ఇంతకీ బ్యాంక్ మేనేజరు బిల్లులు డిస్కౌంట్ చేస్తాడో లేదో కనుక్కోవాలి. అందువలన జార్జి చెప్పగా లండన్‌లోని ఒక ప్రముఖ ఆర్థిక సంస్థ వద్ద ఆస్టిన్ 500 పౌండ్ల రెండు బిల్లులు కొని నవంబరు 29న బ్యాంకు మేనేజర్ కల్నల్ ఫ్రాన్సిస్‌ను కలిసి ''నా పుల్మన్ బోగీల వ్యాపారం పుంజుకుంటోంది. చాలా దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఇలాటి బిల్లులు యింకా వస్తాయి. వీటిని డిస్కౌంట్ చేయడానికి మీకు అభ్యంతరం ఉంటే ముందే చెప్పండి.'' అని కోరాడు. అతను హెడాఫీసుని అడిగి చెప్తానని చెప్పి, మధ్యాహ్నాని కల్లా డిస్కౌంట్ చేశాడు. సాధారణంగా బ్యాంకు డైరక్టర్లలో ఎవరికైనా స్వయంగా తెలిసున్నవాళ్లకే యీ సదుపాయం యిస్తారు. కానీ యితని ఖాతా లావాదేవీలు చూసి, నిజాయితీగా (!) చేసిన యితని అభ్యర్థన చూసి హెడాఫీసు సరే అంది.
దొంగబిల్లుల వ్యవహారానికి క్రిస్మస్ ముహూర్తం పెట్టుకున్నారు. క్రిస్మస్కు రెండు రోజుల ముందు ఆస్టిన్ బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి ''నాకు పనులు ఎక్కువై పోయాయి. కొత్త సంవత్సరం నుంచి చాలా వారాలు లండన్‌కు బయట ఉండాల్సి వస్తుంది. పుల్మన్ ఫ్యాక్టరీకి మంచి స్థలం బర్మింగ్‌హామ్‌లో కనబడింది. అందుకని దాన్ని కేంద్రం చేసుకుని తరచుగా దేశాలు తిరుగుతూ, వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాను. నాకేమైనా ఉత్తరాలు రాయాలంటే బర్మింగ్‌హామ్ పోస్టు మాస్టర్ ఎడ్రసుకే రాయండి, నేను కూడా మీకు పంపే బిల్లులు అవీ అక్కణ్నుంచే పంపుతాను. స్వయంగా రావడానికి వీలు పడదు. బిల్లులు మీకు పోస్టులో అందగానే డిస్కౌంట్ చేసి నా ఖాతాలో వేసేయండి.'' అని చెప్పాడు.
జార్జి డిసెంబరు 28న బర్మింగ్‌హామ్ వెళ్లి ఆస్టిన్ చేతిరాతను అనుకరిస్తూ బ్యాంకు మేనేజరుకి లేఖ రాశాడు, దీనితో పంపుతున్న బిల్లులను డిస్కౌంట్ చేయండి అని. దానితో బాటు 4307 పౌండ్ల విలువైన 10 బిల్లులు జతపరిచాడు. అన్నీ నికార్సయినవే. అవి తూచ తప్పకుండా డిస్కౌంట్ అయిపోయాయి. ఆ బిల్లులు పోస్టు చేసేందుకు ముందు మేక్ వాటికి నికార్సయిన నకళ్లను తయారు చేసేశాడు. అంతా పెర్ఫెక్ట్గా ఉంది, యిక ఆట మొదలవుతోంది అనగా జార్జికి హఠాత్తుగా పాపభీతి కలిగింది. తమ తలిదండ్రులు పేదరికంలో జీవించారు తప్ప యిలాటి దగుల్బాజీ పనులు చేయలేదు. ఇప్పుడు తనూ, తమ్ముడూ యిలాటి పనులు చేయాలా, కష్టపడితే బతకలేకపోమా? అనే ఆలోచన వచ్చింది. మరొకటి ఏమిటంటే ఆస్టిన్, మేక్ యిద్దరికీ పెళ్లి కాలేదు. కానీ తనకు అయింది. లండన్‌కు వచ్చాక మేక్లాగానే ఒక ఉంపుడుగత్తెను పెట్టుకున్నాడు. అవతల భార్య తిరిగి వచ్చేయమని ఉత్తరాలు రాస్తోంది. 'నేను అన్నీ ఏర్పాటు చేసేశాను. ఇకపై నా పని లేదు. ఇప్పటిదాకా వచ్చినదాంట్లో నా వాటా యిచ్చేయండి. నేను అమెరికా వెళ్లిపోతాను.' అన్నాడు. టిక్కెట్టు కూడా కొనేసుకున్నాడు.
