అనురాగ్ ఠాకూర్.. బీసీసీఐ ప్రెసిడెంట్, హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ కమిటీ ప్రెసిడెంట్.
సౌరవ్ గంగూలీ.. క్యాబ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో పాటు బీసీసీఐలోని పలు విభాగాల పదవుల్లో ఉన్నాడు.
కేవలం వీళ్లు మాత్రమే కాదు… క్రికెట్ లో పాలకుల హోదాలో ఉన్న వాళ్లు బహుళ పదవులు అనుభవిస్తున్నారు. ఒక్కోరు మూడునాలుగు పదవులను అనుభవిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా.. బీసీసీఐలో కొంతమందిదే అధిపత్యం. ఎవరికి వారిగా లాబీలు పెట్టుకున్నారు. అత్యంత ధనిక క్రీడా బోర్డుల్లో ఒకటైన బీసీసీఐ విషయంలో రాజకీయ నేతలు, మాజీ క్రికెటర్ల ఆటలు అన్నీ ఇన్నీ కావు! ఆటగాళ్లంటే క్రికెట్ కు అంతో ఇంతో సేవ చేసే ఉంటారు. ఎటొచ్చీ రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు.. క్రికెట్ వ్యవహారాలతో ఆడే గేమ్స్ ఎన్నో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళకు కోర్టు నియమించిన లోథా కమిటీ ఇచ్చిన రిపోర్ట్ సంచలనాత్మక స్థాయి మార్పులనే సూచించింది. బోర్డు విధానాలు పారదర్శకంగా ఉండటానికి, బీసీసీఐ మేనేజ్ మెంట్ లో కుళ్లును కడిగేయడానికి ఈ కమిటీ పలు సూచనలు చేసింది. వీటిలో ముఖ్యమైనవి ఒక వ్యక్తికి ఒకే పదవి, 70 ఏళ్లు పై బడ్డ వాళ్లను బీసీసీఐ వ్యవహారాలకు దూరంగా పెట్టడం, బోర్డు ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒకే ఓటు హక్కు, క్రికెట్ మాజీలతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం.. వంటివి ఉన్నాయి.
ఈ సిఫార్సులతో కూడిన నివేదికను కోర్టు అందించింది లోథా కమిటీ. కోర్టు అయితే ఈ కమిటీలను అమలు చేయమని బీసీసీఐని ఆదేశించే అవకాశం ఉంది. కానీ.. ఈ సిఫార్సులు అమలు చేస్తే.. మొదటి దెబ్బ బీసీసీఐ ప్రెసిడెంట్ కే పడుతుంది. ఒకవైపు ఎంపీ హోదాలో ఉంటూ.. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నాడు అనురాగ్ ఠాకూర్. తండ్రిరాజకీయ వారసత్వంతో అటు రాజకీయాల్లోనూ, ఇటు క్రికెట్ పాలకమండలిలోనూ పట్టు సంపాదించాడు ఠాకూర్. ఈయన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ మండలి కి కూడా అధ్యక్ష హోదాలో ఉన్నాడు. ఇలాంటి పదవులన్నింటినీ అనుభవించే అవకాశాన్ని కోల్పోతాడు బీసీసీఐ అధ్యక్షుడు. దేనికో ఒకదానికి ఆయన పరిమితం కావాల్సి ఉంటుంది.
అలాగే.. లోథా కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేస్తే.. ఇప్పుడు బీసీసీఐలో చక్రం తిప్పుతున్న చాలా మందికి ఇబ్బందులు తప్పవు. ఒకవైపు క్రికెట్ బోర్డుల్లో, దేశవాళీ ప్లేయర్ల ఎంపిక కమిటీలు పాల్పడుతున్న ఆక్రమాలు ఆందోళనకరమైన స్థాయికి చేరాయి. తమ పిల్లలను అండర్ ఏజ్ టీమ్ లకు ఎంపిక చేయమని కోరుతున్న తండ్రులకు షాకులిస్తున్నారు సెలెక్టర్లు. మీ భార్యలను పంపండి.. మీ పిల్లలకు జట్టులో చోటు గ్యారెంటీ అనేంత స్థాయికి తెగించేశారు. జనాల్లో క్రికెట్ కు గల క్రేజ్ ను ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నారు పాలక స్థాయిలో ఉన్న వాళ్లు. మరి వీటికి ఎక్కడో ఒక చోట చెక్ చెప్పకపోతే కష్టమే. మరి చూద్దాం.. లోథా కమిటీ సంస్కరణలు ఏ మేరకు అమలవుతాయో!