ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మీద ఒకప్పుడు అనిల్ కుంబ్లే విరుచుకుపడ్డాడు. 'ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించింది..' అంటూ ఒకానొక సమయంలో టీమిండియా కెప్టెన్ హోదాలో, ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ సిరీస్ సందర్భంగా కుంబ్లే వ్యాఖ్యానించిన తీరు అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఆసక్తికరమైన విషయమేంటంటే, అప్పట్లో ఆసీస్ మీడియా – టీమిండియా కెప్టెన్ కుంబ్లేకి బాసటగా నిలిచింది.
క్రికెట్‌లో స్లెడ్జింగ్‌కి ఆస్ట్రేలియా పెట్టింది పేరు. అసలు క్రికెట్‌కి 'చీటింగ్'ని పరిచయం చేసింది కూడా ఆ జట్టే. ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టడమే కాదు, అవసరమైతే మైదానంలో 'అబద్ధాలు' ఆడేయడం కూడా ఆ జట్టుకి వెన్నతో పెట్టిన విద్య. బ్యాట్స్ మెన్ కొట్టిన బంతి, గాల్లోకి లేచినా, ఫీల్డర్ చేతిలోకి వెళ్ళేముందు లిప్తకాలంపాటు నేలను తాకినా అది 'ఔటే' అని చెప్పడం చీటింగ్ కాక మరేమిటి? అంత జ్ఞానం లేకుండా అంతర్జాతీయ క్రికెట్ ఆడేస్తున్నారని ఎలా అనుకోగలం? కానీ, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆ పని చేస్తారు. ఔట్ కాకపోయినా ఔట్ అని అంపైర్ మీద ఒత్తిడి తీసుకొచ్చేస్తారు.. అంపైర్ల మీద పెత్తనం చాలా ఎక్కువ ఆసీస్ క్రికెటర్లకి.
ఇక, ఇప్పుడు రివ్యూ సిస్టమ్‌ని కూడా భ్రష్టు పట్టించేసింది ఆస్ట్రేలియా ఇండియా టూర్ లో. రివ్యూ కోరే విషయంలో, ఫీల్డ్‌లోనుంచే డ్రెస్సింగ్ రూమ్ సలహాలు తీసుకోవడం ద్వారా కెమెరాకి అడ్డంగా దొరికేశారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఇదే విషయాన్ని కుంబ్లే ప్రస్తావించాడు. 'చీటింగ్'గా దీన్ని అభివర్ణించాడు. గత మూడు రోజులుగా ఆస్ట్రేలియా ఇదే పని చేస్తోందని కోహ్లీ రెండో టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం వ్యాఖ్యానించడం గమనార్హం.
బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో తక్కువ టార్గెట్‌ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా బొక్కబోర్లా పడింది. ఒక్కో వికెట్ పడ్తోంటే, టీమిండియా ఆటగాళ్ళలో సంబరాల కన్నా సంయమనమే ఎక్కువగా కన్పించింది. ఎక్కువగా కోహ్లీ నోటికి అడ్డంగా తన వేలుని పెట్టుకుని కన్పించాడు. అఫ్‌కోర్స్, అతనిలోని 'కసి' మాత్రమే అలాగే వుందనుకోండి.. అది వేరే విషయం. మ్యాచ్‌లో టీమిండియా గెలిచాక, కోహ్లీ కసితీరా ఎంజాయ్ చేశాడు. మ్యాచ్ అనంతరం, మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆసీస్ జట్టు 'చీటింగ్'పై ఘాటైన విమర్శలు చేసి కోహ్లీ వార్తల్లోకెక్కాడు.