తిప్పితే తిరగాలంతే

తిప్పేశారు.. తిరిగేసింది.. వికెట్లు ఎగిరి పడ్డాయ్‌.. సఫారీలు బోల్తా పడ్డారు. తొలి టెస్ట్‌లోనూ, రెండో టెస్ట్‌లోనూ, మూడో టెస్ట్‌లోనూ ఇదే పరిస్థితి. సౌతాప్రికా బ్యాట్స్‌మెన్‌కి పరిస్థితి అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. 'ఇవేం పిచ్‌లు.?' అని…

తిప్పేశారు.. తిరిగేసింది.. వికెట్లు ఎగిరి పడ్డాయ్‌.. సఫారీలు బోల్తా పడ్డారు. తొలి టెస్ట్‌లోనూ, రెండో టెస్ట్‌లోనూ, మూడో టెస్ట్‌లోనూ ఇదే పరిస్థితి. సౌతాప్రికా బ్యాట్స్‌మెన్‌కి పరిస్థితి అస్సలేమాత్రం అర్థం కావడంలేదు. 'ఇవేం పిచ్‌లు.?' అని సౌతాఫ్రికా ఆటగాళ్ళు బయటకు అనడంలేదుగానీ, లోలోపల వారిలోనూ పిచ్‌ పట్ల అసహనం పెరిగిపోతోంది. 

అదే టీమిండియా అయితే డైలాగ్‌ డెలివరీ ఇంకోలా వుండేది. చెత్త పిచ్‌లు.. ఇదేం ఆట.? అని నోరుపారేసుకునేవారు. తమకు తోచిన రీతిలో పిచ్‌లు తయారు చేసేసినా సొంత గడ్డపై టీమిండియాకి సౌతాప్రికా చేతిలో టీ20, వన్డేల్లో షాక్‌ తప్పలేదు. ఆ షాక్‌ కారణంగానే, టెస్టులకోసం అచ్చంగా స్పిన్‌ పిచ్‌లను రెడీ చేయించినట్లున్నారు. రెండో టెస్ట్‌ వర్షార్పణమయినా, ఆ పిచ్‌ పైనా బోల్డన్ని విమర్శలొచ్చాయి. 

ఇక, తాజాగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా 214 పరుగలకు ఆలౌట్‌ అయితే, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగలకే చాప చుట్టేసింది. దీనికి కారణం భారత బౌలర్ల గొప్పతనమే అని చెప్పేయడానికి వీల్లేదు. చెత్త పిచ్‌లో, అందునా స్పిన్‌కి పూర్తిగా సహకరించే పిచ్‌లపై, స్పిన్‌ విభాగంలో వీక్‌ అయిన సౌతాఫ్రికాని బోల్తా కొట్టించడంలో వింతేమీ కన్పించదు. 

ఆస్ట్రేలియాలోని పెర్త్‌ మైదానం చిత్ర విచిత్రమైనది. అక్కడి వాతావరణ పరిస్థితులు విపరీతంగా వుంటాయి. ఆస్ట్రేలియా బౌలర్లు తప్ప, ఇంకెవరూ అక్కడ అంతగా రాణించలేరు. క్రికెట్‌లో పెర్త్‌ మైదానానికి వున్నన్ని ప్రతికూలతలు బహుశా ఇంకే మైదానానికీ వుండవేమో. అందుకే పెర్త్‌ మైదానంపై టీమిండియా కూడా ఎన్నోసార్లు ఆరోపణలు గుప్పించింది. మరి, మనం చేస్తున్నదేమిటి.? టీ20, వన్డేల్లో పరాజయానికి పిచ్‌లపై నెపాన్ని నెట్టేసి, పిచ్‌ క్యూరేటర్లపైనా విమర్శలు గుప్పించిన మనం, సౌతాఫ్రికాని ట్రాప్‌ చేయడం ఎంతవరకు సబబు.? అన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. 

ఏదిఏమైనా, గెలుపు గెలుపే. అయిన్నప్పటికీ టాలెంట్‌ బయటకు రావాలంటే, టీమిండియా కొత్త టాలెంట్‌ని కూడగట్టుకోవాలంటే కావాల్సింది ఇలాంటి చెత్త పిచ్‌లు మాత్రం కాదు. స్వదేశంలో పులులు, విదేశాల్లో పిల్లులు అని టీమిండియాకి ఓ చెత్త ఘనత ఎప్పటినుంచో వుంది. అది బలపడిపోవడం కాదు, కొత్తదనం చూపించగలగాలి. ఈ విషయమై బీసీసీఐ ఆలోచనల్లో మార్పులు రావాలి. ఆటగాళ్ళు, సెలక్టర్లు, పిచ్‌ క్యూరేటర్లు.. ఇలా అన్ని విభాగాల్లోనూ మార్పులు తప్పనిసరి.