అమెరికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన ఆందోళనపై ఆ దేశం ఆవలి వాళ్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్లు నిలుస్తున్నారు. తాము కూడా వివక్షను ఎదుర్కొన్నట్టుగా వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డ్యారెన్ సమీ చెబుతున్నాడు. అది కూడా ఇండియాలో తను ఆ తరహా వివక్షను ఎదుర్కొన్నట్టుగా ఇతడు చెప్పాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడే సమయంలో తను, తనతో పాటు శ్రీలంకన్ క్రికెటర్ ఒకరిని కూడా నల్లవాళ్లు అంటూ ఏడిపించే వారని సమీ చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు గతంలో ప్రాతినిధ్యం వహించాడు ఈ విండీస్ ఆటగాడు. ఆ సమయంలో తను వివక్ష ఎదుర్కొన్నట్టుగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో వివక్ష పూరిత ధోరణి విషయంలో అంతా గళం విప్పాలని కోరాడు.
ఈ నేపథ్యంలో .. గతంలో ఎస్ఆర్హెచ్ కు ఆడుతున్న సమయంలో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చేసిన ఒక పోస్టు తెర మీదకు వచ్చింది. ఆ ఫొటోలో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు నలుగురు సన్నిహితంగా కూర్చున్నారు. వారిలో అందరి పేర్లనూ ప్రస్తావించిన ఇషాంత్, సమీ ని మాత్రం 'కాలూ' అంటూ సంబోధించాడు. హిందీ జనాలు .. నల్లగా ఉన్నవారిని పిలిచే పిలుపు అది.
సమీ ఆరోపణల నేపథ్యంలో ఈ పోస్టు హైలెట్ అవుతూ ఉంది. అయితే నిజంగానే తను వేదనకు గురి అయి ఉంటే సమీ అప్పట్లోనే స్పందించాల్సింది. అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇషాంత్ పోస్టు పట్ల అప్పుడే అభ్యంతరం వ్యక్తం చేసి ఉండాల్సింది, అలాగే తనను 'కాలూ' అంటూ ఇబంది పెడుతున్నారని అప్పుడే స్పందించి ఉండాల్సింది. అయితే అప్పట్లో అలాంటి వివాదాలు రాజేస్తే.. ఐపీఎల్ కాంట్రాక్టులు దెబ్బతింటాయనే భయం ఉండవచ్చు ఈ క్రికెటర్ కు.
అప్పుడు ఇతడి కెరీర్ బాగుండేది. ఒకసారి అలాంటి నిరసనలు తెలిపితే, మళ్లీ తనను ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనరనే భయాలు ఉండవచ్చు. అందుకే అప్పుడు స్పందించకపోయి ఉండొచ్చు. ఇప్పుడు స్పందించి ఉండొచ్చు. ఇదంతా హీరోయిన్ల మీటూ వ్యవహారంలా ఉంది. తమ కెరీర్ తో డబ్బులు వస్తున్నప్పుడు వేదనలు గుర్తుకురావు, కెరీర్ ఒక ఒడ్డుకు చేరాకా.. గతమంతా గుర్తుకు వస్తుంది. జాతి వివక్ష కూడా అంతేనా?