మిగిలిన ముగ్గురూ తెల్లబోయారు. ఇక్కడిదాకా వచ్చాక వదలడం అర్థం లేని పని. నువ్వు చాలా జాగ్రత్తగా ప్లాను చేశావ్. పట్టుబడే ప్రశ్న లేదు. డబ్బు సంపాదించుకుని అందరం మార్చి కల్లా వెళ్లిపోదాం అని బతిమాలారు. నువ్వు లేకపోయినా మేం ముందుకు వెళ్లడం ఖాయం అన్నారు. తను లేకపోతే వీళ్లు ఎక్కడో అక్కడ తప్పటడుగు వేస్తారని జార్జికి భయం. అప్పుడు తన పేరూ బయటకు వస్తుంది. అంతకంటె దగ్గరుండి జాగ్రత్తగా నిర్వహించడం మేలు అనుకున్నాడు. 'సరే ఉంటాను, కానీ ఒక షరతు. వారెన్ పేర ఒక పేరుమోసిన సంస్థ యిచ్చిన బిల్లు (గిల్ట్ ఎడ్జ్డ్ అంటారు) ఉండాలి. అప్పుడే బ్యాంకు మేనేజరు ఎంత పెద్ద మొత్తానికి బిల్లు పంపినా కళ్లు మూసుకుని డిస్కౌంటు చేస్తాడు' అన్నాడు. ఆ సంస్థ ఏమిటో కూడా అతనే చెప్పాడు – పారిస్‌కు చెందిన బేరన్ రాత్‌షీల్డ్ అని.
'నీకు మతి పోయిందా? అతనికి ఎన్నో వ్యాపారసంస్థలున్నాయి. యూరోప్‌లోనే ప్రసిద్ధ బ్యాంకు పారిస్ బ్రాంచ్‌కు అధినేత. అలాటివాడితో నాకు లావాదేవీలున్నాయని నమ్మించడం ఎలా?' అని మొత్తుకున్నాడు ఆస్టిన్. 'అదంతా నాకు తెలియదు. నువ్వు పారిస్‌కి వెళ్లాల్సిందే' అన్నాడు జార్జి. అన్నగారిని నానా బూతులు తిట్టుకుంటూ ఆస్టిన్ 1873 జనవరి 12న పారిస్ వెళ్లే రైలెక్కాడు. అతని దురదృష్టం కొద్దీ అతనెక్కిన రైలు అర్ధరాత్రి 2.30కి పట్టాలు తప్పి, అతని కంపార్టుమెంటుతో అనేక కంపార్టుమెంట్లు పక్కకు ఒరిగిపోయాయి. అతనికి చాలా దెబ్బలు తగిలి, కాలు విరిగింది కూడా. గాయపడిన యితర ప్రయాణీకులతో బాటు అతన్నీ స్ట్రెచర్‌పై తీసుకుని వచ్చి ఆసుపత్రిలో పడేశారు.
తన తలరాతను, అన్నను మరింతగా తిట్టుకుంటూ ఉంటే అతని దృష్టి ఆ రైల్వే కంపెనీ పేరుపై పడింది. ఆ కంపెనీ అధ్యక్షుడు రాత్షీల్డే! ప్రమాదంలో ప్రమోదం అంటే యిదే కాబోలు, యీ వంక పెట్టుకుని అతన్ని కలవవచ్చు అనుకున్నాడు ఆస్టిన్. పారిస్ చేరగానే గ్రాండ్ హోటల్లో దిగి, మర్నాడు ఉదయానికి కల్లా ఉబ్బిపోయిన మొహంతో చేతులకు, కాళ్లకు కట్లతో చేతికర్ర సాయంతో కుంటుకుంటూ రాత్‌షీల్డ్ ఆఫీసుకి వెళ్లాడు. తమ కంపెనీ కారణంగా గాయపడిన అతన్ని చూడగానే స్టాఫ్ జాలి చూపించారు. ''నేను వ్యాపారం చేద్దామని బోల్డంత డబ్బుతో పారిస్ చేరాను. ఇప్పుడీ గాయంతో వ్యాపారం చేయడం నా వల్ల కాదు. నాతో వెనక్కి పట్టుకెళ్లడానికీ ధైర్యం చాలటం లేదు. అందువలన 4500 పౌండ్లకు నా పేర బిల్లు యివ్వండి. డబ్బు చెల్లిస్తాను'' అన్నాడు.
