విజయం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. అయినాసరే, గెలుపు గెలుపులోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది టీమిండియా. తాజాగా మరో సిరీస్ విజయం టీమిండియా ఖాతాలో చేరింది. స్వదేశంలో టీమిండియాకి టెస్టుల్లో వరుసగా ఏడు విజయాలు నమోదు చేసింది. ఏడో విజయం, ఆస్ట్రేలియాపై కావడం గమనార్హం. 4-0 తేడాతో టీమిండియా, ఆసీస్‌ని వైట్‌వాష్ చేస్తుందని అంతా అనుకున్నారుగానీ, తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకి షాక్ తగిలింది. అయితే, ఆ తర్వాత టీమిండియా ఎక్కడా ఆసీస్‌కి ఛాన్స్ ఇవ్వలేదు. రెండో టెస్ట్ టీమిండియా వశం కాగా, అతి కష్టమ్మీద మూడో టెస్ట్‌ని ఆసీస్ డ్రా చేసుకోగలిగింది.
దర్మశాలలో టీమిండియా – ఆసీస్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ కోహ్లీ, గాయం కారణంగా జట్టుకి దూరమవడంతో టీమిండియాపై ఆశలు సన్నగిల్లిన దశలో, కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రహానే జట్టుని ముందుండి నడిపించాడు, టీమిండియాకి ఘనవిజయాన్ని అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 46, రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన రెహానే, మైదానంలో కెప్టెన్‌గానూ ఖచ్చితమైన వ్యూహాలతో విమర్శకుల మెప్పు పొందాడు.
ఇక, ఈ సిరీస్ వివాదాలతోనే ప్రారంభమయ్యింది. మరీ ముఖ్యంగా కెప్టెన్లు కోహ్లీ, స్మిత్ మధ్య డీఆర్‌ఎస్ వివాదం క్రికెట్‌లో పెద్ద దుమారమే రేపింది. డ్రెస్సింగ్ రూమ్ సలహాలతో తెలివిగా 'రివ్యూలు' వాడేసుకున్న స్మిత్, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాక.. వరుసగా రివ్యూల్లో ఫెయిలవడం గమనార్హం. అంతకు ముందు టీమిండియా రివ్యూల పరంగా వరుస ఫెయిల్యూర్లను చవిచూసింది.
మొత్తమ్మీద, టీమిండియా – ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ని 2-1 తేడాతో విజయం సాధించి, టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ, వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఈ సిరీస్‌లో పూర్తిగా ఫెయిలవడం గమనార్హమిక్కడ. మూడో టెస్ట్‌లోనే గాయం కాగా, నాలుగో టెస్ట్‌కి కోహ్లీ అసలు అందుబాటులో లేకుండా పోయాడు.