8 పరుగులు 8 వికెట్లు.. ఇంగ్లాండ్‌ మటాష్‌

కేవలం 8 పరుగుల్లో 8 వికెట్లు కూలిపోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయిలో తమ ఇన్నింగ్స్‌ కుప్పకూలిపోతుందని ఇంగ్లాండ్‌ ఊహించి వుండదు. బెంగళూరులోని చెన్నస్వామి మైదానంలో టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో 8 పరుగులకే…

కేవలం 8 పరుగుల్లో 8 వికెట్లు కూలిపోవడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయిలో తమ ఇన్నింగ్స్‌ కుప్పకూలిపోతుందని ఇంగ్లాండ్‌ ఊహించి వుండదు. బెంగళూరులోని చెన్నస్వామి మైదానంలో టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో 8 పరుగులకే తొలి వికెట్‌ని కోల్పోయిన ఇంగ్లాండ్‌, ఆ తర్వాత కాస్సేపు నిలదొక్కుకున్నట్లే కనిపించింది. 55 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయాక కూడా ధాటిగానే కనిపించింది. ఎప్పుడైతే 119 పరుగుల వద్ద మూడో వికెట్‌ని ఇంగ్లాండ్‌ కోల్పోయిందో, ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇక కోలుకోలేదు. 

టపా టపా వికెట్లు పడిపోతూనే వున్నాయి. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లోకి రావడం, పెవిలియన్‌కి వెళ్ళడం. ఇదే తంతు. జస్ట్‌ 8 పరుగుల్లోనే చివరి 8 వికెట్లను ఇంగ్లాండ్‌ కోల్పోయింది. 127 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా 75 పరుగులతో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది చాహల్‌ అని చెప్పక తప్పదు. టీ20 మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు, ఆ పైన దక్కించుకోవడం చిన్న విషయం కాదు. కానీ, ఈ మ్యాచ్‌లో చాహల్‌ 6 వికెట్లు సాధించాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. ధోనీ, రైనా అర్థ సెంచరీలతో చెలరేగిపోగా, యువరాజ్‌సింగ్‌ 10 బంతుల్లోనే 23 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తమ్మీద, ఈ గెలుపుతో టీమిండియా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో సొంతం చేసుకుంది. 

విశేషమేంటంటే, ఇప్పటికే కోహ్లీ సారధ్యంలోని టీమిండియా ఇంగ్లాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌నీ, వన్డే సిరీస్‌నీ గెలుచుకోగా, ఇప్పుడు టీ20 సిరీస్‌నీ కైవసం చేసుకోవడం.