జాతీయ జట్టు దూసుకుపోతుంటే.. ఉద్వేగంగా ఫీలవ్వాలా..?!
యువ క్రికెటర్లు.. రేపటి తారలు ఆడుతుంటే ఆస్వాధించాలని ఉందా?!
ఇలా కాదు.. మేము మాజీలకు అభిమానులం, మా అభిమాన క్రికెటర్లంతా రిటైరైపోయారనే వారికీ ఆప్షన్ ఉండనే ఉంది!
సీరియస్ క్రికెట్ వద్దు అనుకుంటే.. సిల్లీగా సినిమా వాళ్లు ఆడే క్రికెట్ ను ఆస్వాధించే అవకాశమూ ఉంది!
ఓవరాల్ గా చూడాలనే ఆసక్తి ఉన్న వారికి.. వీక్షించదగినంత క్రికెట్ ఆడేస్తున్నారు. వివిధ కేటగిరిల్లో క్రికెట్ మ్యాచ్చులు జరుగుతున్నాయి. మొన్ననే ఆస్ట్రేలియాతో జాతీయ జట్టు వన్డే, టీ20 సీరిస్ ను ముగించింది. వెంటనే.. ఆసియా కప్ టీ 20, టీ20 వరల్డ్ కప్ లు జరగనున్నాయి. దీంతో నేషనల్ టీమ్ ఆడే మ్యాచ్ లను ఆస్వాధించాలనుకునే వారికి మంచి మజా ఉంది!
మరోవైపు అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది. ఇంతకు ముందు అనేక మంది క్రికెటర్లు అండర్ 19 ప్రపంచకప్ లో మెరిసి వచ్చిన వారే కావడంతో ఈ క్రికెట్ పై బోలెడంత ఆసక్తి నెలకొంది.
ఇక ఇటీవలి కాలంలో బోలెడంత మంది లెజెండరీ ప్లేయర్లు రిటైరయ్యారు. ప్రపంచ క్రికెట్ లో స్టార్ లుగా వెలుగొందిన వాళ్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగారు. వారి రిటైర్ మెంట్ తో అనేక మంది క్రికెట్ అభిమానులు తెగ బాధపడిపోయారు. మరి వారి ఆటతో పెద్దగా విరహమేమీ లేకుండా.. ఇప్పుడు పలు సీరిస్ లు జరుగుతున్నాయి. సచిన్ , వార్న్ ల ఆధ్వర్యంలో ఒక ఆల్ స్టార్స్ సీరిస్ మొదలుకాగా.. ఆ స్ఫూర్తితో దుబాయ్ వేదికగా వెటరన్ క్రికెటర్లతో మరో సీరిస్ జరుగుతోంది!
ఇక మేమూ ఉన్నాం అంటూ.. సినిమా వాళ్లు తయారయ్యారు. భాషల వారీగా ఇండస్ట్రీల మధ్య విభజనను పెట్టుకుని.. వీళ్లు వినోదాన్ని పంచుతున్నారు. మరి ఇన్ని రకాల క్రికెట్ మ్యాచ్ లు ఒకేసారి రన్ అవుతుండటం విశేషం.
సినిమా తారల మ్యాచ్ లు గతంలో ఏడాదికి రెండేళ్లకూ ఒక్కోసారి జరుగుతుండేవి. ఏదో ఒక కాజ్ ను పెట్టుకుని వీళ్లు క్రికెట్ ఆడేవాళ్లు. అయితే ఈ మధ్య వీళ్లు ప్రతి సీజన్ లోనూ మైదానాల్లోకి దిగుతున్నారు. ఇక వెటరన్ల క్రికెట్ విషయానికి వస్తే.. వీళ్ల మ్యాచ్ లూ జరిగేవి కానీ, వాటిని లైవ్ లో ప్రసారం చేయడం జరిగేది కాదు. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ చానళ్ల సంఖ్య పెరిగిపోయి.. ఆ క్రికెట్ ను కూడా ప్రసారం చేసేస్తున్నారు.
ఎగ్జిబిషన్ మ్యాచ్ ల స్థానే.. సీరిస్ లు జరగడం మొదలైందిప్పుడు. అలాగే అండర్ 19 ప్రపంచకప్ మ్యాచ్ లను కూడా లైవ్ ఇవ్వడం మొదలైంది. గతంలో ఈ ప్రపంచకప్ కప్ లో విజేత ఎవరేనది మాత్రమే వార్తల్లోకి వచ్చేది. ఇప్పుడు మాత్రం.. ప్రతి మ్యాచ్ మీదా విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తానికి క్రికెట్ పలు రూపాల్లో అభిమానులను అలరిస్తోంది. ఏ కేటగిరి కావాలనుకొన్న వాళ్లు దాన్ని ఎంచుకోవచ్చంతే!