పసికూన పంజా విసిరింది. ఈ వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్, వెస్టిండీస్‌ని దెబ్బ కొట్టింది. సంచలన విజయాన్ని నమోదు చేసింది. 304 పరుగుల టార్గెట్‌ని అలవోకగా ఛేదించింది. గ్రూప్‌లో మిగతా జట్లకు సవాల్ విసిరింది. సమిష్టిగా రాణిస్తే, చిన్న జట్టు అయినా సంచలనాలు నమోదు చేయవచ్చని నిరూపించింది ఐర్లాండ్.
చివర్లో కాస్త తడబాటు.. అయితేనేం.. విజయం ఐర్లాండ్‌నే వరించింది. 305 పరుగుల లక్ష్యాన్ని 45.5 ఓవర్లలో ఐర్లాండ్ ఛేదించింది. నాలుగు వికెట్లను చివర్లో టపటపా తీయగలిగిన వెస్టిండీస్, అంతకు ముందు ఆ పని చేసి వుంటే ఫలితం ఇంకోలా వుండేది. ఐర్లాండ్ ఆ నాలుగు వికెట్లనూ వేగంగా కోల్పోకుండా వుంటే, ఐర్లాండ్ ఇంకా తొందరగానే లక్ష్యాన్ని ముగించేసి వుండేది.
ప్రపంచ కప్‌లో పెద్ద జట్లకు పసికూనలు షాక్ ఇవ్వడం ఇదే కొత్త కాదు. అయినప్పటికీ దేనికదే ప్రత్యేకం. వెస్టిండీస్‌ని మట్టి కరిపించడం ద్వారా ఆ గ్రూప్ లోని మిగతా పెద్ద జట్లకు (అందులో భారత్ కూడా వుంది) ఐర్లాండ్ సవాల్ విసిరిందనే చెప్పాలి.