క్రికెట్‌ని జెంటిల్మెన్ గేమ్ అని అంటాం. కానీ, క్రికెట్ పిచ్చి గురించి ఎంత పిచ్చిపిచ్చిగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఔను మరి, క్రికెట్ అభిమానంలో అంత పిచ్చి, వెర్రి వున్నాయి. నిజంగా నిజమిది. క్రికెట్ అభిమానం వెర్రి తలలు వేసేస్తోంది. దానికి పరాకాష్టగా అనేక సందర్భాల్ని చెప్పుకోవచ్చు. ఇదిగో, ఇది కూడా అలాంటిదే.
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ఈ రోజు కటక్‌లో టీ20 మ్యాచ్ జరిగింది. మధ్యలో అభిమానులకు కోపమొచ్చింది. మైదానంలోకి వాటర్ బాటిళ్ళను విసిరేశారు. దాంతో మ్యాచ్ పలుమార్లు నిలిచిపోయింది. కాస్త వెనక్కి వెళితే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇలాంటిదే జరిగింది. అది వరల్డ్ కప్ మ్యాచ్. అప్పటికీ ఇప్పటికీ సారూప్యత వుంది. అదే, టీమిండియా మైదానంలో చేతులెత్తేయడం.
ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. తొలి టీ20లో టీమిండియా 199 పరుగులు చేసీ, మ్యాచ్‌ని నిలబెట్టుకోలేకపోయింది. సఫారీలు ఆడుతూ పాడుతూ ఆ మ్యాచ్‌లో విజయం సాధించారు. రెండో మ్యాచ్‌లో 100 పరుగులు కూడా చేయలేక చతికిలపడ్డారు భారత బ్యాట్స్‌మెన్. ఇంకేముంది.? భారత క్రికెట్ అభిమానులకు కోపమొచ్చింది, పిచ్చిపట్టినోళ్ళలా గ్యాలరీల్లో ఊగిపోయారు. తమ చేతిలో వున్న వాటర్ బాటిళ్ళను మైదానంలోకి విసిరేశారు.
అభిమానులకు తగునా ఇది.? అని అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ఈ పిచ్చి పుణ్యమా అని దేశం పరువు మంట గలిసిపోతోంది. భారత్‌లో క్రికెట్ ఆడటానికి ఇతర జట్లు ఒకటికి పదిసార్లు ఇకపై ఆలోచించాలేమో. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం. ఆటగాళ్ళ నిర్లక్ష్యం అనేది వేరే అంశమిక్కడ. ఆటను ఆటలా చూస్తే అసలు సమస్యే వుండదు. కానీ, అలా చూస్తే అది క్రికెట్ పిచ్చి ఎలా అవుతుంది.?