గొంతులో నసగా అనిపించటం, మింగాలంటే ఇబ్బందిగా అనిపించటం సోర్ త్రోట్ ప్రధాన లక్షణం. గొంతులో వరిపొట్టు అడ్డుపటినట్లు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ లక్షణాన్ని ఆయుర్వేద గ్రంథాలు సూక పూర్ణ గళాసక్తం అనే పేరుతో వర్ణించారు. సూకం అంటే నూగు లేదా పొట్టు. గళం అంటే గొంతు. గొంతునొప్పికి సంబంధించిన వివరాలు ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో కంఠవ్యాధులను వర్ణించే సందర్భంలో లభిస్తాయి. వైద్య పరిభాషలో గొంతునొప్పి సమస్యను ఫ్యారింజైటిస్ (గ్రసనిక శోథ) అంటారు. సాధారణంగా ఈ సమస్య ఫ్లూ, లేదా ఇన్‌ఫ్లుయంజా వంటి వైరస్ సంబంధ కారణాల వల్ల వస్తుంటుంది. అనేక సందర్భాల్లో గొంతునొప్పి అనేది శారీరక రుగ్మతకు ప్రారంభ సంకేతంగా వ్యక్తమవుతుంటుంది.
లక్షణాలు
సోర్ త్రోట్ సమస్యలో ప్రధానంగా కనిపించే లక్షణాలు రెండు: గొంతు తడారిపోయి నసగా అనిపించటంతోపాటు వాపు తయారవటం మొదటి లక్షణం. మింగుతున్నప్పుడుగాని, శ్వాస తీసుకుంటున్నప్పుడుగాని లేదా మాట్లాడుతున్నప్పుడుగాని నొప్పిగా అనిపించటం రెండవ లక్షణం. గొంతునొప్పిని కలిగించిన ఇన్ఫెక్షన్‌ని బట్టి ఆయా ఇన్ఫెక్షన్ తాలూకు అదనపు లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకు, జలుబులో గొంతునొప్పితో పాటు అదనంగా దగ్గు, జ్వరం, తుమ్ములు, ఒళ్లు నొప్పులు, ముక్కుకారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్‌ఫ్లుయంజా, లేదా ఫ్లూ వంటి కారణాల వల్ల ఏర్పడిన గొంతునొప్పి తీవ్రత అంతగా ఇబ్బంది పెట్టదు. అయితే టాన్సిల్స్‌వాపు వంటి సమస్యల కారణంగా ఏర్పడిన గొంతునొప్పిలో తీవ్రస్థాయి లక్షణాలు అదనంగా కనిపిస్తాయి.
ఉదాహరణకు గొంతులోనూ, టాన్సిల్ మీదా తెల్లని మచ్చలు కనిపిస్తాయి. మింగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. గొంతునొప్పి దానంతట అదే తగ్గకుండా మళ్లీ మళ్లీ తిరగబెడుతూ ఉంటుంది. వాంతులవుతుంటాయి. చర్మం మీద దద్దురు కనిపిస్తుంది. తలనొప్పి, టాన్నిల్స్ ఎర్రగా వాపుతో కనిపించటం, ఆరునెలలలోపు చిన్నపిల్లల్లో 101 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత కనిపించటం, పెద్దల్లోనూ, పెద్దపిల్లల్లోనూ 103 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకూ ఉష్ణోగ్రత కనిపించటం వంటివి ముఖ్య లక్షణాలు.
వైద్య సలహా ఎప్పుడు తీసుకోవాలి?
అసౌకర్యం ఉన్నప్పటికీ సాధారణంగా గొంతునొప్పితో అంతగా ఇబ్బంది ఉండదు. ఐదారు రోజుల్లో తేలికగానే తగ్గిపోతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని ప్రమదాకరమైన పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. ఉదాహరణకు : వారానికి మించి గొంతునొప్పి కొనసాగటం. ఆహారం మింగటం కష్టమవటం మూలాన నిస్త్రాణ ఆవహించటం. గొంతుపూడుకుపోవటం వల్ల శ్వాస తీసుకోవటం కష్టంగా తయారవటం. ఆరునెలల లోపు పిల్లల్లో 101 డిగ్రీల పారెన్‌హీట్‌కి మించిన ఉష్ణోగ్రత నమోదవటం. లేదా పెద్దపిల్లల్లోనూ, పెద్దల్లోనూ 103 డిగ్రీల ఉష్ణోగ్రతకు మించి జ్వరం కనిపించటం. మెడలో గ్రంథుల వాచిపోయి నొప్పిగా అనిపించటం.
