అజారుద్దీన్.. భారత క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరిది. అజారుద్దీన్ నేతృత్వంలో ఒకప్పుడు టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఆ సమయంలో, టీమిండియాకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డులకెక్కాడు. కెప్టెన్ అనే విషయం పక్కన పెడితే, అజారుద్దీన్ టీమిండియా తరఫున బెస్ట్ 'ఫీల్డర్'. సౌతాఫ్రికా ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్ తర్వాత ఆ స్థాయిలో ఫీల్డింగ్ చేయగల ఆటగాడు భారత జట్టు తరఫున అజారుద్దీన్ మాత్రమే. ఇక, అజారుద్దీన్ బ్యాటింగ్ విషయానికొస్తే, అలాంటి 'మణికట్టు' మాయాజాలం చేసే బ్యాట్స్‌మెన్‌ని ఇప్పటిదాకా మనం చూడలేకపోయాం.!
ఇప్పటిదాకా అజారుద్దీన్ గొప్పతనం గురించి మాట్లాడుకున్నాం.. అంతటి గొప్ప ఆటగాడి మీద పెద్ద మరక పడింది. అదే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం. ఆ దెబ్బకి క్రికెట్ నుంచి తొలగింపబడ్డ అజారుద్దీన్, రాజకీయాల్లోకొచ్చాడు. అఫ్‌కోర్స్ ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయిందనుకోండి.. అది వేరే విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన అజారుద్దీన్ అంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది క్రికెట్ అభిమానులకి అదే అభిమానం వుంది.
అయితే, అజారుద్దీన్ ఆటగాడిగా, కెప్టెన్‌గా వ్యక్తిగత రికార్డులతోపాటు, టీమిండియాకి మంచి విజయాలు అందించాడనే పేరుంది తప్ప, క్రికెట్‌కి అతను చేసిందేమీ లేదు. ఇప్పుడు తీరిగ్గా అజారుద్దీన్, హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై (హెచ్‌సిఎ) కన్నేయడం అదర్నీ విస్మయానికి గురిచేస్తోంది. పైగా, హెచ్‌సిఎ అంటే హైద్రాబాద్ మాత్రమే కాదనీ, మొత్తం తెలంగాణ అనీ అజారుద్దీన్ మాట్లాడుతుండడం ఆశ్చర్యకరమే.
హెచ్‌సిఎ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ అయితే వేశాడు అజారుద్దీన్. కానీ, నిబంధనల ప్రకారం అజ్జూభాయ్ నామినేషన్ చెల్లే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే, రాజకీయాల్లో తనకున్న పలుకుబడి నేపథ్యంలో తిమ్మిని బమ్మిని చేయగలనని అజ్జూభాయ్ అనుకుంటున్నట్టున్నాడు. ఓ పక్క ఎమ్మెస్కే ప్రసాద్ అంచెలంచెలుగా ఎదిగి, చీఫ్ సెలక్టర్‌గా అవకాశం దక్కించుకోవడంతో, అజ్జూభాయ్ కాస్త లేటుగా, తిరిగి క్రికెట్‌లోకి (అడ్మినిస్ట్రేషన్ పరంగా) అడుగుపెట్టాలనుకోవడం ఆశ్చర్యకరమే.