గ్రేటర్ బెంగుళూరులో 32స్థానాలున్నాయి. 2013లో కాంగ్రెసుకు 13, బిజెపికి 12 వచ్చాయి. బిజెపి నగరాల్లో పుంజుకుంటోంది. 2013లో 30% ఓట్లు తెచ్చుకున్న బిజెపి 2014లో మోదీ యిమేజి కారణంగా 46.6% ఓట్లు, 75% సీట్లు తెచ్చుకుంది. ఇప్పుడు 5% నెగటివ్ స్వింగ్ వస్తే దాని సీట్ల సంఖ్య 19కి తగ్గుతుంది. తాగునీటి కొరత, ట్రాఫిక్, వాతావరణ కాలుష్యం వంటి అనేక సమస్యలతో బెంగుళూరు జీవితం అధ్వాన్నంగా తయారైంది కాబట్టి కాంగ్రెసు నష్టపోయి, బిజెపి లాభపడవచ్చు కాబట్టి సగానికి పైగా సీట్లు బిజెపివే అంటున్నారు. నీటికొరత తీర్చడానికి 192 చెరువులు పునరుద్ధరిస్తారని కాంగ్రెసు హామీ యిస్తోంది. నగరంలో చెరువులు, నదుల్ని పునరుద్ధరించడానికి రూ.2500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తానని బిజెపి అంటోంది.
బెంగుళూరు కాస్మోపాలిటన్ నగరం. కన్నడం మాట్లాడేవారు 42% మాత్రమే, తమిళులు 18%, తెలుగువారు 15%, ఉర్దూ మాట్లాడేవారు 13%, హిందీ మాట్లాడేవారు 3.4%, మలయాళం మాట్లాడేవారు 3%.. యిలా ఉన్నారు. వీరిలో ఓటు హక్కు ఉన్న వారెందరో చూడాలి. నగరవాసులు అధికారంలో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉంటూంటారు. కానీ ఓటింగు దగ్గరకు వచ్చేసరికి బద్ధకిస్తారు. అందువలన మురికివాడల్లో ఉన్నవారికి ఓటరు గుర్తింపు కార్డులు యిప్పించి లబ్ధి పొందుదామని ప్రభుత్వం చూస్తోంది. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు.
ఈసారి రాష్ట్రమంతా కలిపి 2% ఓటింగు పెరిగినా బెంగుళూరులో తగ్గింది. 50% దాటలేదు. కావేరీ జలాల విషయంలో బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు పట్ల వివక్షత చూపిస్తోందని అందరూ అనుకుంటున్నారు. తమిళులైతే మరీనూ. తమిళులకు స్వరాష్ట్రాభిమానం ఎక్కువ కాబట్టి బిజెపిని వ్యతిరేకిస్తారా అనేది పరిశీలించాలి. బెంగుళూరు కాకుండా తక్కిన ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలున్నాయి కాబట్టి అక్కడ కాంగ్రెసు, బిజెపి సమానస్థాయిలో సీట్లు తెచ్చుకోవచ్చు. బెంగుళూరులో ఎవరు విజయం సాధిస్తే వారే ముందువరుసలో ఉంటారనవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా ఉన్న బెంగుళూరులో ఓటింగు శాతం తగ్గడం బిజెపికి నష్టం చేయవచ్చు.
కర్ణాటకలో కాంగ్రెసు విజయం చేజిక్కించుకున్నా, విజయానికి దగ్గరగా వచ్చినా ఆ క్రెడిట్ సిద్ధరామయ్యకే పోతుంది. ముఖ్యమంత్రిగా ఎవరు కావాలి అని సర్వేలో అడిగితే ప్రజలు సిద్ధరామయ్యకు 30%, ఎడియూరప్పకు 25%, కుమారస్వామికి 20% ఓట్లేశారట. సిద్ధరామయ్యకు ఉన్న అడ్వాంటేజి ఏమిటంటే అతనికి ప్రత్యామ్నాయాలైన ఎడియూరప్ప, కుమారస్వామి యిద్దరూ యింతకు ముందు ముఖ్యమంత్రులుగా చేసి విఫలమైనవారే. అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నవారే. కుమారస్వామిపై 7 కేసులు పెండింగులో ఉన్నాయి. వాటిలో 4 అక్రమ మైనింగు, 3 డీనోటిఫికేషన్‌కు సంబంధించినవి. సిద్ధరామయ్యపై అవినీతి ఆరోపణలు రాకపోలేదు.