సాధారణ కారణాలు
గొంతునొప్పి ఎక్కువగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం బ్యాక్టీరియా దాడి వల్ల కూడా రావచ్చు. ఈ రెండు రకాల ఇన్ఫెక్షన్లూ నోటిద్వారా, నాసిక ద్వారా శరీరంలోపలకు ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్థుల నిశ్వాసద్వారాగాని లేదా వాళ్లు వాడిన టెలీఫోన్, తలువు గడియ, పాత్రలు, టవల్స్, బొమ్మలు వంటి వస్తువులు ఇన్ఫెక్షన్‌తో సంక్రామికమైనప్పుడుగాని ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపిస్తుంది. పాఠశాలలు, డేకేర్ సెంటర్లు, ఆఫీసులు, యాత్రాస్థలాలు వంటి ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్ త్వరితగతిన తక్కువ సమయంలో ఎక్కువ మందికి మూకుమ్మడిగా వ్యాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గొంతునొప్పిని కలిగించే సాధారణ కారణాలను తెలుసుకుందాం.
వైరస్: గొంతునొప్పిని కలిగించే ప్రధాన వైరస్ ఇన్ఫెక్షన్లలో సాధారణ జలుబును కలిగించే వైరస్, ఫ్లూ లేదా ఇన్‌ఫ్లూయంజాని కలిగించే వైరస్, మోనోన్యూక్లియో సిస్ ప్రధానమైనవి. ఇవే కాకుండా మీసిల్స్, చికెన్‌పాక్స్, క్రూప్ వ్యాధులను కలిగించే వైరస్‌ల వల్ల కూడా గొంతునొప్పి ప్రాప్తిస్తుంది. (క్రూప్ అనే వ్యాధిలో అనుబంధ లక్షణంగా తీవ్రస్థాయిలో పెద్ద శబ్దంతో దగ్గు వస్తుంది. ఇది పిల్లల్లో మాత్రమే కనిపించే వ్యాధి)
గొంతునొప్పి ఒక లక్షణంగా కనిపించే కొన్ని వ్యాధులు
ఎగ్రాన్యులోసైటోసిస్: అనుబంధ లక్షణాలుగా ఇన్ఫెక్షన్ లక్షణాలైన జ్వరం, వణుకు, తలనొప్పి ఉంటాయి. నీరసం, నిస్త్రాణ తరువాత ఈ వ్యాధి వస్తుంది. ఓకరింతలు, వాంతులు, ఆకలి తగ్గటం, రక్తస్రావం ఉంటాయి. చిగుళ్లమీద, అంగిటి మీద బూడిద, ఉదారంగుల పొరతో కప్పబడిన వ్రణాలు కనిపిస్తాయి.
ఎలర్జిక్ రైనటిస్ : ఏడాది పొడవునా ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ వ్యాధిలో గొంతునొప్పితో పాటు ముక్కులోపలి శ్లేష్మపు పొర ఉబ్బటం, పల్చని స్రావాలు కారటం, గొంతులోకి స్రావాలు కారుతుండటం, తుమ్ములు ఆగి ఆగి వస్తుండటం, వాసనను గ్రహించే శక్తి తగ్గటం, కణతలు, నుదుటిభాగంలో తలనొప్పి, కళ్లూ, మూక్కూ, గొంతులో దురద వంటి అనుబంధ లక్షణాలు ఉంటాయి. పరీక్షించి చూసినప్పుడు గొంతులోపలి శ్లేష్మపు పొర తడితో మెరుస్తూ కనిపిస్తుంది. ముక్కు వెనుక భాగంలో, గొంతుతో కలిసే ప్రదేశంలో ఉండే టర్బినేట్స్‌లో వాపు కనిపిస్తుంది. కళ్లనుంచి నీళ్లు కారుతుంటాయి. కళ్లు ఎర్రని జీరతో కనిపిస్తాయి. కనురెప్పల్లో వాపు కనిపిస్తుంది.
ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా : గొంతునొప్పి, కండరాలనొప్పి, దగ్గు, జ్వరం వంటివి ఈ వ్యాధిలో ప్రారంభ లక్షణాలు. ఏవియన్ ఇన్‌ఫ్లుయంజా-ఏ అనే వైరస్ చాలా ప్రమాదకరమైనది. దీని వల్ల నిమోనియా, శ్వాస కష్టమవటం వంటి ప్రాణప్రమాద సమస్యలు ఏర్పడే రిస్కు ఉంటుంది. ఇళ్లలో పెంచుకునే కోళ్లు వంటి పక్షుల్లో ఇది ఇటీవల కాలంలో విజృంభించి ఆసియా ఖండపు దేశాలమీద మూకుమ్మడిగా దాడిచేయటం తెలిసిందే.
