రాంచీ టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. ఇన్నింగ్స్ రెండు వందల రెండు పరుగుల తేడాతో భారత జట్టు ప్రోటిస్ పై ఘన విజయాన్ని నమోదు చేసింది. తద్వారా మూడు టెస్టుల సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికాను తొలిసారి వైట్ వాష్ చేసింది టీమిండియా.
తొలి రెండు టెస్టుల్లోనూ భారీ విజయాలనే నమోదు చేసిన ఇండియా, మూడో టెస్టులో కూడా అదే దూకుడును కొనసాగించింది. ఈ మ్యాచ్ లో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వందల తొంభై ఏడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్డ్ చేసింది.
ఆ తర్వాత సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్ లో నూటా అరవై రెండు పరుగులకు ఆలౌట్ చేసి, ఫాలో ఆన్ ఆడించింది టీమిండియా. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆ జట్టు అంతే స్థాయి ప్రదర్శన చేసింది. నూటా ముప్పై మూడు పరుగులకు ఆలౌట్ అయ్యి చేతులెత్తేసింది. టీమిండియా చేతిలో వైట్ వాష్ అయ్యింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో, రహనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లలో తలా కొన్ని వికెట్లు తీసుకున్నారు.