టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్ట 15 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఆరంగేట్రం నుంచినే క్రికెట్ లో ధోనీ తనకంటూ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాడు. అప్పటి వరకూ టీమిండియాను వేధించిన స్పెషలిస్ట్ కీపర్ కొరతను భర్తీ చేయడం మాత్రమే కాకుండా.. తన స్టైల్ తో, తన ఆటతో ధోనీ అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ లో ధోనీ మానియా మొదలైంది.
టీ20లు వచ్చాకా ధోనీ క్రేజ్ రెట్టింపు అయ్యింది. తొలి టీ20 ప్రపంచకప్ లో టీమిండియాను విజేతగా నిలపడంతో ధోనీ కెప్టెన్ గా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ లోనూ టీమిండియాను విజేతగా నిలిపి 28 యేళ్ల తర్వాత భారత్ ను ప్రపంచకప్ విజేతగా నిలిపాడు ధోనీ. ఇలా చెబుతూ పోతే.. అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా ధోనీ సాధించిన ఘనతలు ఎన్నో ఉంటాయి.
కొన్నేళ్ల కిందట హుందాగా కెప్టెన్సీని వదులుకుని ధోనీ కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు. టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పి వన్డేలు, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయినప్పటికీ ఆటగాడిగా ధోనీ రాణింపు అంత గొప్పగా లేదు. ప్రత్యేకించి ప్రపంచకప్ లో కీలకమైన మ్యాచ్ లలో ధోనీ గ్రేట్ ఫినిషర్ గా సత్తా చూపించలేదు. దీంతో రిటైర్మెంట్ ఒత్తిడి మరింత పెరిగింది.
ప్రపంచకప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ మ్యాచ్ లేవీ ఆడలేదు. విరామం తీసుకున్నాడు. ఇక ధోనీ ఇప్పుడు డైరెక్టుగా జట్టులోకి వస్తే అది మరింత విమర్శలకు దారి తీయవచ్చు. దేశవాళీ ఆటలో ధోనీ సత్తా చూపించాకా మళ్లీ జాతీయ జట్టులోకి వస్తే బావుంటుందని క్రికెట్ లెజెండ్లు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరోవైపు అతడికి వయసు కూడా తక్కువ కాదు. 38 యేళ్లు. ఇలాంటి నేపథ్యంలో విరామం నుంచినే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చని… అటు నుంచి అటే రిటైర్మెంట్ ను ప్రకటించవచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రానున్న జనవరిలో తన కెరీర్ విషయంలో ధోనీ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.