సరిహద్దుల్లో ప్రాణల్ని పణంగా పెట్టే సైనికుడి జీవితం అత్యంత దయనీయ స్థితుల్లో మగ్గుతోంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టతరమైన సరిహద్దుల్ని కలిగి వున్న భారతదేశం.. సైనికుల త్యాగాలతోనే 'భద్రం'గా వుందన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు, ఆ సైనికుడ్ని మనం ఎలా చూసుకోవాలా.? ఆ సైనికుడికి మన ప్రభుత్వాలు ఎంత భరోసా ఇవ్వాలి.?
ఓ సైనికుడు సరిహద్దుల్లో తాము పడ్తున్న కష్టాల గురించి చెబుతూ ఓ వీడియో విడుదల చేసేసరికి దేశమే ఉలిక్కిపడింది. సరిహద్దుల్లో శతృవుతో పోరాడటంలో పడే కష్టం కాదది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న తాము తినడానికి సరై తిండిలేని పరిస్థితుల్లో నిత్యం పహారా కాస్తున్న వైనాన్ని ఆ సైనికుడు చూపుతోంటే, దేశం నివ్వెరపోయింది. సైనికుడి సేవల్ని గొప్పగా గుర్తు చేసుకునే పాలకులు, సైనికుల సంక్షేమం కోసం ఏదేదో చేసేస్తున్నామని చెప్పుకునే పాలకులు.. సైన్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో తలచుకుంటే గగుర్పాటు కలగకమానదు.
దేశ రాజధానిలో ఆ మధ్య మాజీ సైనికులు తమ దయనీయ జీవితం గురించి ఆందోళన బాట పడితే, అప్పుడూ దేశం ఉలిక్కిపడింది. అప్పట్లో పాలకులు స్పందించీ, స్పందించనట్టు స్పందించారంతే. మరి, ఇప్పుడేమంటారు పాలకులు.? సైనిక విమానమొకటి గల్లంతయితే, ఆ కుటుంబాలు ఇప్పటికీ, తమవారి కోసం ఎదురుచూస్తూనే వున్నాయి. తమను పట్టించుకోవడంలేదని బాధిత కుటుంబాలు వాపోతోంటే, కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నమైనా ప్రభుత్వం చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
సైనికుడిగా పని చేయడం కూడా ఓ ఉద్యోగమే.. ఉద్యోగానికి జీతమిస్తున్నాం.. అని ప్రభుత్వాల తరఫున 'నాయకులు' వ్యాఖ్యానిస్తే, అంతకన్నా దారుణం ఇంకొకటుండదు.