బెంగాల్‌లో ముస్లిములు బిజెపిని ఆశ్రయిస్తున్నారు. బిజెపిలో కొత్తగా చేరిన ప్రాథమిక సభ్యుల్లో ముస్లిముల శాతం 2013 డిసెంబరు నాటికి 6.06 వుంటే, జూన్ 20 నాటికి అది 12.38 అయింది. సంఖ్యాపరంగా చూస్తే 60,172 మంది. ఎన్నికల తర్వాత యిలా చేరడం ఎక్కువైంది. బెంగాల్ ఎన్నికలలో ముస్లిములకు వున్న ప్రాధాన్యత తెలిస్తే యిది బిజెపికి రాజకీయంగా ఎంత లాభమో అర్థమవుతుంది. బెంగాల్‌లోని 341 డెవలప్‌మెంట్ బ్లాక్‌లలో 140 వాటిల్లో ముస్లిముల ఓట్లు సగటున 42% వుంటాయి. అంటే మొత్తం మీద చూస్తే జనాభాలో 25-30% అన్నమాట. ఇన్నాళ్లూ వీళ్లు కాంగ్రెసు, లెఫ్టిస్టు పార్టీలలో వుండేవారు. అయితే తృణమూల్ పార్టీ ఆగడాలను వాళ్లు అరికట్టలేకపోతున్నారని గ్రహించాక ప్రత్యామ్నాయం కోసం చూశారు. ఇప్పుడు బిజెపి కేంద్రంలో బలమైన శక్తిగా వుండటంతో తృణమూల్‌కు చెక్ చెప్పడానికి బిజెపిలో చేరడమే మంచిదనిపించింది వారికి. బెంగాల్‌లో లెఫ్టిస్టును సమూలంగా నిర్మూలించడానికి తృణమూల్ గూండాలు ప్రభుత్వ సహాయంతో విరుచుకు పడుతున్నారు. దాంతో ఆ పార్టీలోని హిందువులు పార్టీ వదలి బిజెపిలో చేరారు. ఇప్పుడు ముస్లిములు కూడా చేరుతున్నారు.
బిజెపి అంటే ముస్లిములకు భయం వుంది. ఎన్నికల సమయంలో గోవధను నిషేధిస్తామని, గోమాంసం ఎగుమతిని నిలిపివేస్తామని బిజెపి నాయకులు చేసిన ప్రకటనలు ముస్లిములలో భయాందోళనలు కలిగించాయి. ఎందుకంటే వారిలో చాలామంది ఆ వ్యాపారంపై, తోలు పరిశ్రమపై ఆధారపడి వున్నవారే. ఎన్నికల తర్వాత బిజెపిలో చేరడం ద్వారా దాని విధానాలను తమకు అనువుగా మార్చుకోవాలనే ఆలోచన కూడా వుండి వుండవచ్చు.
ఇప్పటివరకు బెంగాల్ గ్రామీణప్రాంతాల్లో బెంగాలీ మాట్లాడే ముస్లిములే చేరుతున్నారు. కలకత్తాలో వుండే ఉర్దూ మాట్లాడే బెంగాలీయేతర ముస్లిములు బిజెపిని దూరంగానే పెడుతూ తృణమూల్‌నే అంటిపెట్టుకున్నారు. అయితే వారి జనాభా మొత్తం ముస్లిముల్లో 9% మాత్రమే. ముస్లిములు యిలా తమ పార్టీలో చేరడం పట్ల బిజెపి నాయకుల స్పందన ఎలా వుంది? 'బెంగాల్‌లో ముస్లిం ఓట్లను విస్మరించి ఏ పార్టీ మనజాలదు. వారి రాకను స్వాగతిద్దాం' అన్నారు బెంగాల్ బిజెపి మాజీ అధ్యకక్షుడు తథాగత రాయ్. అయితే ఆరెస్సెస్ వర్గాల వారు యీ పరిణామాలపై మండిపడుతున్నారు. వారి రాక వలన తమ సిద్ధాంతాలు పలుచన పడతాయని వారి భయం.
ఆరెస్సెస్ వారి బెంగాలీ పత్రిక ''స్వస్తికా''లో జులై 14 న ప్రచురించబడిన ఒక వ్యాసంలో ''బెంగాల్ ఎన్నికలలో విజయం సాధించి బిజెపి సమస్యలు కొని తెచ్చుకుంటోంది. గతంలో మార్క్సిస్టు పాలనలో అరాచకం సాగించిన అల్లరి మూకలు తృణమూల్ అధికారంలోకి రాగానే సిపిఎం వదిలి తృణమూల్‌లో చేరి తొలినుండీ పార్టీని అంటిపెట్టుకున్న క్యాడర్‌ను వెడలనంపి, పదవులు ఆక్రమించాయి. ఆ విధంగా ఆ పార్టీలో గందరగోళం సృష్టించాయి. ఇప్పుడు బిజెపిలోకి కూడా చాలామంది (ముస్లిములు అని పేర్కొనకుండానే) వచ్చి చేరి అలాటి గందరగోళాన్నే సృష్టించబోతున్నారు.'' అని రాశారు. ఆ భయాన్ని ప్రతిఫలిస్తూ ఒక బిజెపి అభిమాని ట్విట్టర్‌లో – ''యే క్యా హో రహా హై? బిజెపిలో ఆలీల (కామన్ ముస్లిము పేరు) కుంభవృష్టి కురుస్తోందే!?'' అని రాశాడు.
-ఎమ్బీయస్ ప్రసాద్