ఇలాటి బ్యాంకింగ్ వ్యాపారం వాళ్లు చేయరు. ఈ అసాధారణమైన కోరిక విని వాళ్లు తెల్లబోయారు. కాదనడానికి నోరు రాలేదు. రాత్‌షీల్డ్ గార్ని అడిగి చెప్తాం, సాయంత్రం కనబడండి అన్నారు. సాయంత్రం వెళ్లేసరికి రాత్‌షీల్డ్ గదికి పంపారు. రాత్‌షీల్డ్ స్వతహాగా పెద్దమనిషి. జాలిహృదయం కలవాడు. ఆస్టిన్ హుందాతనం, ప్రస్తుత దుస్థితి అతన్ని కదిలించాయి. కూర్చోబెట్టి యాక్సిడెంటు ఎలా జరిగింది, సహాయక చర్యలు ఎలా జరిగాయి అన్నీ వివరంగా అడిగి తెలుసుకున్నాడు. ఆస్టిన్ తన పుల్మాన్ బోగీల వ్యాపారం గురించి చెప్పడంతో ఇంప్రెస్ అయ్యాడు. అతనడిగిన ప్రకారం మూణ్నెళ్ల తర్వాత డబ్బు చెల్లించేట్లా బిల్లు మీద సంతకం చేసి పంపించాడు. ఆస్టిన్ పొంగిపోయి లండన్‌కు పరిగెత్తుకుని వచ్చేయలేదు. రాత్‌షీల్డ్ కంపెనీ వారి బిల్లు ఎటువంటి స్టేషనరీ మీద ఉందాని వెతికి చూశాడు. కంపెనీ ఉన్న వీధిలోనే ఆ షాపుంది. అక్కడ అలాటివి బోల్డు కొనుక్కుని లండన్ చేరాడు.
అది చూసి అతని భాగస్వాములు ఎగిరి గంతేశారు. జనవరి 17న ఆస్టిన్ బ్యాంకు మేనేజరు వద్దకు వెళ్లి నేను వేట కెళ్లినపుడు గుఱ్ఱం మీద నుంచి పడ్డాను, అందుకే యీ గాయాలు అని చెప్పాడు, తను కులీనవంశానికి చెందినవాణ్నని ధ్వనింపచేస్తూ. ఆ తర్వాత రాత్‌షీల్డ్ బిల్లు మేనేజరు ముందు పెట్టేసరికి ఆయన కళ్లంటుకున్నాయి. రాత్షీల్డ్తో వ్యాపారం చేసే స్థాయి యీయనది అనుకున్నాడు. ''బర్మింగ్‌హామ్‌లోనే ఫ్యాక్టరీకై రెండు స్థలాలు చూశాను. బేరసారాలు సాగుతున్నాయి. ఇప్పట్లో లండన్‌కు రాను. అంతా బర్మింగ్‌హామ్ పోస్టాఫీసు ద్వారానే ..'' అని చెప్పాడు. ''నో ప్రాబ్లెమ్'' అన్నాడు మేనేజరు హుషారుగా. ఇక లండన్‌లో తన పని అయిపోయింది కాబట్టి, తక్కిన యంత్రాంగమంతా ఆటోమెటిక్‌గా నడిచిపోతుంది కాబట్టి ఆస్టిన్ మర్నాడే పారిస్‌కు వెళ్లిపోయి అక్కడ మకాం పెట్టేశాడు.
