నిషేధం ఎత్తేయకపోయినా… కోర్టుకెక్కను:శ్రీశాంత్

‘తీహార్ జైల్లో ఉన్నప్పుడు తీవ్రమైన నిరాశా నిస్పృహలో కూరుకుపోయాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నా’’ అంటూ గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ శ్రీశాంత్. అప్పట్లో తను నమ్మిన దేవుడు, తన కుటుంబం…

‘తీహార్ జైల్లో ఉన్నప్పుడు తీవ్రమైన నిరాశా నిస్పృహలో కూరుకుపోయాను. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని కూడా అనుకున్నా’’ అంటూ గుర్తు చేసుకున్నాడు మాజీ క్రికెటర్ శ్రీశాంత్. అప్పట్లో తను నమ్మిన దేవుడు, తన కుటుంబం మాత్రమే తనను కాపాడాయని అన్నాడు. ఇటీవలే తన మీద చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఆధారాల్లేవంటూ ఢిల్లీ కోర్టు కేసు కొట్టేసిన నేపధ్యంలో మళ్లీ క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టాలని తాను ఆశపడుతున్నట్టు చెప్పాడీ మళయాళీ. 

సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు తమను నిర్ధోషిగా గుర్తించిందని, దీని ఆధారంగా బిసిసిఐ తన మీద జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరనున్నట్టు చెప్పాడు. ఒకవేళ అలా జరగకపోయినా దీనిపై తాను కోర్టుకు ఎక్కే అవకాశం లేదని స్పష్టం చేశాడు. 

‘‘నేనెవర్నీ చాలెంజ్ చేయాలనుకోవడం లేదు. నాకెంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతూ ఉండాలనుకుంటున్నాను. అంతే’’అని శ్రీశాంత్ అనడం విశేషం. క్రికెట్ ఆడిన సమయంలో దుందుడుకు ప్రవర్తనకు సింబల్‌లా నిలిచిన ఈ అగ్రెసివ్ బౌలర్ గతానుభవాల నేపధ్యంలో తగినంత  పరిపక్వత సాధించినట్టే కనపడుతోంది. త్వరలో బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ను కలవాలనుకుంటున్నట్టు చెప్పిన శ్రీశాంత ఆశ ఫలించాలని కోరుకుందాం.

మాజీ క్రికెటర్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు కధ కంచికి చేరడంతో… అతని సినిమా  ట్రయల్స్ పరిస్థితి ఏమిటో…ఇక తేలాల్సి ఉంది.  టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాధ్‌తో చర్చలు జరపడానికి హైదరాబాద్ వచ్చి, త్వరలో తెలుగు సినిమా చేయబోతున్నానని కూడా ప్రకటించాడు శ్రీశాంత్. మారిన పరిస్థితుల్లో  సినిమా రంగం మీద దృష్టి పెడతాడో, లేక జట్టులో జేరేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తాడో చూడాలి మరి. 

 -ఎస్బీ