అర్కావతి లేఔట్‌లో 900 ఎకరాల భూమిని డీనోటిఫై చేయడంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే న్యాయవిచారణ జరిపించాడు. సిద్ధరామయ్యది తప్పు లేదని తేల్చారు. ఒక వ్యాపారస్తుడి నుండి రూ.80 లక్షల వాచి తీసుకుంటే ప్రతిపక్షాలు అది లంచం అన్నాయి, యితను బహుమతి అన్నాడు. వివాదం చెలరేగేసరికి, నాకక్కరలేదంటూ అసెంబ్లీ స్పీకరుకు అందచేశాడు. కేసు నమోదు కాలేదు. కాంగ్రెసు ఎమ్మెల్సీ గోవిందరాజు యింటిపై ఇన్‌కమ్‌టాక్స్ దాడి జరిగినప్పుడు డైరీ దొరికింది. దానిలో స్టీలు ఫ్లఓవర్ కట్టడానికి గాను కిక్‌బ్యాక్‌గా కాంగ్రెసు పార్టీకి రూ.65 కోట్లు లంచం యిచ్చినట్లుగా ఒక ఎంట్రీ ఉందట. ఎవరికిచ్చాడో ఏమో వివరాలు బయటకు రాలేదు. ఆ ఫ్లయిఓవరు ఆపేసినట్లున్నారు. ఏది ఏమైనా సిద్ధరామయ్య కాబినెట్‌లో తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నవారు మంత్రులుగా ఉన్నారు.
సిద్ధరామయ్య కురుబ కులానికి చెందినవాడు. జనాభాలో వీరి శాతం 7.1%. రాష్ట్రంలో అన్ని జిల్లాలలోనూ కొద్దికొద్దిగా ఉన్నారు. 120 నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేయగలరు. సిద్ధరామయ్య కారణంగా కాంగ్రెసుకు ఓట్లేయవచ్చని అంచనా. అతను సోషలిస్టు నాయకుడిగా ఎదిగాడు. దేవెగౌడకు ముఖ్య అనుచరుడు. కాంగ్రెసులో చేరాక తన రాజకీయ చాతుర్యమంతా ఉపయోగించి, బాగా ఎదిగాడు. ఈ ఎన్నికలలో కాంగ్రెసు గెలిచినా సిద్ధరామయ్య ఓడిపోవచ్చేమో అని కూడా అంటున్నారు. అతను బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు.
మైసూరు జిల్లాలోని చాముండేశ్వరి నుంచి సిద్ధరామయ్య ఐదుసార్లు గెలిచాడు, రెండుసార్లు ఓడిపోయాడు. అక్కడి ఓటర్లలో 60% ఒక్కళిగలే. ఒక్కళిగ పార్టీగా పేరు బడిన జెడిఎస్ ద్వారా గెలిచిన సిద్ధరామయ్య దేవెగౌడతో విభేదించి బయటకు వచ్చి కాంగ్రెసులో చేరాక 2006లో పోటీ చేస్తే 257 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచాడు. దానికి కారణం గతంలో అక్కడ కురుబల ఓట్లు కూడా చాలా వుండేవి. 2004లో నియోజకవర్గాల విభజనలో వాళ్లందరూ పొరుగున ఉన్న వరుణ నియోజకవర్గానికి మారిపోయారు. అందువలన 2013లో సిద్ధరామయ్య వరుణ నుండి పోటీ చేసి గెలిచాడు.
ఆ సురక్షితమైన స్థానాన్ని యిప్పుడు తన కొడుకు యతీంద్రకు ధారాదత్తం చేసి, తను రిస్కు తీసుకుని, 12 ఏళ్లగా పోటీ చేయని చాముండేశ్వరి నుండి నిలబడుతున్నాడు. తమ నుండి విడిపోయిన సిద్ధరామయ్యకు బుద్ధి చెప్పాలని జెడిఎస్ చాలా పట్టుదలతో ఉంది. పైగా అసదుద్దీన్ ఒవైసీ వచ్చి జెడిఎస్‌కు ఓటేయండని అక్కడ ఉన్న ముస్లిము ఓటర్లకు పిలుపు నిచ్చాడు. ఇక్కడ గెలుపు సందిగ్ధమే కాబట్టి, కాంగ్రెసు ఉత్తర కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని బాదామి నుంచి కూడా పోటీ చేయడానికి అనుమతిచ్చింది.
బాదామిలో సిద్ధరామయ్య ప్రత్యర్థి బిజెపి ఉపముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీరాములు. అతను యిక్కడే కాకుండా చిత్రదుర్గ జిల్లాలోని మొలకలమూరులో కూడా పోటీ చేస్తున్నాడు. సిద్ధరామయ్య కురుబ, దళిత, ముస్లిము ఓట్లను నమ్ముకుంటే శ్రీరాములు లింగాయత్, వాల్మీకి (అతనిది అదే కులం) ఓట్లను నమ్ముకున్నాడు. శ్రీరాములకు గాలి సోదరుల మద్దతుంది. డబ్బుకీ లోటు లేదు. అందువలన అక్కడా గెలుపు సందిగ్ధమే అంటున్నారు. అతనికీ అనుమానం వచ్చిందేమో నేను ముఖ్యమంత్రి నౌతానని పట్టుబట్టను అంటున్నాడు. రేపు ఫలితాలు వచ్చాక అనేక విషయాల్లో స్పష్టత వస్తుంది. ఫలితాలపై సెఫాలజిస్టులు, జర్నలిస్టులు చర్చిస్తున్నపుడు అవగాహన చేసుకోవడానికి యీ వ్యాసావళిలోని సమాచారం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]