జనవరి 21 నుంచి ఫోర్జరీ బిల్లుల వ్యవహారం ప్రారంభమైంది. రాత్షీల్డు బిల్లులకు మేక్ అనేక నకళ్లు తయారు చేశాడు. ఇలా అనేకవాటికి చేశాడు. జార్జి బర్మింగ్‌హామ్‌కు వెళ్లడం, అక్కణ్నుంచి ఆస్టిన్ పేర బాంకు మేనేజరుకి ఉత్తరం రాయడం దొంగ బిల్లులు జతపర్చడం చేసేవాడు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండులో ఆ బిల్లుల తాలూకు డబ్బు జమ అయిందని తెలియగానే నోయెస్, వారెన్ పేరుతో ఆస్టిన్ సంతకం చేసి వెళ్లిన చెక్కుల ద్వారా ఆ ఫండ్స్‌ను కాంటినెంటల్ బ్యాంకుకి బదిలీ చేసి, అక్కణ్నుంచి హార్టన్ పేరుతో ఆస్టిన్ సంతకం చేసిన చెక్కుల ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసేవాడు. ఆ డబ్బుతో బాండ్లు, బంగారం, విదేశీ కరెన్సీ అన్నీ కొని తన గదిలో పరుపు కింద దాచేవాడు. అవి కూడా డైరక్టుగా కొనకుండా బంగారం కొని, దాన్ని అమ్మి బాండ్లగా మార్చి.. ఒక దేశపు కరెన్సీని మరో దేశపు కరెన్సీగా మార్చి.. యిలా దీన్నంతా ఒక చిక్కుదారంగా మార్చాడు. ఈ తెలివితేటలన్నీ జార్జివే. ఎక్కడైనా తేడా వచ్చి తీగలాగితే అది తెగిపోతుంది తప్ప డొంక కదిలించడం అసాధ్యమయ్యేట్లు చేశాడు.
ఇలా వరసగా డబ్బు వచ్చి పడిపోతూ ఉంటే, నోయెస్కు దడ పుట్టింది. ఇంత డబ్బు నా దగ్గర దాచలేను మొర్రో అన్నాడు. జార్జి మేక్ ద్వారా పారిస్‌లో ఉన్న ఆస్టిన్‌కు డబ్బు పంపించి, అక్కడ అమెరికన్ బాండ్లు కొనమన్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలో మూడో విడత బిల్లులు పంపేసరికి 25 వేల పౌండ్లు జమపడ్డాయి. ఈ దశలో ఆస్టిన్ తను పెళ్లి చేసుకుంటున్నానని కబురు పెట్టాడు. జేన్ అనే 18 ఏళ్ల అమ్మాయి అతనికి లండన్‌లోనే తగిలింది. అప్పుడే పెళ్లి చేసుకుంటానంటే, జార్జి కాస్త ఆగు, పెళ్లంటూ దృష్టి మరలితే మన వ్యవహారం కుంటుపడుతుంది అన్నాడు. ఇప్పుడు అంతా స్మూత్‌గా జరిగిపోతోంది కాబట్టి పెళ్లి జరిగినా ఫర్వాలేదని ఆస్టిన్ అనుకున్నాడు. జార్జి అభ్యంతర పెట్టలేకపోయాడు. మేక్, జార్జి పారిస్‌కి వెళ్లి అతన్ని అభినందించి బహుమతి యిచ్చి వచ్చారు. మర్నాడే ఆస్టిన్ పెళ్లి జరిగింది.
ఫిబ్రవరి 26 వచ్చేసరికి మొత్తం 78,400 పౌండ్లు దోచడం జరిగింది. మన ఫ్రాడ్ బయట పడేందుకు యింకా నాలుగు వారాల గడువుంది. మనం మొదట్లో అనుకున్నదాని కంటె ఒక వారం ముందుగానే, యింతటితో మనం ఆపేద్దాం, అన్నాడు జార్జి. 'సరే అలా అయితే, సాక్ష్యాలు ఏవీ దొరక్కుండా తగలబెట్టేద్దాం' అన్నారు మేక్, నోయెస్. మేక్ గదిలోని ఫైర్ ప్లేస్ వద్ద కూర్చుని ఒక్కోటి మంటల్లో పడేయసాగారు. రకరకాల స్టేషనరీలు, స్టాంపులు, సీళ్లు, పెన్నులు, యింకు సీసాలు అన్నీ ఆహుతై పోతున్నాయి. దొంగ బిల్లులు నిప్పులో పడేసేముందు మేక్ కొన్నిటిని పక్కన పెట్టాడు – 'ఫోర్జరీలో మచ్చుతునకగా ఉంచుకోవాల్సిన నమూనాలివి.' అంటూ. జార్జి వాటిని అటూయిటూ తిరగేస్తూ 'ఇవి పనికి వస్తాయంటావా?' అన్నాడు. 'మహరాజులా పనికి వస్తాయి. వాటిల్లో కొన్ని పూరించాలంతే.' అన్నాడు మేక్. 'అయితే ఆ పని చేద్దాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్, దీనితో లక్షా పూర్తవుతుంది.' అన్నాడు జార్జి.
