ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ క్రీడాకారులతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ( ACA ) ఆటలాడుతోందనే విమర్శలు వినిపి స్తున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉంది. ఈ కార్యాలయంలో డబ్బు వ్యవహారాలు చూసే శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ తేలిందని సమాచారం.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో 20 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇంత వరకూ సదరు కార్యాలయ సిబ్బందికి ఎలాంటి వైద్య పరీక్షలు చేయకపోవడంతో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే సదరు ఉద్యోగితో క్రికెట్ కోచ్లు పలుమార్లు కలిశారని, వారు పిల్లలకు శిక్షణ ఇచ్చే క్రమంలో రాసుకుపూసుకు తిరిగారంటున్నారు.
ప్రస్తుతం ACA తరపున రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అలాగే కోచ్లు క్రీడా క్యాంపుల్లో భాగంగా వివిధ జిల్లాలు తిరుగుతూ పలువురు క్రీడాకారులను కలుస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలు తెలిసి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలనే ఆలోచన చేయకపోవడం విమర్శలకు దారి తీసింది.
ఇప్పటికైనా ACA కార్యాలయ సిబ్బంది, కోచ్లు, క్రీడాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడాకారులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కరోనా పాజిటివ్ సమాచారంపై గోప్యత పాటిస్తూ, దాని వ్యాప్తికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.