్టీ నిండా శత్రువులే, అందరితో సయోధ్య చేసుకుంటూ తంటాలు పడ్డాడు. ఏ సబ్జక్టుపైనైనా చాలా హోం వర్క్ చేసుకుని క్షుణ్ణంగా మాట్లాడతాడు. లోకేశ్ పై నుంచి దిగి వచ్చాడు. పార్టీలో పదవులు, అధికారం అనాయాసంగా వచ్చి ఒళ్లో పడ్డాయి. ఒకే ఒక్కసారి పోటీ చేస్తే ఓడిపోయాడు. ఇక సబ్జక్టు గురించి తక్కువ మాట్లాడతాడు. బాబు గారు అది చేశారు, యిది చేశారు అంటూ తండ్రి గొప్పలు చెప్తాడు. మేం మళ్లీ అధికారంలోకి వస్తే ఎవరెవర్ని ఎలా దండిస్తామో చెప్తాడు.

వీటితో అతని నాయకత్వ లక్షణాలపై ప్రజలకే కాదు, టిడిపి అభిమానులకు కూడా అనుమానాలు ఏర్పడ్డాయి. ‘‘ఆంధ్ర రేవంత్‌గా లోకేశ్‌?’’ అనే వ్యాసంలో లోకేశ్‌ను టిడిపి సిఎం కాండిడేట్‌గా చూపించవచ్చు అని రాస్తేనే పాఠకుల్లో టిడిపి అభిమానులు కంగారు పడిపోయారు. ఇది టిడిపిపై ద్వేషం కక్కడమే అని ఆరోపించారు. వైసిపికి మేలు చేసే ప్రయత్నమే అని ఊహించారు. టిడిపిలో బాబు తప్ప వేరెవరూ సిఎం అభ్యర్థుల లేరని వారి ప్రగాఢ విశ్వాసం. లోకేశ్‌ విద్యాధికుడు, మాజీ మంత్రి, యువకుడు, పార్టీకి జాతీయ కార్యదర్శి, నెంబర్ టూ స్థానంలో ఉన్నవాడు, తండ్రి జైలుపాలైనా, ఆసుపత్రి పాలైనా పార్టీ పగ్గాలు చేపట్టవలసినవాడు, పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలపై అవగాహన తెచ్చుకున్నవాడు, వైసిపికి భయాన్ని పరిచయం చేసిన సాహసి, దుష్టశిక్షణకై గ్రంథరచన చేసినవాడు.. యిలా ఎన్ని లక్షణాలున్నా టిడిపి అభిమానుల దృష్టిలో అతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపదగినవాడు కాదు. వెనక్కాల బాబు మెంటారింగ్ ఉంటుందని తెలిసినా అతని పేరు చెప్తే ప్రజలు ఓటేయరని వారి భయం.

ఈ పెర్‌సెప్షన్ మారాలని, దానంతట అది మారదని, మార్చడానికే పికెను తెచ్చుకోవాలని ఆలోచించే లోకేశ్ ఆయన్ను లాక్కుని వచ్చారని నా ఊహ. దిల్లీలో ఉండగానే పికెతో లోకేశ్ టచ్‌లోకి వచ్చారని వార్త వచ్చింది. కావచ్చు. బాబు ఆరెస్టయిన వేళ పార్టీలో బాలకృష్ణ, బ్రాహ్మణి హైలైట్ అవుతూంటే లోకేశ్ వారి ప్రాధాన్యతను తగ్గించడం, తల్లిని మాత్రమే జనంలోకి పంపడం యివన్నీ పికె సలహాల మేరకు కావచ్చు. మధ్యలో ఆగిపోయిన 3 లక్షల చెక్కుల పంపిణీ లోకేశ్ పూర్తి చేయవచ్చు. బాబు కంటె డిఫరెంట్, డైనమిక్ లీడరుగా ప్రొజెక్టు కావలసిన అవసరం లోకేశ్‌కు చాలా ఉంది. అతను మంగళగిరిలో గెలిచి తీరాలి. జగన్ అక్కడ పెద్ద ఛాలెంజ్‌ విసురుతున్నాడు.

ఒకప్పటి టిడిపి నాయకుడు, కులం రీత్యా బిసి, ఆర్కే చేతిలో 2014లో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన చిరంజీవిని లోకేశ్‌కు ప్రత్యర్థిగా జగన్ నిలబెడుతున్నాడు. అతని కోసం ఆత్మీయుడు, రెండు సార్లు నెగ్గిన ఆర్కేను పక్కన పెట్టేసి, రిస్కు తీసుకుంటున్నాడు. నెగ్గితే లోకేశ్ సిఎం అవుతాడు అంటే మంగళగిరి ఓటర్లలో వచ్చే ఊపు వేరు. అక్కడ మళ్లీ ఓడితే లోకేశ్ యిప్పట్లో తేరుకోలేడు. టిడిపి నెగ్గినా, పార్టీ సీనియర్లు లక్ష్యపెట్టడం మానేస్తారు. అక్కడ గెలవాలన్నా, వైసిపి అరెస్టులకు భయపడుతున్న టిడిపి క్యాడర్‌కు ఉత్సాహాన్ని రగిలించాలన్నా, లోకేశ్ దూకుడు స్వభావమున్న నాయకుడిగా, భావి ముఖ్యమంత్రిగా మేకోవర్ కావాలి. దానికే పికె వచ్చి ఉండవచ్చు.

ముఖ్యమంత్రి కావడానికి ముందు బాబు అస్సలు నవ్వేవారు కారు. ఒక కన్సల్టెన్సీ సంస్థ వారు మీరు అప్పుడప్పుడు నవ్వుతూ కనబడాలి అంటూ ఆయన యిమేజిని సవరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పాదయాత్ర ముగింపు సభలో యిచ్చిన ఉపన్యాసంలో లోకేశ్ హావభావాల్లో కొంత మార్పు వచ్చినట్లు అనిపించింది. మేకోవర్‌ యిప్పటికే ప్రారంభమైందేమో తెలియదు. ఏది ఏమైనా లోకేశ్ పటిష్టమైన నాయకుడిగా ఎదగడం మంచిది. రాష్ట్రంలో ఎంతమంది బలమైన నాయకులుంటే అంత మంచిది. ఒకే వ్యక్తి చుట్టూరా పార్టీలు తిరగడం మంచిది కాదు. ఎన్నికలకు వెళ్లబోయే ముందు మేకోవర్ పూర్తయి, బాబుకి నమ్మకం కలిగితే లోకేశ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపవచ్చు. అప్పటివరకు యీ ఊహాగానం కరక్టని కానీ, తప్పని కానీ చెప్పలేం. ఫైనల్‌గా చూపకపోతే ఊహాగానం తప్పు, యిలాటి ప్రయత్నమే జరగలేదు, పికెను ఊరికే పిచ్చాపా‘టీ’కి పిలిచారు అని వాదించే ఆస్కారం ఉంటుంది.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)  

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?