రాంచీలో ఆస్ట్రేలియా – టీమిండియా మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించడం – టీమిండియా ధాటుగా బదులివ్వడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. టీమిండియా ఈ మ్యాచ్‌ని ఎలాగైనా గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మ్యాచ్ 'డ్రా' అయ్యింది. మ్యాచ్ చేతిలోకి వచ్చినట్లే వచ్చి.. 'డ్రా'గా ముగియడంతో టీమిండియా కాస్తంత నిరాశకు గురికాక తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ గాయపడిన విషయం విదితమే. ఆ గాయాలపై వెటకారాలు చేస్తూ, ఆసీస్ ఆటగాళ్ళు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 'స్లెడ్జింగ్'లో అదంతా భాగమేనని ఆసీస్ ఆటగాళ్ళు భావించినట్టున్నారు. మరోపక్క, ఆసీస్ స్లెడ్జింగ్‌కి టీమిండియా కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. కెప్టెన్ కోహ్లీ, పేసర్ ఇషాంత్ శర్మ.. ఆసీస్ ఆటగాళ్ళకు కౌంటర్లు బాగానే వేసేశారు. అలా, ఈ మ్యాచ్ వెరీ వెరీ స్పెషల్‌గా మారింది. ఈ మ్యాచ్ జరుగుతుండగానే, ఓ సందర్భంలో అంపైర్, ఔట్ ప్రకటించేయాలన్న తొందరలో వేలిని పైకి లేపాడుగానీ, ఆ తర్వాత టోపీని సరిచేసుకోవడం హాస్యాస్పదంగా మారింది. పుజారా డబుల్ సెంచరీ, సాహా సెంచరీ.. ఈ క్రమంలో ఆసీస్ ఆటగాళ్ళు చేసిన ఓవరాక్షన్.. అబ్బో, రాంచీ టెస్ట్ పదనిసలు అన్నీ ఇన్నీ కావు.
'8 వికెట్లు తీస్తే చాలు.. గెలిచేయొచ్చు..' అన్న స్థితిలో టీమిండియా, ఎట్టి పరిస్థితుల్లోనూ వికెట్ కోల్పోకూడదన్న కసితో ఆస్ట్రేలియా ఈ రోజు బరిలోకి దిగాయి. మరో రెండు వికెట్లు కోల్పోయాక ఆసీస్ జట్టు, పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. షాన్ మార్స్, హ్యాండ్స్కాంబ్ తమ జట్టుని 'డ్రా' దిశగా నడిపించారు. చివర్లో రెండు వికెట్లని టీమిండియా పడగొట్టినా.. ఉపయోగం లేకుండా పోయింది.
కోహ్లీ – స్మిత్ 'డీఆర్ఎస్ వివాదం' తర్వాత జరిగిన మ్యాచ్ కావడంతో, రాంచీ టెస్ట్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు కోహ్లీ గాయం – ఆసీస్ ఆటగాళ్ళ వెటకారం ఈ మ్యాచ్ పట్ల అంతా ఎట్రాక్ట్ అయ్యేలా చేసింది. చివరికి మ్యాచ్ 'డ్రా'గా ముగియడంతో ఆసీస్ ఊపిరి పీల్చుకుంది.. టీమిండియా మాత్రం ఊస్సూరమనాల్సి వచ్చింది. ఎందుకంటే, టీమిండియా గెలిచే మ్యాచ్.. 'డ్రా'గా ముగిసింది. ఆసీస్ విషయంలో అలా కాదు, ఓడిపోతామనుకున్న మ్యాచ్ 'డ్రా' అయ్యింది.