ఇదే విధివిలాసం అంటే. ఇప్పటిదాకా సకలమైన జాగ్రత్తలు తీసుకుని చాలా సేఫ్‌గా ఆటాడుతూ వచ్చిన జార్జి, ఆ క్షణంలో అత్యాశకు పోయాడు. ఆ దొంగ బిల్లులలో మొత్తం 24 ఏరాడు. మొత్తం 26,265 పౌండ్లు వచ్చేట్లుగా తయారు చేసి వాటి మీద మేక్ సంతకాలు, పేర్లు అన్నీ రాశాడు. అయితే పొరబాటున రెండిటిపై తారీకు వేయడం మర్చిపోయాడు. అది జార్జి కూడా గమనించలేదు. అప్పటిదాకా కలిసి తిరగనివాళ్లు ఆ సారి మాత్రం కలిసి బర్మింగ్‌హామ్‌కు వెళ్లి పోస్టాఫీసు నుంచి ఆ బిల్లులను బ్యాంకుకు పోస్టు చేశారు. 1873 ఫిబ్రవరి 28న అవి బ్యాంకు మేనేజరు కల్నల్ ఫ్రాన్సిస్ బల్ల మీదకు చేరాయి. వారెన్ పేరు చూడగానే డిస్కౌంట్ చేయమని గుమాస్తాకు చెప్పాడు. అతను కాస్సేపు పోయాక వచ్చి 'వెయ్యేసి పౌండ్ల రెండు బిల్లులపై తారీకులు లేవండి' అన్నాడు. బిల్లులు జారీ చేసినది ఎవరా అని చూస్తే బ్లయ్డెన్స్టీన్ కంపెనీవారు. 'తొందరలో మర్చిపోయి ఉంటారు. వాళ్లకు పంపించి, తారీకులు వేయించుకో.' అన్నాడు మేనేజరు.
సాయంత్రం అయ్యేసరికి బ్లయ్డెన్స్టీన్ కంపెనీ నుంచి ఉత్తరం వచ్చింది. 'ఈ బిల్లులు మేం జారీ చేసినవి కావు. మాకు ఏ సంబంధం లేదు' అని. మేనేజరుకి యీ సంగతి తెలియగానే కంగారు పుట్టి వారెన్ ఫైల్ తీసుకుని హెడాఫీసుకి వెళ్లి డిప్యూటీ చీఫ్ కాషియర్కు చూపించాడు. సంగతంతా చెప్పాడు. ఫైల్ చూస్తూనే ఆయన లోటుపాట్లు కనిపెట్టేశాడు. ఈ వారెన్కు పర్మనెంట్ ఎడ్రసు లేదు. కేరాఫ్ హోటల్ అని మాత్రమే ఉంది. డైరక్టరు ఎవరైనా సిఫార్సు చేయనిదే బిల్లులు డిస్కౌంట్ చేయకూడదు, కానీ చేశారు. ఆ వారెన్ ఎంతసేపూ హార్టన్ అనే వాడి పేరనే చెక్కులిస్తున్నాడు తప్ప, తక్కిన వ్యాపారసంస్థ దేని పేరా చెక్కులివ్వలేదు. తప్పకుండా ఫ్రాడ్ వ్యవహారమే అయి వుంటుంది. తక్కిన బిల్లులు కూడా వెరిఫై చేయిస్తే కన్ఫమ్ అయిపోతుంది. ముందు కాంటినెంటల్ బ్యాంకు వారిని హెచ్చరించి, అక్కణ్నుంచి డబ్బులు విత్‌డ్రా చేసేవాణ్ని పట్టుకోవాలి. అప్పటికే శుక్రవారం రాత్రి అయింది. బ్యాంకు మూసేసి ఉంటారు. మర్నాడు పొద్దున్నే బ్యాంకు వాళ్లతో మాట్లాడాలి అనుకున్నాడు.
(సశేషం) – ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2018)
[email protected]