తొలి టీ20 వరల్డ్ కప్‌ని ధోనీ సేన కైవసం చేసుకోవడం ఓ చరిత్ర. అప్పట్లో ఎవరూ ఊహించని ఘనత అది. ఆ తర్వాత ప్రతిసారీ టీమిండియానే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ప్చ్.. నిరాశే మిగిలింది. ఈసారి టీ20 ప్రపంచ కప్ ఫేవరెట్‌గానే టీమిండియా రంగంలోకి దిగింది. దిగుతూనే దారుణ పరాజయాన్ని చవిచూసింది. దాంతో అభిమానులు షాక్‌కి గురయ్యారు.
ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌ని కైవసం చేసుకున్న టీమిండియాకీ, ఇప్పటి టీమిండియాకీ స్పష్టమైన తేడా. ఆ దూకుడు ఇప్పుడు కన్పించడంలేదు. న్యూజిలాండ్ బలమైన జట్టు. ఆ జట్టు చేతిలో టీమిండియాకి టీ20ల్లో ఇప్పటిదాకా విక్టరీ లేదు. ఆ సెంటిమెంట్ మానసికంగా దెబ్బ కొట్టిందని సరిపెట్టుకున్నారు అభిమానులు. పాకిస్తాన్ మీద వరల్డ్ కప్‌లో విజయాలు అలవాటే గనుక, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అలవోకగా టీమిండియా విజయం సాధించేసింది. కానీ, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కొచ్చేసరికి అభిమానులకు టీమిండియా పెద్ద షాకే ఇచ్చింది. 'మేం గెలిచినా మీరు ఆనందంగా లేరు..' అని ధోనీ కసురుకున్నా, నిజానికి అభిమానులు షాక్ నుంచి తేరుకుని, సంబరాలు చేసుకోవడానికి పెద్ద టైమే పట్టింది మరి.
టీ20 మ్యాచ్‌ల తీరే అంత. రెండు మూడు ఓవర్లలోనే మ్యాచ్ స్వరూపం మారిపోతుంటుంది. ముందూ వెనుకా చూడకుండా బాదేయడం చాలా సందర్భాల్లో కలిసొస్తుంది. పసికూన బంగ్లాదేశ్ కూడా అదే అనుకుంది. ఇక్కడ టీమిండియా చతికిలపడబోయి, గట్టునపడింది. ఇక నుంచి పరిస్థితి వేరు. అన్నీ నాకౌట్ మ్యాచ్‌లే. ఎక్కడ తేడా కొట్టినా ఇంటికి వచ్చేయడమే. ఇప్పుడే ధోనీ సేన అసలు సిసలు పోరాట పటిమ ప్రదిర్శంచాల్సి వుంటుంది.
అయితే, ఇక్కడ ధోనీ స్ట్రాటజీ కూడా బాగానే వర్కవుట్ అవుతోంది. అన్నిటికీ మించి అదృష్టమూ కలిసొచ్చేస్తోంది. చాన్నాళ్ల క్రితం పాకిస్తాన్ చేతిలో ఓటమి తప్పి, మ్యాచ్ డ్రా అవడం, సూపర్ ఓవర్‌లో విక్టరీ దక్కడం తెల్సిన విషయాలే. లక్కీగా సూపర్ ఓవర్ దాకా వెళ్ళలేదుగానీ, ఆనాటి ఉత్కంఠకు పదింతల ఉత్కంఠ నిన్నటి బంగ్లా మ్యాచ్‌లో టీమిండియా చవిచూసింది. దాంతో, ఇక ఆటగాళ్ళలో జాగ్రత్త, బాధ్యత రెండూ పెరుగుతాయని అభిమానులు అనుకుంటున్నారు.
చూద్దాం.. తొలి టీ20 నాటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ, ఆనాటి పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ ఈ టీ20 వరల్డ్ కప్‌ని టీమిండియా కైవసం చేసుకోవాలని ఆశిద్దాం.