అనిల్ కుంబ్లే.. ఒకప్పుడు టీమిండియాకి వెన్నెముక. తన బౌలింగ్‌తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాడు. కెప్టెన్‌గానూ సేవలందించాడు. అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. వీటన్నిటికీ మించి, మైదానంలో ఆటగాడిగా అత్యంత నిబద్ధతతో పనిచేశాడు.
జట్టు కోసం గాయాల్ని సైతం లెక్క చేయలేదు. పబ్లిసిటీకి చాలా దూరంగా వుండేవాడు. ఇంతేనా.? జట్టులో జూనియర్లకీ, సీనియర్లకీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరించాడు.
పరిచయం అక్కర్లేని వ్యక్తి అనిల్ కుంబ్లే. 'లెజెండ్' అని క్రికెట్లో పేర్కొనదగ్గ వ్యక్తుల్లో కుంబ్లే పేరు ఖచ్చితంగా వుంటుంది. అలాంటి అనిల్ కుంబ్లేతో, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి పొసగడంలేదు. ఇద్దరి మధ్యా విభేదాలు తారాస్థాయికి చేరాయి.
'కుంబ్లే కోచ్‌గా వుంటే మేం ఆడలేం..' అని తేల్చేశాడు కెప్టెన్. కానీ, బీసీసీఐ కుంబ్లేని తప్పించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఎందుకంటే, కుంబ్లేని తొలగించడానికి కోహ్లీ తప్ప ఇంకో బలమైన కారణం బీసీసీఐకి కన్పించని పరిస్థితి.
ఈ పరిస్థితుల్లో కోహ్లీ ముందున్న అస్త్రం ఒక్కటే. అత్యంత పేలవమైన ప్రదర్శనతో జట్టు ఆటతీరుని దిగజార్చడం. పాకిస్తాన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ చేసింది అదే.
ఆ మ్యాచ్‌లో టీమిండియా వైఫల్యం సాదా సీదాగా జరిగింది కాదని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. కోహ్లీ ఏమన్నా కుంబ్లే మీద కోపం ప్రదర్శించాడా.? అని ఇప్పటిదాకా వున్న అనుమానాలు ఇప్పుడు నిజమని నిరూపితమవుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యాక వెస్టిండీస్ టూర్ వెళ్ళిన టీమిండియాతోపాటుగా కుంబ్లే అక్కడికి వెళ్ళలేదు. నేటితో కుంబ్లే కాంట్రాక్ట్ ముగిసింది. అయినప్పటికీ కూడా ఇంకొన్నాళ్ళు జట్టుకి సేవలందించాలని బీసీసీఐ కోరింది. బీసీసీఐ అభ్యర్థనని కుంబ్లే తిరస్కరించాడు.
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలోనే కుంబ్లే, రాజీనామా చేసి వుండేవాడే. కానీ, కుంబ్లేకి జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాడు. కోహ్లీ అలా ఆలోచించలేకపోయాడు.
ఇక్కడ కోహ్లీ, కుంబ్లేని పంపించేయడంలో సక్సెస్ అయి వుండొచ్చుగాక. కానీ, భారత క్రికెట్ అభిమానుల నుంచి మాత్రం ఛీత్కారాల్ని ఎదుర్కొంటున్నాడు. పంతం నెగ్గించుకోవడానికి కోహ్లీ ఇంతలా దిగజారిపోవాలా.?