బ్రాంకైటిస్ : ఈ వ్యాధి వల్ల గొంతు చివరి భాగంలో నొప్పి, జ్వరం, వణకు, దగ్గు, కండరాల నొప్పి, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆస్కల్టేషన్ పరీక్షలో ఊపిరితిత్తులనుంచి వెలువడే శబ్దాల్లో పిల్లికూతలు, నీటిబుడగ పగిలిన శబ్దాలు ప్రముఖంగా వినిపిస్తాయి.
నోటిలో పుండ్లు (కాంటాక్ట్ అల్సర్స్) : ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్వరపేటిక మీద వ్రణాలు తయారై గొంతునొప్పిని కలిగిస్తాయి. మాట్లాడేటప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది. చెవినొప్పి వంటి ఇతర లక్షణాలు సైతం ఉండవచ్చు. ఎప్పుడూ గొంతు సంవరించుకునే లక్షణం బాధితుల్లో కనిపిస్తుంటుంది. అలాగే అమ్లాలు పైకి పొంగే ఇతివృత్తం కూడా ఉంటుంది.
ప్రేరకాలు
ఎవరికైనా, ఎలాంటి సందర్భాల్లోనైనా గొంతునొప్పి కలగవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు తోడైతే సమస్య కనిపించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రిస్కుల్లో ప్రధానమైనవాటిని చూద్దాం :
వయసు : చిన్నపిల్లల్లోనూ, యుక్తవయస్కుల్లోనూ గొంతునొప్పికి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల వచ్చే స్ట్రెప్ త్రోట్‌కి వీరిలో ఇవకాశం ఎక్కువ.
ధూమపానం, పరోక్షధూమపానం : పొగాకు ద్వారా వెలువడే పొగలో అనేక వందల రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి గొంతులోపలి శ్లేష్మపు పొరలను రేగేలా చేసి గొంతునొప్పికి కారణమవుతాయి. సిగరెట్ పొగను నేరుగా పీల్చేవారిలోనే కాకుండా పీల్చినవారు వదిలిన ధూమాన్ని పీల్చే వారిలోకూడా ఈ సమస్య కనిపిస్తుంటుంది.
సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు : దీర్ఘకాలపు సైనస్ ఇన్ఫెక్షన్ల వల్లగాని లేదా తరుణ అవస్థలోని ఇన్ఫెక్షన్ల వల్లగాని గొంతునొప్పి రావచ్చు.
వ్యాధి నిరోధక శక్తి తగ్గటం : మనశరీరంలో వ్యాధి నిరోధక శక్తి పటిష్టంగా ఉన్నంత కాలమూ పరిసరాల్లో దిగివుండే ఇన్ఫెక్షన్లు దాడిచేయకుండా ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి క్షీణించినప్పుడు ఇవి అమాంతం దాడిచేసి గొంతునొప్పి వంటి సమస్యలను ఉత్పన్నం చేస్తాయి. మధుమేహం, స్టీరాయిడ్స్‌ని వాడటం, క్యాన్సర్‌కోసం కీమోథెరపీ మందులను వాడటం, మానసిక ఒత్తిడికి లోనవటం, నిస్త్రాణ, పోషకాహార లోపం వంటివి వ్యాధినిరోధక శక్తిని గణనీయంగా తగ్గించేవాటిల్లో ప్రధానమైన కారణాలు. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌లో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం మూలాన గొంతునొప్పి దీర్ఘకాలంగా బాధిస్తుంటుంది.
ఇక్కట్లు
గొంతునొప్పికి దారితీసే అనేక కారణాలు సాదారణంగా ప్రమాదరహితంగానే ఉంటాయి. సాధారణ జలుబును కలిగించే వైరస్ వల్ల పెద్దగా ఇబ్బందులు కలుగకపోయినప్పటికీ స్ట్రెప్ త్రోట్‌ని కలిగించే బ్యాక్టీరియా వల్లగాని లేదా మోనోన్యూక్లియోసిస్ కలిగించే వైరస్ వల్లగాని కొన్ని రకాల ఇక్కట్లు కలిగే అవకాశం ఉంది. ఉదాహరణకు:
సలహాలు
ద్రవాహారాలను బాగా తీసుకోవాలి : జ్వరంవల్లగాని, శ్లేష్మం తయారవటం వల్లగాని శరీరంలో జలీయాంసం తగ్గిపోయి నిర్జలీయత ప్రాప్తిస్తుంది. దీనిని భర్తీ చేయడం అవసరం. కనుక బాగా ద్రవ పదార్థాలను పుచ్చుకోవాలి. కాచి చల్లాల్చిన మంచినీళ్లు, పండ్ల రసాలు, టీ, వేడి సూప్స్ వంటివి బాగా తీసుకోవచ్చు. మద్యం, కాఫీవంటివి ద్రవాలైనప్పటికీ వీటిని పుచ్చుకోకూడదు. వీటివల్ల నిర్జలీయత పెరిగే అవకాశం ఉంటుంది.
