పారితోషికాల్లో.. బీసీసీఐ మంచి నిర్ణ‌యం!

క్రికెట‌ర్ల‌కు ఇచ్చే మ్యాచ్ ఫీజుల విష‌యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి బీసీసీఐ మంచి నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ జ‌ట్టులోని పురుష క్రికెట‌ర్ల‌కు ఇచ్చే మ్యాచ్ ఫీజుల‌నే మ‌హిళా జ‌ట్టు ప్లేయ‌ర్ల‌కు కూడా ఇక…

క్రికెట‌ర్ల‌కు ఇచ్చే మ్యాచ్ ఫీజుల విష‌యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి బీసీసీఐ మంచి నిర్ణ‌యం తీసుకుంది. జాతీయ జ‌ట్టులోని పురుష క్రికెట‌ర్ల‌కు ఇచ్చే మ్యాచ్ ఫీజుల‌నే మ‌హిళా జ‌ట్టు ప్లేయ‌ర్ల‌కు కూడా ఇక నుంచి చెల్లించ‌బోతున్న‌ట్టుగా బీసీసీఐ ప్ర‌క‌టించింది. పురుషుల‌తో మ‌హిళ‌ల‌కు స‌మాన వేత‌న డిమాండ్ కు బీసీసీఐ త‌న వంతుగా న్యాయం చేసింది.

గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. క్రికెట్ అనే కాదు చాలా క్రీడ‌ల్లో స్త్రీల‌కు త‌క్కువ పారితోషికాలే ఉన్నాయి! ఆఖ‌రికి ప్ర‌పంచ‌మంతా వీక్షించే టెన్నిస్ లో కూడా ఈ ప‌ద్ధ‌తే ఉంది ఇప్ప‌టికీ! వింబుల్డ‌న్, యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియ‌న్ ఓపెన్.. ఇలా ఎక్క‌డ చూసినా.. పురుషుల టెన్నిస్ మ్యాచ్ విజేత‌ల‌కు ఇచ్చే ప్రైజ్ మ‌నీ క‌న్నా.. స్త్రీల‌కు ఇచ్చే మొత్తం త‌క్కువ‌! 

అదేమంటే.. పురుషుల మ్యాచ్ కు వీక్ష‌కులు ఉన్నంత స్థాయిలో, పురుషుల మ్యాచ్ కు గేట్ వ‌ద్ద వ‌సూలు అయ్యే మొత్తంతో పోలిస్తే స్త్రీల మ్యాచ్ ల‌కు వ‌చ్చే డ‌బ్బు త‌క్కువ‌! దీంతోనే స్త్రీల‌కు స్పోర్ట్స్ లో త‌క్కువ స్థాయి ప్రైజ్ మ‌నీలున్నాయి. భారీ ప్రైజ్ మ‌నీల‌కు పేరు ప‌డిన టెన్నిస్ లోనే ఈ ప‌రిస్థితి ఉంది. దీన్ని వివ‌క్ష అంటూ పోరాడేవారు ఎవ‌రూ లేరు!

ఇక ఇండియాలో విమెన్ క్రికెట్ కు ఉన్న ఆద‌ర‌ణ అంతంత మాత్ర‌మే! పురుషుల క్రికెట్ ను వంద మంది ప‌ట్టించుకుంటార‌నుకుంటే.. మ‌హిళా క్రికెట్ ను ప‌ది మంది కూడా స‌రిగా చూడ‌రు. అది కూడా ఏ ప్ర‌పంచ‌క‌ప్పో అయితే కాస్త వీక్ష‌కాద‌ర‌ణ ఉంటోంది. అది కూడా ఈ మ‌ధ్య కాలంలో మాత్ర‌మే! విమెన్ క్రికెట్ కు ఆద‌ర‌ణ పెంచ‌డానికి బీసీసీఐ ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయినా కూడా వ‌స్తున్న స్పంద‌న అంతంత మాత్ర‌మే!

దేన్నైనా డ‌బ్బుతోనే తూస్తుంద‌నే పేరుంది బీసీఐకి. ఇలాంటి నేప‌థ్యంలో.. కూడా మ‌హిళా క్రికెట‌ర్ల‌కు పురుషుల‌తో స‌మాన‌మైన మ్యాచ్ ఫీజుల‌కు రెడీ అయ్యింది. దీంతో.. ఇక నుంచి ఒక్కో టెస్ట్ మ్యాచ్ కూ ఫైన‌ల్ 11లోని మ‌హిళ‌లు 15 ల‌క్ష‌ల రూపాయ‌లు, అదే వ‌న్డేకు అయితే ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు, టీ20కు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున పొందుతారు.  ప్ర‌స్తుతం పురుష క్రికెట్ జ‌ట్టుకు ఈ స్థాయిలోనే బీసీసీఐ మ్యాచ్ ఫీజును చెల్లిస్తోంది. ఈ స్థాయిలోనే మ‌హిళ‌ల‌కు ఇవ్వ‌బోతోంది. అయితే వార్షిక కాంట్రాక్టుల్లో మాత్రం వ్య‌త్యాసం కొన‌సాగ‌బోతోంది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్టులో ప్ర‌థ‌మ స్థాయిలోని ఆట‌గాళ్లు ఏడాదికి ఏడు కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ పొందుతున్నారు. అదే మ‌హిళ‌ల కాంట్రాక్టుల్లో ప్ర‌థ‌మ స్థాయిలోని వారి ఫీజు కేవ‌లం యాభై ల‌క్ష‌ల రూపాయ‌ల స్థాయిలో ఉంది. విమెన్ క్రికెట్ నుంచి బీసీసీఐకి వచ్చే ఆదాయం పెద్ద‌గా లేదు. అయినా క‌నీసం మ‌హిళా జ‌ట్టు ప్లేయ‌ర్ల మ్యాచ్ ఫీజును అయినా పెంచారు. అభినంద‌నీయం.