సుభాష్ చంద్ర మళ్లీ వచ్చారు. క్రికెటర్లపై కోట్ల డాలర్ల వర్షానికి రెడీ అని ప్రకటించాడు. నిద్రపట్టని ఈ మీడియా మొఘల్ మరో క్రికెట్ లీగ్ అంటున్నాడు. ఈ సారి బీసీసీఐకి, ఐసీసీకి సవాల్ విసరడానికి సిద్ధం అయ్యాడు. అయితే ఈ సారి ఆయన సక్సెస్ అవుతాడా? ఈ సారైనా సక్సెస్ అవుతాడా? అనేది పెద్ద సందేహంగా మారింది. ఎందుకంటే.. సుభాష్ చంద్ర చరిత్రలో ఇండియన్ క్రికెట్ లీగ్ అనే ఫెయిల్యూర్ ఉంది.
సంచలన రీతిలో ఆయన ఆరంభించిన లీగ్ అంతే చప్పున చల్లారిపోయింది. భారత క్రికెట్ లో చీలిక ను సాధించిన సుభాష్ చంద్ర ఆ లీగ్ ను విజయవంతంగా నడపలేకపోయాడు. వివిధ కారణాలతో ఆయన లీగ్ ను రద్దు చేసుకొన్నారు.
అసలు బీసీసీఐ టీమిండియా ఆడే మ్యాచ్ ల ప్రసార హక్కులను “జీ స్పోర్ట్స్'' కు ఇవ్వకపోవడంతోనే ఆయనలో అసంతృప్తి మొదలైంది. జీ టెలివిజన్ నెట్ వర్క్ అధినేత అయిన సుభాష్ చంద్ర భారత లెజండరీ క్రికెటర్లను.. యువ క్రికెటర్లను బీసీసీఐ పరిధి నుంచి తీసుకొని వచ్చి ఐసీఎల్ ను స్టార్ట్ చేశాడు. తొలి ఏడాది దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను బాగా అలరించింది. అప్పటికి ఇంకా ఐపీఎల్ కూడా లేదు!
కపిల్ దేవ్ ఐసీఎల్ కు బాస్ గా వ్యవహరించారు. అనేక మంది భారత మాజీ క్రికెటర్లు ఈ గూటికి చేరారు. ఇక యువ క్రికెటర్లు అందరూ ఐసీఎల్ లో చేరిపోయారు. ఐసీఎల్ లో ఆడే వారికి జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు.. వారిపై నిషేధం ఉంటుందని బీసీసీఐ ప్రకటించినా.. వారు లెక్క చేయలేదు. ఇప్పుడు లీడ్ లో ఉన్న అంబటి రాయుడు, అభిషేక్ నాయర్, సువర్ట్ బిన్నీ… వంటి వారంతా ఐసీఎల్ లో కనిపించారు.
అయితే బీసీసీఐ వీక్ పాయింట్ ను గమనించింది. డబ్బు కోసమే ఆటగాళ్లు ఐసీఎల్ వైపు వెళుతున్నారనే విషయాన్ని గ్రహించి.. దేశవాళీ మ్యాచ్ లు ఆడేవారి జీతాలను పెంచింది. ఇదే ఊపులో ఐపీఎల్ స్టార్ట్ అయ్యింది.. ఐసీఎల్ కళ కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో.. సుభాష్ చంద్ర వెనక్కు తగ్గాడు. ఐసీఎల్ ను రద్దు చేశాడు.
బీసీసీఐ కూడా ఆటగాళ్లపై నిషేధాలు ఎత్తేసింది.. కపిల్ దేవ్ తో సహా అందరినీ తిరిగి గూటికి చేర్చుకొంది. అలా ఐసీఎల్ సంచలనంగా మొదలై… చప్పున చల్లారి పోయింది. అయితే సుభాష్ చంద్ర కు మళ్లీ క్రికెట్ లీగ్ పై ఆసక్తి మొదలైంది. ఈ సారి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యినా సరే.. మళ్లీ కొత్త లీగ్ ను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఎసెల్ గ్రూప్ నుంచి ధ్రువీకరణ లభించింది.
అయితే ఇప్పుడు పరిస్థితుల్లో ఆలా తేడాలున్నాయి. దేశ, విదేశీ క్రికెటర్లు కాసుల వర్షంలో తడుస్తున్నారు. అలాంటి వారిలో చీలిక తీసుకురావలంటే.. వారిని ఆకర్షించాలంటే.. అంతకు మించిన స్థాయిలో డబ్బువిదల్చాలి.. ఆయనకు అంత శక్తి ఉందా? అనేదే సందేహం!