ఏదైనా ఒక మంచి సందర్భంలో క్రికెట్ నుంచి వైదొలగాలనేది ఏజ్ అయిపోయిన క్రికెటర్ల కోరిక. స్వదేశంలో.. సొంత గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ తర్వాత తప్పుకోవాలని, విజయంతో కెరీర్ కు ముగింపునివ్వాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే నాలుగేళ్లకు ఒకసారి వచ్చే క్రికెట్ పండగ ప్రపంచకప్ ను చాలా మంది రిటైర్ మెంట్ కు వేదికగా ఉపయోగించుకొంటూ ఉంటారు.
ఇది సాధారణంగా జరిగేదే కానీ.. తాజాగా ఆసీస్ లో ముగిసిన ప్రపంచకప్ మాత్రం చాలా మంది క్రికెటర్లకు చివరది అయ్యింది. అనేక మంది ఈ ప్రపంచకప్ తో తమ అంతర్జాతీయ క్రికెట్ కు ముగింపును ఇచ్చారు! ఇలాంటి వారిలో ప్రముఖ క్రికెటర్లు.. తమ ఆటతీరుతో గొప్ప పేరును కలిగిన వారు ఉండటం విశేషం!
లీగ్ దశ నుంచే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన జింబాబ్వే టీమ్ లోని ప్లేయర్ టేలర్ తో రిటైర్ మెంట్ హడావుడి మొదలైంది. ఈ ప్రపంచకప్ లో మంచి ఫామ్ తో టాప్ ఫైవ్ బ్యాట్సమన్ లలో ఒకరిగా నిలిచిన టేలర్ జట్టు నుంచి తప్పుకొన్నాడు. దశాబ్దాల నుంచి పసికూనగానే కొనసాగుతున్న జింబాబ్వే తరపున బాగా ఆడుతున్న ఆ బ్యాట్స్ మన్ అలా విరామం తీసుకొన్నాడు.
ఆ తర్వాత క్వార్టర్స్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక, పాకిస్తాన్ తరపున కూడా ప్రముఖ ప్లేయర్లు రిటైర్ మెంట్ ప్రకటించారు. శ్రీలంక తరపు అత్యుత్తమ, లెజెండరీ ప్లేయర్లుగా ఉన్న మాజీకెప్టెన్లు జయవర్ధనే, సంగాకరలు అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికారు. తమ బ్యాటింగ్ శైలితో కేవలం స్వదేశంలోనే గాక విదేశంలో కూడా అభిమానులను సంపాదించుకొన్న ఘనత వీరిది. ఇదే దేశానికి చెందిన మరో సీనియర్ ప్లేయర్ తిలకరత్నే దిల్షాన్ కూడా జట్టు నుంచి తప్పుకొన్నట్టే!
ఇక 16 యేళ్ల చిరుప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతాలు నమోదు చేసిన పాకిస్తానీ బ్యాట్స్ మన్ షాహిద్ ఆఫ్రిది ఈ ప్రపంచకప్ తో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక పాకిస్తాన్ కు ఈ ప్రపంచకప్ లో కెప్టెన్ గా వ్యవహరించిన మిస్బా ఉల్ హక్ కూడా తప్పుకొన్నాడు.
సెమిస్ దశ నుంచి ఇంటికెళ్లిన ఇండియా, సౌతాఫ్రికాల తరపు నుంచి రిటైర్ అయిన వారు లేరు కానీ.. ఫైనల్ మ్యాచ్ ఆడిన ఆసీస్, కివీస్ ల తరపు నుంచి కూడా ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు తప్పుకొన్నారు. కెప్టెన్ గా ప్రపంచకప్ ను అందుకొన్న మైఖేల్ క్లార్క్ వన్డేల నుంచి , దశాబ్దాలుగా న్యూజిలాండ్ తరపున ఆడిన డానియెల్ వెటోరీలు అన్ని రకాల ఫార్మాట్ ల నుంచి రిటైర్ అయ్యారు.
ఇలా ఈ ప్రపంచకప్ తో అనేక మంది ప్రముఖ ఆటగాళ్లు వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ప్రతిప్రపంచకప్ తర్వాత కూడా ఇలాంటి వీడ్కోలు సహజమే అయినా.. ఈ సారి చాలా మంది ప్రముఖ ఆటగాళ్లు ఈ జాబితాలో కనిపించారు.