వేడి నీళ్లలో ఉప్పు కలిపి పుక్కిట పట్టాలి : అర చెంచాడు ఉప్పును గ్లాసెడు వేడి నీళ్లకు కలిపి గొంతు తగిలే విధంగా పుక్కిట పట్టి ఉమ్మేయాలి. దీంతో శ్లేష్మపు ఉధృతి తగ్గి గొంతులో అసౌకర్యం దూరమవుతుంది.
స్వరానికి విశ్రాంతినివ్వాలి : గొంతునొప్పి వల్ల గొంతుబొంగురు పోతే (ల్యారింజైటిస్) సాధ్యమైనంత వరకూ మాట్లాడకుండా స్వరానికి విశ్రాంతిని కల్పించాలి. దీంతో త్వరితగతిన సమస్యనుంచి బయట పడవచ్చు.
ఆయుర్వేద చికిత్స
గొంతునొప్పికి ఆయుర్వేద చికిత్స రెండు రూపాల్లో ఉంటుంది. గొంతునొప్పికి కారణమైన వ్యాధులను తగ్గించే చికిత్స మొదటి రకం. వ్యాధి కారణమేదైనప్పటికీ, నొప్పినీ, అసౌకర్యాన్నీ తగ్గించే, మూలకారణమైన దోషాలను సమస్థితిలోనికి తీసుకురావడానికి ఇచ్చే దోషప్రత్యానీక చికిత్స రెండవ రకం. అవసరాన్ని బట్టి వీటిని ఎంచుకొని చేయాల్సి ఉంటుంది.
సాధారణ మూలికా చికిత్సలు
త్రిఫలా, అల్లం, మిరియాలు, పిప్పళ్లు, యవక్షారం, దారుహరిద్ర (మానుపసుపు), రసాంజనం (మానుపసుపు ఘనం), పాఠా (చిరుబొద్ది), వేప… వీటితో కషాయం తయారుచేసుకొని పుక్కిట పట్టాలి. దారుహరిద్ర, దాల్చినచెక్క, త్రిఫల, తుంగముస్తలు… వీటి చూర్ణాన్ని 3 గ్రాముల మోతాదులో తేనెతో కలిపి పుక్కిట పట్టాలి. యవక్షారం, పాఠా, రసాంజనం, దారుహరిద్ర, పిప్పళ్లు.. వీటి చూర్ణాన్ని తేనెతో కలిపి 3 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి. ఉలవలు, ముల్లంగి, దశమూలాలు… వీటితో కషాయం చేసుకొని 50 మిల్లీలీటర్ల మోతాదులో పుచ్చుకోవాలి. బార్లీపొడిని నువ్వుల నూనెలో వేయించి పిప్పళ్లు, ఉసరి పెచ్చుల కషాయంతో కలిపి తీసుకోవాలి.
ఔషధాలు
ఖదిరాదివటి, కామదుధా రసం, ప్రవాళపిష్టి, సితోపలాది చూర్ణం, కనకసుందర రసం… వీటిని వైద్య పర్యవేక్షణలో వాడుకుంటే గొంతునొప్పి తగ్గుతుంది.
నివారణ
తరచుగా, పూర్తిగా చేతులను శుభ్రపరుచుకుంటూ ఉండాలి. సబ్బు, నీళ్లు లభించకపోతే ఆల్కహాల్ కలిగిన హ్యాండ్ శ్యానిటైజర్స్‌ని వాడవచ్చు. వంటపాత్రలను, గ్లాసులను, న్యాప్‌కిన్స్‌ని, ఆహారాన్ని, తుండుగుడ్డలను ఎవరివి వారే వాడుకోవాలి. వీటిని ఇతరులతో పంచుకోకూడదు. పబ్లిక్ ఫోన్లను వాడకూడదు. క్యాంటిన్లలో, హోటల్స్‌లో గ్లాసును పెదవులతో తాగకూడదు. దగ్గువచ్చినప్పుడు, తుమ్మినప్పుడు టిష్యు పేపర్‌ని అడ్డుగా పెట్టుకొని, దానిని ఉండచుట్టి పారెయ్యాలి.
డా. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ (ఎండీ ఆయుర్వేద)
సెల్- 9177445454